శనివారం, ఏప్రిల్ 04, 2009

అమ్మ-ఆదివారం

ఆదివారం అంటే ఇష్టపడని చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారా? నా చిన్నప్పుడైతే ఆదివారం కోసం సోమవారం నుంచి ఎదురు చూసేవాడిని. చక్కగా బడికి వెళ్ళే పని ఉండదు కదా. ఐతే అమ్మ వాళ్ళు మాత్రం వాళ్ళ చిన్నప్పుడు ఆదివారం అంటే చాలు చాలా భయపడే వాళ్ళట. ఆదివారం నాడు ఇంట్లో ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళే అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళట. అలా ఎందుకు భయపడే వాళ్ళో అమ్మ చాలా సార్లు చెప్పింది. ఎందుకో చెప్పాలంటే ముందు వాళ్ళ ఇంటి సంగతి చెప్పాలి.

అమ్మ వాళ్ళు మొత్తం ఏడుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. మొత్తం ఈ తొమ్మిది మందితో పాటు బంధువుల పిల్లలు మరో ఐదారుగురు ఎప్పుడూ వీళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. అంటే వీళ్ళ ఇల్లే ఓ చిన్న వీధి బడి లా ఉండేదన్న మాట. అమ్మమ్మ ఒక్కర్తే పిల్లలందర్నీ చూడలేదు కాబట్టి అమ్మ వాళ్ళ పెద్దక్క కూడా ఆ బాధ్యత తీసుకునేది. వాళ్ళ అమ్మ అంటే పిల్లలెవరికీ భయం లేక పోయినా, పెద్దక్క అంటే మాత్రం భలే భయం.

ఆడపిల్లల సంరక్షణ అంటే మాటలు కాదు కదా. తల దువ్వి జడలు వెయ్యడమే ఓ పెద్ద పని. ఇక తల స్నానం అంటే ఓ పెద్ద ప్రహసనమే. అమ్మమ్మ, పెద్దమ్మ కలిసి ప్రతి ఆదివారం పిల్లలకి తలంటు కార్యక్రమం పెట్టేవారు. ఓ సారి 'బాల భారతం' సినిమా చూస్తూ, అందులో కౌరవుల స్నానం సీన్ వచ్చినప్పుడు 'మీ చిన్నప్పుడు మీ స్నానాలు కూడా ఇలాగే ఉండేవా?' అని అమ్మని అమాయకంగా అడిగా. దానికి అమ్మ ఎలా స్పందించిందో నాకు బాగానే గుర్తుంది కాని, ఇక్కడ చెప్పను.

అమ్మమ్మ, పెద్దమ్మ లతో పాటు మరో ఇద్దరు సహాయకులు ఉండే వాళ్ళట తలంట్లు పోయడానికి. ఒకరు బాపిరాజు, వాళ్ళింటి పని మహిళ. ఇక రెండో ఆవిడ సోమాలమ్మ. అమ్మ వాళ్ళు చదివే బడిలో ఆయా. సోమాలమ్మ గురించి ఒక్కమాటలో, అదీ అమ్మ చెప్పిందే, చెప్పాలంటే "బళ్ళో మేస్టారంటే భయపడని పిల్లలు ఉండేవాళ్ళు కాని, సోమాలమ్మ అంటే భయపడని వాళ్ళు ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు." బడికి రాని పిల్లల ఇళ్ళకి వెళ్లి, కాపు కాసి వాళ్ళని బడికి లాక్కు రావడం సోమాలమ్మ ప్రతిభకి ఓ మచ్చు తునక మాత్రమే.

బాపిరాజు నీళ్ళ పొయ్యి వెలిగిగించడంతో ఆదివారం మొదలయ్యేదట. పిల్లలంతా చద్దన్నాలు తినే వేళకి సోమాలమ్మ వచ్చేసేదట. ఇక అది మొదలు, తలలు లెక్క పెట్టుకుని, ఒకళ్ళ తర్వాత మరొకరిని కూర్చోబెట్టి తలంటేసే వారట ఇద్దరూ.. అక్కడితో అయ్యిందా.. మద్యాహ్నం అమ్మమ్మ పెట్టిన భోజనం చేశాక పిల్లలందరికీ పేలు చూసే కార్యక్రమం. అమ్మ మాటల్లో చెప్పాలంటే "సోమాలమ్మ తన రెండు కాళ్ళ మధ్య మా తల నొక్కిపట్టి, తను తెచ్చిన పేల దువ్వెనతో మా జుట్టు బలంగా లాగేది. ఆ ఊపుకి జుట్టూడి పోయేది. తలనుంచి రక్తం వస్తుందేమో అని భయం వేసేది మాకు."

పిల్లలెవరైనా సోమాలమ్మకి ఎదురు తిరుగుతారేమో అని, అమ్మ వాళ్ళ పెద్దక్క అక్కడే కావలి ఉండేదట. సాయంత్రం కాపీ తాగి, రాత్రి భోజనం లోకి కూర పచ్చడి తీసుకుని సోమాలమ్మ తిరుగు ముఖం పట్టే వరకు పిల్లలంతా బిక్కు బిక్కు మంటూ ఉండాల్సిందే. "సోమాలమ్మకి జ్వరం రావాలని కోరుకునే వాళ్ళం. అదేమిటో కాని, ఆ మనిషిది భలే ఆరోగ్యం.. ఎప్పుడూ జర్రున చీదేదైనా కాదు. మాకు మేము తల స్నానం చేయగలిగేంత వరకు సోమాలమ్మ బాధ తప్ప లేదు. ప్రతివారం ఆదివారాన్ని తిట్టుకునే వాళ్ళం..."

6 కామెంట్‌లు:

  1. చాలా బాగున్నాయండి అమ్మ-ఆదివారం కబుర్లు... నాక్కూడా మా అమ్మ చెప్పిన వాళ్ళ చిన్నతనం ముచ్చట్లు గుర్తొచ్చాయి... మనకి మిగిలే అన్నిటికంటే పెద్ద ఆస్తి ఈ కబుర్లు, జ్ఞాపకాలేనేమో!

    రిప్లయితొలగించండి
  2. మాకు వేరే సోమాలమ్మ అక్కర్లేకుండా మా అమ్మే ఉండేది.కొబ్బరి పీచు లేకపోతే డొక్క పేడు ఒక్కోసారి ఈ రెండూ కూడా వాడేది మా ఒళ్ళు తోమడానికి.తలంటు పోసుకుని లోపలికి వస్తే కళ్ళు బైర్లు కమ్మేవి దెబ్బకి.అదీ మా సోమాల్"అమ్మ" దెబ్బంటే.

    రిప్లయితొలగించండి
  3. అమ్మ వాళ్ల చిన్నప్పుడూ అంతే నట ..ప్రతీ ఆదివారం పండగలాగే ఉండేదని చెప్తుంది . పైగా పండగలకు నలుగు కూడా ఉండేదట !

    రిప్లయితొలగించండి
  4. @చైతన్య: నిజమేనండి. ధన్యవాదాలు
    @శ్రీనివాస్ పప్పు: కుకుడుకాయ పులుసు కళ్ళలో పోసుకుని, ఉప్పు, చింతపండు చప్పరించడం నాకు బాగా జ్ఞాపకం. చింతపండు కోసమే కళ్ళు తెరిచేసిన సందర్భాలూ ఉన్నాయి :) తన అనుభవాల ద్రుష్ట్యానో, మరేమో తెలీదు కానీ, అమ్మ పెద్దగా శిక్షించేది కాదు.. ధన్యవాదాలు.
    @పరిమళం: మాకు నలుగు ప్రతి ఆదివారం ఉండేదండి.. అదో పెద్ద కథ.. ధన్యవాదాలు
    @ఉమాశంకర్: అంతేనండి :) ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  5. నాకు తలస్నానం అంటే మహా భయం చిన్నపుడు అమ్మ కుంకుడి కాయపులుసుతో తంటూతూ ఆ వారం నేను చేసిన తప్పుల లిస్ట్ అంతా చదువుతూ తల మీద చూపేది.. అసలే పని వత్తిడి ఏమో ఆ కోపం ఈ కోపం .. దెబ్బకు స్నానం అయ్యాక ఆ జుట్టు చిక్కు తీసుకోవడానికి గంట పట్టేది

    రిప్లయితొలగించండి