ఆదివారం, జులై 31, 2016

నవతరం 'పెళ్ళిచూపులు'

రెండు దశాబ్దాల క్రితం వంశీ తీసిన ఫ్లాప్ సినిమా 'లింగబాబు లవ్ స్టోరీ' లో మొబైల్ కేంటీన్ కాన్సెప్ట్ ని నేటి తరం జీవన శైలిని ప్రతిబింబించే కథలో కీలకాంశంగా మలుచుకుని నవతరం దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపుదిద్దిన సినిమా 'పెళ్ళిచూపులు.' విజరయ్ దేవరకొండ ('ఎవడే సుబ్రహ్మణ్యం' లో నాని 'దూద్ కాశి' ఫ్రెండ్), రీతూ వర్మ (అదే సినిమాలో నాని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి) నాయికానాయకులు కాగా, షార్ట్ ఫిల్ముల్లోనూ, చిన్న సినిమాల్లోనూ నటించిన నటీనటులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రత్యేకత ఆసాంతమూ సరదాగా సాగిపోయే క్లీన్ కామెడీ కావడం. కుటుంబంతో కలిసి హాయిగా చూడగలిగే ఈ సినిమాలో కథ కన్నా, కథనమే ప్రేక్షకులని కట్టి పడేస్తుంది.

లెక్కకి మిక్కిలిగా సప్లీలు (సప్లిమెంటరీ పరీక్షలు) రాసి, ఇంజనీరింగ్ అయిందనిపించిన ప్రశాంత్ (విజయ్) కుదురుగా ఉద్యోగం చేసుకునే టైపు కుర్రాడు కాదు. ధర్మో డైనమిక్స్ స్పెల్లింగ్ కూడా తెలియని తన ఇంజనీరింగ్ చదువుతో ఆ ఫీల్డులో నెగ్గుకు రావడం కష్టమని తెలుసతనికి. తనకి ఇష్టమైన హోటల్ మేనేజ్మెంట్ రంగంలో భవిష్యత్తు వెతుక్కోవాలని నిర్ణయించుకుని, ఓ షెఫ్ దగ్గర శిక్షణ పొందుతాడు. కొడుకుని గుండెల మీద కుంపటిలా భరిస్తున్న విజయ్ తండ్రి, ఓ జ్యోతిష్యుడి సలహా మేరకి కొడుక్కి పెళ్లి చేసేయాలని నిర్ణయించుకుంటాడు. పెళ్లి చూపులు చూడ్డానికి చిత్ర (రీతూ వర్మ) ఇంటికి విజయ్ కుటుంబం వెళ్లడం, అక్కడ జరిగే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ తో ప్రథమార్ధం సరదాగా గడిచిపోతుంది.

ఎంబీఏ చేసిన చిత్ర ఏదైనా వ్యాపారం చేసి తనని తాను నిరూపించుకోవాలని నిర్ణయించుకుని, స్నేహితుడి సాయంతో ఓ మొబైల్ రెస్టారెంట్ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంటుంది. సరిగ్గా ఆ స్నేహితుడు ఆమెకి దూరం అయినప్పుడే, పెళ్లి చూపుల్లో విజయ్ తో పరిచయం అవుతుంది. పెళ్ళిచూపుల ఫలితం వేరేగా ఉన్నప్పటికీ, విజయ్ తో కలిసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటుంది చిత్ర. విజయ్ కి కూడా వ్యాపారంలో చేరక తప్పని పరిస్థితులు వస్తాయి. వ్యాపారం ఉహిచనంతగా విజయవంతం అవుతుంది. సరిగ్గా అప్పుడే, చిత్ర స్నేహితుడు తిరిగి రావడం, విజయ్ కి పెళ్లి నిశ్చయమవడంతో కథ క్లైమాక్స్ కి చేరుతుంది. ఒక అత్యంత నాటకీయమైన సన్నివేశం అనంతరం నాయికా నాయకులు వాళ్ళ జీవితాలకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంతో శుభం కార్డు పడుతుంది సినిమాకి.


దర్శకత్వంతో పాటు కథ, కథనం, సంభాషణలు సమకూర్చుకున్న తరుణ్ భాస్కర్ ని ముందుగా అభినందించాలి. బూతు లేకుండా కూడా యూత్ ని మాత్రమే కాక, అన్ని వర్గాలనే అలరించే సినిమా తీయొచ్చని సినిమా తీసి మరీ నిరూపించినందుకు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంత మాత్రమే ఖర్చు చేసి తీసిన ఈ సినిమాని కొత్తగా చిత్ర నిర్మాణ రంగంలోకి రావాలనుకుంటున్న వాళ్ళు ఒక రిఫరెన్స్ గా పరిశీలించాల్సిన అవసరం ఉంది. వేగవంతమైన కథనం, పాత్రోచితమైన సంభాషణలతో పాటు సినిమాటోగ్రఫీ (నగేష్ బానెల్) సంగీతం (వివేక్ సాగర్) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఎడిటర్ (రవితేజ గిరజాల) కి రెండో సగంలో కొంచం తక్కువ పని చెప్పినట్టనిపించింది. అయితే, సినిమా నిడివి మరీ ఎక్కువగా ఉండకపోవడం ప్లస్ పాయింట్ అయ్యింది. పాటలకి బదులు బిట్ సాంగ్స్ మాత్రమే ఉన్నా, అదో లోటుగా అనిపించలేదు ఎక్కడా.

తరుణ్ భాస్కర్ టేకింగ్ మీద శేఖర్ కమ్ముల ప్రభావంగా విపరీతంగా కనిపించి ఈ సినిమాలో. పాత్రలని డిజైన్ చేసుకోడం మొదలు, నటన రాబట్టుకోడం వరకూ ప్రతి చోటా శేఖర్ ముద్ర కనిపించింది. రీతూ వర్మ కైతే 'ఆనంద్' 'గోదావరి' సినిమాలు పదేపదే చూపించి కమలిని చేసినట్టే చేసేయమని చెప్పారేమో అని సందేహం కలిగింది. విజయ్ చాలా సీన్లలో 'ఆనంద్' సినిమాలో రాజాని గుర్తు చేశాడు. సంభాషణలు, నటీనటులు వాటిని పలికిన తీరు కూడా శేఖర్ సినిమాలనే జ్ఞాపకం చేశాయి. బలమైన నాయిక పాత్ర, అదే సమయంలో హీరో డమ్మీ కాకపోవడం, క్లైమాక్స్ మినహా ఇంకెక్కడా అతి పోకడలు కనిపించక పోవడం వల్ల ఎక్కడా విసుగు కలగదు. మొదటిసగం అయితే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. రెండో సగం మొదలైన కాసేపటికే కథనం ఎలా ఉండబోతోందో అర్ధం అయిపోవడం, సరిగ్గా అలాగే ఉండడం కాస్త నిరాశ పరిచాయి.

రెండో సగం విషయంలో, మరీ ముఖ్యంగా ముగింపు విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే పదికాలాల పాటు గుర్తుండిపోయే సినిమా అయ్యేది. అలాగని ఇప్పుడేమీ తక్కువ కాదు. కుటుంబం అంతా కలిసి నిర్భయంగా చూడగలిగే సినిమా. పైగా, ఆసాంతమూ సరదాగా సాగిపోతుంది కూడా. 'ఇలాంటి మనుషులు మనకి తెలుసు' అనిపించే పాత్రలు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ పెట్టకపోవడం పెద్ద రిలీఫ్. సినిమా చూశాక తరుణ్ భాస్కర్ లో ఓ ప్రామిసింగ్ దర్శకుడు కనిపించాడు. దట్టమైన గడ్డం మాటున పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ తో పని లేకుండా నెట్టుకొచ్చేశాడు హీరో. మొదటి సినిమా కన్నా వాచికం లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. కానైతే, చేయాల్సింది ఇంకా ఉంది. కమలిని అనుకరణ విజయవంతంగా చేసింది హీరోయిన్. హీరో స్నేహితుడిగా చేసిన కుర్రాడి కామెడీ టైమింగ్ భలేగా ఉంది. ఫుడ్ ట్రక్ బిజినెస్ చుట్టూ బలమైన సీన్స్ అల్లుకుంటే మరింత బాగుండేది. మొత్తంమీద, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోరుకునే వాళ్ళని అలరించే సినిమా ఇది.

4 కామెంట్‌లు:

  1. మంచి సినిమాకి చక్కని రివ్యూ.. బాగుందండీ.. నాక్కూడా నచ్చేసిందీ సినిమా.
    వంశీ గారిమీద మీకున్న అభిమానానికి మాత్రం మరోసారి హ్యాట్సాఫ్ :-) ఫుడ్ ట్రక్ రెవల్యూషన్ లేటెస్ట్ అంటూ ఉంటే నేనూ నా కాలేజ్ రోజుల్లో ట్రెండ్ అయిన మొబైల్ క్యాంటీన్ ని తలచుకున్నాను కాని లింగబాబు గుర్తురాలేదు :-)

    రిప్లయితొలగించండి
  2. @వేణూ శ్రీకాంత్: నాకు మాత్రం చూసిన వెంటనే లింగబాబే గుర్తొచ్చాడండీ :)) ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  3. భలే పోలికలు పట్టుకుంటారసలు! వేణు గారి కామెంటే నాది కూడా.. :) సినిమా చాలా నచ్చిందండీ.

    రిప్లయితొలగించండి
  4. @కొత్తావకాయ: అవునండీ, ముగింపు దక్క :) ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి