గురువారం, ఏప్రిల్ 02, 2009

అలరాస పుట్టిళ్ళు

ఓ జమీందారు చెల్లెలు, వాళ్ళ దివాణం లో పనిచేసే ఓ రోజు కూలీ ని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. చెల్లెలంటే అపరిమిత మైన ప్రేమ ఉన్నా, పరువు మర్యాదలకి ప్రాణం ఇచ్చే ఆ అన్నగారు సహజంగానే ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు. ఉన్నట్టుండి ఒకరోజు రాత్రి ఆ అమ్మాయి, ఆమె ప్రేమించిన అబ్బాయి ఊరినుంచి మాయమయ్యారు. ఆశ్చర్యకరంగా అప్పటినుంచి దివాణం ప్రాభవం తగ్గిపోవడం మొదలైంది. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగింది? ఆ అమ్మాయి ఏమైంది?

నిడుమోలు కళ్యాణ సుందరీ జగన్నాధ్ రాసిన 'అలరాస పుట్టిళ్ళు' కథను అదేపేరుతో నాటికగా మలచి ప్రదర్శించారు 'కళా వాణి' ఉభయ గోదావరులు ట్రూప్ వాళ్ళు. ఈ కథ పేరే మకుటంగా శ్రీమతి జగన్నాద్ తన కథా సంపుటాన్ని విడుదల చేశారు. గంట నిడివి గల ఈ నాటిక ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ లో సాగుతుంది. కూలిపోతున్న దివాణంలో వృద్ధుడైన జమీందారు సుబ్బారాయుడు మరణ దశలో ఉండడం నాటిక ప్రారంభం. అతని భార్య, ఓ వృద్ధురాలైన పనిమనిషి సుబ్బారాయుడికి సేవలు చేస్తూ ఉంటారు. సుబ్బారాయుడికి చెల్లెలి వరసయ్యే అక్కమ్మ తన టీనేజ్ మనవరాలితో కలిసి అన్నగారిని చూడడానికి వస్తుంది.

అక్కమ్మ మనవరాలిని చూసిన సుబ్బారాయుడు 'సత్యవతీ.. సత్యవతీ' అని కలవరించడం మొదలు పెడతాడు. 'సత్యవతి' కి కబురు పెట్టమంటాడు. అతన్ని నిద్ర పుచ్చి, అక్కమ్మ, ఆమె వదిన, పనిమనిషి గతాన్ని తలచుకుంటారు. సిరి సంపదలతో తులతూగుతున్న దివాణం లో సత్యవతి ఆడింది ఆట, పాడింది పాట . ఆమె కి పెళ్లి చేయాలని అన్నగారు సుబ్బారాయుడు ప్రయత్నాలు చేస్తుండగానే చెంగల్వ రాయుడు వాళ్ళింట్లో పనికి చేరతాడు.

సత్యవతి, చెంగల్వ రాయుడు ఒకరినొకరు ఇష్టపడతారు. వాళ్ళ పెళ్ళికి ససేమిరా అంటాడు సుబ్బారాయుడు. సత్యవతిని చెంగల్వ రాయుడితో వెళ్లి పొమ్మని సలహా ఇస్తుంది అక్కమ్మ. అక్కమ్మ-సత్యవతి ల సంభాషణ ని రహస్యంగా విన్న సుబ్బారాయుడు, ఆగ్రహంతో అక్కమ్మని ఇంట్లోనుంచి వెళ్ళ గొడతాడు. ఆ రాత్రి నుంచి సత్యవతి, చెంగల్వ రాయుడు కనిపించరు. దివాణం లో అందరూ వాళ్ళిద్దరూ ఎక్కడికో పారిపోయి పెళ్లి చేసుకున్నారు అనుకుంటారు.

'సత్యవతీ' అన్న సుబ్బారాయుడి కలవరింతతో గతం నుంచి బయట పడతారు అక్కమ్మ వాళ్ళు. 'ఈ పాటికి బయలుదేరే ఉంటుంది అన్నయ్యా.. సత్యవతి వచ్చేస్తుంది' అంటుంది అక్కమ్మ. ఎగ శ్వాస తో ఉన్న సుబ్బారాయుడు ఆమెకి 'సత్యవతి ఎప్పటికీ రాదమ్మా' అని చెబుతాడు. ఆ రాత్రి సత్యవతి, చెంగాల్వరాయుడు యేరు దాటి పారిపోబోతుండగా తానె వాళ్ళిద్దరినీ పడవలో నుంచి ఏటిలోకి గెంటేశానని, వాళ్ళ శవాలు నీళ్ళలో కొట్టుకుపోవడం తానూ కళ్ళారా చూశానని చెప్పి ప్రాణం విడుస్తాడు సుబ్బారాయుడు.

క్షణాల్లో సెట్టింగులు మార్చడం ఈ ప్రదర్శన ప్రత్యేకత. పాడుబడ్డ మహల్లో నాటిక ప్రారంభమవుతుంది. గతం లోకి వెళ్ళేటప్పటికి అదే మహల్ వైభవంగా ఉంటుంది. ప్రారంభంలో వృద్ధులుగా ఉన్న సుబ్బారాయుడు, అతని భార్య, పనిమనిషి, అక్కమ్మ ఫ్లాష్ బ్యాక్ లో యవ్వనంలో ఉంటారు. ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యేసరికి మళ్ళీ వృద్ధులుగా కనిపిస్తారు. సత్యవతి గా వేసిన అమ్మాయే అక్కమ్మ మనవరాలిగానూ చేసింది. సుబ్బారాయుడు సత్యవతిని చంపే దృశ్యాన్ని నీడల్లో చూపించారు. 'అలరాస పుట్టిళ్ళు' కథా సంపుటాన్ని గురించి మరోసారి...

16 కామెంట్‌లు:

  1. నేనెప్పుడూ నాటికలు చూడలేదండి :(
    ఒక్కసారే బుర్రకధ చూశాను.
    మంచి కధను పరిచయం చేసినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. ఇలాంటివి మా కోసం ఎక్కడైనా U - Tuble లో పెట్టి పుణ్యం కట్టుకోరూ....

    రిప్లయితొలగించండి
  3. నాటిక ముగింపు బాగుంది - దారుణం అయినా.

    రిప్లయితొలగించండి
  4. kadha purthiga cadavalnukumte ikkada cllick cheamdi

    http://www.koumudi.net/Monthly/2008/november/Nov_2008_anaganagaOmanchikatha.pdf

    రిప్లయితొలగించండి
  5. చాలా బావుందండీ ! రాచరికపు ముసుగులో ....దివాణాల్లో ....జరిగే దారుణాలకు ప్రతీకగా ఉందీ నాటిక .మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండీ !

    రిప్లయితొలగించండి
  6. ఈ సందర్భంలో నాటిక ఆ రచయిత్రి రాసిన అద్భుతమైన కథకి ఒక దృశ్య శ్రవణ రూపమే. కథలో అంతర్లీనంగా ఉన్న ఫ్లేష్ బేక్ ని ఈ బృందంవాళ్ళు పూర్తిగా రూపమిచ్చి వెలుగులోకి తీసుకురావడం సమర్ధవంతంగా ప్రదర్శించడం అభినందనీయం.
    కానీ కథ, కథలో పాత్రలు, కథా గమనం, వర్ణనలు, సంభాషణలు, ఇవన్నీ కల్యాణసుందరి గారి అద్భుత్సృజనశక్తి ఫలితాలే.

    మురళిగారూ, ఓ తీవ్రమైన అభ్యంతరాన్ని తెలుపుతున్నా. మీరిలా కథల్లో క్లైమాక్సు చెప్పేస్తే, ఒకవేళ ఇంకా కథ చదవని వారికి చాలా అన్యాయం జరిగినట్టవుతుంది. ఇలాంటీ పరిచయాలు రివ్యూలు చేసేప్పుడు అవసరమైన మట్టుకు కథని కొద్దిగా, చూచాయగా పరిచయం చెయ్యొచ్చు కానీ మొత్తం ఏం జరుగుతుందో చెప్పకూడదని నా మతం. ఇహ మీష్టం.

    రిప్లయితొలగించండి
  7. @భవాని: వీలయితే తప్పక చూడండి.. సినిమాని మించిన అనుభూతిని ఇస్తుంది నాటకం. ధన్యవాదాలు.
    @భాస్కర రామిరెడ్డి: యు-ట్యూబ్ ఆలోచన బాగుందండి. కాని నేను తీసిన ఫోటోలు చూసిన వాళ్ళంతా ముక్త కంఠంతో ఒకే మాట అంటారు.. "భంగిమా.." ...ధన్యవాదాలు.
    @కృష్ణా రావు జల్లిపల్లి, పరిమళం: ధన్యవాదాలు
    @పాప: చాల ధన్యవాదాలండి.. లింక్ ఇచ్చినందుకు.
    @కొత్తపాళీ: ఆలోచించాల్సిన విషయమేనండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. మంచికథ, పరిచయం చేసిన మీకూ, కథ లింకు ఇచ్చిన papa గారికీ ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  9. @ఉమాశంకర్: నాకు బాగా నచ్చిందేమిటంటే ఈ కథను నాటికగా మలచి, ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ లో ప్రదర్శించిన తీరు. ధన్యవాదాలండి..

    రిప్లయితొలగించండి
  10. బాపూ గారికి మహా ఇస్టమైన కథల్లొ ఇది ఒకటి, ఈ కథగురించి నాకొసారి ఆయన చెబుతున్నప్పుడు ఆ expressions మహాద్భుతం. కళ్యాణ సుందరీ జగన్నాధ్ గారు బాపుగారికి దగ్గరి బంధువులు కూడా అనుకుంటా, ఆవిడగురించి కూదా చాలా proud గా చెప్పారు గాని మట్టిబుర్రని సరిగా గుర్తు పెట్టుకొ లెదు.

    రిప్లయితొలగించండి
  11. ఇది సితార కాదు కానీ ఎక్కడో ఆ వాసనలు కనిపించాయి. మరి వంశీ గొప్పతనామో ఏమో కానీండి ఎక్కడైనా జమీందారు కథలు వింటే అదే గుర్తొస్తుంది

    రిప్లయితొలగించండి
  12. @సుబ్రహ్మణ్య చైతన్య మామిడిపూడి: నిజమేనండి.. 'సితార' ని వంశీ తప్ప మరెవరూ అంతబాగా తీయలేరు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. Sanghika natakalaku manchi rojantu okati vasthe thappakunda idi oka goppa natakam ga nilichi pothundi. Manasunu kadilinche kathamshanni ennukunnandu rachayitha gariki dhanyavadalu

    రిప్లయితొలగించండి
  14. @కృష్ణ: నేను చూసిన ప్రదర్శన కూడా చాలా బాగుందండీ.. అందరూ బాగా చేశారు, మూల కథని కొద్దిగా మార్చినా, మొత్తంగా బాగా చేశారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. 15 ఏళ్ళ క్రితం చదివాను ఈ కథను, నిడుమోలు కళ్యాణ సుందరీ జగన్నాధ్ - తమిళం రచన అనుకుంటాను, మనసును కదిలించు కథనం- "అలరాస" - ఇప్పుడే అర్ధమైంది, రాజ/ రాచ - అని, అట్లాగ "స"కారం కొంటి పేరు ఎందుకు పెట్టారో గాని,
    త - అనే మాట అరుదుగా ప్రాచీన సాహిత్యాన కనబడుతున్నది, ఇప్పుడు ఈ శ్లోకములో చూసాను, మళ్ళీ గుర్తుకు తెచ్చినది- మీ కుసుమాంబ 1955

    రిప్లయితొలగించండి
  16. @Anil Piduri: తమిళం కాదండీ, తెలుగావిడే. కళ్యాణసుందరీ జగన్నాధ్ భర్త ఎన్నెస్ జగన్నాధ్ వెనుకటి తరం తెలుగు సినిమా దర్శకుడు. చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు వీళ్ళకి మేనల్లుడు. కళ్యాణసుందరి గారి కథలన్నీ కొల్లేరు పరిసర ప్రాంతాల నేపధ్యంగా సాగుతాయి. రాజ/రాస వాడుకలో ఉన్నదేనండీ.. 'రాసకొడుకు' అన్నవాడుక చాలాచోట్ల కనిపిస్తుంది కదా.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి