గురువారం, జనవరి 26, 2017

హక్కులు-అణచివేత

భారత పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరి దయాధర్మమో కాదు.. తెల్లారిలేస్తే మన నాయకులు తప్పకుండా తల్చుకునే రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అయితే, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అరవై ఏడేళ్ల లోనూ ఈ హక్కు ఎన్నోసార్లు అనేకవిధాలుగా అణచివేయబడింది. అణచివేసిన వాళ్ళు, అధికారంలో ఉన్న నాయకులే. పోలీసులని పెద్ద సంఖ్యలో ఉపయోగించి ప్రశ్నించే గొంతులని నిలువరించాలని వందలాది సందర్భాల్లో ప్రయత్నాలు జరిగినా, హక్కుని వినియోగించుకునే ప్రయత్నాన్ని విడనాడలేదు ప్రజలు. బహుశా, ఇది స్వేచ్ఛ తాలూకు గొప్పదనం.

భారతదేశంలో భాగమైన ఆంద్రప్రదేశ్ లోనూ భావప్రకటన స్వేచ్ఛ ని కట్టడిచేసే ప్రయత్నాలు అనేకం జరిగాయి. అదీ ఇదీ అన్న భేదం లేకుండా అధికారంలో ఉన్న అన్ని పార్టీలూ ఈ కట్టడి నిమిత్తం పోలీసు బలగాలని వినియోగించినప్పటికీ, మాన్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన, జరుగుతున్న నిలువరింత మిగిలిన ముఖ్యమంత్రులతో పోల్చినప్పుడు మరింత ఎక్కువ అన్నది కళ్ళముందు కనిపిస్తున్న సత్యం. పదిహేడేళ్ల నాటి బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమం మొదలు, ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు జరుగుతున్న ఆందోళన వరకూ అన్నీ అణచివేతకు గురయినవి, అవుతున్నవే.

గౌరవ ముఖ్యమంత్రికి 'పాజిటివ్ మైండ్ సెట్'  అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా, ప్రతిపక్షాలు, పత్రికల వాళ్ళు ఆశావహ దృక్పధాన్ని అలవర్చుకోవాలని పదేపదే చెబుతూ వస్తున్నారు. వారి కృషి ఫలించి, మీడియాలోని పెద్ద సెక్షన్  లో ఈ మార్పు వచ్చేసింది. వాళ్లిప్పుడు ముఖ్యమంత్రిని మించి పాజిటివిటీ ని ప్రదర్శిస్తున్నారు. ఇక, ప్రతిపక్షాలు, వాళ్ళ మీడియాకి మాత్రం ఎంత బోధించినా ఫలితం ఉండడం లేదు. వాళ్ళ ధోరణి వాళ్ళదిగానే ఉంటోంది. ఇదంతా రాష్ట్రంలో శరవేగంగా జరిగిపోతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు అంటున్నారు అధికార పక్షం వారు.


సరే, అధికారంలో ఉన్నవాళ్ళ మీద విమర్శలు రావడం సహజం. ఒకప్పటి పాలకులు విమర్శని హుందాగా తీసుకునే వాళ్ళు. అందులో పస ఉంటే, వాళ్ళ ఆలోచనలు మార్చుకునేందుకు వెనకాడేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. గ్రామ పంచాయితీ వార్డు మెంబరు మొదలు ఆపై ఏ పదవి దక్కినా, ఆయా నాయకుల్ని దైవాంశ ఆవహించేస్తోంది. 'నామాటకి తిరుగు ఉండకూడదు' అన్నధోరణే తప్ప రెండో ఆలోచనని ఊహకి కూడా ఒప్పుకోవడం లేదు. ఫలితమే, విమర్శని, విమర్శించే వాళ్ళనీ కూడా ఒప్పుకోలేక పోవడం. వాళ్ళ మీద బలప్రయోగం చేయడం.

బషీర్ బాగ్ ఉద్యమంలో జరిగిన ప్రాణ నష్టానికి, అంగన్ వాడీ వర్కర్లని గుర్రాలతో తొక్కించడానికీ కారణం 'ప్రపంచ బ్యాంకు' అని విశ్లేషించారు అప్పట్లో కొందరు. ఉద్యమాలని అణచివేయకపోతే, ప్రపంచ బ్యాంకు తదితర ద్రవ్య సంస్థల దృష్టిలో రాష్ట్రం పలచన అయిపోతుందనీ, అప్పు పుట్టదనీ, కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్పనిసరై అణచివేత అస్త్రం ప్రయోగించారనీ విశ్లేషించారు అప్పట్లో. ప్రస్తుతానికి వస్తే, 'కేంద్రంతో సంబంధాలు' చెడిపోకూడదు కాబట్టే పోలీసు బలగాలని ఉపయోగించాల్సి వస్తోందన్న మాట వినిపిస్తోంది. కేంద్రం దృష్టిలో రాష్ట్రం పలచన కాకుండా ఉండేందుకే హక్కు(ల) కోసం పోరాడే వాళ్ళ ముందస్తు అరెస్టులు, రోడ్ల మీదకి వచ్చిన వాళ్లపై లాఠీ చార్జీలు జరుగుతున్నాయట.

విద్యుత్ ఉద్యమం రోజులతో పోలిస్తే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా విపరీతంగా పెరిగింది. ఇంకెక్కడా లేనన్ని టీవీ చానళ్లు ఉన్నాయిక్కడ. కానైతే ఏం లాభం.. అవన్నీ ఏదో ఒక పార్టీ జెండాని మోస్తున్నవే తప్ప, ప్రజల కోసం పనిచేస్తున్నవి కాదు. ఒకట్రెండు సంస్థలు మినహా, మిగిలినవన్నీ శక్తివంచన లేకుండా 'పాజిటివిటీ' ని నిత్యం జనం చెవుల్లో పోస్తున్నా, గణతంత్ర దినోత్సవం రోజున ఇంతమంది రోడ్లమీదకొచ్చి, ముఖ్యమంత్రి గారి మనసుకి అంత కష్టం ఎలా కలిగించగలిగారు? అప్పుడు లేనిదీ, ఇప్పుడు ఉన్నదీ సోషల్ మీడియా. ఇంతకీ, ప్రజల మైండ్ సెట్ లో వచ్చిన మార్పు గౌరవ ముఖ్యమంత్రి గారిని చేరుతుందా, లేక ఇదంతా 'ప్రతిపక్షం కుట్ర' అన్న ప్రచారపు హోరు మొదలవుతుందా? వేచి చూడాలి...

2 వ్యాఖ్యలు:

Jai Gottimukkala చెప్పారు...

మీ టపా ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమం గురించా విశాఖలో వైకాపా కొవ్వొత్తుల రాలీ గురించా అర్ధం కాలేదు.

మురళి చెప్పారు...

@జై గొట్టిముక్కల: ఈ రెండేకాక, మరికొన్ని కూడా ఉన్నాయి కదండీ.. మొత్తంగా చూసినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనివ్వక పోవడాన్ని గురించి.. ధన్యవాదాలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి