కళాశాల విద్య పూర్తి చేసుకోబోతున్న రమేష్, తన
స్నేహితుడి చెల్లెలు హేమాలినితో ప్రేమలో పడతాడు. హేమాలిని కుటుంబం
బ్రహ్మసామాజికులు కావడంతో ఆమె గోషా లాంటి సంప్రదాయాలేవీ పాటించదు. రమేష్ ఆ
కుటుంబానికి సన్నిహితుడయ్యాడు. ప్రతినిత్యం ఆ కుటుంబాన్ని టీ వేళకి
కలుసుకోడం, లోకాభిరామాయణం ముచ్చటించడం రివాజుగా మారింది అతనికి. రమేష్ మనసు
హేమాలినికి తెలుసు. నిజానికి ఆమెకి కూడా అతనంటే ఇష్టమే. అంతే కాదు, ఆమె
కుటుంబ సభ్యులకి కూడా రమేష్ మీద మంచి అభిప్రాయమే ఉంది.
పరీక్షలు
పూర్వవుతూనే, రమేష్ ని ఉన్నపళంగా బయల్దేరి రమ్మని జాబు రాస్తాడు అతని
తండ్రి. ఇంటికి వెళ్లే వరకూ అతనికి కారణం ఏమిటన్నది తెలీదు. హేమాలిని విషయం
తెలుసుకున్న రమేష్ తండ్రి, కొడుక్కి సుశీలతో సంబంధం నిశ్చయం చేస్తాడు.
సంప్రదాయవాది అయిన ఆ పెద్దాయన, బ్రహ్మసామాజికురాల్ని కోడలిగా
అంగీకరించేందుకు సిద్ధంగా లేడు. పడవ దాటి పెళ్లి వారి ఊరికి చేరుకుంటుంది
రమేష్ కుటుంబం. అన్యమనస్కంగానే సుశీల మెడలో తాళి కడతాడు రమేష్. వెన్నెల
రాత్రి వేళ స్వస్థలానికి పడవలో తిరుగు ప్రయాణంలో ఉండగా, నది మధ్యలో పడవ
తిరగబడుతుంది. స్పృహ వచ్చేసరికి ఓ ఇసుక తిప్పమీద ఉన్న రమేష్, తనకి కొంచం
దూరంలో స్పృహ తప్పి పడి ఉన్న నవ వధువుని చూస్తాడు.
ఇరువైపుల
బంధువులూ పడవ ప్రయాణంలో మరణిస్తారు. అమాయకురాలైన ఆ వధువు కోసం తానిక
హేమాలినిని పూర్తిగా మర్చిపోవాల్సిందే అని నిశ్చయించుకుంటాడు రమేష్. తన
వాళ్ళ ఉత్తర క్రియలు పూర్తయ్యాక, వధువుతో సంభాషించే ప్రయత్నం చేస్తాడు.
'సుశీలా' అని పిలిస్తే పలకదు ఆమె. ఎందుకంటే, ఆమె పేరు కమల. ప్రమాదానికి
గురైన మరో పడవలో ప్రయాణించిన నవ వధువు ఆమె. జరిగింది ఏమిటో రమేష్ కి
అర్ధమవుతుంది తప్ప, ఆమెకి అర్ధం కాదు. పడవ ప్రయాణం తాలూకు షాక్ నుంచి
పూర్తిగా కోలుకోని ఆమెకి నిజం ఎలా చెప్పాలో అర్ధం కాదు రమేష్ కి. అయితే,
ఆమె తన తాళి కట్టిన భార్య కాదు అని తెలిశాక, హేమాలిని పై మళ్లీ ఆశలు
చిగురిస్తాయి అతనిలో. ఈ జంట కథ ఏ తీరం చేరిందన్నదే రవీంద్రనాథ్ టాగోర్ నవల
'పడవమునక.'
ఈకథకి మార్పులు చేర్పులతో చాలా భారతీయ భాషల్లో
సినిమాలు వచ్చాయి. తెలుగులో అయితే పడవ ప్రయాణాన్ని రైలు ప్రమాదంగా
మార్చేశారు. నవల విషయానికి వస్తే, నాటి కలకత్తా వాతావరణం, బ్రహ్మ సమాజం
ప్రభావం, సంప్రదాయ-ఆధునిక వాదుల మధ్య అంతరాలు.. వీటన్నింటితో పాటూ, ప్రధాన
పాత్రల అంతరంగాలని రవీంద్రుడు చిత్రించిన తీరు అబ్బుర పరుస్తుంది.
నాటకీయతని ఎక్కడ శ్రుతి మించనివ్వక పోవడం వల్ల నవల ఆద్యంతమూ ఆసక్తిగా
సాగడంతో పాటు, ఆద్యంతం సహజంగానే అనిపిస్తుంది. హేమాలిని, కమల పాత్రల
చిత్రీకరణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రచయిత, వారి వారి నేపధ్యాలని
ఆధారంగా చేసుకుని ఆలోచనా స్థాయిల్ని, పరిణతిని చిత్రించారు.
చిన్నప్పుడే
తన వాళ్ళని కోల్పోయి, దూరపు బంధువుల ఇంట్లో పెరిగిన కమల కథ విని ఎంతగానో
చలించి పోతాడు రమేష్. పెళ్లి కారణంగా తనకంటూ భర్త, ఇల్లు ఏర్పడ్డాయని
తృప్తి పడుతున్న కమలకి నిజం చెప్పడం అన్నది అతనికి తలకి మించిన పని
అవుతుంది. ఒకే ఇంట్లో ఉంటూ ఆమెకి దూరంగా ఉండడం కష్టం కాకపోయినా, ఆమె
ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం కష్టం అవుతుంది అతనికి. ఆమె భవిష్యత్తుని కూడా
ఆలోచించి, కమలని ఓ విద్యాలయంలో చేర్చి, అక్కడే ఆమెకోసం ఓ ఇల్లు కుదిర్చి
పెడతాడు. యోగ్యుడైన వరుడికిచ్చి ఆమెకి పెళ్లి చేయడం ద్వారా తన బాధ్యతని
నెరవేర్చుకుని, అటుపై జరిగిందంతా హేమాలినికి చెప్పి ఆమెతో జీవితం
ప్రారంభించాలని తలుస్తాడు రమేష్. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు కథని
ముందుకి నడుపుతాయి.
రమేష్ తనని మోసం చేశాడని భావించే
హేమాలిని, భర్త తనని ఎందుకు దూరం పెడుతున్నాడో తెలియక కమల అనుభవించే
సంఘర్షణ, కథనీ, పాత్రల్నీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. నవలలో
చిత్రించిన బెంగాలీ వాతావరణం శరత్, బిభూతిభూషణ్ ల నవలల్ని గుర్తు
చేస్తుంది. ద్వితీయార్ధంలో ప్రవేశించే కొత్త పాత్రల వల్ల ముగింపుని గురించి
అవగాహన వచ్చినా, ఊహించిన ముగింపుకి కథ ఎలా చేరుతుందన్న ఆసక్తి పుస్తకాన్ని
విడిచిపెట్టకుండా ఏకబిగిన చదివిస్తుంది. కథతో పాటు కథనం మీద రచయిత
తీసుకున్న శ్రద్ధని గమనించవచ్చు. రవీంద్రుడి 'కుముదిని' ని అనువదించిన కమలాసనుడు ఈ 'పడవమునక' నూ తెనిగించారు.(సాహితి ప్రచురణ, పేజీలు 208, వెల రూ. 90,
అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
మంచి పుస్తకాలు గురించి తెలుసుకోవాలంటే తప్పక మీ బ్లాగ్ చదవాల్సిందేనండీ!
రిప్లయితొలగించండిడి. కామేశ్వరి గారు రాసినదనుకుంటాను - జీవితం చేజారనీకు - అనే నవల గురించి మీకు తెలుసాండీ? - ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతోందా - మీకు తెలిస్తే చెప్పగలరా?
~ లలిత
మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు.
రిప్లయితొలగించండితెలుగులో "ఒక చిన్న మాట" సినిమా అనుకుంటాను ..
టాగోర్ బెంగాలీలో వ్రాసిన "నౌకాడూబీ" అనే నవల; ఆంగ్ల అనువాదం The Wreck. రవీంద్రుడి రచనల్లో ఓ మాణిక్యం లాంటిది. మనిషి జీవితంలో ఒక్కోసారి విధి పాత్ర ఎలా ఉంటుందో మచ్చుకి చూపించే కథ.
రిప్లయితొలగించండిపాత "చరణదాసి" తెలుగు సినిమా ఈ నవల ఆధారంగా తీసినదే ("పాత" అని ఎందుకన్నానంటే ఈ రోజుల్లో పాత వాటి పేర్లు పెట్టి సినిమాలు తీసేస్తున్నారుగా ఇంకే పేర్లు దొరకనట్లు. భావదారిద్ర్యం 🙁). మీరన్నట్లు పడవమునకని రైలుప్రమాదంగా మార్చేసారు సినిమాలో. అయినా సినిమా బాగా తీసారనే చెప్పాలి. అంజలీ దేవి గారి అద్భుతమైన నటన. మీరు పైన చెప్పిన తెలుగు సినిమా ఇదేగా?
మీరు చేసిన పుస్తక పరిచయం బాగుంది. ఇటువంటి పుస్తకాలు ఈ తరం వాళ్ళు చదవాలని నా కోరిక 🙁.
@లలిత టీఎస్: 'జీవితం చేజారనీయకు' కామేశ్వరి గారి నవలేనండీ.. చతురలోనో, జ్యోతి లోనో చదివాను.. విడాకులు ఇతివృత్తంతో సాగే నవల.. నిర్మల-విద్య అనే రెండు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే కథ అని జ్ఞాపకం.. నవల కొత్త ప్రింట్ వఛ్చినట్టు లేదండీ.. ఎక్కడన్నా కనిపిస్తే చెబుతాను.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@రాజ్యలక్ష్మి: అవునండీ.. ఒకట్రెండు బ్లాకండ్ వైట్ సినిమాలు కూడా.. ధన్యవాదాలు..
@విన్నకోట నరసింహారావు: అవునండీ.. 'చరణదాసి' 'ఒక చిన్నమాట' తో పాటు మరి కొన్ని సినిమాల్లో కూడా ఈ కథని (పాక్షికంగా) వాడుకున్నారు.. ..ధన్యవాదాలు..