ఆదివారం, ఫిబ్రవరి 25, 2018

శ్రీదేవి ...

ఏం జ్ఞాపకం చేసుకోవాలి శ్రీదేవి గురించి? బాలనటిగా కెరీర్ మొదలు పెట్టి, కథానాయికగా సుదీర్ఘ కాలం కొనసాగి, తల్లిపాత్రలని హుందాగా అంగీకరించి వెండితెరకి వెలుగులద్దిన తార మాత్రమేనా, అంతకు మించి ఇంకేమన్నా ఉందా అన్న ప్రశ్నఉదయం నుంచీ దొలుస్తూనే ఉంది. శ్రీదేవికన్నా ముందు, శ్రీదేవి తర్వాత చాలామంది కథానాయికలున్నారు. కానీ, శ్రీదేవితో సరిసమంగా నటించి, ప్రతిభాషలోనూ తనకంటూ అభిమానులని సాధించుకోవడంతో పాటు, దక్షిణాది తారలకు గగనకుసుమమైన హిందీ సినిమా పరిశ్రమలో స్థానం సంపాదించి, ఏళ్లపాటు అగ్రతారగా వెలుగొందడం మరే నటికీ సాధ్యపడలేదు.

శ్రీదేవి విజయ రహస్యం ఏమిటి? మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది ఆమె తల్లి రాజేశ్వరిని గురించి. బాలతారగా నటిస్తున్న తన కూతుర్ని కథానాయికగా నిలబెట్టాలని నిర్ణయించుకుని, అందుకు తగ్గ కృషి చేయడంతో పాటు, కూతురు ఏమాత్రమూ క్రమశిక్షణ తప్పకుండా అనుక్షణం కంటికి రెప్పలా కాసుకొని, తన మాట జవదాటని విధంగా తర్ఫీదు ఇచ్చారు. శ్రీదేవికి తల్లి పట్ల ప్రేమ, గౌరవం కన్నా భయమే ఎక్కువ అనడానికి దృష్టాంతాలు చాలానే ఉన్నాయి. పేరూ డబ్బూ సంపాదించుకున్న నాయికలు తల్లిదండ్రులని ధిక్కరించడం, వాళ్ళని పూర్తిగా దూరంపెట్టి ప్రేమవివాహాలు చేసుకోవడం సాధారణమే అయినా, శ్రీదేవి ఇందుకు మినహాయింపు. ఇందుకోసం ఆమె కోల్పోయిందేమిటో తెలీదు కానీ, ఒక సుదీర్ఘ కెరీర్ని సంపాదించుకోగలిగింది అని చెప్పక తప్పదు.

ఎన్టీఆర్ కి మనవరాలిగా నటిస్తున్న బేబీ శ్రీదేవి "ఎప్పటికైనా ఎన్టీఆర్ గారి పక్కన నాయికగా నటించాలన్నది నా కోరిక" అని ముద్దుముద్దుగా ఇచ్చిన ఇంటర్యూ ఆరోజుల్లో చర్చనీయాంశం. అది మొదలు, నిన్నమొన్నటి 'బాహుబలి' వివాదానికి సమాధానం వరకూ పబ్లిక్ ఫోరమ్ లో ఏం మాట్లాడినా ఎంతో ఆచితూచి మాట్లాడడం శ్రీదేవి ప్రత్యేకత. ఏంచెప్పాలి అన్నదానితో పాటు ఎలా చెప్పాలి అన్న విషయంలో కూడా స్పష్టత ఉందామెకి. అందుకే కావొచ్చు, అగ్రశ్రేణి నాయికగా ఉన్న రోజుల్లో కూడా ఆమె స్టేట్మెంట్స్ వివాదాస్పదం కాలేదు. శ్రీదేవి ఇంటర్యూలన్నీ ఒక పుస్తకంగా తీసుకొస్తే, సినిమా రంగంలో ఉన్నవారికి ఒక రిఫరెన్స్ గా ఉపయోగపడే అవకాశం ఉంది.

Google Image

అగ్రనటి స్థానాన్ని సంపాదించుకోవడం, తీవ్రమైన పోటీని తట్టుకుని ఆ స్థానంలో మనగలగడం అంత సులువైన విషయమేమీ కాదు. ఇందుకు అందం, అభినయ సామర్ధ్యం మాత్రమే చాలవు. ఈ రెండు లక్షణాలూ ఉన్న చాలామంది ఆ స్థానానికి చేరుకోలేక పోయారు. చేరుకున్న కొద్దిమందీ నిలబడలేకపోయారు. క్రమశిక్షణ, నేర్చుకునే తత్త్వం తో పాటు ప్రవర్తన కూడా తనదైన పాత్ర పోషిస్తుంది. వీటన్నింటి కలబోతకీ 'ప్రొఫెషనలిజం' అని పేరు పెట్టింది సినిమా పరిశ్రమ. శ్రీదేవి దగ్గర అది పుష్కలం. ఆమెకి ఇది సహజాతమా, తల్లిపెంపకం వల్ల అబ్బిన గుణమా లేక కాలక్రమంలో నేర్చుకున్న విషయమా అన్నది ఇదమిద్దంగా తెలియదు కానీ, ఆమెని అగ్రశ్రేణి నాయికగా నిలబెట్టడంతో ప్రొఫెషనలిజం పాత్ర చాలా ఉందన్నది నిజం.

జయప్రద అభిమానులకి శ్రీదేవి ఒక కొరకరాని కొయ్య. జయప్రద చేయలేని పాత్రలు ఉన్నాయనీ, వాటిని శ్రీదేవి సులువుగా చేసేయగలదనీ ఎన్నో వాదోపవాదాలు. 'వసంతకోకిల' 'ఆకలిరాజ్యం' లాంటి ఉదాహరణలు. ఆ వాదం కాస్తా అభినయం నుంచి అందం దగ్గరికి వచ్చేసరికి, "జయప్రదది సహజ సౌందర్యం, శ్రీదేవి కాస్మొటిక్ బ్యూటీ" అన్న సమాధానం జయప్రద ఫాన్స్ దగ్గర సిద్ధంగా ఉండేది. కాస్మొటిక్స్ వాడకం అన్నది వెండితెరమీద కనిపించే ప్రతి ఒక్కరికీ తప్పని సరి అయినప్పటికీ, ఆ వాడకాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లిన నటి శ్రీదేవి. అందాన్ని పెంచుకోడానికి సినీ తారలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు అనే విషయం జనబాహుళ్యానికి తెలిసింది శ్రీదేవి ముక్కుకి జరిగిన సర్జరీ తర్వాతే. ఏళ్ళు గడిచినా వన్నె తరగని ఆమె సౌందర్యం వెనుక కాస్మొటిక్స్ పాత్ర బహిరంగ రహస్యమే.

సోషల్ మీడియాలో శ్రీదేవిని గురించి సర్క్యులేట్ అవుతున్న అనేకానేక సందేశాల్లో, ఒకానొకటి ఈ కాస్మొటిక్స్ గురించే. సుదీర్ఘంగా ఉన్నా, ఆలోచింపజేసేదిగా ఉంది. శ్రీదేవి హఠాన్మరణం వెనుక ఆమె చేయించుకున్న సర్జరీలు, తీసుకున్న బొటాక్స్ ల పాత్ర తక్కువ కాదన్నది ఆ సందేశం సారాంశం. వయసు దాచుకోడం కోసం తిండిని తగ్గించుకోవడం, శరీరాకృతిని కాపాడుకోవడం కోసం తీసుకున్న చికిత్సలు వీటన్నింటినీ ప్రస్తావిస్తూ సాగిన ఆ సందేశం, శ్రీదేవిని ఎంతగానో ప్రేమించే ఆమె కుటుంబం కూడా ఆమెని ఈ కాస్మొటిక్స్ బారినుంచి కాపాడలేక పోవడం విచారకరమని, శ్రీదేవికి తన అందం మీద ఉన్న అపనమ్మకం వల్లే అలవిమాలిన చికిత్సలు చేయించుకుని ప్రాణం మీదకి తెచ్చుకుందన్న ఆరోపణ ఉంది అందులో.

కారణాలు ఏవైనా కావొచ్చు, ఇకనుంచీ వెండితెర వేలుపు శ్రీదేవి ఒక గతం, ఒక చరిత్ర అనుకోవాల్సి రావడం బాధాకరం. అయితే,  ఆ చరిత్ర స్ఫూర్తివంతమైనదీ, నేర్చుకోగలిగే వాళ్లకి ఎన్నో విషయాలు నేర్పించేది కావడం ఒక చిన్న ఉపశమనం. సినీలోకపు అతిలోకసుందరికి నివాళి..

3 కామెంట్‌లు:

  1. ఇవాళ కొంచెం లేటుగా లేచాను, whatsapp నిండా rip మెస్సేజులే. కొంచెం సేపు ఎంజరుగుతోందో అర్ధంకావడానికి కొంచేం సమయం పట్టింది.
    వెంటనే మీబ్లాగులో చూశాను ఏమ్రాసిఉంటారా అని ,... కానీ చాలా సేపు పోస్టు కనపడలేదు.
    అలా చాలాసార్లు చూసాను, ఇప్పటికి కనపడింది

    రిప్లయితొలగించండి
  2. @నాగ శ్రీనివాస: ఉదయాన్నే వార్త విన్నానండీ.. అర్ధమవ్వడానికి టైం పట్టింది.. ..ధన్యవాదాలు..
    @సామ్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి