(రెండో భాగం తర్వాత)
"అందమైన ఈ హంపీ పట్టణమంతా మూడు నెలలపాటు దట్టమైన పొగల్లో ఉంది సార్. వాళ్ళు విగ్రహాలు పగలగొట్టారు, గోపురాలని కూల్చేశారు. నగలన్నీ దోచుకున్నారు. అయినా కూడా ఇంకా ఏదో మిగిలిపోయింది. హంపీని నామరూపాలు లేకుండా చేయందే ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అనుకున్నారు. కలప ఉన్న ప్రతి నిర్మాణానికీ నిప్పు పెట్టి అప్పుడు కదిలారు. జనమంతా కట్టుబట్టలతో పారిపోయారు. హంపి ఒక పెద్ద శ్మశానంగా మారిపోయింది..." గుక్క తిప్పుకోడం కోసం ఆగాడు టూరిస్టు గైడు. అభావంగా ఉన్నాడతను. అప్పటికి అరగంట నుంచీ మాట్లాడుతూనే ఉండడం వల్ల కలిగిన అలసట తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం పర్యాటక శాఖ వారు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో పాల్గొని, గైడుగా అర్హత సంపాదించుకున్నవాడు. వాళ్ళు నేర్పిన చిలక పలుకులే కాకుండా ఇంకా ఏదో చెప్పాలనే తాపత్రయం ఉన్నవాడు. చేస్తున్న వృత్తిమీద గౌరవంతో పాటు, ఆ వృత్తికి కారణమైన శ్రీకృష్ణ దేవరాయల మీద ఆరాధన గోచరించింది అతని మాటల్లో.
హంపీ అనగానే మొదట గుర్తొచ్చేది ఏకశిలా రథం. ఆ రథం ఉన్నది విశాలమైన విజయ విఠల ఆలయ ప్రాంగణంలో. యాత్రలో మూడో రోజు ఉదయం అడుగుపెట్టింది ఆ ఆలయ ప్రాంగణంలోనే. రోజూలాగే తెలుగు మాట్లాడే ఆటో డ్రైవరే దొరికాడు. అందరు డ్రైవర్లలాగే హంపీ కథలెన్నో చెబుతూ, ఇరవై నిమిషాల్లోనే గమ్యస్థానంలో దించేసి వెళ్ళిపోయాడు. అప్పుడే తెలిసిన విషయం ఏమిటంటే, నేరుగా విఠలాలయం దగ్గరికి బయటి వాహనాలు వేటినీ అనుమతించరు. ఒక కిలోమీటరు దూరంలోనే ఆపేస్తారు. అక్కడి నుంచి నడిచి వెళ్లొచ్చు, లేదా అందరూ మహిళలే నడిపే చిన్న చిన్న బేటరీ కార్లలో టిక్కెట్టు కొనుక్కుని వెళ్లొచ్చు. ఉదయపు వాతావరణం ఆహ్లాదంగా అనిపించడంతో నడకకే ఓటు పడింది. ఫలితం, దారిలో మరో రెండు చారిత్రక నిర్మాణాలని చూసేందుకు వీలయింది. వాటిలో ఒకటి 'గజ్జెల మండపం,' ఎందరు నర్తకీమణులు నాట్యం చేశారో అక్కడ. మరొకటి, బాటసారుల కోసం కట్టించిన సత్రం లాంటి నిర్మాణం, ఎదురుగా కోనేరు. ఆశ్చర్యం ఏమిటంటే, అక్కడ కూడా తమ కళా నైపుణ్యం ప్రదర్శించారు విజయనగర శిల్పులు.
అనుకోకుండా జర్నలిస్టు అరుణ మళ్ళీ కలిశారు. అనేగొంది లో ఉన్న ఆర్కియలాజికల్ సైట్ లోకి పర్యాటకులని ఆపేశారని, ఆ శాఖ ఉన్నతాధికారులకి తను మెయిల్ రాశానని చెబుతూ డిపార్ట్మెంట్ ని తిట్టిపోశారు. విఠలాలయంలో గైడ్ ని ఏర్పాటు చేసుకోమని మళ్ళీ గుర్తు చేస్తూ, తను గజ్జెల మండపం దగ్గర నోట్స్ రాసుకోడానికి ఆగిపోయారు. టిక్కెట్టు కొనుక్కుని ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా, కుమారి పద్మ మళ్ళీ గుర్తొచ్చింది. జేసుదాసు గొంతుతో రవీంద్రబాబు 'నవరస సుమమాలికా..' అని పాడుతూ ఉండగా, రథం పక్కన, స్థంభాల మధ్యనా పరవశంగా నర్తించిన పద్మ. ఒక్క 'అందాలు అలలైన మందాకిని..' చరణంలో హేమకూటాన్ని పావనం చేసింది తప్ప, మిగిలిన పాటంతటికీ ఎండని సైతం లెక్కచేయకుండా ఇక్కడే కదా నర్తించింది. చాలా విశాలమైన ఆవరణలో ఉంది విఠలాలయం. ఇంకా సందర్శకుల తాకిడి ఊపందుకోలేదు. లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా రాతి రథం. రకరకాల మండపాలు. చుట్టూ ఎత్తైన ప్రాకారం. గైడు కోసం వాకబు చేస్తుంటే, ఓ హిందీ గైడు తెలుగతన్ని పరిచయం చేశాడు.
ఉన్నట్టుండి సందర్శకుల తాకిడి పెరిగింది. రథం దగ్గర ఫోటోలు, సెల్ఫీలు తీసుకుని తిరుగు ముఖం పట్టిన వాళ్ళు కొందరైతే, మండపాల్లో మరికొన్ని ఫోటోలు తీసుకుని తర్వాతి సైట్ కి పరుగులు పెట్టిన వాళ్ళు మరికొందరు. ఓ గుజరాతీ ఆవిడ మాత్రం చాలా తాపీగా ఒక్కో స్థంభాన్నీ ఫోటోలు తీసుకున్నారు, భర్తే కాబోలు - బ్యాగ్ మోస్తూ మధ్య మధ్యలో ఆవిడకి నీళ్ళూ, బిస్కట్లూ భక్తిగా అందిస్తున్నాడు. "ఏకశిల రథముపై లోకేష్ ఒడిలోన అని నాగేశ్వర్ రావు పాడాడు కానీ సార్, ఇది ఏకశిలా రథం కాదు. ప్రతి పార్టుని విడగొట్టి మళ్ళీ అసెంబుల్ చేయొచ్చు. టూరిస్టులు పాడు చేసేస్తారని చక్రాలని సిమెంట్ తో అతికేశారిప్పుడు," చెప్పాడు గైడు. రథాన్ని దగ్గర నుంచి చూస్తుంటే, ఇలాంటి రథం పక్కనే ఓ రాత్రివేళ 'మౌనమేలనోయి..' అని పాడుకున్న మాధవి గుర్తొచ్చింది. గైడుతో అంటే ఈ రథాన్ని చూసి గజపతులు కోణార్క్ లో ఆ రథాన్ని చేయించి ఉంటారని అభిప్రాయ పడ్డాడు. ప్రధాన ఆలయంలోనూ, ఉపాలయాల్లోనూ కూడా దేవతా విగ్రహాలు లేవు. స్థంభాల మీద చెక్కడం పని మాత్రం చెక్కుచెదరలేదు.
ఆలయ ప్రాంగణం బయట ఉన్న అతిపెద్ద బజారుని పురావస్తు శాఖవారు పునర్నిర్మించారని తెలిసింది. వెనుకవైపు సత్రాలు శిధిలావస్థలో ఉన్నాయి కానీ, రాయలు తులాభార స్థంభాలు మాత్రం ఠీవిగా నిలబడి ఉన్నాయి. ఆవరణంతా కలియతిరిగి బయటికి వచ్చేసరికి, మళ్ళీ రోడ్డు వరకూ నడిచే ఓపిక లేకపోయింది. బేటరీకారు ప్రయాణం తప్పలేదు. విఠలాలయానికి తీసుకున్న టిక్కట్లతోనే లోటస్ మహల్ ఉన్న రాణుల అంతఃపురాన్నీ, కమలాపురంలో ఉన్న మ్యూజియంనీ కూడా చూడొచ్చు. మ్యూజియంని ఎంచుకుని అటు వెళ్తే ఖాళీగానే ఉంది. ప్రదర్శనలో ఉంచిన వస్తువులు కూడా ఊహించినన్ని లేవు. ఆయుధాల తాలూకు అవశేషాలూ, శాసనాల తాలూకు శేష భాగాలూ ఉన్నాయక్కడ. 'మినియేచర్ హంపీ' మాత్రం ప్రత్యేక ఆకర్షణ. చూసేసిన స్థలాలు, చూడాల్సిన విశేషాలు గుర్తు పెట్టుకోడానికి వీలుగా ఉంది ఆ ఏర్పాటు. ప్రవేశ ద్వారం దగ్గర రాయలు, ఇద్దరు రాణుల విగ్రహాలు తిరుమల ఆలయాన్ని గుర్తు చేశాయి.
మయూర భువనేశ్వరిలో వసతి బాగానే ఉంది కానీ, తిండి బొత్తిగా బాలేదు. అంతకు మించి అక్కడెక్కడా ఏమీ దొరికే వీలూ కనిపించలేదు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరి వెళ్తే, వెళ్లిన చోట మధ్యాహ్నానికి కాయో, పండో తినడం, సాయంత్రం తిరిగొచ్చాక పూర్తిస్థాయి డిన్నర్ చేయడం. తిండి, తిరుగుడు షెడ్యూల్లో ఒక్కసారిగా వచ్చిన మార్పు మూడోరోజుకి బయటపడింది. కాస్త తొందరగానే విశ్రాంతికి ఉపక్రమించి, "ఇంతకీ హంపీని ఎవరు ధ్వంసం చేశారు?" అన్న నా ప్రశ్నకి గైడు చెప్పిన జవాబుని జ్ఞాపకం చేసుకున్నాను. "కొడుకు మరణంతో రాయలు దెబ్బతిని ఉన్నాడు. అప్పటికే మంత్రి తిమ్మరుసు దూరమయ్యారు. దీనితో శతృ నవాబులందరూ ఒక్కటై దండెత్తారు. ఎంత దోచుకున్నారో లెక్కే లేదు. దోచుకోడంతో ఆగలేదు. రాయలు మీద అసూయతో హంపిని సర్వనాశనం చేయాలనుకున్నారు. అందమైన విగ్రహాలు పగలగొట్టారు, ఫిరంగులతో మండపాలు పేల్చారు. ఇక్కడి జనాన్ని వాళ్ళు ఎంత భయపెట్టారంటే, మళ్ళీ ఇంగ్లీష్ దొరలు వచ్చి ఈ నిర్మాణాలు గుర్తించే వరకూ మనుషులెవరూ ఇక్కడికి రాలేదు సార్. రాయలుతోనే హంపి వైభవం అంతా పోయింది..." ..హంపీ వచ్చి మూడురోజులు గడిచిపోయాయి.
(ఇంకా ఉంది)
చదువుతూంటే మీతో పాటు మేమున్నట్లుతోచింది చక్కని రచనా శైలి
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ
తొలగించండిహంపీ దారుల్లో మరోసారి తిరిగినట్టుంది! ధన్యవాదాలు మురళి గారు.
రిప్లయితొలగించండివందల సంవత్సరాలనాటి చరిత్రని ఊహించుకోవడం కష్టం! విజయవిఠలుడి కోవెల వెనకభాగంలో మినియేచర్ లో విఠలుడి విగ్రహం చూస్తే పూర్తి కోవెల ఎలా ఉండి ఉంటుందో, మహోన్నతమైన విఠలుడి విగ్రహం ఎంత పెద్ద ఏకశిలా విగ్రహమో అర్ధమవుతుంది. పట్టాభిరాముని కోవెల్లో మెరిసే రాళ్ళతో నిర్మించిన వరండాలు నూనె కాగడాల వెలుగులో ధగద్ధగాయమానంగా ఉండేవట. మెరిసే దారుల్లో నడిచే నాయికల్ని ఊహించుకోవచ్చు. :) ఆ రాళ్ళెలాంటివో ఏమిటో వివరాలు ఎవరికీ అర్ధమేకాలేదీనాటికి.
భారతీయ శిల్పకళానైపుణ్యాన్ని, శాస్త్రవిజ్ఞానాన్ని ప్రపంచానికి వినిపించేందుకు నిర్విరామంగా ప్రయత్నం చేస్తున్న చేస్తున్న YouTuber ప్రవీణ్ మోహన్ గురించి ఎంతచెప్పినా తక్కువే. సంగీతమంటపం గురించిన వివరాలు ఆసక్తి ఉన్నవారికోసం ఈ కింది లింకుల్లో.. కామెంట్ స్పేస్ ని వాడుకున్నందుకు అన్యధాభావించరని ఆశిస్తున్నాను.
https://www.youtube.com/watch?v=a5-Dm68-PEw
https://www.youtube.com/watch?v=FhoOA3pASy4
నేనే మీకు థాంక్స్ చెప్పాలండి.. వీడియోలు చూస్తాను, వీలువెంబడి..
తొలగించండిమురళి గారూ, మీరు ఈ యాత్ర చేసింది ఎప్పుడు ? నేను హంపీ చూసి దాదాపు 30 యేళ్ళవుతోంది. కర్ణాటకలో పనిచేస్తున్నప్పుడు ఒకాదివారం (వయా గంగావతి) ఆనెగుంది వెళ్ళి అక్కడ పుట్టి లో రేవు దాటి హంపీ చేరుకున్నాను (విజయ విఠల వైపు). అక్కడ నుండి దారిలో చూసుకుంటూ విరూపాక్ష దేవాలయం వైపు వెళ్లాను.
రిప్లయితొలగించండిఅప్పట్లో అన్ని సౌకర్యాలు లేవు. అంతా కాలినడకన చుట్టడమే. అయినా అదొక ఆనందం. మీరు వర్ణిస్తున్న దాన్ని బట్టి చూస్తే చాలా మార్పులు జరిగినట్లున్నాయి .... విజయ విఠలలో సరిగమల స్తంభాల దగ్గర సెక్యూరిటీతో సహా 🙂?
యాత్రల విశేషాలు ఆలస్యం లేకుండా రాసేస్తానండి, కొన్ని విషయాలు మర్చిపోయే ప్రమాదం లేకుండా. నేను ఇదే మొదటిసారి వెళ్లడం కాబట్టి, ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసుకునే వీలు లేదు (సినిమాలలో చూసి పోల్చుకోడం తప్ప). ఇప్పుడు ఆటోలు బాగా దొరుకుతున్నాయండి, ఫేర్స్ కూడా రీజనబుల్. ఒక్క విజయ విఠల లోనే కాదండి, మొత్తం అన్ని సైట్ల దగ్గరా చాలా మంది సెక్యూరిటీ సిబ్బంది, మెయింటెనెన్స్ వాళ్ళు పనిచేస్తున్నారు. వీలైతే చూసి రండి, అప్పుడు-ఇప్పుడు హంపి గురించి మీ మాటల్లో తెలుసుకోవచ్చు మేమంతా.. ధన్యవాదాలు..
తొలగించండిఆ రాతి స్థంభాల సంగీతం వీడియో కూడా తీసానండి, తవ్వకాల్లో ఎక్కడుందో పట్టుకోవాలి, హంపీని మళ్ళీ మీకళ్ళతో చూసేస్తున్నాం
రిప్లయితొలగించండిపట్టుకోండి, పట్టుకోండి.. ఇప్పుడు ఆలోచిస్తే 'కనీసం సగమన్నా చూశానా' అనిపిస్తోందండీ నాకు. ..ధన్యవాదాలు.
తొలగించండిచివరి పేరా చదవగానే అలా జరిగుండకపోతే ఎంత బాగుండునో అన్న ఒక ఆలోచన :(
రిప్లయితొలగించండినిజమండీ. ధన్యవాదాలండీ..
తొలగించండి