మంగళవారం, జనవరి 07, 2014

జానకి పాటలు-1

విరహం.. ప్రియమైన వారి ఎడబాటు మిగిల్చే భావన.. ఇష్టమైనది ఎంతమాత్రం కాదు, చాలా కష్టమైనది. ఈ విరహాన్ని గొంతులో పలికించడం అంత సులభం ఏమీ కాదు. ఎందుకంటే, శ్రోతలు ఆ భావనతో మమేకం కావాలి. క్లిష్టమైన ఈ భావనని అలవోకగా తన గొంతులో పలికించిన గాయని ఎస్. జానకి.. జానకి పేరు చెప్పగానే గుర్తొచ్చే పాటల్లో మొదటి వరుసలో ఉండే పాట 'నీలి మేఘాలలో..' ఆరుద్ర రాసిన ఈ పాటని పెండ్యాల నాగేశ్వర రావు స్వరపరిచారు, 'బావామరదళ్ళు' (1960) సినిమా కోసం.

తన పద్దెనిమిదో ఏట సినీ నేపధ్య గాయనిగా కెరీర్ మొదలుపెట్టిన జానకి, ఇరవై రెండో ఏట పాడారు ఈ పాటని.. సన్నగా, తీగలా అనిపించే గొంతు, మెరిసే గమకాలు, వెంటాడే విరహం... ఇవన్నీ ఈ పాటని మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తాయి.. ఒక్క విరహానికి సంబంధించే లెక్కకు మిక్కిలి పాటలు పాడిన జానకి, ఏ రెండు పాటలకీ పోలిక ఉండని విధంగా జాగ్రత్త తీసుకున్నారు.. 'ఎందుకో చేరువై.. దూరమవుతావు..' అన్న దగ్గర జానకి ఎక్స్ ప్రెషన్, మరో గాయని నుంచి ఊహించలేం. మనసుని నీలి మేఘాలలో తేలియాడించే ఈ పాటని ఇక్కడ వినొచ్చు.. ఇదే పాట మేల్ వర్షన్ ని ఘంటసాల ఆలపించారు..

నాదస్వరం.. దక్షిణ భారతదేశంలో పరమ పవిత్రంగా భావించే వాయిద్యం. గుమ్మానికి తోరణం, చెవికి ఇంపుగా సన్నాయి లేనిదే ఏ శుభకార్యమూ పూర్తికాదు.. మరి ఇలాంటి నాదస్వరం ఇతివృత్తంగా సినిమా అంటే అది సంగీత భరిత చిత్రమనే కదా అర్ధం.. నిజజీవిత దంపతులు సావిత్రి, జెమిని గణేశన్ జంటగా 1962 లో ఎమ్వీ రామన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా 'కొంజుం సలంగై.' సావిత్రి వందో సినిమా ఇది. కథానాయకుడు నాదస్వర విద్వాంసుడు. ఓ సందర్భంలో నాయిక గాత్రంతో పోటీగా అతడు నాదస్వరం వాయించాలి.. నాయిక కూడా అతనికి ఏమాత్రం తగ్గకుండా, నాదస్వరానికి పోటీగా తన స్వరం అందించాలి... ఆమె ఆరంభించింది భక్తిగీతం.. భక్తికీ నాదస్వరానికీ అవినాభావ సంబంధం మరి.. గొంతులో భక్తిభావం ఏమాత్రం తగ్గకుండా, సన్నాయితో పోటీ పడుతూ అటు తమిళం లోనూ, ఇటు తెలుగులోనూ పాడగలిగే గాయని కావాలి.

అప్పటికే బాగా పేరు తెచ్చుకున్న గాయనీమణులు ఆ పాట పాడడం తమవల్ల కాదని తేల్చి చెప్పడంతో, . నేపధ్య గాయనిగా అప్పుడప్పుడే కుదురుకుంటున్న ఇరవై మూడేళ్ళ జానకిని వెతుక్కుంటూ వచ్చింది అవకాశం. సినిమాకి సంగీతం అందించిన ఎస్సెం సుబ్బయ్య నాయుడు, నాదస్వరం అందించిన కారుకురుచ్చి అరుణాచలం ఇద్దరూ వారి రంగాల్లో నిష్ణాతులు.. వీరిమధ్య అప్పుడప్పుడే గొంతు విప్పుకుంటున్న జానకి.

'మురిపించే మువ్వలు' పేరుతో తెలుగులోకి డబ్ అయిన సినిమా కోసం ఆరుద్ర రాసిన ఆ పాటని ఇవాల్టి వరకూ కూడా ఇంతకన్నా బాగా పాడడం అసాధ్యం అనిపించే రీతిలో ఆలపించి, తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో గాయనిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది జానకి.. ఐదు నిమిషాల నిడివి ఉండే పాటలో గాయనిగా జానకి విశ్వరూపం కనిపించేది చివరి చరణంలో.. ఇవాల్టికీ టీవీ చానళ్ళలో జరిగే పాటల పోటీల్లో ఎంతటి గాయకులైనా పాడడానికి అంతగా ధైర్యం చెయ్యని -- ఎవరన్నా పాడుతుంటే జడ్జీలు సైతం పూర్తి అప్రమత్తతతో వినే -- ఆ పాటే 'నీ లీల పాడెద దేవా...'


పాండవ మధ్యముడు పరాక్రమ వంతుడు మాత్రమే కాదు, అందగాడు కూడా.. ఆ అందాన్ని చూసి ఒక్క రాచ కన్నెలే కాదు, ముల్లోకాలలోని సుందరీమణులూ మోహంలో మునిగి తేలారు. స్వర్గలోకపు నర్తకి, అపూర్వ సౌందర్యరాశి ఊర్వశి ఇందుకు మినహాయింపు కాదు. ఆ దేవకాంత, మానవమాత్రుడిని మోహించింది సరే.. మరి ప్రకటించడం ఎలాగ? స్వర్గాధిపతి దేవేంద్రుడి ఆహ్వానం అందుకుని ఇంద్రసభకి అతిధిగా వచ్చాడు అర్జునుడు. స్వాగత నృత్యంతో అతిధిని అలరించే బాధ్యతని ఊర్వశి మీదే పెట్టాడు దేవేంద్రుడు.. ఇకనేం.. ఊర్వశికి కావాల్సిందీ అదే.. అర్జునుడి పరాక్రమాన్ని పాటగా అల్లి, తన మెరుపు నృత్యాన్ని జతచేసి, ఎంతో నేర్పుగా తన మనసులో మాటని బయట పెట్టింది.

ఊర్వశిగా నాట్యం చేసిన పద్మినీ ప్రియదర్శిని గురించి ఇక్కడ కొంచం చెప్పుకోవాలి. 'ట్రావెన్కోర్ సిస్టర్స్' గా దేశమంతా పేరుతెచ్చుకున్న భరతనాట్య కళాకారిణులు లలిత, పద్మిని, రాగిణి త్రయంలో ఒకరీమె. (నిన్నటి తరం కథానాయిక, ప్రముఖ భరతనాట్య కళాకారిణి శోభన, ఈ ముగ్గురికీ ముద్దుల మేనకోడలు!!)సరే, ఊర్వశి పాడే పాట ఎలా ఉండాలి? అర్జునుడి పరాక్రమాన్ని మెచ్చుకుంటూనే, అతడిపై తను మరులుగొన్న విషయాన్ని ప్రకటించాల్సిన సందర్భం. 'జావళి' ఛాయలు కనిపించే లలిత శృంగార గీతం. సముద్రాల రచనకి, సుసర్ల దక్షిణామూర్తి సుస్వరాలని అద్దారు. (ఊర్వశి, అర్జునుణ్ణి 'జాణ' అని సంబోధిస్తుంది!).

మరి, ఊర్ధ్వ లోకపు ఊర్వశికి గొంతు ఇచ్చేది ఎవరు? ఇంకెవరు, ఎస్. జానకి. రాజ్యం పిక్చర్స్ నిర్మించిన 'నర్తనశాల' (1963) సినిమాకోసం ఇరవై నాలుగేళ్ల జానకి పాడిన 'నరవరా.. ఓ కురువరా..' పాట, ఆమె ఆల్ టైం హిట్స్ లో ఒకటి.  'అర్జున ఫల్గుణ పార్థ కిరీటి...' దగ్గర పలికే గమకం విని తీరాలి..


(ఇంకా ఉంది)

5 కామెంట్‌లు:

  1. మంచి టాపిక్ ఎంచుకున్నారు.
    జానకి గారి పాటల గురించి చెప్పాలంటే, మీరు కనీసం పది టపాలు వ్రాయాలి.
    ముఖ్యంగా విశ్వనాథ్ గారి సినిమాలలోని పాటల గురించి వివరంగా వ్రాయమని కోరుతున్నాను.

    రిప్లయితొలగించండి
  2. బాగుందండి పోస్ట్ .మీ పోస్ట్ వల్ల తెలియని విషయాలు కొన్ని తెలుసుకున్నా

    రిప్లయితొలగించండి
  3. @బోనగిరి: ఐదు పోస్టుల్లో ముగించానండీ :) ..ధన్యవాదాలు
    @రాధిక (నాని): ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  4. నరవరా కురు వరా అంటూ నృత్యం చేసిన పద్మిని ప్రియదర్శిని , తిరువాన్కూర్ సిస్టర్స్ గా పేరొందిన ముగ్గురు లోని పద్మిని కాదు. గమనించ ప్రార్థన ,

    మీ అభిమాని

    రిప్లయితొలగించండి