శుక్రవారం, ఫిబ్రవరి 01, 2019

వెన్నెల్లో గోదారి అందం ...

"నాకులేదు మమకారం ..
మనసు మీద అధికారం ..
ఆశలు మాసిన వేసవిలో ..."

మమకారాన్ని చంపుకోవడం, మనసు మీద అధికారాన్ని వదులుకోవడం అంటే విరాగిగా మారిపోవడమే. జీవితంలో చూడాల్సినవన్నీ చూసేసి, వానప్రస్థాన్ని చేరుకున్న చాలామందిలో ఈ వైరాగ్యం సహజంగానే కలుగుతుంది. అంతే కాదు, తక్కువ జీవితంలోనే ఎక్కువ అనుభవాల్ని - అందునా చేదు అనుభవాల్ని - చూసిన వాళ్ళూ ఈ దశకి త్వరగానే చేరుకుంటారు. అలా చేరుకున్న ఓ పాతికేళ్ళమ్మాయి, తన ప్రమేయం లేకుండా జరిగిన అనేక సంఘటనల కారణంగా విరాగిగా మారిపోయి, తన మనఃస్థితిని పాట రూపంలో బయట పెడితే? 'సితార' (1984) సినిమాలో కథానాయిక కోసం అలాంటి పాటనే రాశారు వేటూరి.


"వెన్నెల్లో గోదారి అందం..
నది కన్నుల్లో కన్నీటి దీపం..
అది నిరుపేద నా గుండెలో..
చలి నిట్టూర్పు సుడిగుండమై..
నాలో సాగే మౌనగీతం.."

వెన్నెల్లో గోదారిని చూడడం ఓ అనుభవం. మొదట ఆ అందం మైమరపిస్తుంది. సమయం గడిచాక ఐహిక ప్రపంచంతో లంకె తెగిపోతుంది.. మరింత సమయం తర్వాత 'ప్రాణాన్ని విడిచేసితే మాత్రమేం?' అని అనిపించేస్తుంది. ఆ స్థితిని విరక్తి అనలేం.. వెన్నెల్లో గోదారిని తనివితీరా చూసిన వాళ్లకి మాత్రమే సంభవించే స్థితి అది. 'నది కన్నుల్లో కన్నీటి దీపం..' నిజానికిదో గొప్ప కవితాతాత్మక వాక్యం. ఈ పాట నిండా ఇలాంటి వాక్యాలెన్నో పొదిగారు కవి. నది కళ్ళలో నీరు కారి, ఆ కన్నీటితో దీపం వెలుగుతోందట!

'అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై..' ఆ దీపం, నాయిక నిరుపేద గుండెలో 'చలి నిట్టూర్పు' సుడిగుండమై తిగురుతోంది. నిట్టూర్పు వేడిగా ఉండడం అందరికీ అనుభవం. ఆ నిఛ్వాస చల్లబడితే? చల్లబడ్డ ఆ నిట్టూర్పు లోలోపల సుడిగుండమై తిరుగుతుంటే?? 'నాలో సాగే మౌన గీతం..' లోపల ఏం జరుగుతోందో ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి? అందుకే ఆ చలి నిట్టూర్పు సుడిగుండం నాయిక లోలోపల మౌన గీతమై సాగుతోంది. అది విషాద సంగీతమని, విషాదానికి పరాకాష్ట అనీ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కదా..

"జీవిత వాహిని అలలై.. ఊహకు ఊపిరి వలలై..
బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో..
ఎడబాటే.. ఒక పాటై.. పూలతీవెలో సుమ వీణ మోగునా.."

నదిలో కనిపించేవి అలలు, వలలూను. జీవన ప్రవాహం అలలుగా సాగుతోంది. వలలు అడ్డం పడుతూండడంతో ఊహలకి మాత్రం ఊపిరి అందడం లేదు. గతం అనే చీకటి గదిలో జీవితమే ఒక బంధనంగా మారిపోయింది. ఎడబాటు పాటై సాగుతున్నప్పుడు, పూలతీగెతో రాగాలు పలికించడం సాధ్యమేనా?? నాయిక గతం చీకటిమయం. దానిని ఆమె చీకట్లోనే ఉంచాలనుకుంది. కానీ అది సాధ్య పడలేదు. మొదటి చరణంలో నాయిక పరిచయం, ఆమె గతం తాలూకు ప్రస్తావనా జరిగాయి.

"నిన్నటి శర పంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి..
కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నాచూపులు చూడలేని మంచు బొమ్మనై..
యవ్వనాలు అదిమి అదిమి.. పువ్వులన్ని చిదిమి చిదిమి..
వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే.."

రెండో చరణంలో మొదటి భాగం ఇది. ఆమె తన గతమంతా బాణాలతో చేసిన పంజరంలో గడిపింది. అది దాటి వచ్చి స్వరపంజరంలో నిలబడింది. బాణాల నుంచి స్వరాలకి మారినా అది పంజరమే. ఆమె స్వేచ్ఛ లేనిదే. పొంగి పొరలుతున్న కన్నీరు కళ్ళమీద తెరలు కట్టడంతో, ఆమె ఏమీ చూడలేని 'మంచుబొమ్మ' గా మారిపోయింది. అంటే, గడ్డకట్టుకు పోవడమే కాదు, నెమ్మదిగా కరిగి నీరైపోతోంది కూడా. యవ్వనాన్ని అదిమేసి, పువ్వుల్ని చిదిమేసి, చేజేతులా వెన్నెలని 'ఏటిపాలు' చేసుకుంది. మామూలుగా అయితే 'అడవి కాచిన వెన్నెల' అంటారు. కానీ, ఈ పాట నదిని గురించి, నదిలాంటి నాయికని గురించీ కాబట్టి, ఆమె 'ఏటిపాలు' చేసుకుంది అంటున్నారు.

"నాకు లేదు మమకారం.. మనసు మీద అధికారం ..
ఆశలు మాసిన వేసవిలో... ఆవేదనలో రేగిన ఆలాపన సాగే ..
మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే.. మనసు వయసు కరిగే..
మధించిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో..

తిరిగే.. సుడులై.. ఎగసే ముగిసే కథనేనా .. ఎగసే ముగిసే కథనేనా.."

జీవితం కన్నీటి మయమై, వయసు, వలపు ఏటిపాలైపోయిన తర్వాత ఇక మిగిలేది వైరాగ్యపు స్థితే. తనమీద తనకి ప్రేమ లేని స్థితి, మనసు ఎటువైపుకీ మళ్లించలేని స్థితి. ఆశలన్నీ మాసిపోయి, వసంతంలా సాగాల్సిన జీవితం వేసవి గాడ్పుల మయమైపోయినప్పుడు చేసే ఆలాపన ఆవేదనలమయమే. మదిలో నింపుకున్న కలలన్నీ నదిలో వెల్లువలా పొంగి, ఆరిపోయాయి. మనసు, వయసు కరిగిపోయాయి, సరాగమే కానరాలేదు. వలపులు బాధని పెంచేవే.. అవి వేగంగా సుడులు తిరిగి ఎగిసి ఎగిసి కథని ముగిస్తున్నాయి. ముగించేది కథనేనా? కథ-నేనా (నాయిక)?? 'కథనేనా' అని రెండు సార్లు అన్నారు కాబట్టి, రెండు అర్ధాలనీ తీసుకోవచ్చా?? చేయగలిగినన్ని ఆలోచనలు చెయొచ్చు, శక్తి, ఆసక్తి మేరకు.

రాణివాసంలో రహస్యపు జీవితం గడిపి, ఆ రహస్యం కన్నా బరువైన ఒక విషాదాంత ప్రేమానుభవాన్ని గుండెల్లో దాచుకుని, నటిగా కొత్తజీవితం మొదలు పెట్టిన అమ్మాయి మీద ఆ గతమే పగబట్టి, వెంటాడి, వేధిస్తే? జీవితకాలం పాటు తనలోనే దాచుకోవాల్సిన రహస్యాలు, బహిరంగమై తనని వెక్కిరిస్తుంటే, విరక్తి కాక కలిగేదేముంటుంది? ఆమె వేదనని తనదిగా చేసుకుని పదాల్ని పరవళ్ళెత్తిస్తూ వేటూరి రాసిన ఈ పాటని నిజానికి గాఢత కలిగిన కవిత్వం అనాలి.

నది, దుఃఖం రెండూ కూడా సన్నగా మొదలై ఉధృతమవుతాయి. ఆ రెండింటి మేళవింపైన ఈ పాట నడక కూడా అంతే. స్వరజ్ఞాని ఇళయరాజా 'గౌరీ మనోహరి' రాగంలో స్వరపరిచిన పాటని, గుండెల్ని పిండేలా ఆలపించిన ఎస్. జానకి కి యేటి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం లభించింది. పీడకల లాంటి గతాన్ని తల్చుకుని అమ్మాయిగానూ, లోకుల వేధింపుల నించి పారిపోయే నటిగానూ జీవించింది భానుప్రియ. మంద్రంగా మొదలై ఉఛ్చస్థాయికి చేరే స్వరానికి తగిన విధంగా అభినయించింది.

ఇళయరాజా చేత ట్యూన్ చేయించుకుని, వేటూరి చేత రాయించుకుని, గీత రచయిత భావాలకి అద్దంపట్టేలా చిత్రించిన దర్శకుడు వంశీని, నిర్మాత 'పూర్ణోదయా' నాగేశ్వర రావునీ కూడా పాటతో పాటుగా గుర్తుపెట్టుకోవాలి.

14 వ్యాఖ్యలు:

 1. Excellent reviews, with good analysis of the lyrics.

  Can you enable copying so that we can preserve for our private future reference?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నామట్టుకు నాకు సంగీతం, నటులు, దర్శకత్వ విలువల కంటే సాహిత్యానికే పెద్దపీట వెయ్యాలనిపించడానికి కారణం బహుశా ఇలాంటి పాటలే. మిగిలినవన్నీ బంగారానికి తావి. మీ దృక్కోణం చాలా విలక్షణంగా ఉంటుందని మరోసారి నిరూపిస్తున్నాయండీ ఈ పాటల పోస్ట్ లు. సాహిత్యవిశ్లేషణకి నేను పెద్ద అభిమానినేం కాదు. అయినా నచ్చేస్తున్నాయి. Please keep writing for us.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఇంత అతి విశ్లేషణ అవసరమా బయ్యా.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నాకు అత్యంత ఇష్టమైన పాట.చిత్ర కథ ని మొత్తం ఒక్క పాటలో తెలపడం వేటూరి గారికే సాధ్యం.

  వేటూరి గారి శైలి రావడం చాల కష్టం.
  ముఖ్యంగా ఈ వాక్యాల శైలి ఇప్పటి రచయితల ఊహకు కూడా అందదు
  "జీవిత వాహిని అలలై ... జీవిత వాహిని అలలై
  ఊహకు ఊపిరి వలలై బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో..
  ఎడబాటే.. ఒక పాటై పూలదీవిలో సుమవీణ మోగునా"

  వేటూరి గారి పాటలు ఇంకొన్ని పరిచయం చెయ్యండి.
  ముఖ్యంగా గీతాంజలి,సప్తపది,సాగర సంగమం,శుభసంకల్పం,గోదావరి,ఆనంద్,శుభలేఖ,అన్వేషణ ఇలా ఎన్నో ఆణిముత్యాలు.

  ఆయన మాటల్లో
  "ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది
  నీటి మీద రాత రాసి నావెల్లిపొయింది"

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Ve"tourism" lo busy gaa tirugutunnaru gaa... Decade celebrations? Nice.

  Maa godavari gurimchi Emta cheppinaa takkuve.. ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @అజ్ఞాత: After noticing gross misuse of this blog's content, I was forced to disable the copying. Hope you understand. Thanks for your support.
  @కొత్తావకాయ: వేటూరిలో సినిమా కవిని మించిన కవి ఉన్నారనిపిస్తుందండి.. సినిమాకి రాయడం అంటే బహుశా ఓ మెట్టు దిగడమేనేమో ఆయనలోని కవికి. ధన్యవాదాలు..
  @పవన్ కుమార్ రెడ్డి: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు


 7. @అజ్ఞాత: మరో రెండు పేరాలు రాసి పబ్లిష్ చేసే ముందు తొలగించాను భయ్యా/బహెన్. ఓపిగ్గా చదివినందుకు ధన్యవాదాలు.
  @శశి: అవునండీ.. కథ మొత్తం తెలుసుకుని, పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి మరీ రాసేవారనిపిస్తుంది పాటల్ని.. అందుకే నిలిచిపోయాయి.. ధన్యవాదాలు.
  @ఫణీన్ద్ర: వేటూరిజం.. భలే కాయిన్ చేశారే!! దశాబ్ది ఉత్సవాలేమీ కాదండీ.. ఎప్పటినుంచో అనుకుంటున్నదే.. ఇప్పటికి కుదిరింది అంతే.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. వేటూరి గారికి మా ఊరిలో ఉన్న ఏరు (కృష్ణానది) అంటే చాలా ఇష్టమనీ, శ్రీకాకుళంలో ఒక ఇల్లు కట్టుకోవాలనేది ఆయన కోరిక అనీ చాలా రోజుల తరువాత తెలిసింది. చదువులకోసం పట్టణాలకి వలస వెళ్ళడం వల్ల మా ఇల్లు (ఇపుడు కూడా )ఖాళీ గానే ఉండేది. ముందుగా తెలిసుంటే మా ఇంటిలో ఉండమనేవాళ్ళం కదా అనిపిస్తుంది. వేటూరి గారి పాటల్లో కృష్ణా నదిపై వచ్చిన పాటలేమైనా ఉన్నాయా మురళిగారూ ? యమునాతీరం ....లాంటివి.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @నీహారిక: అగ్రస్థాయి గీత రచయిగా సుదీర్ఘకాలం నిలదొక్కుకుని కూడా, సొంతిల్లు లేకుండా వెళ్ళిపోయిన సినిమా కవి వేటూరి ఒక్కరేనేమోనండీ..అన్నట్టు, కృష్ణ మీద కూడా పాటలున్నాయి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ఈ పాటలో నాకు ప్రత్యేకంగా అనిపించేది ట్యూను. అది రచయిత లిరిక్స్ పెద్దగా అర్ధం కానివాళ్ళకు కూడా వాటి పూర్తి భావం రీచ్ అయ్యేలా చేస్తుంది. మీ రివ్యూ చాలా బాగుంది. ఈ పాటకి ఇంత మంచి reference ఇంకెక్కడా దొరకదేమో!!

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @శేఖర్ పెద్దగోపు: ఇళయరాజా మహత్యం అండీ.. వెంటాడే ట్యూన్ నిజంగా.. వేటూరి రచన, జానకి గొంతు, వంశీ మార్కు చిత్రీకరణ, వెరసి గుర్తుండిపోయే పాట.. ..ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు