గతుకుల రోడ్డు మీద కొత్త జీపు పరుగులు పెడుతోంది. ఘాటీ మార్గం, అదికూడా
కిందకి దిగడమేమో అనాయాసంగా కదిలిపోతోంది బండి. డ్రైవర్ దృష్టి ఎదురుగా ఉన్న
రోడ్డు మీద ఉంది. వెనుక సీట్లో గన్ మ్యాన్, క్యాంప్ క్లర్క్, డవాలా
బంట్రోతు కూర్చున్నారు వరుసగా. ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. సాయంకాలమైంది కదా,
అందరికీ ఇళ్ళ మీదకి ధ్యాస మళ్ళి ఉంటుంది.
సిగ్నల్ ఉండదని తెలిసీ, మొబైల్
ఫోన్ ని చేతిలోకి తీసుకున్నాను అప్రయత్నంగా. ఘాటీ దాటితే తప్ప సిగ్నల్
ఉండదు. అక్కడి నుంచీ ఇక కాల్స్ మొదలవుతాయి. ప్రతి సంభాషణా ప్రశ్నతోనే
ముగుస్తుంది. నా దగ్గర ఏ ప్రశ్నకీ సమాధానం లేదిప్పుడు. సమాధానం ఆలస్యం
అయ్యే కొద్దీ జవాబు కోసం ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే.
ఫోన్ నుంచి దృష్టి మరల్చి, అద్దంలోనుంచి బయటికి చూశాను. అడివి చెట్ల పైన
తుమ్మెదలు గుంపులుగా ఝుంకారాలు చేస్తున్నాయి. పెద్ద వర్షం రాబోతోందిప్పుడు.
ఇది సైన్స్ చెప్పిన మాట కాదు, సెన్స్ చెప్పింది. వర్షం మొదలయ్యేలోపు ఈ
అడివి దాటేస్తే ఇక పర్వాలేదు. వేగము, దూరము, కాలము... ఈక్వేషన్లు
తిరుగుతున్నాయి బుర్రలో. ఉహు, ఏకాగ్రత కుదరడంలేదు.
కొంచం ముందుగా బయల్దేరి
ఉండాల్సింది. ఐటీడీయే పీవో కొత్తగా వచ్చిన డైరెక్ట్ రిక్రూటీ.. గంటలో
ముగించాల్సిన మీటింగ్ మూడు గంటల పాటు నడిపాడు. అది అయ్యింది అనుకుంటూ
ఉండగా, గిరిజన నాయకులు అర్జీలు పట్టుకుని వచ్చారు 'కలక్టర్ దొరవారి దర్శనం' అంటూ. వాళ్ళతో మాట్లాడి
బయల్దేరేసరికి ఆలస్యం అయింది. అయినా ఉన్నది అడివిలోనే కదా.. అడివి నాకు
కొత్తేమీ కాదు కదా..
"నీకింక అడివంతా అత్తారిల్లే..." గిరిజ గొంతు నా
చెవిలో గుసగుసలాడుతున్నట్టే ఉంది. ఇదిగో అదిగో అంటూ ఇరవయ్యేళ్ళు
గడిచిపోయాయి గిరిజ నాకీ మాట చెప్పి. యూనివర్సిటీ లైబ్రరీని ఆనుకుని ఉన్న
పెద్ద చెట్టు చుట్టూ కట్టిన సిమెంటు చప్టా మీద కూర్చుని భవిష్యత్
ప్రణాళికలు రచించుకున్న కాలమది.
పట్టీలు పెట్టుకున్నా, లేకున్నా గిరిజ
అడుగుల చప్పుడు పరిచితమే. 'నేను నడవడం వల్ల నేలకి నొప్పి కలుగుతోందేమో' అని
ఆలోచిస్తుందేమో మరి. వెనుకనుంచి వచ్చి నాకళ్ళు మూయడం అప్పట్లో తనకో సరదా. నేను కావాలని ఇంకెవరెవరి పేర్లో చెప్పినా, తనని గుర్తు పట్టేసిన
విషయం గిరిజకి తెలిసిపోయేది.
యూనివర్సిటీ హాస్టళ్ళలో ఉండి పీజీ చేస్తూ
సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళం ఇద్దరం. మొదటి ప్రయత్నం ఇద్దరికీ
ఫెయిల్యూర్ నే ఇచ్చింది. తనిక సివిల్స్ రాయనని చెప్పేసింది గిరిజ. "అయినా,
జనానికి ఏదన్నా చేయాలంటే కలక్టర్ అవ్వడం ఒక్కటే మార్గం కాదు" అంది తను ఆ
సాయంత్రం వేళ. "అవును, కలెక్టర్ భార్యగా కూడా చాలా చెయ్యొచ్చు"
అన్నాన్నేను. నాగొంతులో అతిశయం పలికే ఉంటుంది బహుశా. అదిగో, అప్పుడంది
గిరిజ "నీకింక అడివంతా అత్తారిల్లే" అని.
ప్రపోజ్ చేసుకోడాలు, లవ్యూలు,
పూల బొకేలు, సినిమాలు, డిన్నర్లు.. ఇవేవీ లేని ప్రేమకథ మాది. అదిమొదలు, తను
నన్ను వాళ్ళూరికి ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. వెళ్తే పెళ్లి ప్రస్తావన
వచ్చి తీరుతుంది. ఏమీ సాధించకుండా, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎలా
చెప్పడం? అందుకే ప్రయాణం వాయిదా వేస్తూ వచ్చాను, గ్రూప్ వన్ రిజల్ట్స్
వచ్చే వరకూ.
"ఆర్డీవో గారూ.. ఇప్పటికైనా మా ఊరొస్తారా?" అడిగింది గిరిజ. ఆ
వారంలోనే వెళ్లాం వాళ్ళ ఊరికి. నిజానికి ఊరు కాదది, గూడెం. అడివి మధ్యలో
ఉన్న కొన్ని ఇళ్ళ సముదాయంలో అన్నింటికన్నా పెద్దగా, ఎత్తుగా ఉన్న ఇల్లు.
వాళ్ళ నాన్న ఆ గూడేనికి పెద్ద. గూడెంలో మిగిలిన వాళ్ళతో పోలిస్తే గిరిజ
తల్లిదండ్రులు నాగరికంగానే ఉన్నారనిపించింది. నన్ను వాళ్ళెవరూ కొత్తగానూ,
వింతగానూ చూడకపోవడం, నా హోదాని గుర్తించకపోవడం మాత్రం గుచ్చుకుంది నాకు.
అడివిని చూడడం అదే మొదటిసారి. బోలెడన్ని వనరులున్నా మార్కెట్ సౌకర్యాలు
లేవు. ఈమాటే అన్నాను గిరిజతో. నన్నోసారి చూసి ఊరుకుంది. ఇన్నేళ్ళ లోనూ ఆ
గూడేనికి చాలాసార్లే వెళ్లాం మేమిద్దరం. అక్కడికి వెళ్ళినప్పుడల్లా నన్ను
పూర్తిగా మర్చిపోతుంది గిరిజ. వెళ్లకపోయినా గత కొన్నాళ్ళుగా తనకి నామీద
శ్రద్ధ తగ్గుతూ వస్తోంది. కారణాలు నాకు తెలియనివి కావు. ఎప్పుడో తప్ప నా అంచనాలు తప్పవు.
ఉన్నట్టుండి ఠపా ఠపా చినుకులు మొదలవ్వడంతో వెనక కూర్చున్న ముగ్గురూ
ఉలికిపడ్డారు. వైపర్స్ ఆన్ చేశాడు డ్రైవర్. రోడ్డు మీద గతుకులు బాగా
పెరిగాయి. ఉండుండి ఈడ్చి కొడుతోంది కొండగాలి. తప్పనిసరై వేగం తగ్గించాడు
డ్రైవర్. ఏవిటీ రోడ్డు? ఏమైపోతున్నాయి ఫండ్స్ అన్నీ? ప్రశ్నల వెనుకే నవ్వూ
వచ్చింది.
గంటక్రితం చూసిన రంగురంగుల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కళ్ళముందు
మెదిలింది. గిరిజనాభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన
కార్యక్రమాల్లో రోడ్ల నిర్మాణం ఒకటి. మరీ ముఖ్యంగా నక్సల్ ప్రభావిత
ప్రాంతాల్లో రోడ్లని నిర్మించడం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం.
కోట్లాది రూపాయల తాలూకు అంకెలు బుర్రలో గిరగిరా తిరిగాయి. త్వరలో
రీకార్పెటింగ్ చేయబోయే రోడ్ల జాబితాలో ఈ రోడ్డూ ఉంది. పైకి చెప్పే కారణం
గిరిజనాభివృద్ధే అయినా, అసలు కారణం మాత్రం పూర్తిగా వేరే.
"ఐ నో ది రీజన్
మిస్టర్ సారథీ" అంది మధుమతి. పేరుపెట్టి పిలిచేంత చనువు నేనివ్వలేదు, తనే
తీసుకుంది. మధుమతి అనగానే లిప్ స్టిక్ పెదాల మధ్య బిగించిన పెన్సిల్ కొన,
దట్టమైన మస్కారా చాటున మెరిసే పెద్ద కళ్ళూ జ్ఞాపకం వస్తాయి ముందుగా. ఆ
వెనుకే, ఆమెకి మాత్రమే ప్రత్యేకమైన ఓ సువాసన. అచ్చం అడివిపూల వాసన లాంటిదే.
మధుమతి మాటల్లో చెప్పిన విషయాన్నే గిరిజ తన మౌనంతో చెబుతుంది.
గిరిజతో
మాటలు బాగా తగ్గిపోయాయి. నన్ను చూసినప్పుడల్లా మెరిసే ఆ కళ్ళు,
నిర్లిప్తంగా వాలుతున్నాయిప్పుడు. ఏదో జరగబోతోంది మొత్తానికి. ఇప్పుడు
నేనున్న పరిస్థితుల్లో గిరిజని గురించి ఆలోచించడం సాధ్యమేనా అన్న ప్రశ్న
రావడం లేదు. గిరిజ సమస్యలకి లోపలే ఉంది తప్ప బయట కాదనిపిస్తోంది.
ఒక్కసారిగా తల విదిలించి చుట్టూ చూశాను. మబ్బులు మూసేయడంతో చుట్టూ అంధకారం.
వాన హోరున కురుస్తోంది. రేపు సాయంత్రానికి మించి సమస్యని నేను వాయిదా
వేయలేకపోవచ్చు. ఇరవయ్యేళ్ళుగా నిర్మించుకున్న కెరీర్. అదే సమయంలో దృఢ
పరుచుకున్న వైవాహిక జీవితం. రెండూ ప్రమాదపుటంచునే ఉన్నాయి. కూలిపోకుండా
నిలబెట్టుకోగలిగే శక్తి నాకుందా?
మేఘాల్లో పేరుకున్న తడి వర్షంగా
కురుస్తోంది. నాగుండెల్లో తడి బొత్తిగా లేనట్టుంది. ఒక్క కన్నీటి చుక్కా
రానంటోంది. కరువుతీరా ఏడవగలిగే వాళ్ళది యెంత అదృష్టం!
సడెన్ బ్రేకుతో
ఆగింది జీపు. టైర్ పంక్చర్ అయ్యింది. జీపు దిగిన డ్రైవర్ కొంచం ఆందోళనగా
చెప్పాడు "దారి తప్పినట్టున్నాం సార్.." గన్ మ్యాన్ ఏజెన్సీ కుర్రాడే.
చుట్టూ చూసి, మరీ లోపలికి వెళ్లిపోలేదని చెప్పాడు. దూరంగా దీపం మినుకు
మినుకుమంటోంది. బంట్రోతు గొడుగేసుకుని అటువైపు వెళ్ళాడు.
డ్రైవర్, గన్
మ్యాన్ చెట్టుకింద నిలబడ్డారు. క్యాంప్ క్లర్క్ గొంతు విప్పాడు. "తమరు
మీటింగులో ఉండగా తాసీల్దార్ ఆచార్లు రెండు సార్లు ఫోన్ చేశారండయ్యా.
అర్జెంటుగా మాట్లాడాలన్నారు తవరితో.." ఏం జరగబోతోందో ఆచార్లుకి స్పష్టంగా
అర్ధమయ్యిందన్నమాట! "సీఎస్ గారి విషయం గుర్తుచెయ్యమన్నారు తవరు.." అతనే
చెప్పాడు మళ్ళీ. చీఫ్ సెక్రటరీతో మాట్లాడాల్సి ఉందని బాగా గుర్తే నాకు.
దూరంగా ఉన్న ఇంట్లో కూర్చోడానికి వీలుగా ఉందని బంట్రోతు కబురు తెచ్చాడు.
అతను పట్టిన గొడుగులో నేను, నా వెనుకే తడుస్తూ క్యాంప్ క్లర్క్ ఆ ఇంటివైపు
బయలుదేరాం. టైరు మార్చడంలో డ్రైవరుకి సాయంగా గన్ మ్యాన్ జీపు దగ్గరే
ఉండిపోయాడు. గాలీ, వానా మమ్మల్ని ఎంతగా చిరాకు పెట్టాయంటే, అది
నక్సల్-ప్రోన్ ఏరియా అన్న విషయం ఆ క్షణంలో మాకెవరికీ గుర్తు రాలేదు. ఏదో
జరగబోతోంది అని మాత్రం నాకు చాలా బలంగా అనిపించింది. సైన్స్ కాదు, సెన్స్ చెప్పింది.
(మరికొంచం దూరం...)
ఐఏఎస్‌ల కిడ్నాప‌్ కథకి ఆధునిక రూపమా?
రిప్లయితొలగించండియధావిధిగా... మీ మార్కు పంచ్‌లు అద్భుత:
మీ కథల్లో ఎక్కువ మార్కులు నేటివిటీకే పడతాయండీ. అడవిపూల వాసనా.. మెత్తని అడుగుల సవ్వడీ కూడా పాఠకులు ఆస్వాదించగలిగేలా ఉంటుంది మీ కథనం.
రిప్లయితొలగించండి@పురాణపండ ఫణి: ఐఏఎస్ కథ అండీ, సమకాలీనం :) ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: అడివిపూల వాసన ఎలా ఉంటుందో వర్ణించలేకపోయానండీ, కుదరలేదు.. ధన్యవాదాలు..