సోమవారం, జనవరి 06, 2014

ఉదయ్ కిరణం ...

సినిమా పరిశ్రమ అంత చిత్రమైన పరిశ్రమ మరొకటి ఉండదేమో.. అప్పటివరకూ ప్రపంచానికి తెలియని ఓ అనామకుడిని ఒక్క రాత్రిలోనే సూపర్ స్టార్ ని చేసేస్తుంది. కలలో కూడా ఊహించనంత పేరునీ, డబ్బునీ పాదాల ముందు ఉంచుతుంది. ఇరవయ్యేళ్ళ కుర్రాడు ఉదయ్ కిరణ్ ఇందుకు సాక్ష్యం.. ఇది పదమూడేళ్ళ క్రితం మాట. ఓ మామూలు మధ్య తరగతి కుర్రాడు.. ఆటోల్లో తిరగడం అతనికి లగ్జరీ.. సిటీ బస్సుల్లో తిరిగే కుర్రాడి కోసం సినిమా కంపెనీ అంబాసిడర్ కారు వచ్చి ఇంటి ముందు నిలబడ్డం ఉదయ్ జీవితంలో మొదటి మలుపు.

బూతుని దట్టించి నీతి ముసుగు తొడగడం వల్లో, అప్పటివరకూ వచ్చి పడుతున్న పరమ రొటీన్ సినిమాల కన్నా భిన్నం గా ఉండడం వల్లో.. మొత్తానికి జనం బ్రహ్మరథం పట్టారు ఆ సినిమాకి. గల్లీ కుర్రాడు వాల్ పోస్టర్ల మీదా, టీవీ చానళ్ళ లోనూ సందడి చేయడం మొదలుపెట్టాడు. మధ్యతరగతి జీవితంలో పెద్దగా మార్పు లేదు కానీ, సినిమానే తన కెరీర్ అన్న భావన మాత్రం స్థిరపడింది. రెండో సినిమా బ్రహ్మాండమైన హిట్.. అవకాశాలు వెల్లువెత్తడం మొదలయ్యింది.

ఇక మూడో సినిమా అయితే, సినిమా పరిశ్రమ ఆశ్చర్యపోయే అంతటి విజయం సాధించింది. క్లీన్ సినిమా అవ్వడంతో కుర్రాడిని ఒక్క యువతకి మాత్రమే కాక, వాళ్ళ కుటుంబాలకీ చేరువ చేసింది. ఉత్తరాది ప్రముఖ కథానాయకుడితో పోల్చి కథనాలు రాశాయి పత్రికలు. అప్పటికి అగ్రశ్రేణి కథానాయకుడిగా వెలుగుతున్న ఇప్పటి రాజకీయ నాయకుడు ఒకరు ఉదయ్ ని తన అల్లుడిగా చేసుకుంటానని ప్రకటించి, పనిలో పనిగా తనకి 'కులం' లాంటి సంకుచిత భావాలు ఏమాత్రం లేవని కూడా వాక్రుచ్చారు.


ఉదయ్ హోదా అంతా ఇంతా పెరగలేదు.. మూడు వరస హిట్లు, అత్యంత ప్రముఖ కథానాయకుడికి కాబోయే అల్లుడు.. తను సమకూర్చుకున్న ఇల్లు, కారు.. తన ఖాతాలో ఉన్న విజయాలు. చేతిలో ఉన్న అవకాశాలు.. అప్పటికి తన వయసు ఎంతనీ? పట్టుమని ఇరవై మూడేళ్ళు. ఓ మధ్య తరగతి కుర్రాడిని ఉక్కిరిబిక్కిరి చేసేసే మార్పు. తట్టుకోడం ఏమంత సులభం కాదు. అందులోనూ, ఓ సున్నిత మనస్కుడికి.

తెరవెనుక కారణాలు ఏమైనప్పటికీ, పెద్ద హీరోగారి అమ్మాయితో జరిగిన నిశ్చితార్ధం రద్దయ్యింది. చేసిన సినిమాలు పరాజయం పాలయ్యాయి. చేతిలో ఉన్నాయనుకున్న సినిమాలు వెనక్కి వెళ్ళిపోయాయి. సినిమా పరిశ్రమ ఎంత చిత్రమైనది కాకపొతే, ఓ అనామకుణ్ణి అగ్ర కథానాయకుడిగా చేస్తుంది? ఎంత విచిత్రమైనది కాకపొతే ముచ్చటగా మూడేళ్ళు తిరిగేలోగానే అతన్ని సమస్యల సుడిగుండంలో తోసేసి కీర్తినీ, డబ్బునీ వెనక్కి లాగేసుకుంటుంది?? 

సంకల్ప బలం కావొచ్చు, అదృష్టం కావొచ్చు, ఎడతెగని కృషి కావొచ్చు.. ఢక్కా మక్కీలు తినాల్సిన వయసులో పూలు పరిచిన జీవితం స్వాగతం పలికింది. కొత్త జీవితానికి పూర్తిగా అలవాటు పడ్డాక, స్థిత ప్రజ్ఞత అలవర్చుకోక తప్పని పరిస్థితుల్లోకి నెట్టేసింది.. దీనికి విధి అనో, మరొకటనో పేరు పెట్టుకోవచ్చు. దురదృష్టం.. తన వాళ్ళు వెనక ఉండి ధైర్యం చెప్పాల్సిన సమయంలో, కన్నతల్లి అకాల మరణం.. కుటుంబ పరమైన ఇబ్బందులు.. తనకంటూ ఎవరూ లేరన్న అభద్రత. జీవితంతో పోరాటం.. కెరీర్ కోసం పోరాటం.. మనుగడ కోసం పోరాటం..

ఒక్కసారిగా వచ్చి పడిపోయే విజయాన్ని తట్టుకోడానికి, తట్టుకుని నిలబడడానికి ఎంత శక్తి అవసరమో చెబుతుంది ఉదయ్ జీవితం. అభద్రత అనేది మనిషిని ఎక్కడి వరకూ తీసుకు వెళ్ళగలదో నిరూపిస్తుంది. పరిస్థితులని ఎదుర్కోగలిగే మానసిక ధృడత్వం ఎంత అవసరమో చెప్పకనే చెబుతుంది. సినిమా పరిశ్రమ ఆటుపోట్లని తట్టుకోలేక తమ జీవితాలకి మరణ శాసనం రాసుకున్న వాళ్ళు, పరాజయాలతో పోరాడలేక అస్త్ర సన్యాసం చేసేవాళ్ళు ప్రపంచానికి చెప్పేది ఒక్కటే.. బతకడానికి కావాల్సిన వాటిలో కాస్తంత 'స్థిత ప్రజ్ఞత' ని కూడా చేర్చుకోమని...

....నువ్విలా చేసి ఉండకూడదు ఉదయ్...

14 కామెంట్‌లు:

  1. చక్కటి మాటలు చెప్పారు...ముక్యంగా తళుకు బెళుకుల తారా ప్రపంచంలో జీవించటానికి కావాల్సింది స్థిత ప్రజ్ఞతే ...ఎన్నో వచ్చి పోతుంటాయ్...మంచి జరిగినా చెడు జరిగినా ఒకేలా స్వీకరించి, పొంగిపోకుండా కృంగిపోకుండా ఉండగలిగినప్పుడే ఆనందంగా జీవించగలరు...ఉదయ్ కిరణ్ ఇలా చేయటం చాలా విషాదం...సినిమా ప్రపంచం లో కొత్తగా వస్తున్న కుర్రాళ్ళను చూస్తే జాలి వేస్తుంది..రాజకీయాల తర్వాత అత్యంత పోటీ గల ప్రపంచం అది...ఫెయిల్యూర్లను తట్టుకుని నిలబడటం సామాన్యమైన విషయం కాదు...అవకాసమ్ రాగానే పరిశ్రమలోనికి వచ్చేస్తున్నారు...తర్వాతి భవిష్యత్కు సమ్బందించి ఎలాంటి ఆలోచనా చేయడం లేదు...ఇక్కడ టాలెంట్ ను చూసి అవకాశాలిచ్చేంత మహానుభావులు లేరు అన్నది గుర్తుంచుకోవాలి...

    రిప్లయితొలగించండి
  2. కరెక్ట్ గా రాసారండి. చిన్న వయసులోనే పెద్ద సంపాదన, కీర్తి మనిషిని ఎక్కడికైనా తీసుకు వెళ్తుంది. దాన్ని హటాత్తుగా పోగొట్టుకోవాల్సి వస్తే, తట్టుకునే మానసిక శక్తి ఉండదు. తెరపై ఎన్నో సాధించే హీరో హీరోయిన్లు, నిజ జీవితం లో ఇంత బలహీనులుగా మిగిలిపోవడం, విషాదమే. తెలుగు ప్రేక్షకులు ఉదయ్ ని ఎప్పటికీ మరచిపోరేమో.

    రిప్లయితొలగించండి
  3. 'పరిస్థితులని మానసిక ధృడత్వం ఎంత అవసరమో చెప్పకనే చెబుతుంది. సినిమా పరిశ్రమ ఆటుపోట్లని తట్టుకోలేక తమ జీవితాలకి మరణ శాసనం రాసుకున్న వాళ్ళు, పరాజయాలతో పోరాడలేక అస్త్ర సన్యాసం చేసేవాళ్ళు ప్రపంచానికి చెప్పేది ఒక్కటే.. బతకడానికి కావాల్సిన వాటిలో కాస్తంత 'స్థిత ప్రజ్ఞత' ని కూడా చేర్చుకోమని...

    ....నువ్విలా చేసి ఉండకూడదు ఉదయ్...'

    ఈ చివరి మాటలు ఎందుకో మింగుడుపడటం లేదండీ నాకు. ఆత్మహత్యలను సమర్థించడం నా ఉద్దేశం కాదు. కానీ ఆ స్థితికి చేరుకోవడానికి ఎంత extreme depression and stress అనుభవించాల్సి వస్తుందో నేను స్వయంగా చూశాను. అలాంటప్పుడు వారికెవరూ మాట సహాయం కూడా చేయరు. మనిషి దిగజారిపోయే కొద్దీ మాటలతో గుచ్చి గుచ్చి వేధిస్తుంటారు. చనిపోయాక సానుభూతి ప్రకటిస్తారు. అదే బ్రతికున్నప్పుడు చేస్తే ఏ వ్యక్తీ ఆత్మహత్య చేసుకోడని నా నమ్మకం. 'నేను ఊబిలో దిగితే చేయందించడానికి ఒకడున్నాడ'నే నమ్మకం ఉంటే ప్రాణం మీద తీపి ఉన్నవాడెవడూ చావడని అనుకుంటున్నాను. ప్రతి ఆత్మహత్య వెనుక చాలా మంది నేరస్థులు ఉంటారని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  4. ప్చ్....నువ్విలా చేసి ఉండకూడదు ఉదయ్...

    రిప్లయితొలగించండి


  5. ' చెలిమియె కరువై... చీకటి మూగిన ఏకాంతములో ....నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన..'అని మహాకవి శ్రీశ్రీ రాసిన పదాలు నిజమనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  6. 'స్థిత ప్రజ్ఞత' అంత తేలికగా అలవడే విషయం కాదనుకుంటాను. అలా అలవడితే ఈ ప్రపంచం ఎంతో అందంగా ఉండేది అందరికీ.

    అన్నట్టు, నిన్న ఒక టివి చానల్ లో శ్రీ శ్రీ జొన్నవిత్తుల వారు సెలవిచ్చారు, బ్రహ్మజ్ఞాని, తత్వవేత్త, మహా బలవంతుడు, శౌర్యవంతుడు హనుమంతుల వారు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారుట, లంకలో ఎంత వెతికినా సీతాదేవి కనపడనప్పుడు.

    రిప్లయితొలగించండి
  7. @kvsv: ధన్యవాదాలండీ..
    @వీరయ్య: ధన్యవాదాలండీ..
    @శృతి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  8. @రాధిక (నాని): ధన్యవాదాలండీ..
    @విజయ్ భాస్కర్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  9. @చాణక్య: కొంచం వివరంగా చెప్పాలి అనుకుంటున్నానండీ.. మొదటగా, నేను ఒడ్డున నిలబడి మాట్లాడుతున్నాను అనుకోకండి.. తెలుసు నాకా పెయిన్ ఎలా ఉంటుందో. మీరన్న గుచ్చి గుచ్చి వేధించేవాళ్ళు ఉన్నారు చూడండి.. ఒక మనిషి పోయినా, పదిమంది పోయినా వీళ్ళ నైజం ఏమీ మారిపోదు.. పొడవడానికి ఎవరు దొరుకుతారా అని చూస్తూ ఉంటారు.. కాదంటారా? ఇక నా పోస్టు గురించి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తివచ్చి నా పోస్టు చదువుతాడు అంటే, తప్పకుండా సహానుభూతి ప్రకటించవచ్చు.. కానీ, చదివే వాళ్ళలో ఏ ఒక్కరైనా దురదృష్టవ శాత్తూ అలాంటి పరిస్థితుల్లో ఉండి, ప్రాణం తీసుకోవాలి అనుకుంటే.. ఈ సహానుభూతి నుంచి వాళ్లకి ఎలాంటి సంకేతం వెళ్తుంది? "ఈ ప్రపంచంతో నీకేమీ పని లేదు.. ఇన్ని పడ్డావు కాబట్టి ఇక సెలవు తీసుకో" అని చెప్పడమా?? సారీ అండీ, నేను అలా చెయ్యలేను.. నా దృష్టిలో ప్రాణం చాలా విలువైనది, అది నాదైనా, మరొకరిదైనా... మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు...

    రిప్లయితొలగించండి
  10. @పరిమళం: ధన్యవాదాలండీ..
    @కమనీయం: ధన్యవాదాలండీ..
    @బులుసు సుబ్రహ్మణ్యం: అసాధ్యం అయితే కాదు కదండీ... "సాధనమున పనులు..." ...ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి