మంగళవారం, ఫిబ్రవరి 19, 2019

చినుకులన్నీ కలిసి చిత్రకావేరి ...

"కడలిలో వెతకొద్దు కావేరి నీరు.. 
కడుపులో వెత కొద్ది కన్నీరు కారు.."

ఇద్దరు పెద్దవాళ్ళ మధ్య వచ్చే అభిప్రాయ భేదాల వల్ల ఒక్కోసారి పరోక్షంగా ఏదో ఒక మేలు జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సినిమా రంగంలో ఇలా జరగడం విశేషమేమీ కాదు. 'కళాతపస్వి' కె. విశ్వనాధ్, గీత రచయిత వేటూరి సుందర రామ్మూర్తి కలిసి ఎన్నో మంచి పాటలు ఇచ్చారు. 'శంకరాభరణం' 'సాగర సంగమం' కేవలం ఉదాహరణలు మాత్రమే. కారణాలు తెలీదు కానీ, 'జననీ జన్మభూమి' (1984) తర్వాత వాళ్లిద్దరూ కలిసి పనిచేయలేదు. దాని ఫలితంగా తెలుగు సినిమా పరిశ్రమకి 'పద్మశ్రీ' సిరివెన్నెల సీతారామశాస్త్రి అనే కవి దొరికారు.

ఈ పెద్దలిద్దరినీ ఒకటి చేయడానికి మరో పెద్దమనిషి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కంకణం కట్టుకున్నారు. గాయకుడైన బాలూ నిర్మాతగా మారి విశ్వనాధ్ దర్శకత్వంలో రూపొందించిన 'శుభసంకల్పం' (1995) లో వేటూరి పాటలు ఉండాల్సిందే అని పట్టుపట్టారు. ఫలితంగా, పదకొండేళ్ల విరామం తర్వాత విశ్వనాధ్, వేటూరి కలిసి పనిచేశారు. కథకి, సందర్భానికి అతికినట్టుగా పాటలు రాయడంలో వేటూరిది అందెవేసిన చేయి అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు కదా. 'శుభసంకల్పం' లో రెండు వరుస సందర్భాలకు వేటూరి రాసిన చిన్న పాటల్ని చూద్దాం:



"చినుకులన్నీ కలిసి చిత్రకావేరి.. 
చివరికా కావేరి కడలి దేవేరి.." 

కథానాయకుడు మత్స్యకారుడు. వడ్రంగం పని చేసుకుని జీవించే గంగ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ ప్రమాదంలో ఆమె గాయపడి కోమాలోకి వెళ్ళింది. దాదాపు మరణం అంచున ఉంది. నాయకుడు ఆమెని నావలో సముద్రంలోకి తీసుకెళ్లి ఆమెచేత గంగమ్మకి పూజ చేయించే సన్నివేశానికి రాసిన పాట ఇది. చినుకులన్నీ కలిస్తే నది అవుతుంది. ఆ నది చివరికి సముద్రంలో కలుస్తుంది. నది స్త్రీరూపం, సముద్రుడు పురుషుడు. సాగరసంగమం తర్వాత కావేరి సాగరానికి దేవేరి (భార్య) అవుతుంది.

"కడలిలో వెతకొద్దు కావేరి నీరు.. 
కడుపులో వెత కొద్ది కన్నీరు కారు.."

సంగమం జరిగిపోయిన తర్వాత తర్వాత సముద్రంలో నది నీటికోసం వెతకొద్దు. ఆ నీటి రంగూ రుచీ కూడా మారిపోతుంది కదా. కడుపులో ఉన్న బాధ కన్నీటి రూపంలో బయటికి వస్తుంది.

"గుండెలోనే ఉంది గుట్టుగా గంగ.. నీ గంగ.. 
ఎండమావుల మీద ఎందుకా బెంగ.."

నీ గంగ ఎక్కడికీ వెళ్లిపోవడం లేదు. నీ గుండెల్లోనే ఉంది. నిన్ను విడిచి గంగ వెళ్లడం అన్నది ఎండమావి లాంటిది. అది తల్చుకుని ఎందుకు బెంగ పడడం?

"రేవుతో నావమ్మకెన్ని ఊగిసలో 
నీవుతో నాకన్ని నీటి ఊయలలు.."

రేవుకీ నావకీ ఉన్న అవినాభావ సంబంధం లాంటిదే, నీకూ నాకూ మధ్య ఉన్నది కూడా. మన బంధం విడిపోదు అని నాయిక నాయకుడితో చెబుతున్నట్టుగా సాగుతుందీ పాట. కోమాలో ఉన్న నాయికకు స్పృహ వస్తే ఇలాగే చెబుతుందేమో అనిపించేలాంటి పాట. బాలూ ఆలాపన నేపథ్యంలో ఎస్పీ శైలజ గుర్తుండిపోయేలా పాడారు ఈ పాట.

అనారోగ్యంతో గంగ కన్నుమూసింది. తన గుర్తుగా ఒక బిడ్డని, జీవితకాలపు జ్ఞాపకాల్నీ అతనికి వదిలి వెళ్ళింది. ప్రేమించిన మనిషి దూరం కావడం, పసిబిడ్డ తల్లిలేని వాడు కావడం, అంతే కాక తాను ఎంతగానో ప్రేమించి, గౌరవించే వ్యక్తి నుంచి తన భార్య మరణ వార్తని దాచాల్సి రావడం.. ఇదీ నాయకుడి స్థితి.. ఈ స్థితిలో అతడు పడుకునే పాట: 



"నరుడి బ్రతుకు నటన.. ఈశ్వరుడి తలపు ఘటన..
ఆ రెంటి నట్టి నడుమ.. నీకెందుకింత తపన..
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా..
తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా..
ఏటిలోని అలలలవంటి.. కంటిలోని కలలు కదిపి..
గుండియలను అందియలుగ చేసీ..
తకిట తధిమి తకిట తధిమి తందాన..
హృదయలయల జతుల గతుల తిల్లాన..
తడబడు అడుగులు తప్పని తాళాన..
తడిసిన పెదవుల రేగిన రాగాన.. 
శ్రుతిని లయని ఒకటి చేసి..."

నిజానికి ఈ సాహిత్యం అంతా 'సాగర సంగమం' సినిమాలో "తకిట తధిమి తకిట తధిమి తందాన" మకుటంతో రాసిన పాటలోదే. ఆ పాట చరణంలో వచ్చే "నరుడి బ్రతుకు నటన" నుంచి ఈ పాటని ప్రారంభించి, సగం పాటని పల్లవిగా మార్చేసి, చరణాలని కొత్తగా రాశారు వేటూరి.

"కంటిపాపకు నేను లాల పొసే వేళ.. 
చంటిపాపా నీకు లాలినౌతానంది.. " 

తనకి పుట్టిన బిడ్డ తన కంటిపాప. ఆ బిడ్డకి తాను లాల పోస్తున్నాడు. మామూలుగా అయితే తల్లి చేయాలి, లేదా తమ ఇద్దరి సమక్షంలోనైనా ఉండాలి. ఆమె జ్ఞాపకం అతణ్ణి చంటి పిల్లాడిని చేసి ఏడిపించింది. ఆ దుఃఖానికి ఓదార్పుని మళ్ళీ ఆమే ఇచ్చింది. ఆమె జ్ఞాపకాలు అతడికి లాలిపాడాయి.

"ఉత్తరాన చుక్క ఉలికిపడతా ఉంటె.. 
చుక్కానిగా నాకు చూపు అవుతానంది.."

రోజులతరబడి సముద్రంలో వేట చేసే వెళ్లే మత్స్యకారులకి దిక్కులే మార్గదర్శులవుతాయి. ఆకాశంలో ఉత్తరంవైపున ఉరుములు వినిపించి, మబ్బులు కనిపించాయంటే కుంభవృష్టిగా వర్షం కురవబోతోందని అర్ధం. అలా వస్తున్న ఉరుములకి, మబ్బులకి ఉత్తరం దిక్కున నక్షత్రాలు ఉలికి పడుతూ ఉంటే, ఆమె అతడికి చుక్కాని అవుతానంది. నిజానికి అతనున్నది సముద్రంలో కాకపోయినా, కథానాయకుడి మానసిక స్థితి తుఫాను సమయంలో కడలి కల్లోలంలా ఉందని భావం. అప్పుడు కూడా ఆమె నేనున్నాను అంటోంది.

"గుండెలో రంపాలు కోతపెడతా ఉంటె.. 
పాతపాటలు మళ్ళీ పాడుకుందామంది.."

గుండెల్లో రంపపు కోత అనేది మామూలు వాడుకే అయినా, కథ ప్రకారం ఆమె వడ్రంగం పని చేసుకునే అమ్మాయి కావడం, నాయికా నాయికలిద్దరూ రంపంతో ఒక దుంగని కోసే సమయంలో ప్రేమలో పడడం వల్ల ఈ పదప్రయోగం సందర్భానికి తగ్గట్టుగా అమిరింది. అతడా రంపపు కోతతో బాధ పడుతూ ఉంటే, ఆమె 'బాధ పడకు, పాత పాటలు జ్ఞాపకం చేసుకో' అంటోందిట.

"అన్నదేదో అంది.. ఉన్నదేదో ఉంది.. 
తలపైన గంగ తలపులో పొంగింది.."

'అయిందేదో అయింది' అనడం వాడుకే. అలాగే అతడు కూడా ఆమె అన్నదేదో అంది, ఉన్నదేదో మిగిలింది అంటూనే, 'తలపైన గంగ తలపులో పొంగింది' అంటున్నాడు. తన ప్రాణం (తలపు = హృదయము) అయిన గంగ తన తలపులో (తలపు = జ్ఞాపకం) మిగిలింది అంటున్నాడు.

"ఆదివిష్ణు పాదవంటి ఆకాశాన ముగ్గుపెట్టి.. 
జంగమయ్య జంటకట్టి కాశీలోన కాలుపెట్టి.. 
కడలి గుడికి కదలిపోయే గంగా..."

ఆవేశంతో మొదలయ్యే ఈ పాట ముగింపులో కూడా ఆవేశమే వినిపిస్తుంది. హరిపాదాల్లో పుట్టింది గంగ. అక్కడ పుట్టి, ఆకాశం మీదుగా శివుని జటాజూటం చేరి, అక్కడి నుంచి సముద్రాన్ని చేరుకుంది. అలాగే, అతడి గంగ కూడా కడలి గుడికే చేరుకుంది. కథానాయకుడి ఆవేదనని, ఆవేశాన్నీ సమపాళ్లలో రంగరించి పాడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. స్వరకర్త కీరవాణి, 'సాగర సంగమం' నుంచి తీసుకున్న సాహిత్యానికి ఇళయరాజా బాణీనే కొనసాగించి, చరణాలకి వెంటాడే విధంగా సంగీతం చేశారు. ఈ సినిమా సంగీతానికి గాను ఆ యేటి 'ఫిలిం ఫేర్' పురస్కారం అందుకున్నారు కూడా. కమల్ హాసన్ అభినయాన్ని గురించి కొత్తగా చెప్పేదేముంది?

2 కామెంట్‌లు: