భావుకత్వం ఉన్న టైటిల్, బాగున్న సంగీతం, ఆసక్తి కలిగించిన
స్టిల్స్, మహిళా దర్శకురాలి తొలి చిత్రం.. అన్నింటికీ మించి, కావాల్సిన
వాళ్ళ ప్రొడక్షన్.. నిజానికి రిలీజ్ రోజునే చూడాల్సిన 'మరల తెలుపనా ప్రియా'
సినిమాని కారణాంతరాల వల్ల రెండ్రోజులు ఆలస్యంగా చూశాను. దర్శకురాలు వాణి
ఎం. కొసరాజు తానే రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమా కథ కూడా తెలిసిందే..
ఇదే పేరుతో కొన్నేళ్ల క్రితం ఓ వారపత్రికలో సీరియల్ గా
ప్రచురితమయింది. మామూలుగానే ఓ నవలని సినిమాగా మలచడంలో అనేక సవాళ్లు ఉంటాయి.
అది కూడా సొంత నవలని సినిమాగా మార్చి ఒప్పించడం, అది కూడా దర్శకురాలిగా
తొలిప్రయత్నంలోనే చేయాల్సి రావడం నిజంగా కత్తిమీద సామే. ఈ సాముని గురించి
మాట్లాడుకోవాలంటే, ముందుగా కథ గురించి చెప్పుకోవాలి.
కోటీశ్వరులింటి
గారాబు పట్టి వైషూ అలియాస్ వైష్ణవికి జీవితం అంటే ఎంజాయ్ చేయడం మాత్రమే.
బైకర్ అయిన ఈ అమ్మాయి అప్పుడప్పుడూ బైక్ రేసుల్లోనూ, ఎప్పుడూ ఇంటా, బయటా
జరిగే పార్టీల్లోనూ బిజీగా గడిపేస్తూ ఉంటుంది. అలాంటి వైషూకి గాయకుడూ,
సంగీత దర్శకుడూ అయినా జై అలియాస్ జయకృష్ణ తారసపడతాడు ఒకానొక పార్టీలో.
పరిచయం స్నేహంగా మారినప్పుడు తెలుస్తుంది ఇద్దరి అలవాట్లూ పూర్తిగా
భిన్నమని. వైషూకి వైనూ, సిగరెట్లూ మామూలు విషయాలైతే, ప్రతి మంగళవారం క్రమం
తప్పకుండా ఆంజనేయస్వామి గుడికి వెళ్లే జై కి బీరు రుచి కూడా తెలీదు. జై తో
కలిసి, రాజమండ్రి దగ్గరలో ఉన్న అతని పల్లెటూరికి సంక్రాతి పండక్కి
వెళ్ళొచ్చిన వైషూ, హైదరాబాద్ కి తిరిగి రాగానే అతనికి ప్రపోజ్ చేస్తుంది.
అతను కూడా అంగీకరిస్తాడు. ఇంతలో ఊహించని విధంగా వాళ్లకి బ్రేకప్ అవ్వడంతో
సినిమా విశ్రాంతికి వస్తుంది.
తన తప్పు తెలుసుకున్న వైషూ జై
కోసం వెళ్లేసరికి అతని ఇంటికి తాళం ఉంటుంది. ఫోన్లకి జవాబు ఉండదు. వాళ్ళ
ఊరికి ఫోన్ చేసినా అతని సమాచారం ఏమీ తెలియదు.. ఇక, అతన్ని వెతుక్కుంటూ తానే
స్వయంగా బయల్దేరుతుంది వైషూ. అతని కోసం జరిపిన అన్వేషణలో ఆమె ఎదుర్కొన్న
ఇబ్బందులు, అసలు అతను ఉన్నట్టుండి మాయమైపోడానికి కారణాలు, తిరిగి కలుసుకునే
క్రమంలో ఎదురయ్యే ఆటంకాలని దాటుకుంటూ శుభం కార్డుకి చేరుకుంటుంది. వైషూ గా
వ్యోమ నంది (తొలిపరిచయం), జై గా ప్రిన్స్ నటించారు. కథ ప్రకారం హీరో
కన్నా, హీరోయిన్ కే నటించడానికి అవకాశం ఎక్కువ. ఈ అవకాశాన్ని చక్కగా
ఉపయోగించుకుంది వ్యోమ నంది. నాయిక పాత్రలో ఉన్న డిఫరెంట్ షేడ్స్ ని ఎక్కడా
వంక పెట్టడానికి వీల్లేని విధంగా ప్రదర్శించింది. కేవలం నటనకి మాత్రమే
పరిమితమైపోకుండా గ్లామర్ నీ చిలకరిచింది.
హీరోది ఒకరకంగా
పాసివ్ పాత్ర. హీరోయిజం ఉన్న నాయికచేత ప్రేమించబడే హీరో. చాకోలెట్ బాయ్ లా
కనిపించే ప్రిన్స్ ఈ పాత్రకి సరిగ్గా సరిపోయాడు. ఈ కుర్రాడు వాచికం,
డాన్సులు మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. సాంకేతిక విభాగాల్లో మొదటగా
చెప్పుకోవాల్సింది కెమెరా (ఎస్. రాజశేఖర్), సంగీతం (శేఖర్ చంద్ర) గురించి.
హైదరాబాద్, రాజమండ్రి, గోవా, హరిద్వార్, రిషీకేశ్ లని అందంగా చూపించింది
కెమెరా. కళ్ళకి హాయిగా ఉంది పనితనం. గ్రీటింగ్ కార్డుల్లాంటి ఫ్రేములకి
కొదవ లేదు. ఇక సంగీతం విషయానికి వస్తే, పాటలతో పాటుగా నేపధ్య సంగీతమూ
చక్కగా కుదిరింది. మార్తాండ్ కె. వెంకటేష్ లాంటి సీనియర్ ఎడిటర్ రెండో సగం
విషయంలో ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఎందుకు మొహమాట పడ్డారో అర్ధం కాలేదు. చిన్న
సినిమానే అయినా, చేసిన ఖర్చు తెరమీద కనిపించింది.
దర్శకత్వం
గురించి చెప్పుకోవాల్సింది కొంత ఉంది. నాయకుణ్ణి వెతుక్కుంటూ నాయిక జరిపే
అన్వేషణతో కథను మొదలు పెట్టి ఇంటర్కట్స్ లో వాళ్ళిద్దరి పరిచయం, ప్రేమని
చూపి, బ్రేకప్ దగ్గర విశ్రాంతిని ఇచ్చారు. రెండో సగంలో తన అన్వేషణ
కొనసాగిస్తున్న నాయిక గతాన్ని గుర్తు చేసుకునే క్రమంలో మరి కొన్ని ఫ్లాష్
బ్యాక్ సీన్లు చూపి, కథని ముగింపుకి తీసుకొచ్చారు. నాయికని పల్లెటూరికి
తీసుకెళ్లిన నాయకుడు, తన కుటుంబాన్ని పరిచయం చేస్తాడు. తండ్రితో అతనికున్న మాట పట్టింపులతో సహా
అన్నీ తెలుస్తాయి నాయికకు. అలాగే, ఓ సంగీత దర్శకుడిగా అతడు ఎంత బిజీ అన్నది
కూడా ఆమె ద్వారా ప్రేక్షకులకి తెలుస్తుంది. అలాంటిది, ఉన్నట్టుండి అతను
కనిపించకుండా పోతే అటు కుటుంబమూ, ఇటు సంగీత రంగానికి సంబంధించిన వాళ్ళూ
కూడా ఏమాత్రం పట్టించుకోక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
అలాగే,
నాయికని ఎంతగానో ప్రేమించే ఆమె తల్లిదండ్రులు, ఓ స్నేహితుడి సాయంతో ఆమె
నాయకుణ్ణి వెతుకుతూ, ఆ క్రమంలో జ్వరపడితే ఫోన్లో ఓదారుస్తారే తప్ప పరుగున
వెళ్లే ప్రయత్నం చేయరు. మొదటి సగం ఇట్టే గడిచిపోయిన సినిమా, రెండో సగానికి
వచ్చేసరికి సాగతీతగా అనిపించిందంటే స్క్రిప్ట్ లోపమే. సున్నితమైన
భావోద్వేగాలనీ, నాయికపై నాయకుడి ప్రభావాన్నీ మైన్యూట్ డీటెయిల్స్ తో సహా
చిత్రించిన దర్శకురాలు, ఐటెం సాంగ్ తో సహా కమర్షియల్ హంగుల విషయంలోనూ రాజీ
పడలేదు. ప్రారంభ సన్నివేశంతో మొదలుపెట్టి, విశ్రాంతి వరకూ కలిగించిన
ఆసక్తిని రెండో సగంలోనూ కొనసాగించే విధంగా శ్రద్ధ తీసుకుని ఉంటే
గుర్తుండిపోయే సినిమా అయి ఉండే ఈ 'మరల తెలుపనా ప్రియా' హింసనీ,
రక్తపాతాన్నీ కాక హాయైన సినిమాలని ఇష్టపడే వాళ్లకి నచ్చుతుంది.
చూస్తుంటే గమ్యం సినిమా మళ్ళీ చూపెట్టలేదు కదా. ఒక అనుమానం అంతే.
రిప్లయితొలగించండిEE story konchem gamyam ki daggaraga undi kadandi. roles reverse anthey. nenu cinema chudaledu. meeru cheppina danibatti ala anipinchindi
రిప్లయితొలగించండి@స్వోత్కర్ష, @అశోక్: 'గమ్యం' లో హీరో, నాయిక కోసం వెతికే క్రమంలో అనేక జీవితాలని దగ్గరగా చూసి జీవితం విలువని తెలుసుకుంటాడండీ.. ఇక్కడ నాయికని ఆమె ప్రయాణం పెద్దగా ప్రభావితం చేసినట్టు కనిపించదు. వ్యక్తిగతంగా ఆమె జీవనశైలిలో వచ్చిన మార్పుని చూపించారు అంతే.. వెతకడం అనే పాయింట్ మాత్రం రెంటిలోనూ కామన్ గా ఉంది.. ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@దర్శకురాలు వాణి ఎం. కొసరాజు పంపిన వ్యాఖ్య: "నేను రాసిన 'మరల తెలుపనా ప్రియా' సీరియల్ 'నవ్య' వీక్లీ లో 12 వారాలు ప్రచురితం అయ్యింది 2007-08 లో. 'గమ్యం' నా సీరియల్ తర్వాతే రిలీజ్ అయ్యింది. క్రిష్ నా సీరియల్ కాపీ కొట్టాడని చాలా ఫీల్ అయ్యి 'నవ్య' ఎడిటర్ శ్రీరమణ కి లెటర్ రాసాను కోపంగా. అప్పటి నుంచి ఆయన నాతో మాట్లాడడం మానేసాడు. నా నవలలో హీరో పేరు అభిమన్యు. 'గమ్యం' లో అభిరామ్ గా ఉన్నాడు. ఇంతకంటే కాపీ ఉంటుందా? కథని అటు ఇటు తిప్పి రాసుకుంది క్రిష్, కానీ ఆ అప్రదిష్ట నాకు అంటగడుతున్నారు జనం. దారుణం కదూ!"
రిప్లయితొలగించండి