శనివారం, జనవరి 25, 2014

షల్ వి డాన్స్?

'జీవితంలోని ఖాళీలని పూరించేది సాహిత్యం' అన్నారు మానవ హక్కుల కార్యకర్త కె. బాలగోపాల్. ఒక్క సాహిత్యం అని మాత్రమే కాదు, ఏ కళా రూపమైనా తనదైన పాత్రని పోషిస్తుంది ఈ ఖాళీలని పూరించడంలో. నడి వయసు పెద్ద మనిషి జాన్ క్లార్క్ జీవితం ఇందుకు ఓ పెద్ద ఉదాహరణ. తన జీవితంలో పైకి కనిపించని వెలితి ఏదో అనుభవంలోకి రాగానే, దాన్ని పూరించుకోడం కోసం క్లార్క్ ఏం చేశాడు? అతని చర్య తాలూకు పర్యవసానాలు ఏమిటన్నదే పదేళ్ళ క్రితం విడుదలైన రొమాంటిక్ కామెడీ హాలీవుడ్ చిత్రం 'షల్ వి డాన్స్?'

మిరామాక్స్ సంస్థ నిర్మించిన 'షల్ వి డాన్స్?' కి మాతృక ఇదే పేరుతో 1996 లో విడుదలైన జపనీస్ చిత్రం. మాతృక లాగే ఈ హాలీవుడ్ సినిమా కూడా విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇది జాన్ క్లార్క్ (రిచర్డ్ గెరె) అనే ఓ నడివయసు న్యాయవాది కథ. అందమైన భార్య బెవర్లీ (సూజన్ సరండన్), టీనేజ్ కి వచ్చిన కొడుకూ, కూతురూ క్లార్క్ ని ఎంతగానో ప్రేమిస్తారు. ఎలాంటి అరమరికలూ లేని కుటుంబం వాళ్ళది. క్లార్క్, బెవర్లీల మధ్య అయితే చిన్న రహస్యం కూడా లేదు.

రోజులు సంతోషంగా గడుస్తూ ఉండగా, క్లార్క్ కి తను గడుపుతున్న జీవితంలో ఏదో వెలితి కనిపిస్తుంది. అదేమిటో అతనికి పూర్తిగా అర్ధం కాకపోయినా, తనకోసం తను ఏదైనా చేయాలన్నకోరిక రోజురోజుకీ బలపడుతూ ఉంటుంది. ఆఫీసునుంచి లోకల్ ట్రైన్లో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఒకరోజు యధాలాపంగా బయటికి చూస్తూ ఉండగా, చికాగో లో రహదారి పక్కనే ఉన్న ఓ డాన్స్ స్టూడియో బాల్కనీలో నిలబడి దీర్ఘాలోచనలో ఉన్న ఓ అందమైన అమ్మాయి కనిపిస్తుంది. అది మొదలు ప్రతిరోజూ ఆమెని గమనిస్తూ ఉంటాడు, కేవలం కొన్ని క్షణాలు మాత్రమే. అయితేనేం, బెవర్లీ నుంచి అతను దాచిన తొలి రహస్యం ఇది.

రోజులు గడిచే కొద్దీ ఆ అమ్మాయిని గురించి కుతూహలం పెరిగిపోతుంది క్లార్క్ లో. ఒక రోజు ఉండబట్టలేక చికాగో స్టేషన్ లో రైలు దిగి నేరుగా డాన్స్ స్టూడియోకి వెళ్ళిపోతాడు. మిస్ మిట్జీ అనే వృద్ధురాలు నడుపుతున్న ఆ స్టూడియో లో తను రోజూ గమనిస్తున్న అమ్మాయి కనిపిస్తుంది. ఆమె పేరు పౌలీనా (జెన్నిఫర్ లోపెజ్). ఆ స్టూడియో లో ఇన్ స్ట్రక్టర్. కేవలం ఆమెకోసం బాల్ రూం డాన్స్ క్లాసుల్లో చేరిపోతాడు క్లార్క్. ప్రతి బుధవారం ఆఫీసు అవ్వగానే డాన్స్ క్లాస్. కానీ, క్లార్క్ కి క్లాసులు తీసుకునే ఇన్ స్ట్రక్టర్ పౌలీనా కాదు. నిరాశ పడడు క్లార్క్. ఇష్టంగా డాన్స్ నేర్చుకోవడం మొదలు పెడతాడు.


ఎవరినీ దగ్గరికి రానిచ్చే స్వభావం కాదు పౌలీనాది. ఆమె చాలా రిజర్వుడు. క్లార్క్ తో కూడా కేవలం 'హెలో' మాత్రమే.. అది కూడా ముఖం చాలా సీరియస్ గా పెట్టుకుని. అయితేనేం.. ఇటు పౌలీనా, అటు డాన్స్, ఈ రెండూ క్లార్క్ లో పేరుకుంటున్న స్థబ్దతని కరిగించడం మొదలు పెడతాయి. తనలో పెరుగుతున్న ఉత్సాహాన్ని అదుపులో పెట్టుకోవాలన్న స్పృహ కూడా కలగదు క్లార్క్ కి. అతనిలో వచ్చిన మార్పుని మొదట గమనించింది బెవర్లీ. కూతురు కూడా తల్లి ఆలోచనతో ఏకీభవిస్తుంది. ఆలస్యం చేయకుండా ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ని సంప్రదిస్తుంది బెవర్లీ.

డాన్స్ స్టూడియో లో జరిగిన కొన్ని సంఘటనలు పౌలీనా ని క్లార్క్ కి దగ్గర చేస్తాయి. ఎవరితోనూ పంచుకోడానికి ఇష్టపడని తన గతాన్ని, తన లక్ష్యాన్ని క్లార్క్ తో పంచుకుంటుంది పౌలీనా. భర్తని అనుమానించాలా, వద్దా? అన్న సందిగ్ధం లో ఉన్న బెవర్లీ కి డిటెక్టివ్ ఇచ్ఛిన రిపోర్టు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. తన భర్త డాన్స్ క్లాసులకి వెళ్తున్నాడు తప్ప, మరో మహిళతో గడపడం లేదని తెలియడం ఆమెకి ఉపశమనం ఇచ్చినా, డాన్స్ విషయాన్ని తన దగ్గర దాచడం ఎందుకో మింగుడు పడదు బెవర్లీకి. మరోపక్క, ప్రతిష్ఠాత్మకంగా జరిగే డాన్స్ పోటీల్లో పాల్గొన వలసిందిగా క్లార్క్ ని ప్రోత్సహిస్తుంది పౌలీనా.

క్లార్క్ ఆ పోటీలో పాల్గొన్నాడా? పౌలీనా తో అతని స్నేహం ఎంత దూరం వెళ్ళింది? క్లార్క్ నుంచి పౌలీనా ఏం నేర్చుకుంది? వాళ్ళ సాన్నిహిత్యం ప్రభావం క్లార్క్-బెవర్లీల సంసార జీవితం మీద ఏమేరకు పడింది? ఈ ప్రశ్నలకి జవాబిస్తూ ముగుస్తుంది 106 నిమిషాల నిడివి ఉన్న 'షల్ వి డాన్స్?' మసయుకి సుయో, ఆడ్రే వెల్స్ సమకూర్చిన కథని అందంగా తెరకెక్కించారు దర్శకుడు పీటర్ చెల్సామ్. సరదాగా సాగిపోతూనే, ఆలోచనల్లోకి నెట్టేసే సినిమా ఇది. మొదటగా ఆకర్షించేది పౌలీనా గా నటించిన జెన్నిఫర్ లోపెజ్. ఎక్కడా ఆమె నటించినట్టుగా అనిపించదు. వెంటనే చెప్పుకోవలసింది క్లార్క్ గా నటించిన రిచర్డ్ గెరె. ఎమోషన్స్ ని ఎంత బాగా పలికించాడో, అంతబాగానూ డాన్స్ చేశాడు. బెవర్లీ పాత్ర పోషించిన సూజన్ ఎంత నచ్చేసిందంటే, ఆమె సినిమాలు ఇంకా ఏమేం ఉన్నాయా అని వెతికేంత.

కొన్ని హాస్య సన్నివేశాలు కృతకంగా అనిపించినా, సెంటిమెంట్ సీన్స్ చాలా బాగా పండాయి. క్లార్క్ ఆలోచనల్లో వచ్చే మార్పులు, భర్త గురించి బెవర్లీ కి కలిగే సందేహాలు, ఆమె సంఘర్షణ, పౌలీనా పాత్ర చిత్రణ.. ఇవన్నీ ఈ సినిమాని గుర్తు పెట్టుకునేలా చేస్తాయి. జాన్ ఆల్ట్మాన్, గేబ్రియల్ యారెడ్ ల సౌండ్ ట్రాక్ గురించి ప్రస్తావించకపోతే ఎలా? సంగీతం కథలో భాగంగా కలిసిపోయింది. సరదాగా సాగిపోయే సీరియస్ సినిమా ఇది. అటు కామెడీలు ఇష్టపడేవారు, ఇటు సీరియస్ సినిమాలని మెచ్చేవారిని కూడా అలరిస్తుంది. మళ్ళీ బాలగోపాల్ మాటలు గుర్తు చేసుకుంటే, ఖాళీలని పూరించుకునే కళారూపాల జాబితాలోకి సినిమా కూడా చేరుతుంది, నిరభ్యంతరంగా.

3 కామెంట్‌లు:

  1. Wow! నా ఫేవరెట్ మూవీ! ఎలా మిస్ అయ్యానీ పోస్ట్? నాకు Bobby కూడా చాలా నచ్చుతుందండీ. :) ఇక రిచర్డ్ గెరె గురించి చెప్పేదేముంది! ప్రతీ డైలాగ్, సీన్ ఎంజాయ్ చేస్తూ చూస్తాను.

    'జీవితంలోని ఖాళీలని పూరించేది సాహిత్యం' అన్నారు మానవ హక్కుల కార్యకర్త కె. బాలగోపాల్. ఒక్క సాహిత్యం అని మాత్రమే కాదు, ఏ కళా రూపమైనా తనదైన పాత్రని పోషిస్తుంది ఈ ఖాళీలని పూరించడంలో.

    చక్కని ప్రారంభవాక్యం!

    రిప్లయితొలగించండి
  2. మేఘసందేశం లోని మెయిన్ కాన్సెప్ట్ కీ దీనికీ ఏం తేడా అంటారు?

    రిప్లయితొలగించండి
  3. @కొత్తావకాయ: అవునండీ.. సరదాగా మొదలయ్యి కథలో సీరియస్ మలుపుకి కారణం అయ్యే పాత్ర!! ..ధన్యవాదాలు
    @లక్ష్మీదేవి: 'మేఘసందేశం' లో కాన్సెప్ట్ intellectual companionship కదండీ.. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టం కలిగింది. ఇక్కడ, ఆమె లక్ష్యం వేరు.. అతన్ని మొదట అనుమానంగా చూసి, తర్వాత స్నేహితుడిగా (మాత్రమే) దగ్గరికి రానిచ్చింది.. ...ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి