మంగళవారం, ఆగస్టు 25, 2015

అడివి దారి -2

(మొదటిభాగం తరువాత...)

"పెద్దయ్యా.. కలక్టర్ దొరగారొచ్చారు," డవాలా బంట్రోతు కేక వింటూనే, ఆ ఒంటి నిట్రాట పాక నుంచి ఓ వృద్ధుడు బయటికి వచ్చి దండం పెట్టాడు. ఉన్న ఒకే ఒక్క కుక్కి మంచాన్ని నాకు చూపించి, కాస్త దూరంగా నేలమీద కూలబడ్డాడు.

నా షూస్ విప్పిన బంట్రోతు, నేను కణతలు ఒత్తుకోడం చూసి పరుగున వెళ్లి జీపునుంచి క్యాంప్ బ్యాగ్ తీసుకొచ్చి, ఫ్లాస్కులోంచి వొంపిన కాఫీని, బిస్కెట్లతో కలిపి అందించాడు. రెండు గుక్కలు కాఫీ లోపలికి వెళ్లేసరికి నేను మనుషుల్లో పడి చుట్టూ చూశాను. కురుస్తున్న వర్షాన్ని నిర్లిప్తంగా చూస్తున్నాడా వృద్ధుడు.

అతనింటిని నాదిగా చేసేసుకోడం అసహజంగా అనిపించలేదు నాకు. కాకపొతే కర్టెసీ గుర్తొచ్చి, అతనిక్కూడా కాఫీ ఇవ్వమని సైగ చేశాను బంట్రోతుకి. కాఫీనీ, బిస్కెట్లనీ కూడా తిరస్కరించాడతను.

కాఫీ పూర్తి చేసేసరికి ఆచార్లు గుర్తొచ్చాడు. రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న తాసీల్దార్. నన్ను కలిసేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఐటీడీయే మీటింగ్ నుంచి తప్పించడం కోసం అతనికి వేరే డ్యూటీ వేయించాను. ఫోన్లో అయినా మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. తీర్చాల్సిన బాధ్యతలో, మరొకటో వంక చెప్పి తనని తప్పించమని వేడుకుంటాడు, సహజమే.

"పులులెప్పుడూ బలవ్వవోయ్ సారథీ. బలయ్యే పరిస్థితే వస్తే ఏ మేకనో బలిపెట్టి తప్పుకుంటాయి.." సెక్రటేరియట్ లో ఓ సీనియర్ ఆఫీసర్ తరచూ చెప్పే మాట ఇది. ఇప్పుడు ఆచార్లు మేక. ఏమవుతుంది, మహా అయితే సస్పెన్షన్. ఓ నామమాత్రపు ఎంక్వయిరీ. ఓ ఆర్నెల్ల తర్వాత అన్నీ పాతబడి పోతాయి. అయినా ఆచార్లుకెందుకింత కంగారు? ఉహు, అతన్ని అనుకునే ముందు ఎందుకో నేనే పూర్తిగా కన్విన్స్ అవ్వలేకపోతున్నాను.

'పెద్ద సర్' నేరుగా ఫోన్ చేస్తేనే కదా అప్పటికప్పుడు ఫైల్ పుటప్ చేసి, క్లియరెన్సులు ఇచ్చింది. అనుకోకుండా ఏదో చిన్న ఇబ్బంది. అయినా ఈ మీడియా వాళ్లకి బొత్తిగా పని లేకుండా పోతోంది. మీడియా అనగానే మధుమతి మళ్ళీ గుర్తొచ్చింది. ఇరవై-ఇరవై రెండు మధ్యలో ఉంటుందేమో వయసు. జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ అవుతూనే ఓ నేషనల్ మేగజైన్ లో ఉద్యోగం. ఎన్విరాన్మెంట్ తన స్పెషలైజేషన్ అట. ఆమె లాగింది తీగ. డొంకంతా కదిలింది.

"మీడియాని మేనేజ్ చేయడం తెలీదా మీకు?" మధుమతి రాసిన కథనం పత్రికలో వచ్చిన రోజు చీఫ్ సెక్రటరీ అడిగిన మొదటి ప్రశ్న అది.

"టాప్ టు బాటం.. అందరూ చేస్తున్న పని అదే.. ఏ తప్పు బయటికి వచ్చినా ఆఫీసర్లదే రెస్పాన్సిబిలిటీ.. యు నో, పెద్ద సర్ ఎంత అప్సెట్ అయ్యారో? అవర్స్ ఈజే క్లీన్ గవర్నమెంట్..." సీఎస్ ఆగ్రహాన్ని చాలాసేపే వినాల్సి వచ్చింది.

మధుమతి నాకు కేవలం జర్నలిస్టుగా అనిపించలేదు. ఆ ఉరకలెత్తే ఉత్సాహం, చొరవ, సాహసం.. అవన్నీ చూసినప్పుడు నాకూ గిరిజకీ ఓ కూతురు పుడితే ఇలాగే ఉండేదేమో అనిపించింది. ఆమె అడిగేవన్నీ నిజాలే అవ్వడం కొంత, డాటర్లీ ఫీలింగ్ మరి కొంత, ఆమె క్రాస్ చెక్ చేసుకోడానికి ప్రయత్నించిన చాలా విషయాలని కాదని ఖండించలేక పోయాను.

"ప్రాజెక్ట్ టేకప్ చేసే కాంట్రాక్టర్ల కోసం గవర్నమెంట్ రోడ్స్ వేస్తోంది. పేరుకి మాత్రం అభివృద్ధి, నక్సల్ ఇష్యూ. ప్రాజెక్ట్ వస్తే, కొన్నేళ్ళలోనే అడివి పూర్తిగా అంతరించిపోతుంది.. మిస్టర్ సారథీ, ఇవన్నీ మీకు తెలుసనే అనుకుంటున్నాను" అని మధుమతి అన్నప్పుడు "హౌ అబౌట్ ఏ కప్పాఫ్ కాఫీ?" అని మాత్రమే అడిగాన్నేను.

మధుమతిని చూస్తే గిరిజక్కూడా నాక్కలిగిన భావనే కలుగుతుందా అన్న ఆలోచన మొగ్గలోనే ఆగిపోయింది. కచ్చితంగా కలగదు. మా ఇద్దరికీ ఇక సంతానం కలగదని తెలిసినప్పుడు, ఎవరినన్నా పెంచుకుందాం అన్నాను.

"ఎవరో కన్న బిడ్డని నా బిడ్డ అనుకునేంత విశాల హృదయం నాకు లేదు.. ఇలాంటి విషయాల్లో ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు మనం.. బిడ్డని తెచ్చుకుని, సరిగా చూడలేక, అన్యాయం చేస్తున్నామన్న గిల్ట్ ని భరిస్తూ.. ఇదంతా అవసరమా చెప్పు?" అంది గిరిజ.

మా ఇద్దరిమధ్యా సూది మొనంత దూరం మొదలయ్యింది ఆరోజునే. అదిప్పటికి పెరిగి పెరిగి పెద్ద అగాధం అయ్యింది. గిరిజనుల కోసం పనిచేస్తున్న ఓ స్వచ్చంద సంస్థ లో చేరింది గిరిజ. మొదట్లో వాళ్ళ కార్యక్రమాలకి పిలిచేది. నగరాల్లో ఉంటూ ట్రైబల్ వెల్ఫేర్ కోసం పనిచేయడం నాకో జోక్ లా అనిపించింది. నేను వెళ్ళే వాడిని కాదు. రానురానూ పిలవడం మానేసింది.

ఈ ప్రాజెక్ట్ గొడవ మొదలయ్యాక ఒక రోజు "నువ్వు అడివికి అన్యాయం చేస్తున్నావ్.. అడివి నా పుట్టిల్లు.." అంది గిరిజ. అటు తర్వాత తప్పనిసరి అయితేనే నాతో మాట్లాడుతోంది.

ఉద్యోగంలో చేరిన మొదట్లో మెదడుతో పనిచేయాలా లేక హృదయంతోనా అన్న ప్రశ్న తరచూ వేధించేది. సమాధానం 'హృదయం' అయిన ప్రతి సందర్భమూ నాకేవో కొత్తచిక్కులు తెస్తూనే ఉంది.  అధికారి ఎవరైనా పైవాళ్ళు ఎలాగూ వాళ్ళు చేయదల్చుకున్నదే చేస్తారన్న ఎరుక నిర్లిప్తతని పెంచింది. హృదయాన్ని పక్కకి నెట్టేశాక నా తోటి వాళ్ళకన్నా వెనుకబడిపోతున్నానన్న బాధ మాయమయింది. కానీ, కారణం ఇదీ అని చెప్పలేని అసంతృప్తులెన్నో పెరిగి పెద్దవవుతున్నాయి.

వర్షం కాస్త నెమ్మదించడంతో "ఓసారి బండి సూసొస్తా అయ్యగారూ" అంటూ వెళ్ళాడు బంట్రోతు. అడివి తాలూకు పచ్చి వాసనలు గాలితో కలిసొచ్చి పలకరిస్తూ బిభూతి భూషణుడి 'వనవాసి' ని గుర్తు చేస్తున్నాయి. క్యాంప్ క్లర్క్ మోకాళ్ళ మీద తల పెట్టుకుని కునికిపాట్లు పడుతున్నాడు. వృద్ధుడు కళ్ళు తెరిచే నిద్రపోతున్నట్టున్నాడు. ఇంట్లో మరో మనిషి అలికిడి లేదు.

క్లర్కుకి ఏం గుర్తొచ్చిందో, ఒక్కసారి తలెత్తి "అన్నలొస్తారా పెద్దయ్యా?" అని అడిగాడు. అతని గొంతులో భయం వినిపిస్తోంది.

"ఎవురూ రారయ్యా.. ఎవ్వురూ రారు," స్థిరంగా చెప్పాడా వృద్ధుడు. మాట్లాడ్డం మరచిపోతున్నాడేమో అనిపించేలా ఉంది గొంతు.

"ఒక్కడివే ఉంటున్నావా?" పలకరించాన్నేను. చుట్టుపక్కల ఇళ్లేవీ లేవు. విసిరేసినట్టుగా ఈ ఒక్క ఇల్లే.

"అవును బాబూ.. ముసిల్దెల్లిపోయేక ఒక్కన్నే.." చెప్పాడతను.

"గూడెం మొత్తానికి ఇదొక్కటే ఇల్లా?" ఆశ్చర్యం దాచుకోలేదు నేను. కాళ్ళు జాపుకున్నాడతను.

"గూడెం దూరానున్నాది బాబూ.. నేను ఎలడ్డాను.." ఈ 'వెలి పడడం' ఏమిటో వెంటనే అర్ధం కాలేదు నాకు.

"అంటే ఏంటి పెద్దయ్యా?" అడిగాడు మా క్లర్క్.

"ఎనకటి రోజుల్లో నేను గూడెం పెద్దనయ్యా. అందరికీ మంచీ, సెడ్డా సెప్పటం, తప్పు సేసినోన్ని ఎలెయ్యటం ఇయన్నీ పెద్ద సెయ్యాల్సిన పన్లు. అలాటిది నావొల్లే తప్పు జరిగింది. నాకు నేను సిచ్చేసుకోపోతే, పెద్దరికానికి ఇలవేం ఉంటాది? అందుకే ఎలేసుకున్నాను.." 

ఎవరికైనా వేసే శిక్ష అయితే ఏడాదో, రెండేళ్లో వెలి. పెద్ద వల్లే తప్పు జరిగింది కాబట్టి జీవిత కాలపు వెలి. ఇరవయ్యేళ్ళుగా అతనూ, భార్యా అందరికీ దూరంగా ఈ ఇంట్లో.. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయాక అతనొక్కడే.. మిగిలిన సమూహానికి దూరంగా.. ఎలా సాధ్యపడింది?

"మీ గూడెం వాళ్ళు ఒప్పుకున్నారా మరి?" అడిగాడు క్యాంప్ క్లర్క్.

వర్షం తగ్గింది. బంట్రోతు, గన్ మ్యాన్, డ్రైవరు జీపులో వచ్చారు.

"ఎందుకొప్పుకోరయ్యా? తీరుపన్నాక తీరుపే.. తప్పు సేత్తే సిచ్చ  అనుబించాల్సిందే.. సిచ్చ తప్పించుకోటం అన్నిటికన్నాని పెద్ద తప్పుగాదా? తప్పిచ్చుకుట్టే తిండి సయిత్తాదా, కునుకడతాదా బాబూ?"

ఏకకాలంలో దూరంగా ఉరుము ఉరిమి, దగ్గర్లో మెరుపు మెరిసింది.

షూ లేసులు బిగించుకుని, లేచి నిలబడి "సెలవు పెద్దయ్యా" అంటూ చేతులు జోడించాను.

జీపు రోడ్డుదారి పట్టింది.

(అయిపోయింది)

13 కామెంట్‌లు:

  1. ఎవరికైనా వేసేశిక్ష అయితే ఏడాదో రెండేళ్ళో వెలి,పెద్ద వల్లే తప్పు జరిగింది కాబట్టి జీవితకాలపు వెలి.

    తీరుపన్నాక తీరుపే...తప్పు సేత్తే శిచ్చ అనుబించాల్సిందే...సిచ్చ తప్పించుకోవడం అన్నిటికన్నా పెద్ద సిచ్చ కాదా ? తప్పిచ్చుకుంటే తిండి సయిత్తాదా ...కునుకడతాదా బాబూ ?

    రిప్లయితొలగించండి
  2. ఈ కధలో కధకుడి నిజాయితీ నచ్చిందండీ,సమాజానికి మనమేమి చేయగలమో అదే చెప్పాలి.తప్పు చేస్తే శిక్షించుకుంటే సరిపోదు తనలాగా ఇంకొకరు చేయకుండా ఆపాలి.





    రిప్లయితొలగించండి
  3. మొత్తం కథ చదివాను, భాష-భావం-నేటివిటీ-ఎంచుకునే ప్రతి అంశం మీద మీకున్న పట్టు, భలే కాంబినేషన్ మురళి గారు, సెహబాసో

    రిప్లయితొలగించండి
  4. చాలా రొజుల తర్వాత మంచి కధ చదివాను..... బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. దోవ తప్పాను కదా... :(
    పెద్దయ్య చూపిన దారిలో ఎందరు నడవగలరు? ఎవరి సంగతో నాకెందుకు, నేను నడవగలనా? ఏమో!

    రిప్లయితొలగించండి
  6. @నీహారిక: ధన్యవాదాలండీ
    @లక్ష్మి: పబ్లిష్ చేస్తుండగా 'ఎంతమందికి అర్ధమవుతుంది?' అన్న ప్రశ్న వచ్చిందండీ నాకు. మీ వ్యాఖ్య చాలా సంతోషాన్నిచ్చింది, ఇకపై అలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదని. ధన్యవాదాలు.
    @స్వరూప్ కుమార్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  7. @నీలకంఠ: ధన్యవాదాలండీ..
    @పురాణపండ ఫణి: ఒక సీరియస్ పాఠకుడు తారస పడినప్పుడు రాసిన వాళ్ళకి కలిగే అనుభూతి ఎలా ఉంటుందో మరోమారు అనుభవానికి తెచ్చారు.. మెనీ థాంక్స్..

    రిప్లయితొలగించండి
  8. మెదడుతో పనిచేయాలా లేక హృదయంతోనా?? రెండింటికీ తేడా ఎంతమందికి తెలుస్తుంది.... మీ కథల్లోని గొప్పదనం ప్రతి అక్షరాన్ని శ్రద్ధతో చెక్కుతారేమో చెయ్యిపట్టి నడిపిస్తాయి కథలోకి. ఎప్పటిలానే మంచి కథ.

    రిప్లయితొలగించండి
  9. @జ్యోతిర్మయి: అన్నీ అందరికీ తెలియవు కదండీ.. ఏమీ తెలియని వాళ్ళే అదృష్టవంతులేమో అన్నిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి.. ..ధన్యవాదాలు..
    @పరిమళం: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  10. మనిషి వ్యవహారిక జ్ఞానానికి బహుశా ఒక నిర్దిష్టమైన పరిధి ఉందనుకుంటాను. అది దాటితే, మనిషి విలువల నిర్వచనం తారుమారై, అటుపై నాగరికత చేసే మంచి కన్నా చెడే ఎక్కువౌతుందేమో. మనిషి ఆత్రుతో, లేక వ్యక్తిత్వపు అహమో మరి మరోటో ఈ పరిధులను చాలా చాలా నెమ్మదిగా చెరిపేస్తాయి. లోతైన కథ, ధన్యవాదాలు. హరిః ఓం

    రిప్లయితొలగించండి