శుక్రవారం, జనవరి 27, 2017

దంగల్

ఆమధ్య 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రమోషన్ కోసం మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్యూ చేస్తూ, లాఫింగ్ క్వీన్ రోజా "మీరు దంగల్ సినిమా చూశారా?" అని అడిగి, "తప్పకుండా చూడండి" అని రికమెండ్ చేసింది. తెలుగులో ఆ  తరహా సినిమాలు రావాల్సిన అవసరాన్ని గురించి వాళ్లిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ప్రస్తుతానికి వస్తే, రోజా రికమెండేషన్ తో పాటు ఇంకా అనేక కారణాలకి 'దంగల్' చూడాలనిపించి చూసేశాను. పదహారేళ్ళ క్రితం 'లగాన్' తో ఎంత ఆశ్చర్య పరిచాడో, తాజా 'దంగల్' తోనూ అంతే ఆశ్చర్య పరిచాడు అమీర్ ఖాన్.

'దంగల్' అంటే యుద్ధం. అవును, ఇది యుద్ధం కథే. ఆడపిల్లల మీద చూపిస్తున్న వివక్ష మీద యుద్ధం, మిగిలిన క్రీడలతో పోల్చినప్పుడు కుస్తీ మీద చూపిస్తున్న చిన్నచూపు మీద యుద్ధం, గ్రామీణ క్రీడాకారుల మీద పెద్ద నగరాల్లో ఉండే చదువుకున్న కోచ్ ల సంశయాత్మక ధోరణి మీద యుద్ధం.. తరచి చూడగలగాలే కానీ, రెండు గంటల నలభై నిమిషాల పాటు థియేటర్లో సీట్లకి కట్టి పడేసే సినిమా నిండా ఎన్నెన్నో యుద్ధాలు. అంతేకాదు, నాటకీయతకి తావులేని కుటుంబ బంధాలు, సందర్భోచితమైన సున్నిత హాస్యం, మనకి తెలియకుండానే మనసుకు పట్టేసే సెంటిమెంట్.. ఇవన్నీ ఉన్నాయి 'దంగల్' లో.

హర్యానాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన మహావీర్ సింగ్ ఫోగట్ (అమీర్ ఖాన్) కి కుస్తీ అంటే ప్రాణం. కేవలం కుస్తీ పోటీలతో రోజు గడిచే పరిస్థితి కాదు కాబట్టి, ఉద్యోగంలో చేసిన మహావీర్ అటుపై కుస్తీని నెమ్మదిగా మర్చిపోతాడు. దయా కౌర్ (సాక్షి తన్వర్) ని పెళ్లిచేసుకున్నాక, అతని ఆలోచన ఒక్కటే. ఒక కొడుకుని కని వాడిని కుస్తీ యోధుడిగా తయారు చేయాలి. ఒకటి కాదు, రెండు కాదు, వరసగా నాలుగు ప్రయత్నాలు.. నాలుగుసార్లూ ఆడపిల్లలే కలగడంతో కుస్తీ ఆశని పూర్తిగా వదిలేసుకుంటాడు మహావీర్.


బడికి వెళ్తున్న పెద్ద కూతురు గీతాకుమారి ఫోగట్, రెండో కూతురు బబితా కుమారి ఫోగట్ లలో ఉన్న మల్ల వీరుల నైపుణ్యాన్ని ఓ సందర్భంలో గమనించిన మహావీర్ లో 'ఆడపిల్లలకి కుస్తీ ఎందుకు నేర్పించకూడదు?' అన్న ఆలోచన వస్తుంది. భార్యని ఒప్పించి, ఊరిని ఎదిరించి కూతుళ్ళకి కుస్తీ శిక్షణ ఆరంభిచిన మహావీర్ కి ఎదురైన సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ఒకప్పుడు అంతర్జాతీయ పోటీలో భారతదేశం తరపున ఆడి పతకం సాధించాలని కలలు కన్న ఆ కుస్తీ యోధుడు, ఇప్పుడా కలని కూతుళ్ళ ద్వారా సాకారం చేసుకోవాలని అనుకుంటున్నాడు.

ఈ క్రమంలో మహావీర్ కి ఎదురైన సవాళ్లేమిటి? గ్రామీణ క్రీడాకారులకి ప్రభుత్వం నుంచి దొరుకుతున్న మద్దతు ఎంత? స్పోర్ట్స్ అకాడమీ రాజకీయాలు ఎలా ఉంటాయి? అన్నింటినీ మించి, ఇల్లు దాటి హాస్టల్ చేరి కొత్త ప్రపంచాన్ని చూసిన కూతుళ్లు తండ్రి ఆశయాన్ని ఎంతవరకూ అర్ధం చేసుకుని, సహకరించారు? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబే 'దంగల్.' వరుసగా మెడల్స్ సాధించడం ద్వారా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిన కుస్తీ సోదరీమణులు గీత, బబిత, వాళ్ళ తండ్రి మహావీర్ సింగ్ ఫోగట్ ల నిజజీవిత కథకి కొద్దిపాటి నాటకీయత జోడించి నితీష్ తివారి తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్ విడిచిపెట్టిన తర్వాత కూడా ప్రేక్షకుల్ని వెంటాడుతుంది.

అమీర్ ఖాన్ ని బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అని ఎందుకు పిలుస్తుంది అన్న ప్రశ్నకి మరో సమాధానం ఈ సినిమా. అమీర్ ఖాన్ కాక, మహావీర్ మాత్రమే కనిపిస్తాడు సినిమా అంతటా. తండ్రిగా, కోచ్ గా పరస్పర విరుద్ధమైన బాధ్యతల్ని ఒకే సారి నెరవేర్చాల్సిన క్రమంలో ఎదుర్కొనే ఒత్తిడిని అమీర్ ప్రదర్శించిన తీరు మరో నటుడి నుంచి ఊహించలేం. దర్శకుడి కన్నా ముందుగా ప్రస్తావించాల్సింది కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా కృషి గురించి. చిన్నప్పటి గీత, బబితలు పెద్దవ్వడం చూశాక, 'ఆపిల్లలు పెద్దవాళ్ళు అయ్యేవరకూ ఆగి అప్పుడు షూట్ చేశారేమో' అనిపించింది. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ కజిన్ ఓంకార్ కూడా అంత చక్కగానూ సరిపోయాడు. దర్శకుడే కాదు, మిగిలిన సాంకేతిక నిపుణులకి కూడా వంక పెట్టలేం. 

అమిర్ ఖాన్, సాక్షి తన్వర్ల తర్వాత పెద్దయిన గీతాకుమారి ఫోగట్ గా నటించిన ఫాతిమా సనా షేక్ కి నటనకి బాగా అవకాశం ఉన్న పాత్ర దొరికింది. కుస్తీ కోచ్ గా నటించిన గిరీష్ కులకర్ణి కూడా గుర్తుండిపోతాడు. ఇరవయ్యేళ్ళ మహావీర్ మొదలు, అరవయ్యేళ్ళ మహావీర్ వరకూ పాత్రకు తగ్గట్టు తన శరీరాకృతిని, పాత్ర వయసుకి సరిగ్గా సరిపోయే నటననే ప్రదర్శించిన అమీర్ ఖాన్ ని చూశాక, తమ ఆకృతికి తగ్గట్టుగా పాత్రల తీరునే మార్చేసుకునే తెలుగు సీనియర్ హీరోలు అప్రయత్నంగా గుర్తొచ్చారు. బయోపిక్స్ లో ఒక కొలబద్దగా నిలిచిన 'దంగల్' ని మించిన సినిమా రావాలంటే చాలా సమయమే పట్టొచ్చు, అటు బాలీవుడ్ లో అయినా ఇటు మిగిలిన భారతీయ వుడ్ లలో అయినా... రోజా ప్రశ్నకి జవాబుగా చిరంజీవి ప్రదర్శించిన ఆశాభావాన్ని నింపుకోవడం మాత్రమే మన చేతిలో ఉన్నది.

3 కామెంట్‌లు:

  1. మంచి సమీక్ష. తెలుగు సినిమా వీరుల గురించి తక్కువ చెప్పుకోవటమే ఒప్పు.

    రిప్లయితొలగించండి
  2. ఏమాత్రం నాటకీయత లేని, అద్భుతమైన సినిమాకి చక్కటి సమీక్ష. పనిలో పనిగా వ్యంగ్యబాణాలు వేసేశారుగా! :)

    రిప్లయితొలగించండి
  3. @అన్యగామి: నిజమేనండీ.. ధన్యవాదాలు
    @కొత్తావకాయ: హహ్హా.. బాణాలేం కాదండీ.. ఓ చిన్న పరిశీలన.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి