శుక్రవారం, ఫిబ్రవరి 15, 2019

మేఘమా దేహమా ...

"నాకొక పూమాల తేవాలి నువ్వు.. 
అది ఎందుకో..." 

తాను ప్రేమించిన అబ్బాయి తననీ ఇష్టపడుతున్నాడన్న శుభవార్త. ఆవెనుకే తనకి ప్రాణాంతకమైన వ్యాధి సోకిందనీ, ఇంకెంతో కాలం జీవించే అవకాశం లేదన్న చేదు కబురు. ఇప్పుడామె ప్రేమని పండించుకున్నందుకు పండుగ చేసుకోవాలా లేక తనువు చాలించే క్షణాలకి తను మానసికంగా సిద్ధపడి, అతడినీ సిద్ధం చేయాలా? 'మంచుపల్లకీ' (1982) సినిమాలో ఈ సందర్భానికి అతికినట్టుగా సరిపోయే విధంగా రాసిన గీతాన్ని ఇలా ప్రారంభించారు వేటూరి: 


"మేఘమా దేహమా.. మెరవకే ఈ క్షణం.. 
మెరిసినా, కురిసినా.. కరుగునీ జీవనం.." 

మేఘానికి, దేహానికీ పోలిక పెడుతూ పాటని మొదలుపెట్టడం బహు చక్కని ఎత్తుగడ. మెరిసి, కురిస్తే మేఘం కనుమరుగవుతుంది. నిలువెల్లా ప్రేమతో మెరిసి, వర్షిస్తున్న ఆమె దేహమూ కరిగిపోబోతోంది. పైగా, 'కరుగునీ జీవనం,' 'కరుగు-నీజీవనం' రెండు వేర్వేరు అన్వయాలు కుదురుతున్నాయి. రెండూ సందర్భానికి సరిపోతున్నాయి.

"మెరుపులతో పాటు ఉరుములుగా.. 
మూగబోయే జీవ స్వరములుగా.. 
వేకువ ఝామున వెన్నెల మరకలుగా.." 

మొదటి చరణంలో తొలి సగం ఇది. మేఘం,మెరుపు, ఆ వెంటే ఉరుము. మేఘానికి గొంతు ఉరుమే. ఆమె దేహం విషయానికి వస్తే, జీవ స్వరం క్రమంగా మూగపోబోతోంది. అర్ధరాత్రి ప్రకాశవంతంగా కనిపించే పండువెన్నెల, వేకువ వేళ వచ్చేకొద్దీ వెలుగు తగ్గి మారకలుగా మిగిలినట్టే, ఆమె దేహమూ, స్వరమూ కూడా వెలుగుని కోల్పోతున్నాయి. 

"రేపటి వాకిట ముగ్గులుగా.. 
స్మృతిలో మిగిలే నవ్వులుగా.. 
వేసవిలో మంచు పల్లకిగా.."

ఆమెలోని జీవితేచ్ఛకి ప్రతీక 'రేపటి వాకిట ముగ్గులు' కావాలనుకోవడం. కానీ, అతడి స్మృతిలో నవ్వుగా మిగిలిపోయే తరుణం వచ్చేస్తోంది తెలుసు. క్షణాల్లో కరిగిపోయే మంచుపల్లకీ, వేసవి వేడిమికి మరింత త్వరగా నీరైపోతుంది. 'పల్లకీ' ని పెళ్లి అని అర్ధంలో వాడతారు మామూలుగా. దానికి 'మంచు' చేర్చి మరణానికి ప్రతీకగా ఉపయోగించారు కవి. 

"పెనుగాలికి పెళ్లి చూపు.. 
పువ్వు రాలిన వేళా కళ్యాణం.. 
అందాకా ఆరాటం.. 
ఆశలతో పేరంటం..." 

మేఘం, మెరుపు, ఉరుము.. ఆ వెంటనే రావాల్సింది పెనుగాలి. ఆ పెనుగాలికి పెళ్లి చూపు. గాలితాకిడి పువ్వు రాలిన వేళే పెళ్ళిముహూర్తం. గాలికీ, పువ్వుకీ పెళ్లి జరిగే వరకూ ఆరాటం తప్పదు. ఆశలూ తప్పవు. జీవన్మరణాల మధ్య ఊగిసలాడుతున్న నాయికకి ఒక పక్క బతకాలన్న కాంక్ష, మరోపక్క మరణం తప్పదన్న ఎరుక. పువ్వులా తాను రాలిపోయే వరకూ, బతకాలనే ఆరాటం, బతుకుతానన్న ఆశల పేరంటం తప్పవు. పెళ్లిని, పేరంటాన్నీ విషాదాని సూచించడానికి ఉపయోగించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. 

"నాకొక పూమాల తేవాలి నువ్వు.. 
అది ఎందుకో..."

ప్రియురాలు, ప్రియుణ్ణి పూమాల తెమ్మందంటే ఎందుకు? మామూలు సందర్భంలో అయితే పెళ్లి చేసుకోడానికి. మరి ఇక్కడ ఎందుకు తెమ్మంటోంది పూమాల? అతనితో పెళ్ళికా, లేక తన అంతిమ యాత్ర సందర్భానికా?? 

దర్శకుడిగా వంశీ తొలిసినిమా ఇది. ఎమ్మార్ ప్రసాదరావు నిర్మాత. రాజన్-నాగేంద్ర స్వరకల్పనలో ఎస్. జానకి కరుణారస ప్రధానంగా పాడారీ పాటని. ముఖ్యంగా మొదట్లో వచ్చే ఆలాపన మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. తెరపై సుహాసిని, చిరంజీవి అభినయించారు.

2 కామెంట్‌లు:

  1. మంచి పాట. దీని గురించి ఒక సందేహమూ, ఒక వివరణా.

    " మేఘమా, దేహమా.... , మెరిసినా, కురిసినా ...." అనే వాక్యాలు క్రమాలంకారం పరిధిలోకి వస్తాయి కాబట్టి, కవి చేసిన ప్రతిపాదనలు రెండు: ఒకటి మేఘం మెరవడం; రెందు దేహం కురవడం. మొదటిదాన్ని అర్థం చేసుకోవచ్చుగానీ, దేహం కురవడం ఏమిటి? పల్లవిలో ఆ పదాలు కురిసినా, మెరిసినా అన్న ఆర్డర్‌లో ఉన్నా బానే ఉండేది. (దీనిగురించి వంశీ గారినే ఒకసారి అడిగాను. సంతృప్తికరమైన సమాధానం అయితే దొరకలేదు :) )

    ఈ పాటని వంశీ గారు ఈ సినిమాకి మాతృక అయిన Palaivana solai (వాణీ జయరామన్/శంకర్-గణేష్) సినిమానుంచి యథాతథంగా తీసుకున్నారు - తెలుగులో చేసిన రాజన్, నాగేంద్రలకి అలా చేయడం ఇష్టం లేకపోయినా.

    ఆ శంకర్-గణేష్‌లు కూడా, జగ్‌జీత్ సింగ్ పాడిన " తుమ్ నహీ, గమ్ నహీ..." అనే గజల్ నుంచి ఈ ట్యూన్‌‌ని తీసుకున్నారు. దానికి సంబంధించి ఆ తమిళ సినిమాలో ఏదైనా క్రెడిట్ ఇచ్చారేమో తెలీదు. బహుశా ఇచ్చివుండకపోవడానికే అవకాశాలు ఎక్కువ.

    జగ్‌జీత్ సింగ్ కూడా తక్కువ తినలేదు. ఆయన దీన్ని గులామ్ ఆలీ దగ్గర్నుంచి అప్పు తీసుకున్నారు. ఆ మహానుభావుడు - గులామ్ ఆలీ పాడింది - అసలైన ఆణిముత్యం (దర్ద్-ఎ-దిల్/బహదూర్ షా జఫర్)! మీరు ఇప్పటికే ఆ పాటని విని ఉండకపోతే:

    https://www.youtube.com/watch?v=YB8Z1qwOPPc:

    రిప్లయితొలగించండి
  2. @రమణమూర్తి: 'కరుగునీ జీవనం' అన్న వివరణ కూడా ఉంది కదండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి