సోమవారం, ఫిబ్రవరి 25, 2019

రాగం తీసే కోయిల ...

"గుండెలో మురళిని గొంతులో ఊదకే..
పదే పదే పదే పదాలుగా..."

సందర్భోచిత గీతాలు రాసేప్పుడు గేయ రచయితలు పాత్రల ఔచిత్యాలని బట్టి పాట రాయాలా, లేక సందర్భంలో గాఢతకి తగినట్టుగా సాహిత్యం అందించాలా? వేటూరి లాంటి కవులు రెండూ చేశారు. బహుశా, 'ఎప్పటి కెయ్యది ప్రస్తుత'మో అప్పటికా విధంగా రాసేసి ఉంటారు. పాత్రౌచిత్యానికి మించే  అయినప్పటికీ, సందర్భంలో గాఢతని మరింత పెంచే విధంగా అనేక పాటలు రాశారు వేటూరి సుందర రామ్మూర్తి. వాటిలో 'నాగమల్లి' (1980) సినిమా కోసం రాసిన 'రాగం తీసే కోయిల...' అనే విషాద యుగళం ఒకటి. 



"రాగం తీసే కోయిల.. కోయకు గుండెలు తీయగా..  
రాతిరి వేళలా రగిలే ఎండలా.. "

అంటూ నాయిక పల్లవితో మొదలవుతుంది ఈపాట.  నిజానికి ఇది పల్లవిలో తొలి సగం. రాత్రివేళలో ఎండ కాయడం అన్నది అసహజ పరిణామం. తీయగా వినిపించే కోయిల పాట గుండెని కోయడం కూడా అంతే అసహజం.

"బాసలెన్నో చేసుకున్న ఆశే మాయగా..
పిలవని పిలుపుగా రాకే నీవిలా.."

ఈ మాటలతో పల్లవిని పూర్తి చేశాడు కథానాయకుడు. వాళ్లిద్దరూ ఎన్నో బాసలు చేసుకున్నారు. ఆ బాసల నుంచి వాళ్ళకెన్నో ఆశలు పుట్టాయి. కానీ ఇప్పుడు అవన్నీ మాసి పోయాయి. ఆ విషాద సందర్భంలో ఉన్న వాళ్ళ మనః స్థాయికి కోయిలకి స్వాగతం పలికేదిగా లేదు. అందుకే, పిలవని పిలుపుగా రావద్దు అని కోయిలని వేడుకుంటున్నాడతను.

కథానాయకుడు నాగరాజు గిరిజన యువకుడు. పెద్దగా చదువబ్బకపోయినా వేణుగానం అతనికి సహజంగా అబ్బిన విద్య. కోయిల పాడినంత తీయగానూ, అలవోకగానూ వేణువుని పలికిస్తాడతను. అదిగో, ఆ పాట విని అతనితో ప్రేమలో పడిపోయింది మల్లి. ఎనిమిదో తరగతి వరకూ చదువుకున్న ఆ అమ్మాయి, ఇష్టంలేని పెళ్లిని తప్పించుకోడానికి ఇంటి నుంచి తప్పించుకుని, పట్నానికి చేసే ప్రయాణంలో నాగరాజుని కలిసి, అతని వేణుగానం విని, ప్రేమలో పడిపోయింది. కలుసుకున్నంత సేపు పట్టలేదు, వాళ్లిద్దరూ ఊహించని పరిస్థితుల్లో విడిపోడానికి. ఒకచోట ఆమె బందీగా మారింది. ఆమె జాడ తెలియక, తల్లడిల్లుతూ వెతుకుతున్నాడు అతను.

"జంటని ఎడబాసిన.. ఒంటరి నా బ్రతుకున..  
మల్లెల సిరివెన్నెల మంటలు రేపగా.."

తొలి చరణంలో తొలిభాగాన్ని ఆమె పాడింది. జంటని విడిచిన జీవితం మల్లెల, సిరివెన్నెల మంటలా ఉందంటోంది. నిజానికి మల్లెపూలు, వెన్నెల హాయిని ఇవ్వాలి. కానీ, అతడి ఎడబాటు కారణంగా ఆమెలో అవి మంటల్ని నింపుతున్నాయి.

"వయసులా నులివెచ్చని..  వలపులా మనసిచ్చిన.. 
నా చెలి చలి వేణువై వేదనలూదగా.."

అతడు అందుకుని ఆమెని, ఆమె ప్రేమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 'చలి వేణువు' అన్నది వేటూరికి చాలా ఇష్టమైన పదప్రయోగం బహుశా. ('మెరుపులా మెరిశావు..' లాంటి పాటల్లో కూడా వినిపిస్తుంది). చలి అంటే జడము అని, జడము అంటే మూగ అని అర్ధాలున్నాయి. చలి వేణువు కి మూగవేణువు అని అర్ధం చెప్పుకోవచ్చేమో. ఒక టీవీ కార్యక్రమంలో ఎస్పీ బాలూ అయితే, చలిగా ఉన్నప్పుడు వేణువు సరిగా పలకదు అని అర్ధం చెప్పారు. ఎప్పుడూ హాయైన పాటలు పాడే తన వేణువు నుంచి వేదన వినిపించడం బాధిస్తోంది అతన్ని.

"తొలకరి పాటలే.. తోటలో పాడకే.. 
పదే పదే పదే పదాలుగా.."

కోయిలని పాడొద్దని వేడుకుంటూ తొలి చరణం ముగించింది ఆమె. పాట మొత్తం ఆమె వేడుకోలు కోయిలకైతే, అతని విన్నపాలు వేణువుకి!

"పగిలిన నా హృదయమే.. రగిలెనే ఒక రాగమై.. 
అడవిలో వినిపించిన ఆమని పాటగా.."

ఆమె వియోగం అతడి హృదయాన్ని బద్దలు చేసింది. బద్దలైన హృదయం రాగమై రగిలింది. మామూలుగా అయితే హృదయం పలకాలి. ఇక్కడ అతడి స్థితి కారణంగా రాగం రగిలింది. అది కూడా, అడవిలో వినిపించిన ఆమని పాటలా ఉంది. ఇది రెండో చరణం ప్రారంభం.

"అందమే నా నేరమా..  పరువమే నా పాపమా..  
ఆదుకోమని చెప్పవే ఆఖరి మాటగా.."

అంటూ ఆమె కొనసాగింపు. ఆమెని బంధించిన వాళ్లకి హృదయంతో పని లేదు. వాళ్ళకి కావాల్సింది ఆమె అందం, పరువమూను. ఆమెని రక్షించే వాళ్ళు ఎవరూ లేరు, అతడు తప్ప.

"గుండెలో మురళిని గొంతులో వూదకే.. 
పదే పదే పదే పదాలుగా.."

'గుండె గొంతుకలోన కొట్టాడుతాది' అనే కవితాత్మక వాక్యానికి కొనసాగింపులా వాక్యం ఇది.  వేణువు అతడికి ప్రాణం. ఒక్కమాట చెప్పాలంటే తన గుండెల్లో వేణువుతో పాటు ఆమెకీ చోటిచ్చాడు అతను. అలాంటిది ఇప్పుడు ఆమె వియోగంతో వేణువు మీదకి కూడా మనసు పోవడం లేదతనికి.

ముందే చెప్పుకున్నట్టుగా, నాయికా నాయకుల పాత్రల ఔచిత్యాలకి ఏమాత్రమూ పొసగని సాహిత్యం ఇది. అయితేనేం, ప్రేమించి, వియోగం బారిన పడిన ప్రతి జంటా తమని తాము ఈ పాటలో చూసుకుంటారు అనడంతో అతిశయోక్తి లేదు. రాజన్-నాగేంద్ర సంగీతంలో బాలు, సుశీల పాడిన ఈ పాటకి, దేవదాస్ కనకాల దర్శకత్వంలో చంద్రమోహన్, మల్లిక అభినయించారు. సందర్భ బలం, నటీనటుల నటనని మించిన పాట ఇది, స్వరం, పాడిన విధానం కూడా సాహిత్యానికి తగ్గట్టుగా అమిరాయి.

6 కామెంట్‌లు:

  1. పాట కోసం సినిమా చూస్తారా? చూసిన సినిమాలో వచ్చే పాట వింటారా? I’m curious.

    రిప్లయితొలగించండి
  2. అవును బయ్యా. పిచ్చి పిచ్చి భావాలతో నిండిన ఈ పాటలు నీకెలా నచ్చాయి. అయినా ఇంత శ్రమించి మధించి వేటూరిని ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నావు. నువ్వు గ్రేటర్ బయ్యా.

    రిప్లయితొలగించండి
  3. @కొత్తావకాయ: రెండూనండీ.. ఈ సినిమా అయితే పాట(ల) కోసమే చూశాను.. ధన్యవాదాలు.
    @అజ్ఞాత: నచ్చిన పాటల్ని గురించి రాయడం కన్నా, నచ్చని పాటల్ని గురించి చదవడం కష్టం అనిపిస్తుంది నాకు.. మీ ఓపిక చూస్తే ముచ్చటగా అనిపిస్తోంది భయ్యా/బహన్.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. నాగమల్లివో తీగమల్లివో పాట కూడా బాగుంటుంది.ఈ సినిమా మీరు చూసారా ? పాటలు వినడమే గానీ సినిమా చూడలేదు. వేటూరిగారికి పోటీ అంటూ ఉంటే సిరివెన్నెలగారే కానీ వేటూరిగారు అన్నిరకాల పాటలూ వ్రాయగలరు కానీ సిరివెన్నెలగారు వ్రాయలేరేమో అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  5. @నీహారిక: సినిమా చూశానండీ.. ఈ పోస్టు కోసం మొన్ననే మళ్ళీ చూశాను. యూట్యూబ్ లో మొత్తం సినిమా ఉంది.. రంగనాథ్, చంద్రమోహన్ లకి బాలూ సొంత గొంతుతో పాడారు (మిమిక్రీ లేకుండా) కాబట్టి, వాళ్ళు నటిస్తుంటే చూడ్డానికి ఆయనకి బావుంటుందనుకుంటా.. ధన్యవాదాలు.
    @హిమబిందు: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి