గురువారం, ఫిబ్రవరి 10, 2022

మంచి వెన్నెలవేళ

తెలుగు బ్లాగుల వైభవోజ్వల యుగంలో కలం పట్టిన వారిలో కొందరు బ్లాగరుల నుంచి రచయిత(త్రు)లు గా పదోన్నతి పొంది విరివిగా రాస్తూ, వరుసగా పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఈ కొందరిలోకి కొంచం ఆలస్యంగానైనా చేరారు 'కొత్తావకాయ' బ్లాగరు సుస్మిత. పుష్కర కాలానికి పూర్వం ఒకానొక మార్గశిర మాసంలో రోజుకో టపాగా తన బ్లాగులో ప్రచురించిన 'తిరుప్పావై' పాశుర కథా మాలికకి ఇప్పుడు పుస్తక రూపం ఇచ్చారు, 'మంచి వెన్నెలవేళ' అనే పేరుతో. ముప్పై కథలకి తోడు, ముందు, వెనుక మాటలు, ప్రతి కథకీ ఆ కథ కోసమే రచించారేమో అనిపించే లాంటి రేఖాచిత్రాలతో కలిపి 262 పేజీల గ్రంధమయ్యింది. ఆకర్షణీయమైన ముఖచిత్రాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి.

రచయితల మొదటి సవాలు తమ రచనని పాఠకుల చేత చివరికంటా చదివించడం. చెబుతున్నది ఎవరికీ తెలియని కొత్త కథ అయినప్పుడు తర్వాత ఏంజరిగిందో తెలుసుకోడం కోసమైనా పేజీలు తిప్పుతారు లెమ్మన్న ధైర్యం ఉంటుంది. కానీ, అందరికీ తెలిసిందీ, జనబాహుళ్యంలో బాగా నలిగిందీ అయిన కథని 'చదివించేలా' చెప్పడం అన్నది కత్తిమీద సామే. ఈ కథ శ్రీకృష్ణ దేవరాయ విరచిత 'ఆముక్త మాల్యద' కాదు. కానీ, ఆ నాయిక నోచిన కాత్యాయనీ వ్రతాన్నే ద్వాపర యుగంలో గోపకాంతలు ఆచరించిన విధాన్ని వర్ణించేది. నెలకి మూడు వానలు కురవడం కోసం, రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం తమ రాజు నందగోపుని ఆదేశం మేరకు ఓ మార్గశిర మాసం నెల్లాళ్ళూ కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించారు రేపల్లె పడతులు. ఆ నందగోపుని కొడుకు శ్రీకృష్ణుడు మరెవరో కాదు, వాళ్లందరికీ బాల్య స్నేహితుడే.

మంచు వర్షంలా కురిసే మార్గశిర మాసంలో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి, యమునా నదిలో తలారా స్నానం చేసి, నదీ తీరంలోనే కాత్యాయనీ దేవి సైతక ప్రతిమని ప్రతిష్టించి, ఇళ్లనుంచి తెచ్చుకున్న పువ్వులతో పూజ చేసి, పొంగలి ప్రసాదం వండి, నివేదన చేసి ఆరగించి, గృహకృత్యాల నిమిత్తం బాలభానుడితో పాటే ఇల్లు చేరాలి. ఊళ్ళో పెళ్లి కాని ప్రతి పడుచూ, ప్రతి రోజూ ఈ పూజలో పాల్గొనవలసిందే. ఇంకా నిద్రలేవని చెలులని, వారి ముంగిట నిలిచి సుతారంగా నిద్రలేపడం, పూజకి కావాల్సిన సంబారాలని సమకూర్చుకోవడం అనే నిత్య కృత్యాన్ని ముప్పై కథలుగా అల్లాలంటే చాలా దినుసులు అవసర పడతాయి. ఇందుకోసం రచయిత్రి ఎంచుకున్నవి బాలకృష్ణుడి లీలా వినోదాలు, ఓ యుగం వెనక్కి వెళ్లి త్రేతాయుగం నాటి రామ కథలూను.  

సూక్ష్మంగా పరిశీలిస్తే చాలా కథల్లో ఒక్కో దానిలోనూ ఒక్కో రామాయణ గాధ, ఒక్కో కృష్ణలీల కనిపిస్తాయి. నాటి రాముడే నేటి కృష్ణుడనీ, రెండూ శ్రీ మహావిష్ణువు అవతారాలే అనీ గోప వనితలందరికీ తెలుసు. అయినా కూడా వాళ్లంతా అతడిని తమ జతగాడిగా చూస్తారు. ఎంతో చనువుని ప్రదర్శిస్తారు. అంతలోనే అతని దైవత్వం గుర్తొచ్చి కుంచించుకు పోతారు. 'ఏమీ తెలియని అమాయకపు గొల్లలం' అని వాళ్లలో వాళ్ళు మాట వరుసకు అనుకుంటారు కానీ, వాళ్లకి తెలియని విషయాలు లేవు. రామాయణం కంఠోపాఠం. కృష్ణలీలలెప్పుడూ నాలిక చివరనే ఉంటాయి. ఎవరితో ఎలా మాట్లాడాలో, కార్యసాధనకి అవసరమైన కిటుకులేవిటో బాగా తెలిసిన వాళ్ళు. వాళ్లలో వాళ్ళకి చిన్నచిన్న తగువులున్నా వ్రతం విషయానికి వచ్చేసరికి అందరూ ఒకటైపోతారు.

'భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించి...' అనే మాటని వ్రత పురోహితుల నోటి నుంచి వింటూ ఉంటాం. ఈ గోపికలు చేసే వ్రతంలో భక్తి కన్నా శ్రద్ధ పాలే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే నిత్యం నదికి వెళ్లి వచ్చేప్పుడు వాళ్ళు చెప్పుకునే కథల్లో రామకథల్ని భక్తిగానూ, కృష్ణ కథల్ని శ్రద్ధగానూ చెప్పుకోడం గమనించవచ్చు. లక్ష్యాన్ని చేరేందుకు భక్తి కన్నా శ్రద్ధ ముఖ్యమన్న సూచన ఉందా? అని సందేహం కలిగింది. ఓ సందర్భంలో ఈ అమ్మాయిలందరూ యశోదని కలిసేందుకు వెళ్లి "నీ పోలిక పుణికి పుచ్చుకున్న ఆ కృష్ణుడే మాకు దిక్కు. అతనికి మా విన్నపం చెప్పుకోవాలంటే నీ అనుమతి కావాలి. నిద్ర లేచి రావమ్మా" అని ప్రార్ధిస్తారు. దేవకీ నందనుడికి యశోద పోలికలు ఎలా సాధ్యం అన్నది ఇంకో సందేహం.

'అనల్ప' ప్రచురించిన ఈ పుస్తకానికి సుదీర్ఘమైన ముందుమాట రాశారు మోదుగుల రవికృష్ణ - స్వయానా ప్రచురణకర్త, అరుదైన పుస్తకాలు వెలుగు చూడడం వెనుక సూత్రధారి. వారి స్వగతమూ, జ్ఞాపకాలూ బాగున్నాయి కానీ ఈ రచనని గురించి మరికొంచం ప్రస్తావించి ఉంటే బాగుండేదనిపించింది. ఏకబిగిన ఈ పుస్తకాన్ని పూర్తి చేస్తే ఆ వెంటనే ఇంకేమీ చదవాలనిపించదు. చివరి పేజీల్లో ప్రచురణ కర్తలు ఇచ్చిన ప్రకటనలు పలుకురాళ్ళలా అనిపించింది అందుకేనేమో. "ఏ పదార్ధం ఎటు వడ్డించాలో తెలిసిన ఇల్లాలు, మక్కువతో తన మగనికి వడ్డించిన విస్తరిలా ఉంటుంది రేపల్లె" లాంటి ఉపమలు ఉప్మాలో జీడిపలుకులు. మొదలు పెట్టాక, ఆసాంతమూ ఆపకుండా చదివించేవి ఇవే. భక్తి పరులకి మాత్రమే కాదు, అందమైన వచనాన్ని ఇష్టపడే వారికీ కానుకివ్వదగిన ఈ పుస్తకం వెల రూ. 250. ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు. రచయిత్రి నుంచి మరిన్ని పుస్తకాల కోసం ఎదురుచూస్తూ.. 

9 కామెంట్‌లు:

  1. పుస్తక పరిచయం బాగుంది.
    ముఖచిత్రం చిత్రకారుడు కార్టూనిస్ట్ కేశవ్.ఇతను Krishna for today series లో బొమ్మలు గీస్తున్నాడు. అన్నీ అంత బాగుండవు కానీ కొన్ని చిత్రాలు బాగానే ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కేశవ్ గారి బొమ్మలు కొన్ని చూశాను. ధన్యవాదాలండీ..

      తొలగించండి
  2. నిజం గానే వైభవోజ్వల యుగం గుర్తొచ్చింది సారూ.. మొదటి పేరా లో మీ పాత పోస్ట్ , అక్కడ కామెంట్లు చదువుతుంటే .

    రిప్లయితొలగించండి
  3. హృదయపూర్వక ధన్యవాదాలు మురళి గారూ. పదేళ్ళ క్రితపు మాటే ఈరోజు కూడా.. చిరఋణగ్రస్తురాలిని!
    ఇన్నేళ్ళలో మారనిది నెమలికన్నుతో మా అందరికీ ఉన్న అనుబంధం కూడా. మీ సమీక్షతో పుస్తకానికి నిండు వచ్చినట్టేనండీ.

    రిప్లయితొలగించండి
  4. సమీక్ష పెద్ద మాట.. పరిచయం అనొచ్చేమోనండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  5. బ్లాగావరణంలో నా ఆల్ టైమ్ ఫేవరెట్ రచన ఇది. ఆవకాయ, చక్రపొంగలి అంత తియ్యగా కూడా ఉండగలదని తెలిసిందీ అప్పుడే.

    రిప్లయితొలగించండి
  6. పుట్టుక కంటే పెంపకమే మనిషి లక్షణాల్లో ప్రముఖ పాత్ర కదా! ఆ కాంటెక్స్ట్ లోనే యశోదతో అలా అని ఉంటారు.

    రిప్లయితొలగించండి