బుధవారం, ఫిబ్రవరి 06, 2019

వేదం .. అణువణువున నాదం ...

"సాగరసంగమమే ఒక యోగం.. క్షార జలధులే క్షీరములాయే.. 
ఆ మధనం ఒక అమృత గీతం.. జీవితమే చిరనర్తనమాయే..." 

సంగీతం సామవేదం నుంచి పుడితే, నాట్యం మాత్రం నాల్గు వేదాల నుంచీ ఉద్భవించింది. నాట్యమే జీవితంగా, జీవితమే నాట్యంగా గడిపిన ఓ కళాకారుడు, కళను తప్ప కాసుల్ని, కీర్తిని పోగుచేసుకోలేని వాడు, జీవిత చరమాంకంలో తన విద్య మొత్తాన్ని ఒక ప్రియమైన విద్యార్థినికి ధారబోసి, ఆమె నాట్యంలో తనని తాను చూసుకుని, మైమరిచి, తృప్తితో కన్నుమూసే సందర్భానికి ఒక పాట కావాలి. సంగీత, నాట్యాలమీద సమగ్రమైన అవగాహన ఉన్న కవి ఆ పాటని ఎలా ఆరంభిస్తారు? 'సాగరసంగమం' (1983) సినిమా కోసం తాను రాసిన పాటని వేటూరి ఇలా మొదలు పెట్టారు: 



"వేదం.. అణువణువున నాదం.. 
నా పంచప్రాణాల నాట్య వినోదం.. 
నాలో రేగేనెన్నో హంసానందీ రాగాలై..." 

నాట్యమంటే వేదం.. శ్రద్ధగా నాట్యం చేస్తున్నప్పుడు నర్తకుడు/నర్తకి శరీరమంతా నాదమయమే. నాయకుడికి నాట్యం కేవలం ప్రాణం కాదు, పంచప్రాణాలూను. నాట్యం తాలూకు నాదం 'హంసానంది' రాగాలై రేగుతోంది. సంగీతజ్ఞులు 'హంసానంది' ని సంధ్యారాగం గా వర్గీకరించారు. అంటే, ఈ రాగంలో స్వరం చేసిన కృతులు సాయం సంధ్య వేళ పాడుకోడానికి అనువుగా ఉంటాయి. కథ ప్రకారం, ఈ పాట వచ్చే సందర్భం నాయకుడి జీవిత సంధ్యా సమయం. 

"సాగరసంగమమే ఒక యోగం.. క్షార జలధులే క్షీరములాయే.. 
ఆ మధనం ఒక అమృత గీతం.. జీవితమే చిరనర్తనమాయే.. 
పదములు తామే పెదవులుకాగా.. గుండియలే అందియలై మ్రోగ..." 

నది, సముద్రంలో కలవడం సాగరసంగమం. కళని తనలో నింపుకున్న కళాకారుడు, లయకారుడిలో లీనమవ్వడం కూడా అలాంటిదే.. అది ఒక యోగం. ఉప్పునీటి సముద్రాలు పాలుగా మారుతున్నాయి. జరుగుతున్న మధనం అమృతగీతమై వినిపిస్తుంటే, జీవితం మొత్తం పురాతనమైన నాట్యమైపోయింది. పాదాలు పెదవులుగా రాగం ఆలపిస్తుంటే, గుండెలు మువ్వలుగా మోగుతూ సంగీతం సమకూరుస్తున్నాయి. ...కళనే ఊపిరిగా చేసుకుని బతికినవాడు కదా, చివరి క్షణాల్లో కూడా ఆ కళే కనిపిస్తోంది, వినిపిస్తోంది.. 

"మాతృదేవోభవ..పితృదేవోభవ.. 
ఆచార్యదేవోభవ..అతిథిదేవోభవ.." 

దశోపనిషత్తుల్లో ఏడోదైన తైత్తరీయోపనిషత్తు తల్లి, తండ్రి, గురువులు, అతిధులు దైవంతో సమానమని చెబుతోంది. వాటిని గుర్తు చేసుకుంటూ, గురువు నుంచి నేర్చుకున్న విద్యని ప్రదర్శించడానికి వేదికెక్కింది శిష్యురాలు. 

"ఎదురాయె గురువైన దైవం.. ఎదలాయె మంజీర నాదం.. 
గురుతాయె కుదురైన నాట్యం.. గురుదక్షిణై పోయే జీవం.. 
నటరాజ పాదాన తలవాల్చనా..నయనాభిషేకాన తరియించనా.. 
సుగమము.. రసమయ.. నిగమము.. భరతము గానా..." 

సాక్షాత్తూ దేవుడే గురువు రూపంలో రావడంతో ఆమె ఎదసడి మువ్వలసవ్వడిగా మారిపోయింది. కుదురైన నాట్యాన్ని నేర్పిన గురువుకి దక్షిణగా ఇచ్చేందుకు ఏముందని? జీవితమే గురుదక్షిణ అయిపొయింది. సాక్షాత్తూ నటరాజస్వరూపుడైన ఆయన పాదాలపై తలవాల్చి, కన్నీటితో అభిషేకించడం తప్ప ఇంకేం చేయగలను? సులభమైనది, రసమయమైనది, వేదస్వరూపమైనదీ కదా నాట్యం... ఆ నాదం వింటూ అతని ప్రాణదీపం కొండెక్కిపోయింది. 

"జయంతితే సుకృతినో రససిద్ధః కవీశ్వరః 
నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయం" 

భర్తృహరి నీతి శతకంలో ఇరవయ్యో పద్యం ఇది. మంచి పుస్తకాలని రచించిన కవులు పుణ్యాత్ములై, పాఠకులకి కలిగించిన రససిద్ధి కారణంగా జరామరణాలు లేని కీర్తికాయులు, యోగులు అవుతారని భావం. ఇక్కడ నాయకుడు, తన నాట్యం ద్వారా ప్రేక్షకుల్లో రససిద్ధి కలిగించి యోగిగా మారాడన్నది అన్వయం.అతడు లేకపోయినా, శిష్యురాలి రూపంలో అతని నాట్యం కళాభిమానులందరికీ రససిద్ధిని కలిగిస్తూనే ఉంది..  

'హంసానంది' రాగంలో ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటని బాలు, శైలజ హృద్యంగా ఆలపించారు. ముఖ్యంగా 'మాతృదేవోభవ...' కి ముందుగా వచ్చే శైలజ ఆలాపన కట్టిపడేస్తుంది. గురువుగా కమల్ హాసన్, శిష్యురాలిగా శైలజ నటించారు ఈ నాట్యప్రధానమైన గీతంలో. 'పూర్ణోదయా' నాగేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రానికి 'కళాతపస్వి' కె.విశ్వనాధ్ దర్శకత్వం వహించారు.

2 కామెంట్‌లు:

  1. వేదం.. అణువణువున నాదం..
    నా పంచప్రాణాల నాట్య వినోదం..
    నాలో రేగేనెన్నో హంసానందీ రాగాలై..-ఎదో రాగం పెరు తెలుసుకొని ఇరికించినట్టు లేదూ. అసలు ఈ పల్లవికి తలా తోక ఉందా. లేని పోని అర్థాలు అపాదిస్తూ ఎందుకు బయ్యా ఈ అతి విశ్లేషణలు. వేటూరి అక్కడక్కడా కొన్ని మంచి పదబంధాలు భావనలు రాసినమాట నిజం. అయితే ఈ అతి పొగడ్తలు వెగటు కలిగిస్తుంది. అవసరాన్ని మించి పాండిత్య ప్రదర్శన చేయడం వ్యర్థం. ఇది నా అభిప్రాయం మాత్రమే బయ్యా. I may be wrong too. We need not get carried away so much and indulge in over adulation. I too like a few veturi songs like నీలాలు కారేనా, akhilandeshwari, రెపల్లియ ఎద ఝల్లున...I am equally critical of the nonsensical stuff he wrote. No intention of belittling your write up.

    రిప్లయితొలగించండి
  2. @అజ్ఞాత: మీకు నచ్చిన పాటలు ఉన్నట్టే, నాకు నచ్చిన పాటలూ ఉన్నాయండి, కొంచం ఎక్కువ ఉన్నాయేమో బహుశా.. వాటిలో కొన్నింటి గురించి రాసే ప్రయత్నం ఇది.. ఒకరికి సెన్స్ అనిపించింది మరొకరికి నాన్సెన్స్ అనిపించడం సహజమే.. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు భయ్యా/బహెన్..

    రిప్లయితొలగించండి