శుక్రవారం, ఫిబ్రవరి 03, 2017

కత్తుల వంతెన

మహీధర రామమోహన రావు పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చే నవల 'కొల్లాయిగట్టితేనేమి?.' స్వాతంత్రోద్యమాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాసిన ఆ నవలకి విశేష పాఠకాదరణతో పాటు సాహిత్య అకాడమీ అవార్డూ లభించింది. రామమోహన రావు రచనల్ని పునర్ముద్రిస్తున్న విశాలాంధ్ర ముద్రణాలయం తాజాగా ప్రచురించిన నవల 'కత్తుల వంతెన.' యాభై ఆరేళ్ళ క్రితం, అంటే 1961 లో 'విశాలాంధ్ర' నిర్వహించిన నవలల పోటీల్లో ప్రధమ బహుమతి గెలుచుకున్న ఈ నవల నాటి సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించింది.

కాలం మారినా, మనుషుల మనస్తత్వాలు పెద్దగా మారలేదు అనడానికి నిదర్శనం, ఈనవల్లో రచయిత లేవనెత్తిన అనేక ప్రశ్నలు నేటికీ సజీవంగా ఉండడమే.విజయవాడలోని ఓ ఇంట్లో మూడు వాటాల్లో అద్దెకి ఉంటున్న అవివాహిత యువతీయువకుల కథ ఇది. వాళ్ళు ముగ్గురూ ఉన్నత చదువులు చదివిన వాళ్ళు. ఆదర్శాలు కలిగిన వాళ్ళు. తల్లిదండ్రులతో తరాల అంతరాల కారణంగా విభేదిస్తున్న వాళ్ళూను. స్కూలు టీచర్ గా పనిచేస్తున్న కల్యాణిది బ్రాహ్మణ నేపధ్యం. తండ్రితో పాటు, అన్న కూడా కమ్యూనిస్టు పార్టీ సానుభూతి పరుడే.

పోయిన ఆస్థి పోగా, మిగిలిన దాంతో పల్లెలో కుటుంబం నడుస్తోంది. ఉద్యోగం కోసం విజయవాడలో ఒంటరిగా ఉంటోంది కల్యాణి. ఆమె పక్క వాటాలో ఉంటున్న సుజాత కమ్మ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. స్వాతంత్రోద్యమంలో ఆస్థులు పోగొట్టుకున్న ఆమె తండ్రి, దేశానికి స్వతంత్రం వస్తూనే కాంట్రాక్టరుగా మారి బాగా గడిస్తాడు. ఇద్దరు కూతుళ్లతో చిన్నమ్మాయి సుజాత. ఆమెని పెద్ద చదువులు చదివించాలని తండ్రి కోరిక. వితంతువైన తన మేనత్తతో కలిసి ఓ వాటాలో అద్దెకి ఉంటూ కాలేజీలో చదువుతోంది సుజాత.


ఇక మూడో వాటాలో ఉంటున్న ఒంటరి రాజగోపాలం. క్షత్రియుల కుర్రాడు. ఇంజినీరింగ్ చదివి, ప్రభుత్వంలో జూనియర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. సుజాతకి రాజగోపాలం అంటే ఇష్టం. ఆమె ప్రతీ చర్యలోనూ ఆ విషయం బయట పడుతూ ఉంటుంది. ఇక రాజగోపాలానికి కల్యాణి అంటే ఇష్టం. కానీ అతను బయట పడడు. కల్యాణి చాలా గుంభనమైన మనిషి. ఆమెకి సుజాత, రాజగోపాలాల అంతరంగాలు తెలుసు. నిజానికి ఆమెకీ రాజగోపాలం అంటే ఇష్టమే. అతని నుంచి ఎలాంటి ప్రతిపాదన వస్తుందో చూద్దామన్న ధోరణిలో ఉంటుందామె.

కొడుక్కి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న రాజగోపాలం తల్లిదండ్రులు విజయవాడ వచ్చి, కులాంతర వివాహాన్ని తాము ఏమాత్రం ఆమోదించమని చెప్పి వెళ్లడం, అటుపై సుజాతని చూడవచ్చిన ఆమె అక్కాబావలు (బావ, రాజగోపాలం స్నేహితుడే) సుజాత మనసు తెలుసుకుని ఆమె తండ్రికి సూచన అందించడంతో కథ పాకాన పడుతుంది. కల్యాణిని మనసులో ఉంచుకుని, కొడుకుతో కులం విషయంలో రాజీ పడమని తేల్చి చెప్పిన రాజగోపాలం తల్లిదండ్రులు, సుజాత తండ్రి భారీ కట్నం, లాంఛనాలతో పిల్లనిస్తాననేసరికి మెత్తబడతారు.

వీళ్ళతో సమాంతరంగా నడిచే కథ డాక్టరు మంజులతది. శ్రీవైష్ణవ కుటుంబంలో పుట్టిన మంజులత వర్ణాంతర ప్రేమవివాహం చేసుకుంటుంది. కులాల కారణంగా కుటుంబంలో కలతలు రేగడంతో విడాకులు తీసుకుని విడిగా జీవిస్తూ ఉంటుంది. తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చెల్లెలు వర్ణాంతర ప్రేమ వివాహానికి సిద్ధపడడంతో ఆ పెళ్లి ఆపే ప్రయత్నాల్లో ఉంటుంది మంజులత. ఇందుకోసం స్నేహితుడైన రాజగోపాలం సాయం కోరుతుంది. రాజగోపాలం కల్యాణిని వివాహం చేసుకోవాలని ప్రతిపాదించే సమయానికి, ఆమెకి బాల్య వివాహం జరిగిందన్న విషయం వెలుగులోకి రావడంతో పాటు నాటి వరుడు తెరమీదకి వస్తాడు.

తరాల మధ్య అంతరాలు, విలువల మధ్య ఘర్షణలతోపాటు, నాటి బెజవాడ రాజకీయాలు, కమ్యూనిస్టు పార్టీ విస్తృతి లాంటి విషయాలెన్నో చర్చకి పెట్టారీ నవలలో. మొత్తం ముప్ఫయి ఎనిమిది ప్రకారణాలుగా విభజించిన ఈ 192 పేజీల నవల కొన్ని చోట్ల డాక్టర్ పి. శ్రీదేవి రాసిన 'కాలాతీత వ్యక్తులు' నవలని గుర్తు చేస్తుంది. అయితే, శ్రీదేవి తన నవలలో కులాలని నేరుగా ప్రస్తావించలేదు. "భూతకాలపు అలవాట్లు, ఆచారాల నుంచి, భావికాలపు ఆదర్శాలను అందుకొనేటందుకు మానవుని ప్రయత్నం అనవరతం సాగుతూనే ఉంటుంది. ఈ రెండు కాలాలనూ కలుపుతున్న వర్తమానాన్ని ఒక వంతెనతో పోల్చవచ్చు. ... వంతెన మామూలు వంతెన కాదు, కత్తుల వంతెన!" అంటారు రచయిత. (వెల రూ. 160, విశాలాంధ్ర మరియు అన్న ప్రముఖ పుస్తకాల షాపులు).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి