ఆదివారం, ఆగస్టు 02, 2015

రక్తస్పర్శ - శారద కథలు

భవిష్యత్తు దర్శనం చేయగలిగే వారిని 'ద్రష్ట' లు అంటారు. సాహిత్యంలో, మరీ ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఇలాంటి వారు కనిపిస్తారు. కాలపరిక్షకి నిలబడడమే కాదు, ఏ కాలంలో చదివినా 'ఇది ఈ కాలానికి సరిపోయే రచన' అనిపించడం వీరి రచనల ప్రత్యేకత. ఇలాంటి ద్రష్టల జాబితాలో 'శారద' కలం పేరుతో కలకాలం నిలిచిపోయే రచనలు చేసిన ఎస్. నటరాజన్ ది చెదరని స్థానం. శారద కథలు ఆపకుండా చదివిస్తాయి.. పదేపదే వెంటాడతాయి కూడా.

జన్మతః తమిళుడైన నటరాజన్, యవ్వనారంభంలో పొట్టకూటి కోసం తెనాలికి వలస వచ్చి, హోటల్ సప్లయర్ గా పనిచేస్తూ రాత్రి వేళల్లో తెలుగు నేర్చుకుని, సాహిత్యాన్ని మధించడం మాత్రమే కాకుండా, తెలుగు రచయితగా పేరు సంపాదించుకోవడం గొప్ప విశేషం. కాలపరిక్షకి నిలబడే కథలెన్నో రాసిన నటరాజన్ తన ముప్ఫై రెండో ఏటే అనారోగ్యంతో కన్ను మూయడం ఓ గొప్ప విషాదం.

తన ఇరవై నాలుగో ఏట 1948 లో రచనా వ్యాసంగం ఆరంభించిన శారద తర్వాతి ఏడెనిమిదేళ్ళ కాలంలో అరవై కథలు, నవలలు, నాటికలు, నాటకాలు, వ్యంగ్య రచనలూ చేసినా అందుబాటులో ఉన్నవాటి సంఖ్య స్వల్పం. కృత్యాద్యవస్థ మీద సంపాదించిన ముప్ఫై ఐదు కథలతో తెనాలికి చెందిన శారద సాహిత్య వేదిక ప్రచురించిన సంకలనమే 'రక్తస్పర్శ.' నటరాజన్ మరణించిన ఎనిమిదేళ్ళకి 'రక్తస్పర్శ' పేరుతో 1963 లో వెలువడ్డ సంకలనానికి మరికొన్ని కథలు చేర్చి వెలువరించిన పుస్తకం ఇది.


శారద కథలు పందొమ్మిది పేజీల నిడివిగల 'రక్తస్పర్శ' మొదలు సింగిల్ పేజీ కథ 'దేశమును ప్రేమించుమన్నా' వరకూ భిన్న ఇతివృత్తాలని స్పృశిస్తూ సాగాయి. సాహిత్యానికి సతతహరిత ఇతివృత్తంగా చెప్పే మానవ సంబంధాల చుట్టూ అల్లిన కథలదే సింహభాగం. కథా రచనలో శారదది తనదైన శైలి. అయితే, చలం, కొకు, చాసోల ప్రభావం స్పష్టాస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. 'రక్తస్పర్శ' తో పాటు 'స్వార్ధపరుడు,' 'మరలో చక్రం,' 'గొప్పవాడి భార్య,' 'వింత ప్రకృతి,' 'పిరికి ప్రియుడు,' 'సంస్కార హీనుడు,' 'మర్యాదస్తుడు,' 'అవసానం' కథలకి ఇతివృత్తం మానవనైజమే.

చిన్న వయసులోనే తల్లినీ తండ్రినీ పోగొట్టుకుని, కాపురం ఆరంభించిన కొన్నాళ్ళకే వితంతువుగా మారిన అనసూయ, తన తమ్ముడు ప్రసాదరావుని యోగ్యుడిగా తీర్చిదిద్దిన వైనమే 'రక్తస్పర్శ.' చాసో 'లేడీ కరుణాకరం' గుర్తురాక మానదు ఈ కథ చదువుతుంటే. లోకం నోరుమూయించి మరీ తాము కోరుకున్నట్టుగా జీవించగల శక్తి ఉంది ఈ రెండు కథల్లో ప్రధాన పాత్రలకీ. వకీలు విజయరాఘవరావు గారి కాళ్ళు లేని కూతురు పద్మావతిని పెళ్ళిచేసుకున్న పేదింటి ప్రకాశరావు కథ 'స్వార్ధపరుడు.' పద్మావతి తీసుకున్న నిర్ణయం కారణంగా ఆమెనీ, ఈ కథనీ కూడా మర్చిపోలేరు పాఠకులు.


సనాతనుడైన తండ్రి, ఆదర్శవంతుడైన అన్న, అంతకు మించి ఆదర్శాలున్న భర్త.. వీళ్ళందరి పంచనా బతుకుతూ వచ్చిన ఓ స్త్రీ తనదైన జీవితాన్ని వెతుక్కోడం 'మరలోచక్రం' కథ ఇతివృత్తం. భర్త గొప్పదానాన్ని పెంచే విధంగా జీవించి, అందుకోసమే మరణించిన స్త్రీ కథ 'గొప్పవాడి భార్య.' స్త్రీ పురుషుల చాంచల్యాలని 'వింత ప్రకృతి' కథ చిత్రిస్తే, తనని ప్రేమించిన స్త్రీని చితికెక్కించిన భీరువు కథ 'పిరికి ప్రియుడు.' 'సంస్కార హీనుడు' కథలో కామేశ్వరి పాత్ర చిత్రణ జరుక్ శాస్త్రి రాసిన గొప్ప కథ 'ఒక్క దణ్ణం' లో కథానాయిక రామసీతనీ, పురాణం కథ 'సీత జడ' నాయిక సీతనీ ఏకకాలంలో గుర్తుచేస్తుంది. అయితే ఈ మూడు కథలకీ పోలిక లేదనే చెప్పాలి.

నటరాజన్ కి వామపక్ష ఉద్యమాలతో సంబంధం ఉంది. తెలంగాణా సాయుధ పోరాటాన్ని గురించి స్పష్టమైన అవగాహన ఉంది. ఆ చారిత్రిక పోరాటం ఇతివృత్తంగా రాసిన కథలు 'కొత్త వార్త' 'గెరిల్లా గోవిందు.' సోషియో ఫాంటసీ మీద కూడా ఆసక్తి మెండే అనిపిస్తుంది 'వింతలోకం,' 'ఎగిరే పళ్ళెం' కథలు చదివినప్పుడు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యమని చెప్పే కథ 'కోరికలే గుర్రాలైతే.' శృంగార రస ప్రధానంగా సాగే 'కౌముది' కథనీ ఒప్పించేలా రాశారు నటరాజన్. 'శారద' లభ్య రచనల సమగ్ర సంకలనం వెలువడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

(కొసమెరుపు: ఘనత వహించిన విశ్వవిద్యాలయం వారొకరు ఎమ్మే తెలుగు పాఠ్య పుస్తకంలో శారద రచనల్ని 'అశ్లీల సాహిత్యం' జాబితాలో వేశారట!)

3 కామెంట్‌లు:


 1. శారద నవల 'మంచీ -చెడూ ' మాత్రం చదివాను.అంత ప్రతిభ ఉన్న అతని జీవితం చిన్న వయసు లోనే అలా ముగియడం విషాదకరమే.క్షయ వ్యాధి అనుకుంటాను.

  రిప్లయితొలగించు

 2. ఘనత వహించిన విశ్వ విద్యాలయం వారొకరు ఎమ్మే పుస్తకం లో శారద రచనల్ని అశ్లీల సాహిత్యం జాబితా లో వేశారట :)

  అసలైన సాహిత్యం అనబోయి అప్పు తచ్చై అశ్లీమై పోయిందేమో : జేకే !

  తక్కువ వయసులో తమిళుడు తెలుగు నాట సాహిత్య లోకం లో చెరగని ముద్ర వేసిన నటరాజన్ చిరస్మరణీయుడు .

  చీర్స్
  జిలేబి

  రిప్లయితొలగించు
 3. @కమనీయం: ఫిట్స్ అని చదివానండీ రెండుమూడు చోట్ల.. చిన్న వయసులో వెళ్ళిపోవడం మాత్రం చాలా విషాదం అండీ.. ధన్యవాదాలు.
  @జిలేబి: అవునండీ, చిరస్మరణీయుడే.. ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు