అతని పేరు ఉమామహేశ్వర రావు. అతన్ని గురించి ఒక్కమాటలో చెప్పాలంటే మూర్తీభవించిన మంచితనం. వృత్తిరీత్యా ఫోటో గ్రాఫర్, టెక్నిక్ మాత్రమే తెలుసును తప్ప, క్రియేటివిటీ గురించి ఆలోచన లేదు. ఇప్పటి లోకంలో బతకాలంటే మంచితనం మాత్రమే ఉంటే సరిపోదనీ, సృజనాత్మకత లేకుండా కేవలం టెక్నిక్ మీదే ఆధారపడితే మంచి ఫోటోగ్రాఫర్ కాలేనని అతడు తెలుసుకోవడం, ఆ దిశగా ప్రయత్నాలు చేసి విజయం సాధించడమే సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా. మహేష్ అని పిలవబడే ఈ ఉమామహేశ్వరరావు ఉండేది అరకులోయలో. ఇందువల్ల ప్రేక్షకులకి కలిగిన ప్రయోజనాలు ఏమిటంటే, సినిమా జరిగిన రెండు గంటల పదహారు నిమిషాలపాటూ అరకు, పరిసర గ్రామాల పచ్చదనం కళ్ళని ఆహ్లాద పరుస్తూ ఉండగా, ఇన్నాళ్లూ సినిమాలో కామెడీకి మాత్రమే పరిమితమైన ఉత్తరాంధ్ర మాండలీకం సినిమా ఆసాంతమూ సొగసుగా చెవులకి వినిపించింది.
వైవిద్యభరితమైన 'C/o. కంచరపాలెం' సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన వెంకటేష్ మహా తన రెండో ప్రయత్నానికి రీమేక్ సినిమాని ఎంచుకోవడం (మాతృక 'మహేసిన్టే ప్రతీకారం' (2016) అనే మలయాళీ సినిమా) ఆశ్చర్యం కలిగించినా, కథా స్థలాన్ని తనకి పట్టున్న ఉత్తరాంధ్రకి మార్చేయడం అతడి తొలివిజయం అనిపించింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక అతడి రెండో విజయం. తొలి సినిమాని అందరూ కొత్తవాళ్లతో తీసిన వెంకటేష్, రెండో సినిమాలో నలుగురైదుగురు మినహా కథా నాయికలతో సహా మిగిలిన అన్ని పాత్రలకీ కొత్తవాళ్ళనే ఎంచుకున్నాడు. సత్యదేవ్ తో పాటు సీనియర్ నరేష్ (ఇతని తాజా పేరు వీకే నరేష్), నిర్మాతల్లో ఒకరైన విజయ ప్రవీణ పరుచూరి (ఈమె
'C/o. కంచరపాలెం' సినిమాని నిర్మించడంతో పాటు అందులో ఓ ముఖ్య పాత్రని పోషించారు), ఇద్దరు ముగ్గురు టీవీ నటులు మినహా మిగిలిన అందరూ కొత్త మొహాలే.
మహేష్ (సత్యదేవ్) కి కెమెరా వారసత్వంగా వస్తుంది. అతడి తండ్రి వయసులో ఉండగా ఫోటోలు తీసుకోడం కోసం అరకు వచ్చి అక్కడే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకుని, ఫోటోగ్రాఫర్ గా స్థిరపడి పోతాడు. ఆ జంటకి మహేష్ ఒక్కడే సంతానం. భార్య మరణం తర్వాత, స్టూడియోని కొడుక్కి అప్పగిస్తాడతను. పాస్పోర్ట్ ఫోటోలు, పెళ్ళిళ్ళకి, చావులకి ఫోటోలు తీసే మహేష్ కి తండ్రి చేసినట్టుగా కెమెరాతో ప్రయోగాలు చేయాలన్న ఆలోచన రాదు. తనో మంచి ఫోటోగ్రాఫర్ని అని గాఢమైన నమ్మకం. ఫోటోకి బ్యాక్ గ్రౌండ్, లైటింగ్ సరిగ్గా ఉంటే చాలుకదా అనుకుంటాడు. తండ్రికి వండిపెడుతూ, చుట్టుపక్కల వాళ్లందరితోనూ స్నేహంగా ఉండే మహేష్ జీవితం ఒకేసారి మూడు మలుపులు తిరుగుతుంది. ప్రియురాలు దూరమవ్వడం, అనుకోని రీతిలో అతనికి పదిమందిలోనూ అవమానం జరగడం, ఫోటో తీయించుకోడానికి వచ్చిన ఓ అమ్మాయి 'నీకసలు ఫోటోగ్రఫీ తెలుసా?' అని మొహం మీదే అడిగేయడం. అక్కడినుంచి మలుపు తిరిగిన అతని కథ, మహేష్ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడంతో ముగుస్తుంది.
నటీనటులందరూ బాగా చేశారు. సత్యదేవ్, నరేష్, నాయికలిద్దరి నటనా గుర్తుండిపోతుంది. రెండో సగంలో వచ్చే నాయిక కెరీర్ తొలినాళ్లలో భానుప్రియని గుర్తు చేసింది. పాత్రలు, సంభాషణలు ఎంత సహజంగా ఉన్నాయంటే, సినిమా చూస్తున్నట్టుగా కాక అరకులో రోడ్డు పక్కన నిలబడి జరుగుతున్నది చూస్తున్నట్టుగా అనిపించింది చాలాసార్లు. కెమెరా (అప్పు ప్రభాకర్), సంగీతం (బిజిబల్) విభాగాలని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సహజంగానే ఎంతో అందమైన అరకు, కెమెరా కంటిలో మరింత అందంగా కనిపించింది. యుగళ గీతాలు లేకపోయినా, నేపధ్య సంగీతంతో పాటు, మూడు పాటలూ కూడా సినిమాలో కలిసిపోయాయి. మలయాళం ఒరిజినల్ చూసిన మిత్రులు "యథాతథంగా దించేశాడు" అన్నారు కానీ, నేను ఒరిజినల్ చూడలేదు. రెండోసగంలో హీరో ఫోటోగ్రఫీతో ప్రేమలో పడే సన్నివేశాలని మరికొంచం బాగా రాసుకుంటే బాగుండేది అనిపించింది.
కథాకాలం విషయంలో కొంచం కన్ఫ్యూజన్ కనిపించింది. ఓ పక్క మహేష్ బాబు-జూనియర్ ఎన్ఠీఆర్ ఫ్యాన్స్ ని కథలో పాత్రలు చేస్తూనే, హీరో తన స్టూడియోలో పాత పద్ధతితో ఫోటోలు డెవలప్ చేసినట్టుగానూ ('కడగడం' అనేవాళ్ళు), పాతకాలపు కంప్యూటర్ వాడుతున్నట్టుగానూ చూపించారు. అలాగే కాలేజీ స్టూడెంట్స్ చేసిన ఫ్లాష్ మాబ్ లో అన్నీ పాత పాటలే ఉన్నాయి. మొదటి సగంలో కనిపించిన కొన్ని పాత్రలు (అరకు వాసులు) రెండో సగంలో మాయమవడం వల్ల ఆ పాత్రల్ని కథలో భాగంగా కాక, కామెడీ ఫిల్లింగ్ కోసం వాడుకున్న భావన కలిగింది. స్థానిక ఆచారాలు, వంటకాల్ని కథలో భాగం చేశారు కానీ, యాత్రికులని మర్చిపోయారు. సంభాషణలు సహజంగా ఉండడమే కాదు, నవ్విస్తూనే ఆలోచలోకి నెట్టేశాయి చాలా సన్నివేశాల్లో. ఫోటోగ్రఫీతో పరిచయం లేనివాళ్ళకి రెండోసగం సాగతీతగా అనిపించే అవకాశం ఉంది. రొటీన్ కి భిన్నంగా ఉండే క్లీన్ సినిమాలని ఇష్టపడేవాళ్ళకి నచ్చే సినిమా ఇది. ఓటీటీ లో విడుదలైంది కాబట్టి కలెక్షన్ల లెక్కలు కుదరవు కానీ, సినిమాగా చూసినప్పుడు వెంకటేష్ మహా కొత్త దర్శకులు ఎదుర్కొనే 'రెండో సినిమా గండం' దాటేసినట్టే.
// “ 'రెండో సినిమా గండం” // హ్హ హ్హ హ్హ, అటువంటి ప్రమాదం కూడా ఒకటి ఉంటుందా కొత్త దర్శకులకు? కానీ మొత్తానికి ఈ దర్శకుడికి ద్వితీయ విఘ్నం తప్పిందన్నమాట 🙂.
రిప్లయితొలగించండిమీ రివ్యూ చదివడంతో ఈ సినిమా చూశాను నెట్-ఫ్లిక్స్ లో. మీరన్న చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ చక్కగా తీసిన చిత్రం. అంతకంతకూ Dr.ప్రవీణ పరుచూరి గారి సినిమాలు, సత్యదేవ్ నటన బాగా ఆకట్టుకుంటున్నాయి (ఇంతకు ముందు “మన ఊరి రామాయణం” లో కూడా చాలా బాగా నటించాడు). ప్రస్తుత సినిమాలో రెండో హీరోయిన్ (జ్యోతి పాత్రలో రూప) నటనలో చాలా ease ఉంది. ఫ్లాష్ మాబ్ లో (మీరన్నట్లు పాత పాటలే అనుకోండి) ఆ అమ్మాయి మరీ ఉత్సాహంగా చేసింది. ఆ అమ్మాయి తెలుగమ్మాయి అవడం నాకు మరింత బాగా నచ్చింది. మొత్తం మీద చూడదగ్గ చిత్రం.
(మీరన్న ఫొటోలు “కడిగి” డెవలప్ చెయ్యడం హీరో తండ్రి చేసినట్లు చూపించారు.. ముందు తరం వ్యక్తి కాబట్టి డిజిటల్ గా చెయ్యడం అదీ అలవాటు లేక పోయుండచ్చు అనుకోవాలి అని నా అభిప్రాయం)
(పైన మలయాళం సినిమా పేరుని మీరు మహేసిం...“తే” ప్రతీకారం అని వ్రాశారు. ఏమనుకోకండి గానీ ఆ పదం మహేసి...“న్టే” అని ఉండాలి. “యొక్క” (of) అనడానికి మలయాళంలో చివర “న్టే” జేరుస్తారు. కాబట్టి, ఆ మలయాళ సినిమా పేరు “మహేసిన్టే ప్రతీకారం” అవుతుంది)
హహ్హ.. ఈ 'రెండో సినిమా గండం' అనే సెంటిమెంట్ ఓ ఇరవై ఏళ్ళ క్రితం మొదలైందండి.. ఆ 'యూత్' సినిమాల వెల్లువ రోజుల్లో చాలామంది కొత్త దర్శకుల మొదటి సినిమా సూపర్ హిట్ అయితే రెండో సినిమా అట్టర్ ప్లాప్ అయ్యేది.. సినిమా వాళ్ళ సెంటిమెంట్ల గురించి కొత్తగా చెప్పుకునేది ఏముంది?
తొలగించండిఫోటోలు కడగడం.. మీరన్నది ఆలోచించాల్సిన విషయమే.. చిన్న ఊరు కాబట్టి, తండ్రి ఆస్తి కాబట్టి హీరో ఇంకా ఆ పాతకాలం నాటి లాబ్ ని కూడా కొనసాగిస్తూ ఉండి ఉండొచ్చు.. అయినా అదేమీ పెద్ద లోపం కాదులెండి.. చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని చిన్నచిన్నవి విడిచిపెట్టేశారే అనిపించిందంతే ..
మలయాళం సినిమా పేరు సరిచేశానండీ.. ధన్యవాదాలు..
తమకున్న క్రియేటివిటీ అంతా పోసి మొదటి చిత్రం తీసి హిట్ కొడితే, రెండో సినిమాకోసం క్రియేటివిటీ తెచ్చుకోడానికి టైం లేనప్పుడు ఇలాంటి ఫ్లాపులు ఎదురౌతాయి. అంతేగానీ గండాలూ, తప్పించడానికి పూజలూ అంటూ మాట్లాడేది అంతా హంబక్.
రిప్లయితొలగించండిThank you
తొలగించండి
రిప్లయితొలగించండిమళయాళం సినిమా చూస్తున్నట్టే వుంది. :)
ఒరిజినల్ చూడలేదండీ నేను.. ఇప్పుడు చూడాలనిపిస్తోంది.. ధన్యవాదాలు.
తొలగించండిరివ్యూ బావుంది మురళి గారూ. ఇతనికి రెండో సినిమా గండం కరోనా రూపంలో మరో విధంగా ఎదురైందనుకోవాలేమోనండీ :-)
రిప్లయితొలగించండిమీరన్నట్లు టైమ్ ఫ్రేమ్ విషయంలో కొంత క్లారిటీ ఇచ్చినట్లైతే ఇంకా బావుండేది. స్టూడియో విషయంలో ఇంకా వాళ్ళ నాన్నగారి మాటే చెల్లుబాటు అవుతుందనుకోవచ్చేమోనండీ. అందుకే డిజిటల్ ఫోటోలు తీస్తున్నా లాబ్ అవీ అలాగే ఉంచి ఉండొచ్చు. అరకు టూరిస్టుల గురించి అస్సలు చూపించక పోవడం కూడా లోపమే ఒక చిన్న రిఫరెన్స్ ఐనా ఇచ్చుండాలి.
ధన్యవాదాలండీ.. ఈ క్రూ ఇంటర్యూలు చూస్తున్నాను (సత్యదేవ్, వెంకటేష్ మహా).. మన ప్రశ్నల్ని ఎవరూ అడగడం లేదు :(
తొలగించండిడిజిటల్ ఫోటోగ్రఫీని మన దేశంలో స్టూడియోలు పూర్తిగా అడాప్ట్ చేసి ఒక పదిహేను ఏళ్ళు మాత్రమే, అయ్యిందండీ. పాతతరం ఫోటోగ్రాఫర్స్ కొంతమంది, వాళ్ళ హాబీగా ఫిలిం కొనసాగించే వారు వున్నారు. ఈ సినిమాలో కూడా హీరో డిజిటల్ కెమెరా వాడితే, వాళ్ళ నాన్న గారు ఫిలిం కెమెరా వాడినట్టుగా చూపించడం జరిగింది.
తొలగించండిమురళిగారూ.. మీరు ఒక్కరేనండి ఇంకా బ్లాగు మొక్కకి రోజూ నీళ్ళు పోసేది :)
రిప్లయితొలగించండిఈ సినిమా భలె ఉంది కానీ... మీరన్నట్టె కొన్ని పంటికింద రాళ్ళు లా ఉన్నాయ్! ఆ రెండో హీరొయిన్ భలె నచ్చెసింది. నటన కూడా బాగ చేసింది.
కానీ నాకు కంచరపాలెమే నచ్చింది దీనికంటే :)
నేను కంచరపాలెంతో పోలిక పెట్టుకోకూడదని అనుకున్నానండీ.. కాబట్టి నో కంప్లైంట్స్ :) ఆ అమ్మాయి మెడికో అట! ధన్యవాదాలు..
తొలగించండి