మంగళవారం, జనవరి 24, 2017

అష్ట వర్షాత్ ...

ఎనిమిదేళ్లు... ఎనిమిది వందల టపాలు... ఎంతోమంది మిత్రులు... ఎల్లలు లేని ఆదరణ... హేమంతం చేమంతులనీ, పుష్యం భోగిమంటలనీ తీసుకొస్తూ, వాటితో పాటుగా 'నెమలికన్ను' పుట్టినరోజునీ వెంటపెట్టుకొచ్చేశాయి మరోసారి. ఓ శనివారపు మధ్యాహ్నపు వేళ, ఖాళీగా కూర్చుని, తోచీ తోచకా ఆరంభించిన బ్లాగుకి ఎనిమిదేళ్లు నిండి తొమ్మిదో ఏడు ప్రవేశించింది. ఆవేళ ఒక్కడినే.. ఈవేళ నాతోపాటు ఎంతోమంది మిత్రులు.. రాసినవి మెచ్చేవాళ్ళూ, తప్పులు సరిదిద్దే వాళ్ళూ, రాయకపోతే అదేమని అడిగేవాళ్ళూను... ఏంకావాలి ఇంతకన్నా?

గడిచిన ఏడాది కాలంలో చేసినది తగుమాత్రం బ్లాగింగే.. రాసినవి అరవై టపాలే.. వీటిలో ముందుగా ఏమాత్రం ఆలోచించకుండా అక్షరాలు పేర్చుకుంటూ వెళ్ళినవీ, రోజుల తరబడి ఆలోచించి  ఎప్పటికో బ్లాగుకి ఎక్కించినవీ కూడా ఉన్నాయి. టపాలు రాసినప్పుడూ, రాయనప్పుడూ కూడా మిత్రులు నా వెంట ఉండడం సంతోషాన్ని కలిగించిన విషయం. బ్లాగింగ్ కి మరికొంచం ఎక్కువ సమయం కేటాయించాలని మరీ మరీ అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. చదవాల్సిన పుస్తకాలు, వాటితో పాటు చదివి,  రాయడాన్ని పెండింగ్ పెట్టిన పుస్తకాలూ చెప్పుకోదగ్గవిగానే ఉన్నాయి.

గతేడాది బాగా రాసి, ఈ ఏడాది పెద్దగా ఆ జోలికి పోని అంశం కథలు. రాసిన ఒక్క కథా కూడా నాకు సంతృప్తి కలిగించలేదన్నది నిజం. ఆలోచనలు చాలానే ఉన్నాయి కానీ వాటిని అక్షర రూపంలో పెట్టే సమయం ఎప్పుడొస్తుందో.. కొందరు మిత్రులు తరచుగా బ్లాగెందుకు రాయడం లేదు అని అడుగుతున్నారు.. 'స్పందన లేకపోవడం చేతా?' అన్న ప్రశ్న కూడా వచ్చింది. నా జవాబు 'కాదు' అనే. గతంలో చాలాసార్లు చెప్పినట్టుగా, వ్యాఖ్యలు నాకు బోనస్ మాత్రమే. కేవలం వ్యాఖ్యల కోసమని నేనెప్పుడూ ఏదీ రాసింది లేదు. బ్లాగు రాయడం నా ప్రాధాన్యతల్లో ఇప్పటికీ ముందే ఉంది.


ఆమధ్య అందుకున్న ఒక మెయిల్ కొంచం ఆసక్తికరంగా అనిపించింది. ఆలోచింపజేసింది కూడా.. "మీరు రాజకీయాలని గురించి రాయడం మానేస్తే, మీ బ్లాగు మిత్రులు పెరిగే అవకాశం ఉంది" అన్న సూచనతో వచ్చిందా ఉత్తరం. 'వర్తమానం' లేబుల్ తో కరెంట్ అఫైర్స్ ని గురించి నాకు రాయాలని తోచినప్పుడల్లా రాస్తూ ఉండడం ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టింది కాదు, బ్లాగు తొలినాళ్ళ నుంచీ ఉన్నదే. బ్లాగు మిత్రులకి నచ్చేలా రాయడం అన్నది నా అజెండా కానేకాదు. నా అభిప్రాయాలు నచ్చిన వాళ్ళు మిత్రులవుతారు. నచ్చనివాళ్ళు దూరం జరుగుతారు.. అంతే.

వ్యక్తిగతంగా గడిచిన ఏడాది చాలా హడావిడిగా గడిచింది. ఒక్కసారి వెనక్కి తిరిగి 'ఏడాదిలో ఏం చేశాను?' అని ఆలోచించుకుంటే వచ్చిన జవాబు 'ప్రయాణాలు.' వీటికారణంగా రొటీన్ లో మార్పులు చేసుకోవడం అనివార్యం అయ్యింది. ఫలితంగా నాకోసం నేను కేటాయించుకునే సమయం తగ్గింది. ఆ ప్రభావం మిగిలిన నా ఇష్టాలతో పాటు బ్లాగింగ్ మీదా పడింది. కొన్ని విలువైన పాఠాలు నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే, అప్పటికే తెలిసిన విషయాలనే అనుభవపూర్వకంగా నేర్చుకున్నా. వాటిలో కొన్ని మంచి కథావస్తువులుగా కనిపిస్తున్నాయిప్పుడు.

నేను బ్లాగింగ్ ని ఆపేయాలనుకోవడం లేదు. ఇందరు మిత్రులనిచ్చిన ఈ వేదిక అంటే నిర్లక్ష్యమూ లేదు. ఈ కొత్త ఏడాది మరికొంచం తరచుగా రాయాలని ఉంది. ఇందుకోసం, నాకోసం నేను కేటాయించుకునే సమయం ఇతరత్రా ఖర్చవ్వకూడదని కోరుకుంటున్నాను. వ్యాఖ్యలతో, మెయిల్స్ ద్వారా నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ వేదిక నుంచి మిమ్మల్నందరినీ మరికొంచం తరచుగా కలుసుకునే అవకాశం కలగాలని బలంగా కోరుకుంటున్నాను.. అందరికీ వందనాలు!!

16 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

Kaneesam 5 yellu ga mee blog chaduvutunnananukunta. Mee gnapakalante, amma cheppinattu kaburlante naku chala chala ishtam. Kaka pote philosophy ane toic meeru specific ga eppudu touch cheyaledanukunta. Wonderful blog and beautiful posts always. Wish your blog many more successful years!

DG చెప్పారు...

శతమానం భవతి, శతాయు పురుషః శ్శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి

ఈ మంత్రం పూర్తిగా సరి చూడడానికి గూగిల్ చూసాను. "శతమానం భవతి" అనే సెర్చ్ స్టింగ్ తో. బయటికి ఏమొచ్చిందో చెప్పక్కర్లేదనుకుంటా. అలా ఉంది మన దౌభాగ్యం. ఏం చేస్తాం?

జయ చెప్పారు...

ఎప్పటికప్పుడు మీ నెమలికన్ను వెతుకుతూనే ఉంటాను. చాలా రోజులయ్యింది, ఏమీ లేదబ్బా...అనుకుంటున్నాను. మీకు 'శతమానం భవతి '. పంచవన్నెల నెమలి కన్ను ఎప్పుడూ విచ్చుకుంటూనే ఉండాలనే మా కోరిక తప్పక తీరుస్తారని నాకు తెలుసు.మీ కోసమే అగ్రిగ్రేటర్ ఓపెన్ చేస్తాను మరి.....

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హృదయపూర్వక అభినందనలు మురళి గారు :-) మీరనుకున్నట్లు ఈ ఏడాది మరిన్ని ఎక్కువ పోస్టులు రాయాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్..

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మురళి గారికి అభినందనలు. మరెన్నో మైలురాళ్ళు దాటడానికి శుభాకాంక్షలు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

DG గారు, బయటికి ఏమొస్తుందో చూద్దామని నేను కూడా మీరు చెప్పిన స్ట్రింగ్ తో గూగుల్ లో వెదికాను, ధన్యుడనయ్యాను.
అందువల్ల ఈసారి "శతమానం భవతి మంత్రం" అనే స్ట్రింగ్ తో వెదికితే మనకి తెలిసిన మంత్రం వచ్చింది.

కొత్తావకాయ చెప్పారు...

హృదయపూర్వక అభినందనలు! మీ ప్రతీ బ్లాగ్ పోస్టూ చదివించేదే అయినా, కథలకోసం కొంచెం ఎక్కువ ఎదురుచూస్తున్నానండీ.

Hima bindu చెప్పారు...

Happy blogging Murali garu

Lalitha TS చెప్పారు...

బ్లాగ్వార్షికోత్సవ శుభకామనలు - శుభాభినందనలు.
~లలిత

అజ్ఞాత చెప్పారు...

అభినందనలు.
మీరు వ్రాస్తూనే ఉండండి. మేము చదువుతూనే ఉంటాము.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

మా నెమలికన్ను అష్టాశత వర్షాత్ నిరాటంకంగా చదువరులని అలరిస్తూ సాగాలని కోరుకుంటూ అభినందనలు

అజ్ఞాత చెప్పారు...

కుంచెం ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. కాపీ పేస్టుల ఫేస్‌బుక్కూ వాట్సప్పుల కంటె బ్లాగడం కష్టం. కానీ అదే ఇష్టమైన పని కదా..

మురళి చెప్పారు...

@ప్రసూన: నిజమేనండీ, నేరుగా ఫిలాసఫీ గురించి రాయలేదు.. మీ అభిమానానికి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు..
@డీజీ: మెజారిటీకి మొదటి ప్రయారిటీ ఏదో అదే కనిపిస్తుంది కదండీ సెర్చ్ లో :) ధన్యవాదాలు
@జయ: చాలా సంతోషమండీ.. రాస్తూనే ఉంటాను.. ధన్యవాదాలు..

మురళి చెప్పారు...

@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ
@విన్నకోట నరసింహారావు: ధన్యవాదాలండీ
@కొత్తావకాయ: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@హిమబిందు: ధన్యవాదాలండీ
@లలిత టీఎస్: ధన్యవాదాలండీ
@బోనగిరి: ధన్యవాదాలండీ

మురళి చెప్పారు...

@శ్రీనివాస్ పప్పు: తప్పకుండానండీ.. ధన్యవాదాలు
@పురాణపండ ఫణి: అవునండీ.. బ్లాగింగ్ పూర్తిగా డిఫరెంట్.. మిగిలిన వాటితో పోల్చలేం.. ధన్యవాదాలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి