మంగళవారం, డిసెంబర్ 24, 2013

నాయికలు-వరూధిని

కంటినిండా కలలు నింపుకుని ప్రపంచాన్ని చూడాల్సిన యవ్వనంలో ఆమె కష్టాలనీ, కన్నీళ్ళనీ చూసింది. ఒకప్పుడు వైభవంగా బతికిన తన కుటుంబం, దారిద్ర్యపు అంచులలో నిలబడడాన్ని చూసింది. తోడబుట్టిన వాళ్ళ స్వార్దాన్నీ, కన్నవాళ్ళ నిస్సహాయతనీ కళ్ళారా చూసింది. మిగిలిన తోబుట్టువుల అందరి పెళ్ళిళ్ళూ అంగరంగ వైభవంగా చేసిన తండ్రి, తన దగ్గరికి వచ్చేసరికి కనీసం అయినింటి సంబంధం వెతకడానికి కూడా తటపటాయించడాన్ని మౌనంగా గమనించింది.. అలాంటి ఆమెకి కూడా ఒక రోజు వచ్చింది.. ఓ కుటుంబాన్ని శాసించగలిగే స్థాయి వచ్చింది.. అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? ఆమె చేతిలో కీలుబొమ్మగా మారిన ఆ కుటుంబం ఏమయ్యింది? ఈ ప్రశ్నలకి జవాబులు వెతుక్కోడానికి ముందు ఆమెని గురించి తెలుసుకోవాలి. ఆమె పేరు వరూధిని.

వ్యవసాయ రంగాన్ని ఇతివృత్తంగా తీసుకుని నాలుగున్నర దశాబ్దాల క్రితం డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రాసిన నవల 'మట్టిమనిషి' లో నాయిక వరూధిని. గుంటూరు జిల్లాలో ఉన్న ఓ పల్లెటూళ్ళో భూస్వామ్య కుటుంబంలో పుట్టింది. తండ్రి బలరామయ్య ఆ ఊరికంతటికీ పెద్దమనిషి. చదువు, ఆటపాటలతోనూ, సినిమాలు, షికార్లతోనూ బాల్యం ఆనందంగా గడిచింది వరూధినికి. యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉండగానే పట్నవాసంతో పూర్తిగా ప్రేమలో పడిపోయింది ఆమె. పరిస్థితులు అనుకూలిస్తే, పట్నంలో ఉన్న ఏ గొప్ప ఇంటికో ఆమె కోడలయి ఉండేది. కానీ, అలా జరగలేదు. వరూధినికి పెళ్లివయసు వచ్చేసరికి ఆ కుటుంబం ఆర్ధిక పరిస్థితి పూర్తిగా తిరగబడి పోయింది. అన్నలు ఆస్తులని మాత్రమే పంచుకుని, ఆమె పెళ్లిని తండ్రి బాధ్యతల్లోకి నెట్టేశారు.

పేరులో మాత్రమే జమీందారీని నిలుపుకున్న బలరామయ్యతో వియ్యమందడానికి జమీందార్లు ఎవరూ సిద్ధంగా లేరు. కాబట్టే, తన కూతుర్ని ఊరుబోయిన వెంకయ్య మనవడు, సాంబయ్య కొడుకు అయిన వెంకటపతి కి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి సిద్ధ పడ్డాడు బలరామయ్య. వెంకయ్య ఆ ఊరికి వ్యవసాయ కూలీగా వచ్చి, బలరామయ్య తండ్రి వీరభద్రయ్య ఇంట పాలేరుగా జీవితం మొదలు పెట్టాడు. నెమ్మదిగా రైతుగా ఎదిగాడు. అతని కొడుకు సాంబయ్య రెక్కల కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఇంచుమించు ఓ వంద ఎకరాల భూమిని కొడుకు వెంకటపతి కి వారసత్వంగా అందించాడు. వెంకటపతికి పెద్ద మొత్తంలో కట్న కానుకలతో పిల్లనిస్తామంటూ ఎన్నో సంబంధాలు వచ్చినా, వాటన్నింటినీ రెండో ఆలోచన లేకుండా తిరగ్గొట్టేశాడు సాంబయ్య. తన తండ్రి పాలేరుగా పనిచేసిన ఇంటినుంచే కోడల్ని తెచ్చుకోవలన్నది సాంబయ్య పట్టుదల.

వెంకటపతి మొరటు మనిషి. చదువూ సంధ్యా లేనివాడు. తాతతండ్రుల బాటలో నేలని మాత్రమే నమ్ముకున్నాడు. పట్నవాసం అంటే ఏమిటో బొత్తిగా తెలియదు అతనికి. ఉండడానికి లంకంత ఇల్లు ఉన్నా, వెంకటపతి పుడుతూనే అతని తల్లి దుర్గమ్మ మరణించడం, సాంబయ్య మరో పెళ్లి చేసుకోకపోవడంతో అది ఆడదిక్కు లేని సంసారం. అలాంటి ఇంట్లో అడుగుపెట్టింది, పట్నవాసపు వాసనలున్న వరూధిని. ఆ ఇంట్లో కోడలిగా తను ఇమిడి పోడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది. తన వల్ల ఎంతమాత్రం కాదని అర్ధం కావడంతో, నెలతప్పగానే కాపురాన్ని బస్తీకి మార్చింది. అప్పటికే వెంకటపతి వరూధిని చేతిలో కీలుబొమ్మ. పెళ్ళికి ముందు వరకూ తండ్రిమాట వేదవాక్కు వెంకటపతికి. అతను తనకంటూ సొంత ఆలోచనలు లేని వాడు కావడంతో, వెంకటపతిని తన దారికి తెచ్చుకోడం పెద్ద కష్టం కాలేదు వరూధినికి.

బస్తీలో, సినిమా హాల్ యజమాని రామనాధ బాబుతో స్నేహం మొదలుపెట్టింది వరూధిని. ఆ స్నేహం, అతని భాగస్వామ్యంతో బస్తీలో కొత్త సినిమా హాల్ కట్టేంత వరకూ వెళ్ళింది. వెంకయ్య, సాంబయ్యల చెమట, బస్తీలో సినిమా హాలుగా రూపాంతరం చెందింది. సాంబయ్య, వెంకటపతి ల మధ్య అంతరం మరింతగా పెరిగింది. మట్టి ఆనుపానులు మాత్రమే తెలిసిన వెంకటపతికి బస్తీలో చేసేందుకు ఏపనీ లేదు. రామనాధ బాబు ప్రోత్సాహంతో తాగుడికి అలవాటు పడ్డాడు. ఇంటి పెత్తనం మొత్తం వరూధినిదే అయ్యింది. రామనాధ బాబుతో ఆమె స్నేహం చాలా దూరమే వెళ్ళింది. వయసు మీద పడ్డ సాంబయ్య పల్లెటూరికే పరిమితం అయిపోయాడు. వెంకటపతిది కేవలం వరూధిని భర్త హోదా మాత్రమే. అటు వ్యాపార వ్యవహారాల్లోనూ, ఇటు ఇంటి విషయాల్లోనూ నిర్ణయాలు రామనాధ బాబువే. అలాంటి రామనాధ బాబు, తనకి దూరం అవుతున్నాడు అని తెలిసినప్పుడు వరూధిని ఏం చేసింది?

'రెండు తరాల మధ్య అందమైన వారధి స్త్రీమూర్తి' అంటారు గొల్లపూడి మారుతిరావు తన 'సాయంకాలమైంది' నవలలో. వరూధిని, మట్టిమనిషి సాంబయ్యకి, అతని మనవడు రవి కి మధ్య వారధిగా నిలబడింది. అటు సాంబయ్య ని, ఇటు వెంకటపతిని వాళ్ళు నమ్ముకున్న మట్టికి దూరం చేసింది. "ఎందుకు?" అన్న ప్రశ్న ఎప్పుడూ రాదు, 'మట్టిమనిషి' చదువుతూ ఉంటే. ఎందుకంటే, వరూధినికి ఆ క్షణంలో తనకి అనిపించింది చేయడం తప్ప దీర్ఘ కాలికమైన ప్రణాళికలు అంటూ లేవు. తనకి నచ్చినట్టు జీవించడానికే ఆమె వోటు. తనని కట్టుకున్నవాడి మీద జాలి, తను కన్నవాడి పట్ల బాధ్యత ఇవి మాత్రమే ఆమె దగ్గర ఉన్నవి. అందుకే, తను నమ్ముకున్న వాడు తనని నిలువుగా ముంచేయడానికి సిద్ధపడినప్పుడు, ఆమె మొదట ఆగ్రహించింది, అటుపై ప్రతీకారానికి సిద్ధపడింది.. కానీ, అతనిమీద ఆమెకి ఉన్న ప్రేమదే పైచేయి అయ్యింది.. 'మట్టిమనిషి' చదువుతూ ఉంటే, వరూధిని నాయికా? లేక ప్రతినాయికా? అన్న సందేహం చాలాసార్లే కలుగుతుంది.. వరూధిని కోణం నుంచి చూసినప్పుడు, ఆమె నాయికే..

ఆదివారం, డిసెంబర్ 08, 2013

ధర్మవరపు ...

పది పన్నెండేళ్ళ క్రితం సంగతి.. అప్పటికి వరకూ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంటే దూరదర్శన్ లో చూసిన 'ఆనందో బ్రహ్మ,' సినిమాల్లో చిన్న చిన్న వేషాలు.. తేజ తీసిన 'నువ్వు-నేను' సినిమా హిట్ అవ్వడంతో అందులో లెక్చరర్ వేషం వేసిన ధర్మవరపు హాస్యనటుడిగా బాగా బిజీగా మారిన సమయం అది. యూత్ సినిమాల్లో లెక్చరర్లని మరీ బఫూన్లు గా చూపిస్తున్నారన్న విమర్శ మొదలైంది కూడా అప్పుడే.. సరిగ్గా ఆసమయంలో ధర్మవరపు తో ప్రత్యక్ష పరిచయం. మొదటి సమావేశంలోనే ఓ ఆత్మీయ వాతావరణం ఏర్పడింది అనడం కన్నా, ధర్మవరపు ఏర్పరిచారు అనడం సబబు.

కొన్ని నెలల పాటు మరీ తరచుగా కాకపోయినా అప్పుడప్పుడూ కలిసే వాళ్ళం. సినిమా విషయాలు అని మాత్రమే కాదు, సమస్త విషయాలూ కబుర్లలో అలవోకగా దొర్లిపోయేవి. ఎంత అలసటగా ఉన్నా సరే, కబుర్లు మొదలు పెట్టారంటే నవ్వులు పూసేవి. ప్రాసకోసం పాకులాట అవసరం లేదు, మామూలు మాటనే కాస్త విరిచి పలికితే చాలు అప్రయత్నంగానే నవ్వొచ్చేస్తుంది, తెరమీదే కాదు, తెరవెనుక కూదా ధర్మవరపు తీరు అదే. పేరు, అవకాశాలు ఒకేసారి చుట్టుముట్టినా ఆ ప్రభావం మనిషి మీద పడినట్టుగా అనిపించలేదు.

ఒంగోలు అన్నా, శర్మ కాలేజీ అన్నా, మిత్రుడు టి. కృష్ణ అన్నా తగని అభిమానం ధర్మవరపుకి. ఈ మూడు విషయాలూ తప్పకుండా తలపుకి వచ్చేవి, ఎంత చిన్న సమావేశం అయినా. వామపక్ష భావజాలం అంటే గౌరవం తనకి. ప్రజా నాట్యమండలి తో అనుబంధం ఉంది కూడా. పాత సినిమాలు విపరీతంగా చూసే అలవాటు, ఎవరినైనా ఇట్టే అనుకరించేసే టాలెంటు వృత్తిలో తనకి ఎంతగానో ఉపయోగ పడ్డాయి. రోజులు గడుస్తూ ఉండగానే, ఇక ధర్మవరపు ని రెగ్యులర్ గా కలవాల్సిన అవసరం లేని రోజు ఒకటి వచ్చేసింది. ఆ విషయం చెప్పగానే తన స్పందన "వచ్చే ఆదివారం మనం కలిసి భోజనం చేస్తున్నాం... మా ఇంట్లో."


చాలా పనులు, షూటింగులు.. తనకి గుర్తుంటుందా, వీలవుతుందా అనుకున్నా.. ఆ విషయం మర్చిపోయాను.. శనివారం ఫోన్ వచ్చింది.. "వచ్చేస్తారా? వచ్చి పికప్ చేసుకోనా?" ఆశ్చర్యం అనిపించింది, "డ్రైవర్ ని పంపనా?" అనకుండా "వచ్చి పికప్ చేసుకోనా?" అన్నందుకు.. నేనే వస్తానని చెప్పి అడ్రస్ తీసుకున్నాను. ఓ వెలుగు వెలుగుతున్న హాస్యనటుడి ఇల్లు అంటే ఎంత హంగామా ఉంటుందని ఊహించుకోవచ్చో అంతా ఊహించుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టాను. ఉహు, మామూలు మధ్యతరగతి ఇల్లు.. లుంగీ, లాల్చీతో సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న ధర్మవరపు. పెద్దబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు.. చిన్నవాడు స్కూలింగ్.

"సభకి నమస్కారం" అన్నాను, 'తోకలేనిపిట్ట' సినిమాలో జయలలిత ని అనుకరిస్తూ. ధర్మవరపు దర్శకత్వం, సంగీతం అందించిన సినిమా అది. పెద్దగా ఆడలేదు. కాసేపు సరదా కబుర్లు అయ్యాయి. చిన్నబ్బాయి తో కబుర్లు చెబుదామంటే, ఆ పిల్లవాడు నోరు విప్పడంలేదు. "పలుకే బంగారమా?" అన్నానో లేదో, "అబ్బే అదేమీ లేదు.. ఇందాకే వాడికి పన్నూడింది.. ఆ అవమాన భారంతో కుంగిపోతున్నాడు" అన్నారు ధర్మవరపు. హాల్లో ఎక్కడా షీల్డులు, సినిమా వాళ్ళతో ఫోటోలు కనిపించలేదు. కబుర్లు అవుతూ ఉండగానే భోజనానికి పిలుపు వచ్చింది.ఆవిడే స్వయంగా వడ్డించారు.. నేను ఆశ్చర్యంగా చూస్తుండగా "వంటకూడా ఆవిడే.. మా ఇంట్లో వంటవాళ్లు, పనివాళ్ళు ఉండరు" అన్నారు ధర్మవరపు.

ఆవిడ మితభాషి.. కానీ, తినేవాళ్ల ఆకలి గుర్తెరిగి వడ్డించే (నేను చూసిన) అతి తక్కువ మంది ఇల్లాళ్ళ లో ఒకరు. భోజనం అవుతూ ఉండగానే నేను ఏమాత్రం ఊహించని ప్రశ్న వచ్చింది ధర్మవరపు నుంచి. "ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన వేషం ఏది?" జవాబు చెప్పడానికి ఆలోచించలేదు ఏమాత్రం. "స్వాతికిరణం లో మంజునాథ్ తండ్రి పాత్ర.. హోటల్ నడుపుకునే బాబాయ్.." తన మోహంలో కనిపించిన వెలుగు ఇప్పటికీ గుర్తుంది నాకు. "మహానుభావుడు విశ్వనాధ్ గారు.. ఆయనే చేయించుకున్నారు.. ఏమీ అనుకోనంటే ఓ మాట.. మీతో కలిసి భోజనం చేయడం ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది నాకు.." నేనేమీ మాట్లాడలేదు.

పెద్దబ్బాయి నాతోపాటు బయటికి వచ్చాడు. నవతరం వారసులు రాజ్యం ఏలడం మొదలుపెట్టిన కాలం కదా.. సహజంగానే "మీరెప్పుడు హీరో అవుతున్నారు?" అని అడిగాను నవ్వుతూ.. ఎటూ పాస్పోర్ట్ ఉందికదా అని.. "నేను రోజూ అద్దంలో చూసుకుంటానండీ" అని నవ్వేసి "లేదండీ..నాకు ఇంట్రస్ట్ లేదు.. చదువయ్యాక ఉద్యోగం.. లేదంటే బిజినెస్ అంతే.." ఆ తర్వాత చాలా ఏళ్ళ తర్వాత రెండు వేర్వేరు సందర్భాలలో అనుకోకుండా ధర్మవరపు ని కలవడం తటస్తించింది. రెండుసార్లూ కూడా తనే వచ్చి పలకరించడం మాత్రం ఎప్పటికీ ఆశ్చర్యమే నాకు. ఉదయం పేపర్లో 'ధర్మవరపు ఇక లేరు' అన్న వార్త చూసినప్పటి నుంచీ ఏపని చేస్తున్నా ఇవే జ్ఞాపకాలు.. దింపుకో గలిగే బరువు కాదు కదూ ఇది.. ధర్మవరపు కి నివాళి..

గురువారం, నవంబర్ 14, 2013

పెసరాయ్...

'పెసరట్లు పలు విధములు...' అంటూ టపా మొదలు పెడితే జరిగేవి రెండు.. మొదటిది, చదివే వారి ముఖంలో చిరునవ్వైతే, రెండోది వారి నోట్లో ఊరే లాలాజలం. 'ఏమని పాడుదునో ఈ వేళా...' అని మధురగాయని పి. సుశీల తన కెరీర్ తొలినాళ్ళలో పాడినట్టుగా, ఏమని చెప్పుదునో పెసరట్టు గురించీ అనుకున్నా కానీ, ఇలా టపా మొదలు పెడుతూనే ఎన్నో కబుర్లు మేమున్నాం అంటూ గుర్తొచ్చేస్తున్నాయి. షాపు నుంచి తెచ్చుకున్న పెసల్లో రాళ్ళూ, రప్పలూ ఏరుకుని, ఓ సారి కడిగేసి, అటుపై నీళ్ళలో నానబోసేసి.. బాగా నానాక ఓ చిన్న అల్లంముక్క జతచేసి జారుగా పిండి రుబ్బి పక్కన పెట్టేసుకుంటే పెసరట్టు మహాయజ్ఞం లో మొదటి అంకం పూర్తయినట్టే.

పెసరట్టు అంటూ అనుకున్నాక, కేవలం సాదా పెసరట్టుతో సరిపెట్టుకునే ప్రాణాలు కావు కదా మనవి.. అందుకన్జెప్పన్జెప్పేసి ఉల్లి పాయలు, అల్లం, పచ్చి మిర్చీ సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకుంటాం. సరిగ్గా ఇదే సమయంలో 'ఆ చేత్తోనే కాస్త ఉప్మా కలియబెట్టెయ్య రాదూ' అని ఆత్మారాముడో, సీతో వినీ వినిపించనట్టు మూలుగుతారు. 'అదెంత పని కనుకా' అనిపించి తీరుతుంది. పావుగంటలో ఉప్మా రెడీ అవ్వనే అవుతుంది. పెనం పొయ్యి మీదకి ఎక్కించి, బాగా వేడెక్కనిచ్చి కాసిన్ని నీళ్ళు జల్లి చూసుకుని, వేడి సరిపోతుంది అనిపించగానే ఉప్పు కలిపిన పెసరపిండితో అట్టు పోసేసి, అటుపై కొంచం జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లి, పచ్చి మిర్చి ముక్కలూ ఒకదాని తర్వాత ఒకటో, అన్నీ కలిపేసో మన ఓపికని బట్టి జల్లేస్తాం కదా.. ఇక్కడితో రెండో అంకం పరిసమాప్తం.

సగం కాలిన అట్టు చుట్టూనూ, మధ్యలోనూ నెయ్యో నూనో చల్లేసి, అట్టు సుతలు పైకి లేస్తున్నాయనగా ఓ గరిటెడు ఉప్మా అట్టు మధ్యలో పెట్టేసి, మన చెయ్యి తిరగడాన్ని బట్టి రెండు మడతలో, మూడు మడతలో వేసేసి అల్లప్పచ్చడి, కొబ్బరి పచ్చడి ఉన్న ప్లేట్లోకి బదలాయించేశామంటే పెసరట్టు వంటకం పూర్తైపోయినట్టే. పెనం, పిండీ సిద్ధంగా ఉన్నాయి.. మొదటి అట్టు వాసన ముక్కుకి తగలడంతోనే కనీసం నాలుగైదు అట్లన్నా కావాల్సిందే అని కడుపు ఆదేశాలు జారీ చేసేస్తుంది.. కాబట్టి అట్టు వెనుక అట్టు.. అట్టు పై అట్టు... అట్లా అట్ల వంటకం కొనసాగుతుందన్నమాట. పేరు పెసరట్టే అయినా వండడంలో ఎవరి పధ్ధతి వాళ్ళది. మా గోదారి సైడు పెసలు నానబెట్టి వేసే అట్టునే, అలా తూర్పుకి వెళ్లేసరికి పెసరపప్పు నానబెట్టి రుబ్బిన పిండితో వేస్తారు. ('మిథునం' సినిమా కోసం (బుచ్చి) లక్ష్మి చేత తనికెళ్ళ భరణి వేయించిన అట్టు జ్ఞాపకం వచ్చిందా?!)

దోశని పల్చగా, క్రిస్పీ గా తినడానికి ఇష్టపడే ప్రాణులు సైతం పెసరట్టు దగ్గరికి వచ్చేసరికి 'ఎలా ఉన్నా సరే' అనేస్తారు. అవును మరి, పెసరట్టు పల్చగా ఉన్నా, మందంగా ఉన్నా రుచే. ఉల్లి పచ్చి మిర్చి వగయిరాలతో పాటు వేయించిన జీడిపప్పు పలుకులు పెసరట్టు మీద జల్లి, కనీసం నాలుగు చట్నీలతో వడ్డిస్తే ఆ పెసరట్టు పేరు 'ఎమ్మెల్యే' పెసరట్టు. మందంగా వేసిన పెసరట్టుతో 'పెసరట్టు కూర' అని చేస్తారు. పెసరట్టు ముక్కలని పోపులో వేసేసి, చింతపండు రసం కూడా పోస్తారు పైన.. ఏ ఇల్లాలో ఉదయం మిగిలిపోయిన పెసరట్లతో ఈ కూర సృష్టించి ఉంటుంది బహుశా.. కేవలం కూర కోసమని పెసరట్లు చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. కొంతమంది కొన్ని వంటల్లో స్పెషల్. ముళ్ళపూడి వారి 'కోతికొమ్మచ్చి'  లో చాలాసార్లు 'భట్టు గారి పెసరట్టు' గురించి చదివాకా, దాన్ని ఎలాగైనా రుచి చూడాలన్న కోరిక కలిగింది. కానైతే, సదరు భట్టు గారు హోటలు నడపడం లేదు, ఆకాశవాణి నుంచి పించను పుచ్చుకుంటున్నారు అని తెలియడంతో ఆశ వదిలేసుకున్నాను.


కేవలం పెసరట్టు వల్లే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫలహారశాలలు, అవి నడిపే బాబాయిల కథలు కోకొల్లలు. వంశీ పసలపూడి కథల్లో 'అచ్యుతం' గుర్తున్నాడా? గోదారొడ్డున పాక హోటల్లో రోజూ కుంచెడు పెసలు నానబోసి వేసే అట్లని గంటల్లో అమ్మేసే 'అమృత హస్తు'డు!! మిగిలిన వంటల గురించి రాసినట్టే, పెసరట్ల గురించి కూడా చాలా ప్రత్యేకంగా, రుచి చూసి తీరాలి అనిపించేలా రాశాడు. 'దిగువ గోదారి కథ'ల్లో రాసిన ధనలక్ష్మి పెసరట్లనైతే నేను రుచి చూడగలిగాను.. ధనలక్ష్మి అంటే వండే ఆవిడ పేరు కాదు, ఎమ్మెల్యే పెసరట్టు లాగే 'ధనలక్ష్మి పెసరట్టు' అన్నమాట. అరిచెయ్యి మందాన, అరిచెయ్యి వెడల్పులో మాత్రమే ఉండే ఈ పెసరట్టు మీద అల్లం, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలతో పాటు నానబెట్టిన పెసరపప్పు (వడపప్పు) కూడా జల్లుతారు బాగా. ఒక్కక్కరూ కనీసం నాలుగైదు పెసరట్లకి తక్కువ కాకుండా తినేయగలరు, అసలు తిన్నట్టే తెలియకుండా. వీటిని ఉప్మాతోను, ఉప్మా లేకుండానూ కూడా తినొచ్చు. వంశీ 'కోడిగుడ్డు పెసరట్టు' గురించి కూడా చెప్పాడు కానీ, ఇప్పటి వరకూ ఎక్కడా తారసపడలేదు ఆ వంటకం.

ఎటూ సాహిత్యం-పెసరట్టు టాపిక్ వచ్చింది కాబట్టి, కథకుడు జ్యేష్ఠ విషయం కూడా మాట్లాడేసుకుందాం. కొత్త పెళ్ళికొడుకు జ్యేష్ఠ అత్తారింటికి వెళ్తే, అత్తగారు అల్లుడికి పెసరట్టు చేసిపెట్టారు. తినేశాక, "పెసరట్టు ఎలా చేస్తారండీ?" అని మర్యాద చెడకుండా అత్తగారిని అడిగాడు అల్లుడు. "పెసలు, వాటితో బాటు కరకర రాడానికి ఓ గుప్పెడు బియ్యం నానబోసి, బాగా నానాక రుబ్బుకుంటాం అండీ" అని అత్తగారు వివరిస్తూ ఉండగా అడ్డుపడి, "మరి రాళ్ళు ఎన్ని వేస్తారండీ?" అని అంతే మర్యాదగా అడిగారట అల్లుడుగారు.. పాపం, అత్తగారు సిగ్గుపడిపోయారట. జ్యేష్ఠ స్మారక వ్యాసావళిలో ఇంద్రగంటి జానకీబాల గారని జ్ఞాపకం, ఈ కబురు పంచుకున్నారు. పెసలు నానబోసే ముందే రాళ్ళు లేకుండా చూసుకోడం ఇందుకే అన్నమాట. కొత్తల్లుడి ముందు అత్తగారికి అవమాన భారం లేకపోయేది కదా పాపం.

ఇక పెసరట్టు కాల్చడంలో కూడా ఎవరి పధ్ధతి వాళ్ళది. మాకు తెలిసిన ఒకావిడ, వేడి పెనం మీద పెసరపిండిని గరిటెతో పోసి, అట్టు మాత్రం తన చేత్తోనే తిప్పుతారు. అట్లు చాలా పల్చగా కరకర్లాడుతూ వస్తాయి. దోశ పిండిని నిలవ చేసినట్టుగా పెసర పిండిని నిలవ చేయడం కుదరదు. రుచి తేడా కొట్టేస్తుంది.. కొంచం పులుపు తగిలినా పెసరట్టు తినలేం. అందువల్ల, పెసరట్టుకి నిలవ పిండి కన్నా తాజాగా రుబ్బిన పిండి శ్రేష్టం!! (అప్పదాసు గారి బజ్జి పచ్చడి గుర్తొచ్చిందా ఎవరికైనా?) ఎప్పుడైనా దోశ ని చట్నీ డామినేట్ చేసే అవకాశం ఉంది.. కానీ పెసరట్టు ముందు మాత్రం చట్నీ పప్పులేవీ ఉడకవు. ఎంత రుచికరమైన చట్నీ అయినా సరే, పెసరట్టు ముందు వెలవెలబోవాల్సిందే. అలాగే, పెసరట్టు తినడానికి నిర్దిష్టమైన సమయం అంటూ లేదు.. అనగా, బ్రేక్ఫాస్ట్ గా మాత్రమే పనికొస్తుంది లాంటి శషభిషలు ఏవీ లేవన్న మాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని కావాలంటే అన్నీ తినేయచ్చు.

మామూలుగా టిఫిను పుచ్చుకున్నాక కాఫీయో, టీవో సేవించడం రివాజు. అదే పెసరట్టు తిన్నాక అయితే, వీటికి బదులుగా పల్చటి మజ్జిగ పుచ్చుకుంటే (వీలయితే నిమ్మరసం పిండింది) రెండు మూడు గంటలన్నా గడవక ముందే కడుపు ఆకలితో కణకణ మంటుంది. ఇల్లేరమ్మ వాళ్ళ అమ్మలాంటి తెలివైన ఇల్లాళ్ళు ఆదివారం పొద్దున్నే పెసరట్టుప్మా టిఫిన్ పని పెట్టుకుంటారు. అప్పుడైతే ఎక్కువ వంటకాలు చెయ్యకుండానే మధ్యాహ్నం బోయినాలు కానిచ్చేయవచ్చు కదా.. మామూలు పెసరట్టు కన్నా, ఉప్మాతో కలిసిన పెసరట్టు కొంచం బరువుగానే అనిపిస్తుంది మరి. అదేవిటో, పెసరట్టు కబుర్లు మాత్రం ఎన్ని చెప్పుకున్నా బరువుగా అస్సలు అనిపించవు.. ఆ భరోసాతోనే ఈ పోస్టు పబ్లిష్ చేసేస్తున్నా... (గూగులిచ్చిన ఫోటో)

మంగళవారం, నవంబర్ 05, 2013

పురుషార్ధం

"ఆడపిల్లలా ఆ ఏడుపేంటీ.. ముయ్ నోరు.. పీకలో పొడిచేస్తా మళ్ళీ నోరు లేచిందంటే... ఏమనుకున్నావో... చదువు లేదుకానీ, ఏడుపు ఒకటీ మొహానికి.. మొగ వెధవ్వి.. నాలుగక్షరం ముక్కలు రాకపోతే అడుక్కు తినాలి చూసుకో.." ...వెక్కిళ్ళు తగ్గడానికి కొంచం సమయం పట్టింది.

"వీరు మన స్కూలికి కొత్తగా వచ్చిన డేన్స్ మేష్టారు.. రోజూ స్కూలైపోయాక ఇక్కడే కూచిపూడి పాఠాలు చెబుతారు.. మీ ఇళ్ళలో చెప్పి, ఆసక్తి ఉన్నవాళ్ళు చేరొచ్చు.."
"అసలే ఆడంగి నడక.. ఇప్పుడు డేన్స్ ఒకటి తక్కువయ్యింది మనకి.. ఆ నంగిరి మాటలు మానేసి, తిన్నగా నడవడం, మాట్లాడ్డం నేర్చుకో ముందు" ..కన్నీళ్లు తుడుచుకోడానికి కాలర్ ఉపయోగానికి వచ్చింది.

"కొత్తగా వచ్చిన హెడ్మాస్టారు బాగా స్ట్రిక్టు. వచ్చే పరీక్షల నుంచి మార్కులు తక్కువ వచ్చిన మగపిల్లలకి ప్రోగ్రెస్ కార్డులు ఇంటికి ఇవ్వం. వాళ్ళ నాన్నల్ని తీసుకొచ్చి ఇక్కడే సంతకం చేయించాలి...కాబట్టి, మగ గాడిదలు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి..." ...ఆడగొంతులు కిసుక్కుమన్నాయి.

"ఏమ్మా.. హైస్కూలు దాటేసరికి పెద్దాళ్ళం అయిపోయాం అనుకుంటున్నారా? సీనియర్లం ఉన్నాం ఇక్కడ.. మీసాలేవమ్మా నీకు? వస్తాయా, రావా?" ...కన్నీళ్లు ఉగ్గబట్టుకోవడం కాస్త అలవాటైనా.. ఏ క్షణమైనా తెగిపోవచ్చు గట్టు.
"అడుగుతుంటే దిక్కులు చూస్తావేమ్మా? ఇంతకీ నువ్వు ఆడా, మగా?"
"మీసాలే రాందే మిగిలినవేం తెలుస్తాయిరా?" ...గట్టు తెగిపోయేలా ఉంది... ఇంతమందిలో పరువు పోవడం ఖాయం.. "మీరాగండ్రా... ఏమ్మా.. టెన్త్ లో స్కోరెంత?" ...కొత్తగా వచ్చిన గడ్డం నిమురుకుంటూ జవాబు కోసమే చూస్తున్నాడు..
"వెళ్ళమ్మా... కుడిచేతివైపు చివరి రూంలో మీ క్లాసు" ..జవాబు విన్నాక మొదటగా నోరు పెగిలింది గడ్డం అతనికే...

"ఈ రోజుల్లో శ్రద్ధగా చదువుకునేది ఆడపిల్లలే... మగపిల్లలు కాలేజీలో ఎందుకు చేరతారంటే... ఒకటి వాళ్ళు గొడ్లు కాయడానికి కూడా పనికిరారు కాబట్టి.. రెండు... ఎక్కువ చదువుకుంటే ఎక్కువ కట్నం లాగొచ్చు కాబట్టి.." ... క్లాసురూంలో ఓణీలు గర్వంతో రెపరెపలాడాయి..
"లెక్చరర్ మాటలు పట్టించుకోకమ్మా..ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చెయ్యాలి ఆయన. లెసన్స్ బాగా చెబుతారు.. అవి మిస్సవ్వద్దు" ...గెడ్డం నిమురుకోవడం మానలేదు...
"ఈసారి క్యాంపస్ డ్రైవ్ లోలేడీస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్.. వేకెన్సీస్ మిగిలితే అప్పుడు జెంట్స్...అయినా నీకేం పర్లేదులే.. మీసాలుంచవు కదా... లేడీస్ కోటాలో ఇచ్చేస్తారు" ... జోక్ చేశాననుకుని తనే నవ్వేశాడు.

"నాకు ఏడ్చే మగాళ్లంటే అసహ్యం.. మగాడంటే స్ట్రాంగ్ గా ఉండాలి.. నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి..." ...మంచం మీద మల్లెలు నవ్వుతున్నాయి..
"నీ నవ్వు నచ్చుతుంది నాకు, చందమామలా.. అవునూ.. అసలు ఎంగేజ్మెంట్ అప్పుడే అడుగుదాం అనుకున్నాను.. నువ్వు మీసం ఎందుకు పెంచవూ?" ..మళ్ళీ నోరు తెరిచే అవకాశం దొరకలేదు ఆ రాత్రి.

"అయాం నాట్ ఎక్స్ పెక్టింగ్ దిస్ ఫ్రం యూ... యు షుడ్ నో హౌ టు ఎక్స్ ట్రాక్ట్ వర్క్ ఫ్రం యువర్ టీం మెంబర్స్.. మెత్తగా ఉంటే నెత్తినెక్కుతారు.. కొంచం గట్టిగా ఉండడం నేర్చుకోండి" ... ఇరవై నిమిషాల క్లాసు ముగుస్తూనే, మొబైల్ మోగింది..
"నాక్కోపం వచ్చింది.. నీమీద అలిగాను తెలుసా? అస్సలు పట్టించుకోడం లేదు నన్ను..." ఫోన్ ని విసిరి కొట్టేయగలిగితే ఎంత బాగుండును..
"హే...ఎనీథింగ్ రాంగ్? ఎందుకూ ఛాతీ రాసుకుంటున్నావ్? కూల్ డౌన్.. ఈ నీళ్ళు తాగు ముందు.. మేనేజర్ మాటలు పట్టించుకోకమ్మా.. తెలిసిన డాక్టర్ ఉన్నాడు.. నా కార్లో వెళ్దాం సాయంత్రం..."

"ట్వెంటీ ఎయిట్.. కొత్త పెళ్లికొడుకా?"
"ఓహ్.. రెండేళ్ళయినా, ఇంకా నిద్ర సరిపోవడం లేదంటే..." డాక్టర్ నవ్వేశాడు, తన వృత్తి ధర్మానికి విరుద్ధంగా..
"ఆనే సీరియస్ నోట్.. చాలా ఎక్కువ టెన్షన్ కేరీ చేస్తున్నారు మీరు.. అదొక్కటే ప్రాబ్లం.. లుక్ అవుట్ ఫర్ సం వెంట్.. టెన్షన్ తగ్గించుకుంటే... యూ విల్బీ ఆల్రైట్..."

"హ్హు.. నీకో గుడ్ న్యూస్ చెబుదామని ఉదయం నుంచీ ఎదురు చూస్తున్నా తెలుసా? నాకేడుపొచ్చేస్తోంది.. నువ్వు నన్నస్సలు పట్టించుకోడం లేదు" ...ఫోన్ స్పీకర్ మోడ్ లో ఉండగా కాల్ కట్టయ్యింది.
"నాకు బాగా అర్ధమయ్యింది నీకేం కావాలో" ..చెయ్యి గెడ్డం మీదకి వెళ్ళింది అలవాటుగా..
"స్మోక్ అండ్ డ్రింక్... మాంచి రిలీఫ్ అసలు.. బిలీవ్ మీ.. ఆఫ్ కోర్స్, ఈ వయసులో కొత్తగా స్మోక్ అంటే కష్టం కానీ..." ...కారు మెత్తగా సాగిపోతోంది..

"సన్నీ... వాటీజ్ దిస్.. యుఆరె బాయ్.. గుడ్ బాయ్..రైట్?" ..బీర్ బెల్లీ  పొడుచుకు వస్తోంది, టీ షర్టు నుంచి..
"తప్పు నాన్నా... గర్ల్స్ ఏడుస్తారు.. బాయ్స్ ఏడవరు.. చోటా బీం ఏడుస్తాడా ఎప్పుడైనా? స్మైల్... స్మై...ల్.. దటీజ్ ది స్పిరిట్..."

సోమవారం, అక్టోబర్ 28, 2013

చింతలవలస కథలు

విజయనగరం జిల్లాలో ఉన్న ఓ పల్లెటూరు చింతలవలస. నిజానికి ఇదే జిల్లాలో ఇదే పేరుతో సుమారు ఓ పది పల్లెటూళ్ళు ఉన్నాయి అంటారు రచయిత డాక్టర్ మూలా రవి కుమార్. పశువైద్య శాస్త్రం చదివి, నేషనల్ డైరీ డవలప్మెంట్ కార్పోరేషన్ లో ఉద్యోగం చేస్తున్న రవి కుమార్ స్వస్థలం, ఒకానొక చింతలవలసకి సమీపంలో ఉన్న అమరాయవలస. చింతలవలస కథా స్థలంగా తను రాసిన ఆరు కథలకి, పాలకేంద్రాల పని తీరు ఇతివృత్తంగా రాసిన నాలుగు కథలు, అనేక అంశాలని స్పృశిస్తూ రాసిన మరో ఎనిమిది కథలని చేర్చి, మొత్తం పద్దెనిమిది కథలతో వెలువరించిన కథా సంకలనమే 'చింతలవసల కథలు.'

ఇవి నేటివిటీ చుట్టూ అల్లుకున్న కథలు కావు. ఇంకో మాటలో చెప్పాలంటే, చింతలవలస అని మాత్రమే కాదు, ఏ పల్లెటూళ్ళో అయినా జరిగేందుకు అవకాశం ఉన్న కథలే ఇవి. వానాకాలం చదువులు ఇతివృత్తంగా సాగే 'బడిశాల' ఈ సంకలనంలో మొదటి కథ. అడివిని ఆనుకుని ఉన్న ఓ పల్లెలో ఓ రీసెర్చ్ స్కాలర్ కి ఎదురైన అనుభవాలు 'బలిపశువు' కథ. వ్యవస్థ పనితీరుని ఎత్తిచూపించే కథ ఇది. 'చింతలవలస 1985 అను ది సీక్రెట్ ఆఫ్ జోయ్' కవితాత్మకంగా సాగే మినీ కథ. రాజకీయాలు, మానవ మనస్తత్వ విశ్లేషణల సమాహారం 'గురివింద నాయుడు' కథ. 

ఆద్యంతం ఆసక్తిగా సాగే కథ 'పాఠం' ఆర్టీసీ బస్సు డిపో కథా స్థలం ఇందులో. 'పొడుం డబ్బాలో దూరిన దోమ' ఓ బడిపంతులు ఉద్యోగాన్ని ఎలా పొట్టన పెట్టుకుందో చెప్పే కథ సస్పెన్స్ ప్రధానంగా సాగుతుంది. చిన్న చేపను పెద్ద చేప మింగే అవినీతి శాఖా చంక్రమణానికి క్లాస్ రూం పాఠాన్ని జోడించి ఆసక్తికరంగా చెప్పిన కథ 'ఫుడ్ చైన్.' ఈ కథ చదువుతుంటే శ్రీరమణ రాసిన 'పెళ్లి' కథ గుర్తొచ్చింది అసంకల్పితంగా. 'ఎలోవీరా' గా పిలవబడే కలబంద పంట ఇతివృత్తంగా రాసిన 'చెంచు మంత్రం' చాలాకాలం పాటు గుర్తుండిపోయే కథల్లో ఒకటి.


పాడిపరిశ్రమ ఇతివృత్తంగా కథలేవీ ఇప్పటివరకూ తెలుగులో వచ్చిన దాఖలాలు లేవు. ఓ అధికారిగా ఈ రంగంలో అనుభవం గడించిన రవికుమార్ 'రోడ్డు పాలు,' 'కులం పాలు,' 'సానుభూతి పాలు,' 'పాలపుంతలో ముళ్ళు' అనే నాలుగు 'పాల' కథలు రాశారు. చదువుతున్నంతసేపూ తన అనుభవాలని, పరిశీలనలనీ మరిన్ని కథల రూపంలో అక్షరీకరించి ఈ రచయిత ఓ పాల కథల సంపుటం తీసుకువస్తే బావుంటుంది కదా అనిపిస్తూనే ఉంది. డైరీల నిర్వహణ, పాలసేకరణలో క్షేత్ర స్థాయిలో ఉండే ఇబ్బందులు మొదలు, పైస్థాయిలో జరిగే రాజకీయాల వరకూ ఎన్నో అంశాలని స్పృశించారు.

చదివించే గుణం పుష్కలంగా ఉన్న కథలే ఇవన్నీ. ఎక్కడా సుదీర్ఘమైన సంభాషణలు లేవు. "ఈయన కింద ఏడాది పరిగెడితే  మేలుజాతి గుర్రాలు కూడా మేం గాడిదలం అనే అభిప్రాయానికి వచ్చేస్తాయి" లాంటి వాక్యాలతో ఆఫీసు బాసునీ, "రోజుకి నాలుగు గంటలే నిద్రపోడానికి మీరేమైనా ప్రధాన మంత్రా?" లాంటి ప్రశ్నల ద్వారా ఇంటిబాసునీ పాఠకులకి రూపు కట్టేస్తారు. చాలా కథల్లో కనిపించే 'కిరణ్' పాత్ర మరెవరో కాదు, రచయిత రవికుమారే అని పాఠకులకి అర్ధం కాడానికి ఎన్నో కథలు పట్టవు. 'చెంచు మంత్రం' కథలో కిరణ్ ఉండడు.. కానీ పార్థ, సారథి పాత్రలు రెంటిలోనూ రచయిత కనిపించేస్తారు.

పుస్తకం పేరులో చింతలవలస ఉన్నా, కథల్లో కళింగాంధ్రతో పాటు కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలు మూడూ కనిపిస్తాయి. పాల కథలు అన్నింటికీ కథాస్థలం రాయలసీమే. అలాగే నల్గొండ, పల్నాడు ప్రాంతాల్లో పశుపోషణని గురించిన నిశిత పరామర్శ కనిపిస్తుంది 'పాలపుంతలో ముళ్ళు' కథలో. పుస్తకం చదవడం పూర్తిచేసేసరికి ఉత్తరాంధ్ర నుంచి మరో ప్రామిసింగ్ రైటర్ వచ్చారన్న భావన బలపడింది. ('చింతలవలస కథలు,' చినుకు పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 152, వెల రూ. 95, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శుక్రవారం, అక్టోబర్ 25, 2013

కలగంటి.. కలగంటి..

ఉన్నట్టుండి 'కలలు' ఇప్పుడు హాట్ టాపిక్కై కూర్చున్నాయి. నలుగురు కూచుని నవ్వే వేళ ఈ కలల విషయం గుర్తు చేసుకోవడమో, లేదంటే గుర్తు చేసుకుని మరీ నవ్వుకోవడమో జరిగిపోతోంది. నవ్విన నాప చేను పండుతుందా లేదా అన్నది చెప్పే కృషిలో నిమగ్నమై ఉంది ప్రభుత్వం. ఒకవేళ పండక పొతే మాత్రం ఏమయ్యింది, కల పేరు చెప్పుకుని ఇప్పటికే చాలామంది జనం వాళ్ళ కష్టాలన్నీ కాసేపు మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వుకుంటున్నారు కాదూ. పండిందే అనుకుందాం.. ప్రజలందరూ సాధ్యమైనంత సేపు నిద్దరోయి మరిన్ని కలలు కనేందుకు పక్కలు సిద్ధం చేసుకుంటారు.

కలలు అందరూ కంటారు.. వీటి హేతువుల జోలికి వెళ్లొద్దు మనం. రాజకీయనాయకులు ఉన్నారు చూడండి, వీళ్ళు కొన్నాళ్ళ క్రితం వరకూ ఓటర్లని పగటి కలల్లో ముంచి తేల్చేసి పబ్బం గడిపేసుకునే వాళ్ళు. రానురానూ, కలలు కనే ఓపిక లేకా, కనడానికి కావలసినంత నిద్ర పట్టే పరిస్థితులు కనిపించకా జనం సదరు నాయకులని నమ్మడం మానేశారు. కానైతే, నమ్మినట్టు నటించడం మాత్రం మర్చిపోవడం లేదు. ఇన్నాళ్ళూ తాడిన తన్నిన నాయకులకి, తలదన్నే వాళ్ళు పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయాలు వెతుక్కోక తప్పని పరిస్థితి వచ్చేసింది.

రాష్ట్రపతి పదవికి ఓ కొత్త గౌరవం తెచ్చిన టెక్నోక్రాట్ అబ్దుల్ కలాం పిల్లలు, యువకులతో ఎప్పుడు మాట్లాడినా వాళ్ళని కలలు కనమనీ, వాటిని నిజం చేసుకోడానికి శ్రమించమనీ చెబుతారు. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను, అంతపెద్ద హోదాకి ఎదగడానికి జీవితంలో పైకి ఎదగాలన్న కలలు ఎంతగానో దోహదం చేశాయని చాలాసార్లే చెప్పారు వివరంగా. ఆయన మాటల్లోంచి నిద్రపొమ్మని అర్ధం తీసుకున్న కొందరు మాత్రం, "కలాం గారు ఏమన్నారు? కలలు కనమన్నారు.." అంటూ వ్యంగ్య భాష్యాలు మొదలుపెట్టారు. ఇందులో కూడా అవకాశం వెతుక్కున్న మన నాయకులు మాత్రం, "కలాం గారు కూడా కలలు కనమనే చెప్పారు" అని కొత్తపాట అందుకున్నారు.

కేంద్రంలో వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూటమికి సమస్యలు రోజు రోజుకీ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అవినీతి ఆరోపణలు ఓ పక్కా, రోజు రోజుకీ క్షీణిస్తున్న రూపాయి ఆరోగ్యం మరోపక్కా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఎన్నికలు దగ్గరకి వచ్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ గండాలని గట్టెక్కించే తరుణోపాయాలు ఏమిటన్న విషయం మీద కాంగ్రెసు నాయకత్వం దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. కాలం బొత్తిగా కలిసి రాకపోవడం వల్ల కాబోలు, ఉల్లిపాయ సైతం బాంబుగా మారి తను పేలడమో, ప్రభుత్వాన్ని పేల్చడమో చేసేసేలా ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో, అల్లక్కడెక్కడో ఉండే ఓ సాధు పుంగవుడు ఓ ధగధ్ధగాయమానమైన కలగన్నాడు. ఒకటీ రెండూ కాదు, వేలాది బంగారు నాణేలు ఆ కలనిండా.. కేవలం నాణేలు మాత్రమే కాకుండా, అవి దొరికే చోటు కూడా స్పష్టంగా కనిపించడంతో ఈ కల సంగతిని ఓ రాజకీయ నాయకుడి చెవిన వేశాడు. ఇంకేముందీ, తవ్వకాలు మొదలయ్యాయి. ప్రభుత్వం కూడా తవ్వితే పోయేదేముందనుకుంది. నిజమే, బంగారం దొరికిందా.. డబ్బుతో ముడిపడ్డ కొన్ని సమస్యలైనా తీరొచ్చు. దొరకలేదూ.. కొన్నాళ్ళ పాటు జనం మాట్లాడుకోడానికి ఓ టాపిక్ దొరుకుతుంది. వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళని ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కాలం గడపగలరు పాపం.

ఏలినవారి అంచనా ఏమాత్రం తప్పలేదు.. ఓ పక్క ఆ ఫలానీ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతూ ఉండగానే, దేశానికి మరోమూల ఉన్న ఇంకో సాధు సామ్రాట్టు సైతం ఓ బంగారు కలగన్నాడు. పలుగులూ, పారలూ సిద్ధం. జన సామాన్యానిది నిద్ర అయితే, సాధువులది యోగనిద్ర అని కదా ప్రచారం. ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఏమిటంటే, సామాన్య జనానిని మామూలు కలలైతే, సాధు జనానివి మాత్రం బంగారు కలలు. కాషాయం కట్టిన వారందరూ యోగనిద్రలోకి జారుకోడం ద్వారా, ప్రజల సంగతి ఎలా ఉన్నా, ప్రభుత్వానికి మాత్రం బాగా మేలు జరిగేలా కనిపిస్తోంది ప్రస్తుతం..

మంగళవారం, అక్టోబర్ 22, 2013

కృష్ణశాస్త్రి బాధ...

"కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ" అన్నాడు గుడిపాటి వెంకటాచలేయుడు, శ్రీశ్రీ 'మహాప్రస్థానం' పుస్తకానికి ముందుమాట రాస్తూ... ఇప్పుడు ప్రపంచం మొత్తానికి 'కృష్ణశాస్త్రి' ఎవరంటే.. అమెరికా సంయుక్త రాష్ట్రాలు. అస్సలు ఆశ్చర్యం అక్కర్లేదు, ఎందుకంటే అమెరికా బాధ ప్రపంచం బాధ అయి కూర్చుంది ఇప్పుడు. అమెరికా ఆర్ధిక వ్యవస్థకి నీరసం చేస్తే, మూడొంతుల ప్రపంచ దేశాలు వాళ్ళ భవిష్యత్తుని గురించి ఆందోళన పడడం ఇవాళ కొత్తగా మొదలైంది కాదు.. నూతన ఆర్ధిక సంస్కరణలని నీడలాగా అనుసరించిన పరిణామం ఇది.

ఇరవై రెండేళ్ళు వెనక్కి వెళ్తే, ఢిల్లీలో కాంగ్రెస్ మైనారిటీ సర్కారుని పీవీ నరసింహారావు ప్రధానిగా సారధ్యం వహించి నడిపిస్తున్న రోజులు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాల వల్ల దివాలాకి దగ్గరలో ఉన్నాయి. తీవ్రమైన డబ్బు కటకట. జాతి సంపద అయిన బంగారం నిలవలని తాకట్టు పెట్టి సొమ్ము తెచ్చినా, కేవలం కొన్ని నెలల్లోనే ఆర్ధిక వ్యవస్థ పుంజుకుని పరుగులు తీసే పరిస్థితి ఏమాత్రమూ లేదు. ఆ బంగారాన్ని అమ్మేస్తే, దేశ భవిష్యత్తు అవసరాలు మరి?

సరిగ్గా ఇదే సమయంలో కేంద్రం ముందుకు వచ్చిన ఓ ప్రత్యామ్నాయం నూతన ఆర్ధిక సంస్కరణలు. అప్పటివరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద విపరీతమైన ఆంక్షలు విధిస్తూ -- పారిశ్రామికవేత్తల మాటల్లో చెప్పాలంటే 'మడి కట్టుకుని' -- ఉన్న భారతదేశం విదేశీ పెట్టుబడులని ఆహ్వానించింది. ఒక్కసారిగా మొత్తం అన్ని రంగాలకీ గేట్లు బార్లా తెరవకుండా, ఎంపిక చేసిన కొన్ని రంగాల్లో, కొంత శాతం మేరకు విదేశీ పెట్టుబడులని ఆహ్వానించే విధంగా నిబంధనలని సడలించింది. ఫలితంగా ఎన్నో కొత్త పరిశ్రమలు వచ్చాయి.. ముఖ్యంగా ఐటీ పరిశ్రమ ఊపందుకుంది. 

వందల్లో పరిశ్రమలు, లక్షల్లో ఉద్యోగాలు.. ఒక్కమాటలో చెప్పాలంటే దశ తిరిగింది... ఉన్నత, మధ్య తరగతి వర్గాలది, దేశ ఆర్ధిక వ్యవస్థదీ కూడా. ఇది నాణేనికి ఒకవైపు. ప్రతి నాణేనికీ బొమ్మా బొరుసూ ఉన్నట్టే, ఈ నాణేనికీ ఉన్నాయి. నూతన ఆర్ధిక సంస్కరణలు మంచిని మాత్రమే వెంటపెట్టుకుని రాలేదు. భారత సమాజంలో పేదా, గొప్పా అంతరాలు మొదటినుంచీ ఉన్నవే అయినా, అవి మరింతగా పెరిగిపోడానికి దోహదం చేశాయి. వ్యవసాయ రంగాన్నైతే సంక్షోభంలోకి నెట్టేశాయి.

సంస్కరణల ఫలితంగా ఇప్పుడు మార్కెట్ అంటే ఒక్కటే మార్కెట్.. అది గ్లోబల్ మార్కెట్.. స్వేచ్చా వాణిజ్యం అందుబాటులోకి వచ్చాక నాణ్యమైన సరుకు తక్కువధరలో దొరికే చోటునుంచి సులభంగా తెచ్చుకో గలుగుతున్నాడు వినియోగదారుడు.. (ఇక్కడి లొసుగులు ఇక్కడా ఉన్నాయి, అది వేరే కథ). ఇప్పటికీ సంప్రదాయ పద్ధతిలోనే, ప్రభుత్వం నుంచి నామమాత్రంగా అందుతున్న మద్దతుతో వ్యవసాయం సాగిస్తున్న భారతీయ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పెట్టుబడులు పెరిగిపోవడం, ధరలు పడిపోవడం ఒక్కసారిగా జరగడంతో వ్యవసాయరంగం ప్రమాదం అంచున నిలబడింది.

వ్యవస్థ ఏదైనా కావొచ్చు.. కానీ బలవంతుడిదే పైచేయి అన్న ప్రాధమిక సూత్రంలో ఏమార్పూ ఉండదు.. మార్కెట్ మొత్తం కేంద్రీకృతం అయిపోవడం ఫలితం ఏమిటంటే, ఆ మార్కెట్ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. అమెరికాలో ఏం జరిగినా దాని ప్రభావం మార్కెట్ మీద, తద్వారా ఆ మార్కెట్లో భాగస్వాములైన ప్రపంచ దేశాల మీద పడి తీరుతుంది. అమెరికా ఆర్ధిక వ్యవస్థ కళకళలాడితే, మిగిలిన దేశాల్లో పరిస్థితులు బాగుంటాయి. ఆ వ్యవస్థకి ఏ చిన్న జలుబు చేసినా అన్ని దేశాలూ తుమ్మడం ప్రారంభిస్తాయి.. ఇప్పుడిక అమెరికా కృష్ణశాస్త్రి కళ్ళలో ఆనందం కోసం ఎదురుచూడాలి మనం..

సోమవారం, అక్టోబర్ 14, 2013

...ఐనా, నేను ఓడిపోలేదు!

డిస్ప్లే లో ఉన్న పుస్తకాలు వరుసగా చూసుకుంటూ వెళ్తూ, ఒక కవర్ పేజి చూసి "బాగా తెలిసిన అమ్మాయిలా ఉందే?" అనిపించి పుస్తకం చేతిలోకి తీసుకున్నా. '...ఐనా, నేను ఓడిపోలేదు!' అనే టైటిల్ బాగా ఆకర్షించడంతో, పుస్తకం తీసేసుకున్నాను. ఆ తర్వాత, వెళ్ళిన చోట పని కొంచం ఆలస్యం కావడంతో చేతిలో ఉన్న పుస్తకం చదవడం మొదలుపెట్టాను... పది పేజీలు పూర్తిచేసేసరికి అర్ధమయ్యింది, ఈ పుస్తకం పూర్తిచేసి కానీ నేను నిద్రపోలేనని. 'ఏముందీ నూట పాతిక పేజీల పుస్తకంలో?' అని ఎవరన్నాఅడిగితే, నేను చెప్పగలిగే జవాబు ఒక్కటే... "జీవితం!!" 

ఘనమైన చారిత్రక, సాంస్కృతిక చరిత్ర ఉన్న వరంగల్ జిల్లా ప్రస్తుతం ఆత్మహత్యల్లో ముందుంది. ఆంధ్రప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నజిల్లాలలో వరంగల్ ఒకటి. ఆ జిల్లాలో మైలారం అనే ఓ మారుమూల పల్లెటూరికి చెందిన గృహిణి జ్యోతి తన ఇద్దరు చిన్నపిల్లలు బీనా, బిందు లతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. కూలీలందరూ ఇళ్ళకి వెళ్ళిపోయాక, పిల్లలిద్దరినీ బావిలోకి తోసేసి, ఆపై తనూ అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధ పడిపోయింది. కారణం? ఏడాది తేడాతో పుట్టిన ఆ పిల్లలు ఇద్దరికీ కనీసం పాలిచ్చే స్తోమతు లేకపోవడం..

అప్పటివరకూ తన పేదరికం, శారీరక దుర్బలత్వం.. వీటి చుట్టూనే ఆమె ఆలోచనలు తిరిగాయి.. కూలీలందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు. జీవితానికీ, మరణానికీ మధ్య ఉన్నవి కేవలం కొన్నే క్షణాలు. అప్పుడే ఆమెకి గుర్తొచ్చింది.. తను పదోతరగతి పాసయ్యానని. ఆ చదువు తన ఇద్దరు బిడ్డలకీ గుక్కెడు పాలని అందించలేక పోదన్న ధైర్యమూ వచ్చింది.. ఆ పదో తరగతి కూడా, స్వయంగా ఆమె తండ్రే ఆమెని 'బాల సదన్' అనే అనాధాశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ చేర్చడం వల్ల చదవగలిగింది. అటుపై ఊహించనంత తొందరగా పెళ్లి, పిల్లలు...


బతకగలను అన్న ధైర్యం కలిగిన క్షణం జ్యోతి జీవితంలో చాలా గొప్పది. ఆ ధైర్యమే ఆమెచేత ఎన్నో ఉద్యోగాలు చేయించింది.. అమెరికా తీసుకెళ్ళింది.. అక్కడ సొంత వ్యాపారం ప్రారంభించ గలిగేలా చేసింది. తను నడిచే దారిలో అడుగడుగునా ఎదురయ్యే ముళ్ళని ఏరి పారేసి ఆపకుండా తన ప్రయాణాన్ని కొనసాగించేలా చేసింది. పదోతరగతి చదువు, గుండెల నిండా ధైర్యం పెట్టుబడిగా, తన ఇద్దరు పిల్లలకీ మంచి జీవితం ఇవ్వడం అనే లక్ష్యంతో మైలారం వదిలిపెట్టిన జ్యోతి చేసిన ప్రయాణం తక్కువదేమీ కాదు. ఎదుర్కొన్న ఒడిదుడుకులూ మామూలువి కాదు.

2012 మే ఒకటిన ఓ తెలుగు టెలివిజన్ చానల్ కి జ్యోతి రెడ్డి ఇంటర్యూ ఇవ్వడం తో మొదలయ్యే కథనం, అదే సంవత్సరం మే రెండున ఎమెస్కో బుక్స్ ఆఫీసులో తన ఆత్మకథ ప్రచురించడానికి అంగీకరించడంతో ముగుస్తుంది. అక్కడక్కడా కొన్ని తడబాట్లు ఉన్నప్పటికీ ఆపకుండా చదివించే కథనం. "నేను నాకు యాది ఉన్నంతవరకూ, నేను అనుభవించిన సంఘటనలన్నీ, అప్పటి మనోభావాల్నీ యథాతథంగా కాగితం మీద పెట్టే ప్రయత్నం చేశాను. కొంతమందికి బాధ కలిగించే విషయాలు ఏవయినా నేను రాసి ఉండకపోవచ్చు, కానీ రాసినవన్నీ వాస్తవాలు. గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్న వేలాది భావాలకి అక్షరరూపాలు," అన్న చివరి మాట సాయంతో ఆమె రాయకుండా వదిలేసిన విషయాలని ఊహించవచ్చు.

"నాకనిపించింది ఏమిటంటే, ఈ జ్యోతి అనే పల్లెటూరు అమ్మాయి ప్రపంచ ఆర్ధిక విపణికి కేంద్రమైన అమెరికాలో స్థానం పొందడానికి కారణం ఆమె భయాన్ని జయించడమేనని. నేను జ్యోతిని భయం లేని ఓ స్త్రీగా భావించడంలేదు. భయాన్ని జయించిన ఓ స్త్రీగా భావిస్తున్నాను" అన్నారు ఎమెస్కో విజయకుమార్ తన ముందుమాటలో. 'నిప్పులాంటి నిజం' పుస్తకాన్ని తెనిగించిన జర్నలిస్ట్ జి.వల్లీశ్వర్ రచనా సహకారం అందించిన ఈ పుస్తకం కథనంలో ఆయన మార్కు కనిపించింది. అచ్చుతప్పులు తక్కువే కానీ, ఫోటోల ముద్రణ విషయంలో మరికొంచం శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది.

... నాకు తెలిసిన అమ్మాయిలా అనిపించి పుస్తకం చేతిలోకి తీసుకున్నా, కవర్ ఫోటోని దగ్గరనుంచి చూడగానే అర్ధమయ్యింది, ఆమె నాకు తెలియదని. కానీ, పుస్తకం చదవడం పూర్తిచేయగానే ఆమె నాకు ఆత్మీయురాలన్న భావన కలిగింది. జీవితం వడ్డించిన విస్తరి కాని ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే రచన ఇది. (ఎమెస్కో ప్రచురణ, వెల రూ. 60, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, అక్టోబర్ 07, 2013

దాలప్ప తీర్థం

దాలప్ప ఓ మామూలు మనిషి. సమాజానికి బాగా ఉపయోగ పడే మనిషి. కానీ, సమాజం నుంచి ఎలాంటి గుర్తింపూ నోచుకోక పోగా చివాట్లూ, చీత్కారాలూ భరిస్తున్న మనిషి. అతనొక్కడే కాదు, దాలప్ప చేసే వృత్తిలోనే ఉన్న అతని బంధువులు, సావాసగాళ్ళూ అందరిదీ ఇదే పరిస్థితి. తన వృత్తి అవసరాన్ని అందరూ గుర్తించేలా చేయాలన్న దాలప్ప ప్రయత్నం ఎంతగా ఫలించిందంటే, ఇప్పటికీ అతని పేరు మీద ఏటా 'దాలప్ప తీర్థం' జరుపుకునేటంత!!

'సాక్షి' దినపత్రికను, మరీ ముఖ్యంగా 'ఫ్యామిలీ' పేజీని క్రమం తప్పకుండా చదివే వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు. ఎన్నో ఆసక్తికరమైన వార్తా కథనాలు రాసిన ఈ పాత్రికేయుడు కథకుడు కూడా. తను రాసిన పద్నాలుగు కథలతో విడుదల చేసిన సంకలనానికి శ్రీనివాసరావు ఇష్టంగా పెట్టుకున్న పేరు, సంకలనంలో మూడో కథ పేరూ ఒక్కటే.. అదే 'దాలప్ప తీర్థం.'

ఉత్తరాంధ్ర నుడికారంలో చకచకా సాగిపోయే ఈ కథలన్నీ ఆసాంతమూ విడవకుండా చదివిస్తాయి. బ్రాహ్మలు పెట్టుకునే ఆవకాయ కోసమని మడిగట్టుకుని మరీ తన మిల్లులో కారాలు ఆడించి ఇచ్చే 'పిండిమిల్లు' హుస్సేను కథ చెప్పినా, ఊళ్ళో తల్లిపాలు చాలక అల్లాడుతున్న పసిపిల్లలందరికీ స్తన్యం అందిచి ఊపిరిపోసిన గంపెడు పిల్లల తల్లి 'పాలమ్మ' ని గురించి చెప్పినా పాఠకుల చేత ఏకబిగిన కథని చదివించడం ఎలాగో ఈ రచయితకు బాగా తెలుసు. 'పులికన్నా డేంజర్' అయినది ఏమిటో, ఒకప్పుడు 'చల్దన్నం చోరీ' చేసిన దొంగలు ఇప్పుడు ఎలా రూపు మార్చేసుకున్నారో తెలుసుకోవచ్చు ఈ కథల ద్వారా.


విశాఖ జిల్లా పల్లెల్నీ, మరీ ముఖ్యంగా మూడు నాలుగు దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన అగ్రహారాలనీ, వాటితో పాటుగా కష్టానికీ సుఖానికీ కలిసిమెలిసి ఉండి, వాటిని ఎదురీదిన అష్టాది వర్ణాల వారినీ పాఠకులకి పరిచయం చేసిన రచయిత, మానవీయ విలువలు క్రమక్రమంగా కనుమరుగవుతున్న తీరుని కథలు చదివిన వారు ఆలోచనలో పడే రీతిలో చిత్రించారు. 'వానతీర్పు' 'నిదర్శనం' 'శిఖండి గాడు' 'చిదిమిన మిఠాయి' అగ్రహారం నేపధ్యంగా సాగే కథలు. వీటిలో తొలి మూడు కథలూ వాస్తవ సంఘటనలే!!

"ఒక రావిశాస్త్రి నీ ఒక పతంజలి నీ కలిపి ముద్ద చేస్తే వచ్చే పదార్ధం చింతకింది లా ఉంటుందేమో" అన్నారు 'ప్రియదర్శిని' రామ్. నాకైతే, పేదవాడి పక్షాన నిలబడ్డంలో రావిశాస్త్రినీ, 'కన్యాశుల్కం' నాటకాన్ని ప్రేమించడంలో పతంజలినీ గుర్తు చేసిన ఈ రచయిత నేటివిటీ చిత్రణలో వంశీ ని జ్ఞాపకం చేశారు. 'రాజుగారి రాయల్ ఎన్ ఫీల్డ్' 'గుడ్డముక్కలు' కథలు వంశీని బాగా జ్ఞాపకం చేశాయి. అయితే, శ్రీనివాసరావుకి తనదైన శైలి ఉంది, ఆపకుండా చదివించే గుణం ఈయన కథల్లో పుష్కలంగా ఉంది.

అక్కడక్కడా సంభాషణల్లో వినిపించిన నాటకీయత, ఉన్నట్టుండి కథల్లోకి జొరబడే పత్రికల భాష, కొంచం ఎక్కువగానే ఉన్న అచ్చుతప్పులు పంటికింద రాళ్ళు. వీటిని మినహాయించుకుంటే, ఈ కథల సంకలనం మృష్టాన్న భోజనమే. గురజాడ, చాసో, రావిశాస్త్రి కథల్లో కనిపించే "అమాయకమైన కవితాస్వప్నం" డాక్టర్ చింతకింది కథల్లో కూడా కనిపించడం తనకెంతో సంతోషంగా ఉందన్న వాడ్రేవు చిన వీరభద్రుడి ముందుమాటతో ఏకీభవించకుండా ఉండలేం.. కథా సాహిత్యాన్ని ఇష్టపడే వారు తప్పక చదవాల్సిన సంకలనం ఈ 'దాలప్ప తీర్థం.' (శ్రీనిజ ప్రచురణలు, పేజీలు 106, వెల రూ. 110, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

గురువారం, అక్టోబర్ 03, 2013

అందరూ మనుషులే!

ఓ భూస్వామ్య కుటుంబంలో పుట్టి, పెద్ద చదువు చదివి, ఓ వ్యాపారస్తుడికి ఇల్లాలై, ఓ బిడ్డకి తల్లైన తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టి నాయికగా నీరాజనాలు అందుకున్న రేఖ కథ 'అందరూ మనుషులే!' కేవలం సినిమా పరిశ్రమని మాత్రమే కాక, తనకి పరిచయం ఉన్న అనేక రంగాలనీ, భిన్న మనస్తత్వాలనీ నేపధ్యంగా తీసుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి వి.యస్. రమాదేవి రాసిన నవల ఇది.

ఆంధ్ర రాష్ట్ర అవతరణ సమయం ఈ నవల కథా కాలం.. మధ్య తరగతి అమ్మాయి రేఖ పెళ్ళితో మొదలయ్యే ఈ నవల, సినిమా పరిశ్రమతో సహా, మద్రాసులో స్థిరపడ్డ తెలుగు పరిశ్రమ ప్రముఖులు వాళ్ళ కార్య స్థానాలని హైదరాబాద్ కి మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్న సమయంలో తెలుగు సినీ రంగంలో ఉన్నత స్థితిలో ఉన్న కథానాయిక రేఖ తీసుకున్న నిర్ణయం, దాని తాలూకు ఫలితాలతో ముగింపుకి చేరుకుంటుంది. విస్తారమైన కేన్వాసు కావడంతో కథనం తాపీగా సాగుతుంది.

ఓ రైతు కుటుంబానికి చెందిన సత్యనారాయణకి తల్లీ తండ్రీ లేరు. వారసత్వంగా వచ్చిన ఆస్తి అమ్మి, విజయవాడలో ఓ కట్టెల అడితి ప్రారంభిస్తాడు. అతనికి ఉన్నదల్లా చిన్నాన్న రామారావు. జర్మనీలో స్థిరపడ్డ ఫిలాసఫీ స్కాలర్. ఆ రామారావు కూతురు ూర్యకాంతం. ప్లీడర్ భూషణ రావు, సత్యనారాయణని చూసి, ముచ్చట పడి, తన భార్య శాంత సవతి చెల్లెలు రేఖతో పెళ్ళికి ఒప్పిస్తాడు. హైదరాబాద్ లో అన్న రాజేశ్వర్ దగ్గర ఉండి డిగ్రీ పూర్తిచేసిన రేఖకి కవిత్వంలో మంచి అభినివేశం ఉంది.

పెళ్ళైన కొంత కాలానికే మిత్రుల ప్రోద్బలంతో సినిమా కంపెనీలో వాటా తీసుకుంటాడు సత్యనారాయణ. లాభాలు బావుండడంతో అడితి అమ్మేసి మొత్తం డబ్బు సినిమాల్లోనే పెడతాడు. పార్ట్నర్స్ సలహా మేరకు రేఖ కథానాయికగా ఓ సినిమా నిర్మాణం ప్రారంభిస్తారు. అదే సమయానికి, తన జర్మన్ భార్యకి పుట్టిన కొడుకు మన్మోహన్ తో కలిసి సత్యనారాయణ దగ్గరికి వచ్చేస్తాడు రామారావు. ఫిలాసఫీ రేఖకి కూడా ఎంతో ఇష్టమైన సబ్జక్ట్ కావడం, మన్మోహన్ కి ఇంగ్లీష్ తప్ప తెలుగు రాకపోవడంతో వాళ్ళిద్దరికీ దగ్గరవుతుంది రేఖ. రేఖ సినిమాల్లో నటించడాన్ని రామారావు ప్రోత్సహిస్తాడు.

మొదటి సినిమా రేఖకి మంచి పేరు తేవడంతో వరసగా అవకాశాలు వస్తాయి. సత్యనారాయణ అడ్డుకోడు. అలాగని, ఆమెకి వస్తున్న పేరుని పూర్తిగా ఆస్వాదించనూ లేడు. నటించడం రేఖకి ఇష్టమూ కాదు, అయిష్టమూ కాదు. సినిమా పరిశ్రమలో ఉండే రకరకాల మనుషుల మధ్య నెగ్గుకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే, రామారావుతో సహా ఆమెకి దగ్గర వాళ్ళందరూ రేఖని అనుమానించే పరిస్థితులు వస్తాయి. తామరాకు మీద నీటిబొట్టు చందంగా తన పని తాను చేసుకుపోయే రేఖ ఎలా స్పందించిందో చెబుతూ కథని ముగిస్తారు రమాదేవి.


ముందుగా చెప్పినట్టుగా విస్తారమైన కేన్వాసుతో 418 పేజీల నవలని రాశారు రమాదేవి. మధ్య తరగతి మనస్తత్వాలు, తాగుడు అనర్ధాలు మొదలు, లోతైన వేదాంత విషయాలు, నవాబుల జీవన విధానం వరకూ ఎన్నో ఎన్నెన్నో విషయాలని కథలో భాగం చేశారు. కోస్తా, తెలంగాణా ప్రాంతాల నైసర్గిక రూపం, ప్రజల జీవన విధానం, న్యాయస్థానాల పనితీరు, మారుతున్న ఫ్యాషన్లు, వస్త్రధారణ ఇలా ఎన్ని సంగతులో చర్చకి వస్తాయి నవలలో. కథనం పరుగులు పెట్టించేది కాదు. తాపీగా చదివించేది.

రేఖ ఉన్నత వ్యక్తిత్వాన్ని చిత్రించే క్రమంలో రచయిత్రి మిగిలిన పాత్రలని ఒకింత చిన్న చూపు చూశారేమో అనిపించక మానదు. ప్రాముఖ్యత ఉన్న కొన్ని పాత్రలు ఉన్నట్టుండి తెరవెనక్కి వెళ్ళిపోవడం, అదాటున రంగం మీదకి వచ్చిన పాత్రలు అంతలోనే కీలకమైనవిగా మారిపోవడం ఆశ్చర్య పరుస్తుంది. ఎడిటింగ్ విషయంలో కొంచం శ్రద్ధ తీసుకుని ఉంటే రీడబిలిటీ పెరిగి ఉండేది అనిపించింది. రమ్య ప్రచురణలు ప్రచురించిన ఈ పుస్తకం నవోదయ బుక్ హౌస్ ద్వారా అందుబాటులో ఉంది. (వెల రూ. 190).

సోమవారం, సెప్టెంబర్ 30, 2013

బీనాదేవీయం

తెలుగు పాఠకులకి బీనాదేవిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భార్యా భర్తలిద్దరూ కలిసి ఒకే పేరుతో సాహిత్యాన్ని సృజించడం అరుదైన ప్రక్రియే అయితే, తెలుగు పాఠకులకి జంట సాహిత్యాన్ని రుచి చూపించిన జంట బి.నరసింగరావు (బిన) బాలా త్రిపుర సుందరీ దేవి (దేవి). వీరి కలంపేరు 'బీనాదేవి.' ఇరవయ్యేళ్ళ క్రితం నరసింగరావు మరణించినప్పుడు 'బీనాదేవి మృతి' అని ప్రకటించేశాయి మన పత్రికలు. అయితే, బీనాదేవిలో రెండో సగం బాలా త్రిపుర సుందరీ దేవి రాయడం మానలేదు. 'కథలు-కబుర్లు' సంకలనం తర్వాత, ఆమె నుంచి వచ్చిన తాజా రచన 'బీనాదేవీయం.'

"ఎప్పటినుంచో నాకు ఓ తీరని కోరిక.. ఓ అయిదు తరాల నవల రాయాలని... ఓ మాగ్నమ్ ఓపస్! బుచ్చిబాబు గారి 'చివరకు మిగిలేది' లాగా.. రావిశాస్త్రి గారి 'రత్తాలు-రాంబాబు' లాగా... ఎలా ప్రారంభించాలి? అన్ని తరాలు ఎలా ఊహించాలి? ఆ అయిదు తరాలు మేమే ఎందుక్కాకూడదూ! ఊహ, కల్పన అవసరం లేదు. మా అమ్మమ్మ మొదలు, మా మనవల వరకూ తెలిసిన జీవితాలే అన్నీ!" అంటూ రచన ప్రారంభించిన సుందరమ్మ, తన అమ్మమ్మ-తాతయ్య, అమ్మ-నాన్నల తరాల గురించి విపులంగా రాశారు.

ఊహించగలిగినట్టే అవన్నీ ఎంతగానో ఆసక్తి కలిగించే విశేషాలు.. ఇద్దరు తాతల్లోనూ మాతామహులు వకీలు కాగా, పితామహులు ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర పోలీస్ ఆఫీసర్. ఈ రెండు డిపార్ట్మెంట్ల జీన్స్ తో పుట్టిన త్రిపుర సుందరీ దేవి, తన మేనమావ, వకీలు అయిన నరసింగరావుని పెళ్ళాడేశారు. తండ్రిగారిది ఒక రకంగా ఇల్లరికమే కావడంతో అమ్మమ్మ ఇంట్లో పుట్టి పెరిగి, ఆ అమ్మమ్మకే కోడలు అయిపోయారు. 'అంట్లు తోముకునే ఆడపిల్లకి ఆల్జీబ్రా ఎందుకూ?'అనే వ్యాఖ్యానాలు లెక్కపెట్టకుండా తండ్రి హైస్కూలు వరకూ చదువు చెప్పిస్తే, పెళ్లి తర్వాత అమ్మమ్మ ప్రోత్సాహం, భర్తగారి అనుమతి తో ప్రయివేటుగా డిగ్రీలో చేరి, నలుగురు పిల్లల తల్లయ్యాక పట్టా పుచ్చుకున్న వైనం స్పూర్తిదాయకం.


ప్లీడర్ ప్రాక్టీసులో ఆదాయం స్థిరమైనది కాదు కాబట్టి, మిత్రుల సలహా మేరకి నరసింగరావు నెల జీతం వచ్చే జడ్జీ ఉద్యోగం లోకి మారిపోవడంతో, రెండు మూడేళ్ళకోసారి కుటుంబం మొత్తం బదిలీలమీద ఊళ్లు తిరగడం.. ఆ బదిలీలు కూడా అనంతపురం నుంచి అమలాపురం లాంటి దూర దూర ప్రాంతాలకి.. జడ్జీ గారి సర్వీసు పూర్తయ్యేసరికి రాష్ట్రం మొత్తం చుట్టేశారు! పిల్లల పెంపకం, వాళ్ళ చదువులు, రచనా వ్యాసంగం, రచయితలతో స్నేహాలు ఓ వైపు, వెళ్ళిన ప్రతిచోటా దొరికిన అనేకరంగాలకి సంబంధించిన స్నేహితులు మరోవైపు. వీళ్ళందరికీ సంబంధించిన కబుర్లు ఎన్నో, ఎన్నెన్నో..

బీనాదేవి పేరు చెప్పగానే గుర్తొచ్చే 'పుణ్యభూమీ కళ్ళుతెరు' నవల ఎలా పుట్టిందో రేఖామాత్రంగానే చెప్పారు. అలాగే, బీనాదేవి రచనల మీద రావిశాస్త్రి ప్రభావాన్ని గురించి కూడా.. నిజానికి ఈ పుస్తకంలో స్పృశించి వదిలేసిన అనేక విషయలని గురించి విపులంగా రాసి ఉంటే బాగుండేది కదా అనిపించక మానదు. అలాగే, 'కథలు-కబుర్లు' లో చెప్పిన కొన్ని కబుర్లు పునరావృతం కావడంతో, ఆ పుస్తకం చదివిన వాళ్లకి తెలిసిన సంగతులే మళ్ళీ చదువుతున్న భావన కలుగుతుంది. వీటిలోనే కొన్ని పునరుక్తులు కూడా.. ఎడిటింగ్ మీద మరికొంచం శ్రద్ధ పెట్టి ఉంటే ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు, బహుశా.

అలాగే, తాతయ్య, నాన్న తరాల గురించి చెప్పినంత వివరంగా తర్వాతి మూడు తరాల గురించీ చెప్పకపోవడం వల్ల పుస్తకం పూర్తిచేశాక "ఐదు తరాలు ఎక్కడ?" అని ఆలోచించుకునే పరిస్థితి. ఆసక్తికరమైన ఎత్తుగడతో రచన మొదలు పెట్టినా, చివరి వరకూ కొనసాగించక పోవడం, చివరి పేజీల దగ్గరకి వచ్చేసరికి హడావిడిగా ముగించేస్తున్నారు అన్న భావన కలగడం వల్ల కాబోలు, ఈ 191 పేజీల పుస్తకాన్ని చదివి పక్కన పెట్టాక ఓ 'మాగ్నమ్ ఓపస్' చదివిన భావన అయితే కలగదు. అలాగని చదవకుండా వదిలేయాల్సిన పుస్తకం అయితే కాదు.. గడిచిన తరాల జీవితాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆత్మకథలని ఇష్టంగా చదివే వాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం. ('రచన' మాస పత్రికలో వచ్చిన సీరియల్ని వాహిని బుక్స్ పుస్తక రూపంలో తీసుకువచ్చింది. వెల రూ. 180. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం).

శనివారం, ఆగస్టు 31, 2013

బ్లఫ్ మాస్టర్

తెలుగు నాట కమర్షియల్ నవలలు రాజ్యం చేస్తున్నకాలంలో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల 'బ్లఫ్ మాస్టర్.' ఎదుటివారిని సులువుగా మోసం చేసి క్షణాల్లో లక్షలు సంపాదించగల మోసగాడు యాభయ్యేళ్ళ విషకంఠం, అతనికి అన్నివిధాలా సరిజోడు అయిన ప్రియురాలు పందొమ్మిదేళ్ళ విరిజ ల కథ ఇది. ఎన్నో నేరాలు చేసినా ఎప్పుడూ పోలీసులకి చిక్కని విషకంఠాన్ని ఎలాగైనా అరెస్టు చేసి తీరాలని పట్టుదలగా ఉన్న పోలీస్ అధికారి కృపాల్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలిగాడా లేదా అన్నది ఈ నవల ముగింపు.

"మనిషిలో ఆశకన్నా దురాశ ఓ పాలు ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా భారతదేశ పరిస్థితి ఇలాగే ఉంది. న్యాయ సమ్మతంగా నెలకి ఐదారు వేల రూపాయలు వచ్చినా తృప్తి లేదు. బల్లకింద నించి ఇచ్చే చేతుల ద్వారా వచ్చే 'అదనపు వంద'ఆత్మతృప్తిని ఇవ్వని పరిస్థితి నేడు ఎదురవుతోంది. రూపాయి పెట్టుబడి పెట్టి నెల తర్వాత సంపాదించే పావలా కన్నా, పావలా పెట్టుబడితో మర్నాడు వచ్చే రూపాయి మాత్రమె హుషారునిస్తోంది. యధా రాజా, తధా ప్రజ.." అన్న ప్రారంభ వాక్యాలతో మొదలయ్యే ఈనవల, మల్లాది రాసిన అన్ని నవలల్లాగే ఆసాంతమూ విడవకుండా చదివిస్తుంది.

కథానాయకుడు విషకంఠం చిన్న చిన్న మోసాలు చెయ్యడు. వందలు, వేలు కాదు అతను సంపాదించాలి అనుకునేది. లక్షలు సంపాదించాలి.. అది కూడా సులభంగా, ఎవరికీ చిక్కకుండా. అందుకే అతని టార్గెట్ బాగా డబ్బున్న వాళ్ళే అవుతారు.. వాళ్ళ బలహీనతలని ఎరగా వేసి తనకి కావాల్సింది సంపాదించుకుని మాయమైపోయే విషకంఠం, ఎక్కడో మరోచోట తేలి మరో రకం మోసానికి తెరతీస్తాడు. ఏ భాషనైనా తన మాతృభాష అనిపించేట్టు మాట్లాడడం, ప్రతిరోజూ దినపత్రికలు క్షుణ్ణంగా చదివి వార్తల్లో నుంచి ఐడియాలు తీసుకోవడం, అత్యంత శ్రద్ధగా తన పధకం అమలుచేసి, అంతే జాగ్రత్తగా మాయమవ్వడం అతని పధ్ధతి.


నగల దుకాణానికి వెళ్లి డబ్బిచ్చి ఓ ఉంగరం కొనుక్కుని, విలువైన వజ్రాల నెక్లెస్ కొట్టేయడం, ఓ కంపెనీలో తక్కువ జీతానికి ఉద్యోగంలో చేరి తక్కువ సమయంలోనే పద్నాలుగు లక్షలు తెలివిగా మాయం చేయడం... అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడా పోలీసులకి దొరక్కపోవడం ఇదీ విషకంఠం ప్రత్యేకత. ఇలాంటి గూటి పక్షే విరిజ. ఒకరినొకరు మోసం చేసుకోబోయి, దొరికిపోయి, అటుపై స్నేహితులు, ప్రేమికులు అయిపోతారు ఇద్దరూ. అప్పటివరకూ తన పథకాలని తనొక్కడే అమలు చేసుకున్న విషకంఠం, అటు తర్వాత విరిజని కూడా భాగస్వామిగా చేసుకుంటాడు.

తనకంటూ ఎవరూ లేని విషకంఠం తన సంపాదనని బంగారు బిస్కట్లుగా మార్చి జాగ్రత్తగా దాచుకుంటాడు. అతనా బిస్కట్లు ఎక్కడ దాచాడో తెలుసుకోవడం విరిజ లక్ష్యం. తన గురించి ఎన్నో విషయాలనీ, పథకాల అమలులో తీసుకునే శ్రద్దనీ పూసగుచ్చినట్టు చెప్పినా, బంగారు బిస్కట్ల విషయం మాత్రం రహస్యంగా ఉంచుతాడు. విషకంఠం గురించి బాగా తెలిసిన విరిజ తొందర పడదు. ఆ బంగారం తనకి దక్కక మానదని నమ్మకం ఆమెకి. అతని సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది విరిజ.

విషకంఠాన్ని పట్టుకోడాన్ని చాలెంజ్ గా తీసుకున్న పోలీసాఫీసర్ కృపాల్ ఎట్టకేలకి తన కృషిలో విజయం సాధించగలుగుతాడు. బంగారం రహస్యం విరిజకి చెప్పి జైలుకి వెడతాడు విషకంఠం. ఒకవేళ తను పోలీసులకి దొరికిపోతే విడిపించడానికి ఏం చేయాలో ముందుగానే ఆమెకి చెప్పి ఉంచుతాడు కూడా. ఇంతకీ విషకంఠం జైలు నుంచి బయట పడగలిగాడా? అతని శేషజీవితం ఎలా గడిచింది? దొరికిన సంపదని విరిజ ఏం చేసింది? ఇత్యాది ప్రశ్నలకి సమాధానం ఇస్తూ ముగుస్తుందీ నవల. కొన్ని విదేశీ క్రైమ్ కథల ప్రభావం ఉన్నట్టనిపిస్తుంది. ('బ్లఫ్ మాస్టర్' ప్రింట్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేదు).

మంగళవారం, ఆగస్టు 13, 2013

కథా సుగంధాలు

గంధం నాగరాజు పేరు చెప్పగానే 'గమ్యం' సినిమాలో సంభాషణలు గుర్తొస్తాయి. 'బాణం' 'సొంత ఊరు' లాంటి వైవిద్యభరిత సినిమాలూ అదే వరసలో గుర్తొస్తాయి. రాసింది తక్కువ సినిమాలకే అయినా, సినిమా సంభాషణల మీద తనదైన ముద్ర వేసిన నాగరాజు మొదట నాటక రచయిత. తర్వాత కథా రచయితగా ప్రయాణం సాగించి, సినీ రచయితగా ఎదిగి నలభై రెండేళ్ళ పిన్న వయసులోనే ప్రపంచాన్నివిడిచి పెట్టేశారు. నాగరాజు స్మృత్యర్ధం ఆయన రాసిన పదిహేను కథలతో వెలువరించిన సంకలనమే 'కథా సుగంధాలు.'

పుస్తకాన్ని చేతిలోకి తీసుకోగానే 'గమ్యం' సినిమా గుర్తు రావడం వల్ల కాబోలు, చాలా అంచనాలతో కథలు చదవడం మొదలు పెట్టాను నేను. అయితే, 'గమ్యం' సినిమా వరకూ నాగరాజు చేసిన సాహితీయానంలో ఈ కథలు రాశారన్న ఎరుక కలగడానికి ఎన్నో పేజీలు పట్టలేదు. రొమాన్స్, సెంటిమెంట్, హాస్యం అనే వర్గాలలో ఏదో ఒకదానిలో ఇమిడిపోయేలా ఉన్నాయి మెజారిటీ కథలు. ఇంకా చెప్పాలంటే, ఫలానా వర్గంలో కథ రాయాలి అని ముందుగానే అనుకుని ఆపై కథా రచన సాగించారేమో అనిపించింది.

'సృష్టి,' 'జీవితానికో పుష్కరం,' 'దుప్పటి' కథలు 'సరసమైన కథల' కేటగిరీలోకి వస్తాయి. వీటిలో గోదావరి పుష్కరాలు నేపధ్యంగా రాసిన 'జీవితానికో పుష్కరం' ఆకట్టుకునే కథ. తర్వాత నిలబడేది 'దుప్పటి' కథ. 'వెల్లవేసి చూడు,' 'పాకలహరి,' 'వెంకటప్పయ్య ట్రా(డ్రా)మా కేర్' హాస్య కథలు. పాత్రలు, సన్నివేశాల నుంచి హాస్యం పుట్టించడానికి రచయిత చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. వీటిలో, 'పాకలహరి' కథ భరాగో రాసిన 'వంటొచ్చిన మగాడు' కథని జ్ఞాపకం చేసింది.


'చెరువు,' 'జన్మభూమి,' 'క్షమయా ధరిత్రి' కథలు వ్యవసాయాన్ని, మరీ ముఖ్యంగా వ్యవసాయరంగ సంక్షోభాన్ని ఇతివృత్తంగా  రాసినవి. 'పునరావాసం' కథలో నక్సల్ ఉద్యమాన్ని స్పృశించిన నాగరాజు, 'అపరాజిత' కథని స్త్రీవాద కోణంలో రచించారు. 'అబార్షన్' కథ అబ్ స్ట్రాక్ట్ గా అనిపిస్తుంది. ట్రీట్మెంట్ విషయంలో మరికొంచం శ్రద్ధ పెడితే బాగుండేది అనిపించిన కథ 'రజ్జు సర్ప భ్రాంతి.' మానవనైజం ఇతివృత్తంగా సాగే కథ ఇది.

మొత్తం సంకలనంలో నన్ను బాగా ఆకట్టుకున్న కథ 'తెల్ల మచ్చల నల్ల క్రోటన్ మొక్క.' పేరులాగే కథలోనూ ఎంతో వైవిధ్యం ఉంది. అపరాధ పరిశోధన ఇతివృత్తంగా సాగే ఈ కథ ఆసాంతమూ ఊపిరి బిగపట్టి చదివించడమే కాదు, ఊహకందని ముగింపుతో ఆశ్చర్య పరుస్తుంది కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఒక్క కథ కోసం ఈ పుస్తకం కొనుక్కోవచ్చు అనిపించింది. మళ్ళీ మళ్ళీ చదివిన కథ ఇది.

మొత్తంగా చూసినప్పుడు కథల్లో వైవిధ్యం చూపడానికి నాగరాజు చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. ఇతివృత్తం మొదలు మాండలీకం వరకూ ప్రతి విషయంలోనూ ఏ రెండు కథలకీ పోలిక ఉండని విధంగా శ్రద్ధ తీసుకున్నారు. అయితే మితిమీరిన నాటకీయత, బలవంతపు హాస్యం కోసం చేసిన ప్రయత్నాలని తగ్గించుకుంటే మరింత బాగుండేది అనిపించింది.గంధం నాగరాజు కుటుంబం, స్నేహితులు కలిసి ప్రచురించిన ఈ సంకలనం అచ్చుతప్పులు ఎక్కువే. అయితే, నాగరాజు కథలు కను మరుగు కాకుండా ఉండడానికి చేసిన ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే. (పేజీలు 190, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

ఆదివారం, జులై 28, 2013

అందుకో నా లేఖ...

అమ్ములూ,

నాలుగు కాగితాలు ఉండచుట్టి పడేశాను.. ఎలా పిలవాలో తెలీక.. ఎదురుగా ఉన్నప్పుడు పిలవడం అన్నది ఎప్పుడూ ప్రత్యేకంగా అనిపించలేదు.. ఒకే ఒక్కసారి తప్ప!! కాపురానికి వచ్చిన రెండు వారాల తర్వాత, ఆషాఢమాసం వంకన పుట్టింటికి బయల్దేరడానికి రెండు వారాల ముందూ ఆవేళ ఉదయం నేను యదాలాపంగా 'అమ్మీ' అని పిలిస్తే ఎర్రగా చూశావు చూడు.. అలా చూసేసి విసురుగా తల తిప్పుకోగానే నీ బారు జడ మెడకి చుట్టుకుని బుగ్గని ముద్దాడినప్పుడు 'వాలు జడనైనా కాకపోతిని..' అని పాడుకున్నాను మూగగా.. మరీ.. ఇప్పుడు ఎవర్ని చూస్తున్నావలా చురచురా??

ఇంతకీ ఎలా ఉన్నావు... ఏం చేస్తున్నావు?? నీకేం, మీ వాళ్ళందరితోనూ సరదాగా గడిపేస్తూ ఉంటావు.. రోజులు గడుస్తున్నట్టే తెలియడం లేదు కాబోలు. నా పరిస్థితి ఏమిటో కనీసం ఒక్కసారన్నా ఆలోచించావా.. పున్నమి కదా అని నిన్నరాత్రి డాబా మీదకి వెళ్లి చందమామని చూడబోతే, మబ్బు చాటు చంద్రుడు నన్ను చూసి నవ్వినట్టు అనిపించింది. ఒక్క చంద్రుడేనా, ఎవర్ని చూసినా నన్ను చూసి నవ్వుతున్నారేమో అని ఒకటే అనిపించేస్తోంది. ఎందుకు నవ్వుకుంటున్నారో అని అద్దంలో మొహం చూసుకోవాలని కూడా అనిపించడం లేదు. అసలు ఏ పనిమీదకీ దృష్టి పోవడం లేదు తెలుసా.

నాలుగేళ్ల నుంచీ ఈ క్వార్టర్స్ లో ఉంటున్నా నాకు తెలిసిన వాళ్ళు తక్కువే.. నువ్వొచ్చి అందరినీ ఇట్టే పరిచయం చేసేసుకుని, స్నేహం కూడా కలిపేశావు. అందరికీ ఏం చెప్పావో తెలీదు కానీ, రోజుకో కేరియర్ వస్తోంది.. చుట్టుపక్కల వాళ్ళ దగ్గరనుంచి. కూరలు, పులుసుల మొదలు, అవియల్, కూటు వరకూ... కేరియర్ విప్పిన ప్రతిసారీ ఒక్కటే ఆలోచన.. 'నువ్వు కూడా ఉంటే...' ...ఈ ఆలోచనే నా గొంతుకి అడ్డం పడిపోతోంది. కనీసం మరో రెండు వారాలు ఆగాలి నీతో కలిసి గడపాలంటే.. ఎప్పటికి గడుస్తాయో కదూ.. ఉదయం నుంచి సాయత్రం వరకూ బాగానే గడిచిపోతోంది, ఆఫీసు పుణ్యమా అని. కానీ, సాయంత్రం నుంచి ఉదయం వరకూ గడపడం నా వల్ల కావడం లేదు. ప్చ్...

రోజూ ఆఫీసు నుంచి వస్తూ నాకు తెలియకుండానే పూలకొట్టు ముందు ఆగిపోతున్నాను.. ఇంట్లో నువ్వు లేవన్న విషయం గుర్తొచ్చి మళ్ళీ బయల్దేరుతున్నా.. అదిగో.. అలా నన్నుచూసి నవ్వుకునే వాళ్ళలో పూలమ్మి కూడా చేరిపోయింది. ఏం చేయనూ ఇంటికి వచ్చి? క్వార్టర్స్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా.. ఆడుకుంటున్న పిల్లల్ని చూసినప్పుడు, కొన్నేళ్ళు గడిచేసరికి మన పిల్లలూ వాళ్ళలో ఉంటారన్న ఊహ తోస్తుంది. నిన్న మొన్నటి వరకూ నేను... ఇప్పుడు నువ్వు-నేను.. కొన్నేళ్ళు గడిచేసరికి మనం.. తలచుకుంటే ఆశ్చర్యంగా అనిపించే నిజం కదూ ఇది..

నువ్వు రాకముందు గడిపిన జీవితం ఆలోచనలోకి కూడా రావడం లేదంటే నమ్ముతావా? ప్రతి ఆలోచనా మనం కలిపి గడిపిన రోజుల చుట్టూనే తిరుగుతోంది. వచ్చిన రోజు సాయంత్రమే షికారుకని బయల్దేరదీసి పూల మొక్కలు కొనిపించావు చూడూ.. అవే ఇప్పుడు నాకీ ఇంట్లో తోడు. గులాబీ మొగ్గ తొడుగుతోంది. ఎరుపా, గులాబిరంగా అన్నది ఇంకా తెలియడం లేదు. జాజితీగ నెమ్మదిగా పాకుతోంది, తాడు మీదకి. వర్షాలు బానే పడుతున్నాయి కదా... నీళ్ళు పోసే పని ఉండడం లేదు.. వెళ్తూ వెళ్తూ నువ్వు చెప్పిన జాగ్రత్తలు మాత్రం పూటా గుర్తొస్తున్నాయి.. వాకిట్లో మొక్కలు ఎండిపోతూ ఉంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారమ్ములూ?

నిన్ను చూడాలని బాగా అనిపిస్తోంది.. ఏ అర్ధరాత్రో కలత నిద్ర నుంచి మెలకువ వచ్చినప్పుడు అప్పటికప్పుడే బయల్దేరి నీ దగ్గరికి వచ్చేయాలని యెంతగా అనిపిస్తుందో.. అదేం ఊరసలు? వంక పెట్టుకుని వద్దామన్నా ఎవరూ చుట్టాలూ, స్నేహితులూ లేని ఊరు.. మా ఆఫీసే కాదు, ఆ చుట్టుపక్కల ఐదూళ్ళలో అసలు ఏ ఆఫీసూ లేనే లేదు కాబట్టి 'ఆఫీసు పని' అని వంక పెట్టడానికి అస్సలు కుదరదు. పోనీ, గోదారికి వరదలు కదా.. ఎలా ఉన్నారో చూద్దామనీ అని వంక పెడదాం అంటే, 'ఎంత పెద్ద వరదొచ్చినా మా ఊరికి ఏమీ అవ్వద'ని పెళ్లి చూపులప్పుడే చెప్పేశారు మీవాళ్ళు. ఎన్నో జాగ్రత్తలు చెప్పావు కానీ, ఏ వంక పెట్టుకుని నిన్ను చూడ్డానికి రావాలో ఉపాయం చెప్పావు కావు..

చూస్తాను చూస్తాను... నేరుగా వచ్చేసి, "మీ అమ్మాయి ఉన్నఫళంగా రమ్మని ఉత్తరం రాసిందండీ" అని చెప్పేస్తాను.. ఇంటికొచ్చిన అల్లుడిని వెళ్ళిపొమ్మని చెప్పలేరు కదా.. వేరే ఏ దారీ దొరక్కపోతే ఇదే దారి.. మళ్ళీ, ముందుగా చెప్పలేదని నన్ను సాధించకుండా ఇప్పుడే చెప్పేస్తున్నా... అప్పుడు తెల్లముఖం వెయ్యకూడదు.. తెలిసిందా... ఉహు... ఉత్తరం ముద్దులు ఇవ్వదల్చుకోలేదు నీకు.. అన్నీ నేరుగానే... వచ్చేస్తున్నానూ...

నీ
-నేను

శుక్రవారం, జులై 05, 2013

జర్నీ ముచ్చట్లు

టైటిల్ చూసి ఇదేదో మా గోదారమ్మాయి అంజలి పొడవు జడతో నటించిన 'జర్నీ' సినిమా గురించిన పోస్టు అనుకోవద్దని మనవి.. (ఆ అమ్మాయి కన్నా, జడే ఎక్కువగా నటించేసిందని నా అనుకోలు).. మరి పోస్టు దేనిగురించీ అంటే.. ప్రయాణాల గురించి.. మరీ ముఖ్యంగా బస్సు ప్రయాణాల గురించి.. ప్రయాణాల్లో ఎదురయ్యే పదనిసల గురించీ అన్నమాట.. సాంకేతిక పరిజ్ఞానం బాఘా పెరగడం వల్ల అనేకానేక ప్రయోజనాలు ఉన్నాయి కానీ, బస్సు ప్రయాణాల్లో మాత్రం బోల్డన్ని ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. సమస్య పరిజ్ఞానంతో కాదు, దాన్ని సరిగ్గా వాడుకోక పోవడంతో.. అదికూడా ఎలా వాడకూడదో తెలిసీ అలాగే వాడడం వల్ల అనిపిస్తూ ఉంటుంది, కొన్ని కొన్ని అనుభవాలు ఎదురైనప్పుడు.

సెల్ఫోన్ల లో కేవలం పాటలు మాత్రమే వినిపించేవి నిన్న మొన్నటివరకూ.. త్రీజీ పుణ్యమా అని ఇప్పుడు సర్వమూ కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఈ వినిపించడం అన్నది కేవలం మనకు మాత్రమే జరిగేందుకు వీలుగా ఇయర్ ఫోన్లు, బ్లూటూత్ లు ఉన్నాయి. కానైతే, వీటిని వాడేవాళ్ళు కొద్దిమందే.. ప్రయాణాల్లో అయితే అతికొద్దిమంది. బస్సులో కనీసం ఒకరో ఇద్దరో నిస్వార్ధ పరాయణులైన అవుత్సాహిక ప్రయాణికులు ఉంటారు. 'కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ' టైపులో వీళ్ళ ఆనందం మొత్తం ప్రపంచానికి ఆనందం కావాలి అని మనసా వాచా కోరుకుంటారు. అందు నిమిత్తం, స్పీకర్ ఆన్ చేసి మరీ వాళ్ళ ఫోన్ లో ఉన్న పాటల్ని మిగిలిన ప్రయాణికులు అందరికీ వినిపిస్తూ ఉంటారు.

'తెల్లారితే వీళ్ళందరూ తలోచోటికీ వెళ్ళిపోతారు కదా... మనదగ్గరున్న పాటలన్నీ ఇప్పుడే వినిపించేద్దాం' అనే ఆత్రుత కొద్దీ, అర్ధ రాత్రుళ్ళు సైతం తమ రాగయాగాన్ని నిరంతరాయంగా కొనసాగించేసే ఈ అవుత్సాహికుల వల్ల కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. మరీ ముఖ్యంగా పగలంతా పనిచేసుకుని రాత్రి బస్సులో చిన్నదైనా ఓ కునుకు తీసేద్దాం అని ప్లాన్ చేసుకున్న వాళ్ళకీ, తెల్లారితే ఊపిరి సలపని పనులు కాబట్టి ప్రయాణంలోనే కూసింత రెస్టు తీసుకుందాం అనుకున్న వాళ్ళకీ ఈ పాటలు ఆనందానికి బదులు చిరాకుని మిగులుస్తాయి. పెద్దగా చదువుకొని వాళ్ళైతే ఒక్కసారి చెప్పగానే అర్ధం చేసుకుని, ఇయర్ ఫోన్లు పెట్టుకోడమో లేదా పాటలు ఆఫ్ చేయడమో చేస్తారు. అదే వెల్-ఎడ్యుకేటేడ్ వాళ్ళైతే డ్రైవర్ కి కంప్లైంట్ చేయాల్సిందే. అప్పుడు కూడా "ఐ టూ బాట్ ది టికెట్" లాంటి ఆర్గ్యుమెంట్లు వినాల్సి ఉంటుంది.

దూరదర్శన్ రోజుల్లో కుర్చీలో కూచోబెట్టి కాళ్ళూ చేతులూ కట్టేసి మరీ పందుల పెంపకం కార్యక్రమం నిర్బంధంగా చూపించడం లాంటి కార్టూనులు వచ్చేవి పత్రికల్లో. అలాంటి నిర్బంధ సినిమా వీక్షణం ఒకటి బస్సు ప్రయాణాల్లో తరచూ సంభవిస్తూ ఉంటుంది. బస్సులో వేసే సినిమా మొదలు, సౌండ్ వరకూ దేనిలోనూ ప్రయాణికుల ప్రమేయం ఉండదు. మొన్న ఓ ప్రయాణంలో ఓ కొత్త సినిమా చివరి అరగంటా చూశాను. అప్పుడే చదువు పూర్తిచేసుకున్న ఓ పాతికేళ్ళ అమ్మాయి, తనకి కార్లో లిఫ్ట్ ఇచ్చిన తన తండ్రి వయసు హీరోతో ప్రేమలో పడిపోతుంది, అతగాడు చెప్పిన ఫ్లాష్ బ్యాక్ విని. ప్రేమ గుడ్డిది.. ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా అబద్ధం అని తెలిసి అతనిమీద పగ పెంచుకుంటుంది.. ప్రేమ ప్రతీకారాన్ని కోరింది... తల్లిదండ్రులు ఆ పిల్లని ఆమె ఈడువాడే అయిన మరియు బాల్యం నుంచీ ఆమెని ప్రేమించేస్తున్న ఆమె బావతో నిశ్చితార్ధం ఏర్పాట్లు చేస్తారు. ఈ బావేమో, తండ్రి వయసు హీరోనే నీకు సరైన వాడు, నేను తగను అని పక్కకి తప్పుకుంటాడు.. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది.. సినిమా మాత్రం ప్రేక్షకుల తలనొప్పిని కోరింది.

చివరి అరగంటలోనే ఇంత కథ జరిగిపోతే, ముందు గంటన్నర లోనూ దర్శకుడు ఏం చెప్పాడా? అన్న కుతూహలం ఎంతైనా కలిగింది. చూసిన ఒకే ఒక్క పాట ఆధారంగా గూగుల్ చేసి సినిమా పేరు తెలుసుకున్నాను.. చూసే ధైర్యం మాత్రం చేయలేకపోతున్నా.. మళ్ళీ ఏదన్నా ప్రయాణంలో మొత్తం సినిమా చూడాల్సి వస్తుందేమో అన్న భయం మాత్రం కలుగుతోంది. టీవీ ఉన్న బస్సు, టీవీ లేని బస్సు అన్న చాయిస్ ఉంటే బాగుండును కదా అని బలంగా అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి సినిమాలకి బలి అయినప్పుడల్లా.. ఒంటరి ప్రయాణంలో పక్కసీటు ప్రయాణికుడు ఫేస్ బుక్ అప్డేట్ల బాపతు అయితే ఆ కష్టం అంతా ఇంతా కాదు.. ఏ కొందరు పుణ్యాత్ములో ఉంటారు, సౌండ్ ఆప్షన్ తీసేసేవాళ్ళు. మిగిలిన జనాభా మాత్రం వాళ్లకి అప్డేట్ వచ్చిన విషయాన్ని చుట్టుపక్కల అందరికీ వినిపించేంత సౌండ్ కనీసం ఉంచుతారు డివైస్ కి.

టెక్నాలజీ తో సంబంధం లేని సమస్యలూ తక్కువేమీ కాదు. ఆ మధ్య ఓ ప్రయాణం లో ఓ తల్లీ కొడుకూ బస్సెక్కారు. కొడుక్కి యాభై, తల్లికి డెబ్భై ఐదు పైమాటే. అంత పెద్దావిడ బస్సులో ప్రయాణం చేస్తున్నారు కదా అనుకున్నా, ఆవిడ కర్ర సాయంతో బస్సు ఎక్కుతుంటే. అనుకోకుండా వాళ్ళది మా వెనుక సీటే. మనిషి వంగిపోయినా గొంతు మాత్రం భానుమతి, యెస్. వరలక్ష్మిల వారసత్వంలో వచ్చిందన్న విషయం అర్ధం కాడానికి ఎక్కువ టైం పట్టలేదు. గొంతు విషయంలో కొడుక్కి అచ్చం తల్లిపోలికే. ప్రయాణం పూర్తయ్యేసరికి వాళ్ళ ఉమ్మడి కుటుంబ రాజకీయాలు, బంగారం వెండి పంపకాల గురించి బస్సు యావత్తుకీ ఎన్ని విషయాలు తెలిశాయో చెప్పలేను. "మేం కాసేపు పడుకుంటాం" అని ఒకరిద్దరు నిర్మొహమాటులు నోరు తెరిచి అడిగేసినా లాభం లేకపోయింది. అర్ధం అయిన విషయం ఏమిటంటే, అటు తల్లి కానీ ఇటు కొడుకు కానీ ఐదు నిమిషాల కన్నా ఎక్కువసేపు మౌనంగా ఉండలేరు. ఇలా చెప్పుకుంటూ వెడితే వీటికి అంతం కనిపించదు కాబట్టి ఇక్కడితో ఆపుతున్నా...

శనివారం, జూన్ 15, 2013

మూడు ముగింపులు...

రచయిత సత్తా ఉన్నవాడైతే ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వచ్చినా ఎక్కడా పునరుక్తి అన్న భావన కలగకుండా రక్తి కట్టిస్తాడు అనడానికి ఉదాహరణ జంధ్యాల. నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చిన జంధ్యాల ఒకే విషయాన్ని మూడు సినిమాలలోని సన్నివేశాల్లో చెప్పారు.. మూడింటిలోనూ అవి పతాక సన్నివేశాలే.. సినిమాకి ప్రాణం అయిన సన్నివేశాలే. అయితేనేం.. చూసే ప్రేక్షకుడిని ఒప్పించడం మాత్రమే కాదు, 'ఈ విషయాన్ని ఇంతకన్నా బాగా మరోవిధంగా చెప్పడం సాధ్యమేనా?' అన్న ప్రశ్న వచ్చేలా రాయడం జంధ్యాల ప్రతిభకి నిదర్శనం. తను అర్దాయుష్కుడై మన మధ్య నుంచి వెళ్ళిపోయినా, జంధ్యాల రాసిన సినిమాల్లో కొన్ని చిరంజీవులుగా మిగిలిపోయేవి ఉండడం ఒక్కటే సంతోషించాల్సిన విషయం.

కె. విశ్వనాథ్ 'సిరిసిరిమువ్వ' తో జంధ్యాల సంభాషణల రచయితగా పేరు తెచ్చుకుని స్థిరపడ్డ నాలుగేళ్ళకి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక విచిత్రం జరిగింది. ఇద్దరు ప్రముఖ దర్శకులు ఒకేలాంటి కథతో సినిమాలు తీశారు. అంతేకాదు, ఇద్దరూ కూడా సంభాషణలు రాయడానికి జంధ్యాలనే ఎంచుకున్నారు. రెండు సినిమాలకీ కూడా ముగింపే ప్రాణం. వీటిలో మొదటిది, జంధ్యాల సినీ రంగ గురువు విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'సప్తపది' సినిమా. ఓ బ్రాహ్మణ యువతికీ, హరిజన యువకుడికీ మధ్య ప్రేమ మొలకెత్తి మొగ్గతొడగడం ఇతివృత్తం. ఈ ప్రేమ సంగతి తెలియక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న మేనబావ, తను ఆమెతో కాపురం చేయలేక, ఆ హరిజన యువకుడికి ఆమెని అప్పగించడం ముగింపు.


"చాతుర్వర్ణం మయాసృష్టం..." వరకూ మాత్రమే గీతాకారుణ్ణి గుర్తు చేసుకునే వాళ్లకి, "గుణ కర్మ విభాగచ..." అని చెప్పింది కూడా ఆ శ్రీకృష్ణుడే అని గుర్తు చేయడం మాత్రమేకాదు, వర్ణాశ్రమ ధర్మాల మర్మాన్ని వివరిస్తూ జంధ్యాల రాసిన సంభాషణలే 'సప్తపది' సినిమాని నిలబెట్టాయి అనడం అతిశయోక్తి కాదు. ఈ సంభాషణలని జెవి సోమయాజులు చేత పలికించడం వల్ల, జంధ్యాల రాసిన మాటలకి మరింత నిండుతనం వచ్చి, ప్రేక్షకులకి చేరువయ్యాయి. 'సప్తపది' సినిమా మొత్తం ఒక ఎత్తు, ముగింపు సన్నివేశం ఒక్కటీ ఒక ఎత్తు. జంధ్యాల అక్షరాలా కత్తిమీద సాముచేసి రాశారు అనిపించక మానదు.

అదే సంవత్సరం విడుదలైన మరో ప్రేమకథా చిత్రం 'సీతాకోక చిలుక.' తమిళ దర్శకుడు భారతీ రాజా తమిళ, తెలుగు భాషల్లో తీశారీ సినిమాని. ఓ పేద బ్రాహ్మణ యువకుడికీ, ధనవంతురాలైన క్రైస్తవ అమ్మాయికీ మధ్య ప్రేమ పుట్టి పెరగడం అన్నది ఇతివృత్తం. నాయికనాయకులిద్దరూ వయసురీత్యా చిన్న వాళ్ళు, అస్వతంత్రులు. నాయకుడి పేదరికం, ఇద్దరి మతాలతో పాటు, వాళ్ళ వయసు కూడా అడ్డంకే వాళ్ళ ప్రేమకి. నాయిక సోదరుడు డేవిడ్ వ్యక్తిగా ఎలాంటి వాడైనా, మతం విషయంలో పట్టింపు బాగా ఎక్కువ. అతడితో పాటు, ఊరి వాళ్ళందరినీ ఒప్పించే బాధ్యతని ఓ చర్చి ఫాదర్ తీసుకుంటారు. ఓ తెల్లవారు ఝామున ప్రేమ జంటని తరుముకుంటూ సముద్రం ఒడ్డుకు వచ్చిన ఊరి వాళ్ళందరికీ, మతం కన్నా ప్రేమే గొప్పదని చెప్పి ఒప్పిస్తారు ఆ ఫాదర్.


"అన్ని మతాలూ ప్రేమని బోధిస్తాయి..." అంటూ సాగే సంభాషణలు పలికింది కళా వాచస్పతి కొంగర జగ్గయ్య. చర్చి ఫాదర్ గా అతిధి పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాలో. నాయికా నాయకుల ప్రేమ గురించి డేవిడ్ ని, ఊరి వాళ్ళనీ మాత్రమే కాదు, సినిమా చూసే ప్రేక్షకుల్నీ ఒప్పిస్తారు. "ఇలాంటి సన్నివేశాన్నే సప్తపది లో చూశాం.. అక్కడా ఇవే డైలాగులు" అన్న భావన ప్రేక్షకుల్లో కలిగేందుకు ఏమాత్రం ఆస్కారం లేని విధంగా ఉంటాయి జంధ్యాల రాసిన సంభాషణలు. 'సప్తపది' లో ఊరిని ఒప్పించే వృద్ధుడు ఆలయ పూజారి మాత్రమే కాదు, నాయికకి స్వయంగా తాతగారు. కానీ ఇక్కడ చర్చి ఫాదర్ ఎవరికీ బంధువు కాదు.. కానీ ఊరందరి మంచీ కోరే వ్యక్తి. ప్రేమించడం తప్పుకాదని నమ్మే మనిషి.

ఈ రెండు సినిమాలూ విడుదలైన సంవత్సరమే, 'ముద్దమందారం' తో దర్శకుడిగా మారారు జంధ్యాల. మరో ఆరు సంవత్సరాల తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'పడమటి సంధ్యారాగం.' ఇది ఖండాంతర ప్రేమకథ. తెలుగమ్మాయి సంధ్యకీ, అమెరికన్ కుర్రాడు క్రిస్ కీ మధ్య పుట్టిన ప్రేమ. సంధ్య తండ్రి ఆదినారాయణ ఛాందసుడు. దేశం విడిచి పెట్టడానికే ఇష్ట పడని వాడు. అలాంటిది, కూతురు ఒక తెల్లవాడితో ప్రేమలో పడిందన్న విషయం తెలిసి తట్టుకోలేక పోతాడు. ఇండియా తిరిగి వెళ్ళిపోతాడు. సంధ్య-క్రిస్ దంపతులు తమకి పుట్టిన కూతురిని ఆదినారాయణ దగ్గర ఉంచి, ఆయన్ని పెంచమంటారు. తాతయ్య పెంపకంలో పెరిగిన ఆ పిల్ల అనిత, తండ్రి మీద ద్వేషం పెంచుకుంటుంది.. తల్లినీ ఈసడించుకుంటుంది.


అనిత టీనేజ్ కి వచ్చేసరికి, ఆదినారాయణ పరమపదించడంతో, అంత్యక్రియల నిమిత్తం ఇండియా వస్తారు సంధ్య, క్రిస్. తమపట్ల అనిత విముఖత చూసి బాధ పడ్డ సంధ్య, తన కూతురికి తన ప్రేమ కథ మొత్తం చెప్పడంతో పాటు, క్రిస్ మతం విషయం లో అనితకి ఉన్న అభ్యంతరాలకీ జవాబులు చెప్పి, మతం కన్నా మానవత్వం గొప్పదని చెబుతుంది. 'సప్తపది' 'సీతాకోక చిలుక' లలో కులం, మతం గురించి ఊరందరినీ ఒప్పించే విధంగా ఉండే సంభాషణలు రాసిన జంధ్యాల, ఈ సినిమాలో తండ్రి మతాన్ని గురించీ, దేశాన్ని గురించీ తల్లి కూతురుకి చెప్పడం అన్న సందర్భాన్ని గమనంలో ఉంచుకుని రాశారీ డైలాగులు. మిగిలిన రెండు సినిమాల్లోని సన్నివేశాలతో పోల్చినప్పుడు, ఈ సన్నివేశం లో వచ్చే డైలాగులు 'లౌడ్' గా లేకపోవడం గమనించవచ్చు. (జూన్ 19 కి జంధ్యాల మనల్ని విడిచిపెట్టి పుష్కర కాలం పూర్తవుతోంది).

బుధవారం, జూన్ 12, 2013

ఆకెళ్ళ కథలు

వంటి పేరుతో కాక, ఇంటి పేరుతో ప్రసిద్ధులైన కథా, నాటక, సినిమా రచయిత ఆకెళ్ళ. వెంకట సూర్యనారాయణ అంటే తెలియని ఉంటారేమో కానీ, తెలుగు నాట సాహిత్యం, సినిమా, టీవీ, రంగస్థలంతో ఏ కొద్ది పరిచయం ఉన్నవారైనా ఆకెళ్ళ పేరు వినగానే గుర్తుపడతారు. సెంటిమెంట్ ప్రధానంగా రచన చేయడంలో ఆకెళ్ళది అందెవేసిన చేయి. 'స్వాతిముత్యం' 'శ్రుతిలయలు' 'సిరివెన్నెల' లాంటి సినిమాలకి రచన చేసినా, 'శ్రీనాధుడు' లాంటి పద్య నాటకాలు, సాంఘిక నాటికలు రాసి రాష్ట్ర ప్రభుత్వం నుంచీ నంది అవార్డులు అందుకున్నా అది ఆకెళ్ళ లోని బహుముఖీన సాహితీ ప్రజ్ఞకి నిదర్శనం. ఆకెళ్ళ రాసిన ఇరవై ఒక్క కథలతో వెలువడిన సంకలనమే 'ఆకెళ్ళ కథలు.'

ఎనభయ్యో దశకంలో తెలుగు నాట ఆకెళ్ళ కథ ప్రచురించని పత్రిక లేదనడం అతిశయోక్తి కాదు. ఆకెళ్ళ ముమ్మరంగా కథా రచన చేసిన కాలం కూడా అదే. అటు తర్వాత సినిమా రంగానికి, అక్కడి నుంచి నాటక రంగం మీదుగా బుల్లితెరకీ ప్రయాణించారీ కాకినాడ వాసి. ఎనభయ్యో దశకపు తెలుగు కథా సాహిత్యం అనగానే మొదట గుర్తొచ్చేవి మధ్యతరగతి జీవితాలు, నిరుద్యోగి కుర్రాళ్ళు, చిరుద్యోగి తండ్రులు, పెళ్ళికి ఎదిగొచ్చిన ఆడపిల్లలు పట్నవాసాల్లోనూ, పని వాళ్ళని పురుగుల్లా చూసే కామందులు, కొండొకచో ఎర్రజెండా సౌజన్యంతో చైతన్యవంతులై యజమానులకి బుద్ధి చెప్పే పనివాళ్ళూ పల్లెటూళ్ళ లోనూ కనిపించిన కాలం. ఈ కాలంలో రాసిన కథల్లో నుంచి కాల పరిక్షకి నిలబడ గలిగే వాటిని ఎంచి సంకలించారు ఆకెళ్ళ.

కథ చెప్పే పద్ధతిలోనూ, అక్కడక్కడా సంభాషణల్లోనూ కనిపించే కూసింత నాటకీయతని మినహాయించుకుంటే, ఏకబిగిన చదివించే కథలు ఇవన్నీ. తన తరంతో తన సంప్రదాయం అంతరించిపోతుందని బాధ పడే ఓ తండ్రి కథ 'కాలం కత్తెరలో' లో మొదలయ్యే ఈ సంకలనం, తన పగటి వేషాలతో ఎందరినో మెప్పించినా, జీవన యవనికపై భర్త వేషాన్ని రక్తి కట్టించ లేకపోయానని, తన భార్య అంతిమ ఘడియల్లో బాధ పడే భర్త యాజీ కథ 'సహస్ర ప్రయాణం' లో ముగుస్తుంది. కథలే కాదు, వాటికి పెట్టిన పేర్లూ ఆలోచింపజేస్తాయి. సంపుటిలో రెండో కథ 'చంద్రగ్రహణం,' ఎమ్వీఎస్ హరనాధ రావు రాసిన 'లేడి చంపిన పులి నెత్తురు' కథని జ్ఞాపకం చేసింది. (ఈ కథ ఆధారంగానే రాజేంద్రప్రసాద్-యమునలతో 'ఎర్ర మందారం' సినిమా తీశారు).



అలాగే, కాళీపట్నం రామారావు ప్రముఖ కథ 'యజ్ఞం' ను గుర్తుచేసిన కథ 'రాక్షసి బొగ్గు.' అయితే, ఇక్కడ రెండు కథలకీ పోలిక రేఖా మాత్రమే. 'కాముని పున్నమి' కథ చదువుతున్నప్పుడు బుచ్చిబాబు రచనలు, 'గొలుసు' కథ చదువుతున్నప్పుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలూ అప్రయత్నంగా గుర్తొచ్చాయి. పేదల బతుకుల గురించి రచయిత రాసిన తీరు, కనబరించిన ఆవేశం రావిశాస్త్రి రచనలని జ్ఞాపకం చేశాయి. "శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్ర రచనలు, రాచకొండ కథలు నేను రచయిత కావడానికి ప్రేరకాలుగా నిలిచాయి" అన్నారు రచయిత తన ముందుమాటలో. ఆకెళ్ళ యెంత అలవోకగా కథలు రాసేసేవారో గుర్తు చేసుకున్నారు ఆయన మిత్రుడు చెరుకువాడ సత్యనారాయణ తన 'ఆప్తవాక్యం' లో.

టైం మిషిన్ ఎక్కి ముప్ఫై ఏళ్ళు వెనక్కి ప్రయాణం చేసినట్టు అనిపిస్తుంది ఈ కథలు చదువుతూ ఉంటే. ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాల్సిన ఆడపిల్లల తండ్రులు - మరీ ముఖ్యంగా అంది వచ్చిన కొడుకు కోడలితో కలిసి వేరు కాపురం పెట్టేసిన వాళ్ళు - చాలా కథల్లోనే కనిపిస్తారు. 'తోలు బొమ్మలు' 'సంకెళ్ళు' కథలు ఉదాహరణలు. అమెరికా యుద్ధ దాహాన్ని ప్రతీకాత్మకంగా చెప్పిన కథ 'యుద్ధం.' ఓ పల్లెటూరి దీపావళి సంబరాలని అంతర్జాతీయ సమస్యతో ముడిపెట్టి చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. 'చీకట్లో శిఖండి' 'లవ్ గేమ్' 'ఆకలిబల్లి' 'గంతలు' లాంటి వైవిద్యభరితమైన కథలు ఉన్నాయీ సంకలనంలో. అలాగే, పేద-ధనిక తారతమ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథలూ ఎక్కువే - 'చేటపెయ్య' 'అడ్డుకట్ట' 'స్ట్రా' లాంటివి.

ఆకెళ్ళ కథలు క్లుప్తంగా ఉంటాయి. ఆరంభం, ముగింపు ఆకట్టుకుంటాయి. సుదీర్ఘమైన సంభాషణలు ఉండవు. ఈ కథలు చదువుతుంటే రంగస్థలం మీద ఓ నాటికను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. రచనా కాలాన్ని గుర్తుపెట్టుకుని చదివితే నాటకీయత పెద్దగా ఇబ్బంది పెట్టదు. రచయిత శ్రద్ధ తీసుకున్న మరో అంశం ముగింపు. కొన్ని కథల ముగింపు ఆశ్చర్యపరిస్తే, చాలా కథల విషయంలో ముగింపు ఆలోచనలో పడేసేదిగా ఉంది. "వీటిలో పన్నెండు కథలు మళ్ళీ మళ్ళీ చదవదగ్గవి ఉన్నాయి" అంటూ ముందుమాటలో రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య చెప్పిన మాటతో ఏకీభవిస్తాం, పుస్తకం పూర్తిచేశాక. ('ఆకెళ్ళ కథలు,' విశ్వశాంతి పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 154, వెల రూ. 90, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, జూన్ 10, 2013

రెండు మహానగరాలు

అనువాద సాహిత్యం చదివే పాఠకులని ఇబ్బంది పెట్టే మూడు విషయాలు..పాత్రల పేర్లు, ప్రాంతాల పేర్లు, వారు ఉపయోగించే భాష. అనువాదం ఎంత సరళంగా ఉన్నా, చదువుతున్న నవల పరాయిది అన్న భావన కలుగుతూనే ఉంటుంది ఈ మూడు విషయాల్లోనూ. మొదటి రెంటినీ మార్చడం ఎటూ సాధ్యపడదు. మూడోదైన భాషని ఆసాంతమూ తెనిగించి, 'విదేశీ పాత్రలు స్వచ్చమైన తెలుగుని ఇంచక్కా మాట్లాడుతున్నాయే..' అన్న ఆశ్చర్యాన్ని పాఠకులకి కలిగించిన అనువాద రచయిత తెన్నేటి సూరి. పాత్రల మధ్య సంభాషణల్లోనే కాదు, కథ చెప్పడానికీ, సన్నివేశాల వర్ణనకీ జాను తెనుగుని ఇంత బాగా ఉపయోగించిన అనువాద రచయిత మరొకరు లేరేమో అన్న సందేహం కలగక మానదు, 'రెండు మహానగరాలు' చదువుతూ ఉంటే.

ఫ్రెంచి విప్లవాన్ని నేపధ్యంగా తీసుకుని చార్లెస్ డికెన్స్ 1859 లో రాసిన 'ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్' ని 'రెండు మహానగరాలు' పేరిట తెనిగించారు అభ్యుదయ కవి తెన్నేటి సూరి. మాతృకలో ఏ కొద్ది భాగాన్ని చదివిన వారికైనా, సూరి తన అనువాదాన్ని మక్కీకి మక్కీగా కాక, మొత్తం నవలని మళ్ళీ మళ్ళీ చదివి, జీర్ణించుకుని, తనదైన శైలిలో తిరగరాశారని ఇట్టే బోధ పడుతుంది. ఇప్పుడిప్పుడు వాడుక భాషనుంచి కూడా నెమ్మదిగా తప్పుకుంటున్న 'ఇక్ష్వాకుల కాలం నాటి' 'అహోబల బిలం' 'డచ్చీలు చరవడం' లాంటి ఎన్నో ప్రయోగాలు ఈ నవల్లో అడుగడుగునా కనిపిస్తాయి. పాత్రల పేర్లు, సంఘటనా స్థలాలని బట్టి విదేశీ నవల అనుకోవాలే తప్ప, ఇంకెక్కడా అనువాదం అన్న భావన కలగనివ్వలేదు రచయిత.

ఫ్రెంచి విప్లవం ప్రారంభానికి ముందు ఉన్న పరిస్థితులు, విప్లవం తీరుతెన్నులతో పాటు, నాటి ఇంగ్లండు నగరం స్థితిగతులనీ వర్ణిస్తుందీ నవల. "అది ఒక వైభవోజ్వల మహాయుగం - వల్లకాటి అధ్వాన్న శకం; వెల్లివిరిసిన విజ్ఞానం - బ్రహ్మజెముడులా అజ్ఞానం; భక్తీ విశ్వాసాల పరమపరిధనం - పరమ పాశందాల ప్రల్లద కల్లోలం..." అంటూ కవితాత్మకమైన వచనంతో నవలని మొదలు పెట్టి "గవిడిగవదల ఓ రాజూ, గాజుకళ్ళ ఓ రాణీ ఇంగ్లండు లోనూ, గవిడిగవదల ఓ రాజూ, కలువ కన్నుల ఓ రాణి ఫ్రాన్సులోనూ రాజ్యం చేస్తున్నారు" అంటూ నేరుగా కథలోకి తీసుకుపోతారు రచయిత. ఇది దేశ భక్తుడైన డాక్టర్ మానెట్ కథ. ఫ్రాన్సు జమీందార్ల దురాగతాలకు ప్రత్యక్ష సాక్షి అయిన మానెట్ సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితం గడపాల్సి వస్తుంది.


మానెట్ నూ, అతని కూతురు లూసీనీ కలిపే బాధ్యత తీసుకుంటాడు టెల్ సన్స్ బ్యాంక్ ఉద్యోగి లారీ. ఖాతాదారుల క్షేమం కోసం తపించే టెల్ సన్స్ బ్యాంకు, వారికి అవసరమైన అన్ని సేవలనూ నమ్మకంగా అందిస్తుంది. మానెట్ జైలుకి వెళ్ళాక, అతని కూతురు పెంపకం బాధ్యత గమనించడంతో పాటు, ఆయన జైలు నుంచి విడుదల అయ్యాడని తెలిశాక ఆ తండ్రీ కూతుళ్ళని కలిపే పనినీ బ్యాంకు తన భుజాన వేసుకుంటుంది. ఏకాకి జైలు జీవితంలో వెలుతుర్ని పూర్తిగా మర్చిపోయిన మానెట్ దాదాపు పిచ్చివాడిగా జైలు నుంచి బయటికి వస్తాడు. అతన్ని ఇంగ్లండు తీసుకువెళ్ళి తన ప్రేమతో అతన్ని మనిషిని చేస్తుంది లూసీ. అదే సమయంలో ఆమె డార్నే తో ప్రేమలో పడుతుంది. 

ఫ్రాన్స్ లో ఓ జమీందారీ కి వారసుడైన డార్నే తన ఆస్తిని బీదలకి పంచాల్సిందిగా మిత్రుడిని కోరి, ఒక సామాన్యుడిగా ఇంగ్లండు చేరుకొని లూసీని వివాహం చేసుకుంటాడు. ఆ దంపతులకి ఒక పాప పుట్టాక, ఫ్రాన్స్ లో విప్లవం మొదలవుతుంది. డార్నే స్నేహితుడు తానో చిక్కులో ఉన్నానని, ఒక్కసారి చూసి వెళ్ళమని రాసిన జాబు చూసుకుని హడావిడిగా బయలుదేరతాడు. అయితే, జమీందార్ల మీద పీకల వరకూ కోపంగా ఉన్న విప్లవ కారులు డార్నే ని నిర్బందిస్తారు. అతనికి మరణ శిక్ష ఖాయం అవుతుంది. తన యావత్ జీవితాన్నీ ఫ్రెంచి జైలుకి ధారబోసిన డాక్టర్ మానెట్ తన అల్లుడిని రక్షించుకోగలిగాడా? విప్లవం ప్రారంభం అయ్యేనాటికి ఫ్రాన్స్ లో ఉన్న పరిస్థితులు ఏమిటి? ఫ్రెంచి విప్లవం పరిణామాలు ఇంగ్లండుని ఏవిధంగా ప్రభావితం చేశాయి? తదితర ప్రశ్నలకి జవాబులిస్తూ ముగుస్తుంది ఈనవల.

తెన్నేటి సూరి అనువాదంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి భాష, క్లుప్తత. చక్కని తెలుగు నుడికారంతో నవలని నింపిన సూరి, ఎక్కడా ఏ సన్నివేశమూ కూడా 'సుదీర్ఘం' అనిపించనివ్వలేదు. నడిరోడ్డు మీద ద్రాక్ష సారా జాడీ భళ్ళున బద్దలైన వైనాన్ని వర్ణించినా, ఫ్రెంచి వీధుల్లో 'గిలెటిన్' పేరిట నిత్యం జరిగిన నరమేధాన్ని కళ్ళకి కట్టినా అనువాదంలో రచయిత చూపిన ప్రత్యేక శ్రద్ధ పాఠకుడికి అడుగడుగునా అర్ధమవుతూనే ఉంటుంది. ఏకబిగిన చదివి పక్కన పెట్టాల్సిన నవల ఇది. ఎక్కడ ఆగినా, మళ్ళీ మొదటినుంచీ చదవాల్సిందే. మళ్ళీ మళ్ళీ చదివించే కథనం. 'విశాలాంధ్ర' ప్రచురించింది. (పేజీలు 244, వెల రూ. 125, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శుక్రవారం, జూన్ 07, 2013

మహి

"ఒకరి మంచి చెడులు నిర్ణయించడానికి నేనెవరిని? విషయాలని బ్లాక్ అండ్ వైట్ లో చూడడం తేలిక. చాలా మంది ఆ తేలిక పనిని ఎంచుకుంటారు. నాకు అది చేతకాదు. వాటి షేడ్స్ చూడడం ఇష్టం. చూసే వాళ్ళన్నా గౌరవం," అంటుంది మహి. ఓ మధ్యతరగతి కుటుంబంలోని ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టిన మహి అవివాహిత. కాలేజీ లెక్చరర్ గా ఉద్యోగం చేస్తూ, ఒంటరిగా, తనకి నచ్చినట్టుగా జీవిస్తోంది. ఇంట్లో ఎవరికీ మహి అర్ధం కాదు. ఆమె తమ మనిషి అని చెప్పుకోవడం వాళ్లకి ఇష్టం లేదు. కానీ వాళ్ళందరికీ మహి నుంచి కావాల్సింది ఒక్కటే, ఆమె సంపాదన.

"నువ్వు ఒక్కదానివే కదా? సంపాదించింది అంతా ఏం చేసుకుంటావ్?" ఈ ప్రశ్నని తల్లి వైదేహి మొదలు, అక్కా బావా మాధవి, భాస్కర్, వాళ్ళ టీనేజ్ దాటిన పిల్లలు కార్తిక్, నందన ఏదో ఒక సందర్భంలో మహిని అడుగుతూనే ఉంటారు. ఎవరికీ ఏమీ తక్కువ చెయ్యదు మహి. తను చేయగలిగిన సహాయం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. కానీ, ఆమె చేసే సాయం ఎవరికీ గుర్తుండదు, తృప్తి గానూ ఉండదు. పైగా, ఆమె నుంచి డబ్బు తీసుకున్నామని పైకి చెప్పుకోలేరు. తన స్నేహితుడు 'చైత్ర' తో లివిన్ రిలేషన్ లోకి వెళ్ళాలనుకున్న మహికి ఈ కుటుంబం నుంచి వచ్చిన ప్రశ్నలు, ఇబ్బందులు ఏమిటి? ఆమె వాటిని ఎలా ఎదుర్కొంది? అన్న ప్రశ్నలకి జవాబే కుప్పిలి పద్మ రాసిన 'మహి' నవల. కథానాయిక మహి.

పుస్తకం కవర్ చూడగానే ఎందుకో అప్రయత్నంగా 'మిల్స్ అండ్ బూన్' నవలలు, ఆ వెంటనే తెలుగు మిల్స్ అండ్ బూన్స్ గా పేరుపడ్డ యద్దనపూడి సులోచనారాణి నవలలూ గుర్తొచ్చేశాయి. దానికి తోడూ నవల ప్రారంభంలోనే నందన "మమ్మీ, నాకు ఉద్యోగం వచ్చేసిందోచ్" అనడంతో చటుక్కున 'సెక్రటరీ' నవల గుర్తొచ్చింది. ఒకప్పుడు ఎంతో ఇష్టంగా, ఆకలీ నిద్రా కూడా మర్చిపోయి మరీ చదివిన యద్దనపూడి నవల్లాలాంటి మరో నవల చదవబోతున్న భావన కలిగింది. పేజీలు చకచకా తిరిగిపోవడంతో ఆ భావన మరింతగా బలపడింది. మహి అవివాహితగా ఎందుకు ఉండిపోయింది? అన్న విషయాన్ని చివరివరకూ దాచి ఉంచిన రచయిత్రి, ప్రపంచీకరణ ఫలితంగా మధ్యతరగతిలోనూ, యువతరం ఆలోచనల్లోనూ వచ్చిన మార్పుని చిత్రించడానికి ప్రధమార్ధాన్ని ఉపయోగించుకున్నారు.


డిగ్రీ పూర్తవుతూనే ఓ కాల్ సెంటర్లో పదివేల రూపాయల జీతానికి ఉద్యోగం సంపాదించుకున్న నందన, త్వరలోనే పబ్బులు, డిస్కో లకి అలవాటు పడుతుంది. అక్కడి కొత్త స్నేహితుల సంపాదనతో పోలిస్తే తన సంపాదన (అప్పటికే తల్లిదండ్రుల ఇద్దరి జీతాల కన్నా ఎక్కువ!) ఏ మూలకీ పనికిరాదనీ నిర్ణయించుకున్న నందన యూఎస్ ప్రయాణం అవుతుంది. అందుకు కావాల్సిన డబ్బు ఎలా సమకూర్చడం అన్నది ప్రధాన సమస్య. అంతమొత్తం తను సర్దలేనని చెప్పేస్తుంది మహి. మనవరాలు అంటే విపరీతమైన ప్రేమ ఉన్న వైదేహిది, మగపిల్లల్ని దోచి ఆడపిల్లలకి పెట్టే తత్త్వం. నందనకి కావాల్సిన డబ్బు సమకూర్చేందుకు నడుం బిగిస్తుంది ఆవిడ. మనవరాలు యూఎస్ లో ఉంటోందని చెప్పుకోవడం ఆమెకి గర్వకారణం కూడా.

నందన అన్న కార్తీక్ కి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని కోరిక. చెల్లెలి లాగే, మధ్యతరగతి జీవితానికి పూర్తి వ్యతిరేకం అతను. డబ్బుండీ మహి తనకి లిఫ్ట్ ఇవ్వడం లేదన్న భావన ఉంటుంది. ఈ పిల్లలకి చిన్న వయసులోనే అవసరాలు అంతగా పెరిగిపోవడం ఏమిటో, కోటీశ్వరులు కావాలన్న ఆరాటం ఏమిటో బొత్తిగా అర్ధం కాదు మహికి. ప్రశాంతమైన జీవితం ఆమెది. కవిత్వం, సంగీతం, సాహిత్య సమావేశాలు... వీటితో కాలం గడిపేస్తూ ఉంటుంది. తల్లి నడిపించే కుటుంబ రాజకీయాలు బొత్తిగా కిట్టవు ఆమెకి. వదినలని కూడా తమతో సమంగా చూడమని తల్లికి చెబుతూ, భంగపడుతూ ఉంటుంది. అందరితోనూ సరదాగా ఉంటూనే, తామరాకు మీద నీటి బొట్టు చందంగా తనని తాను మలుచుకుంటుంది మహి.

కుప్పిలి పద్మ రచనల్లో నాయికల కన్నా నాయకులే ఎక్కువగా పూలని ప్రేమిస్తూ ఉంటారు. అచ్చం అలాంటి నాయకుడే చైత్ర. లిల్లీపూల గుత్తులతో మహిని నవ్వుతూ పలకరించే ఈ అందగాడు, 'లివిన్' ప్రతిపాదన పెడతాడు. మహి ఇంటికి చైత్ర రాకపోకలు పెరగడం, ఆమె కుటుంబ సభ్యులకి ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. మహి కారణంగా నందనకి మంచి సంబంధాలు రావేమో అని దిగులు పడతారు వైదేహి, మాధవి. మహి గతం, చైత్ర విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం నవల ముగింపు. ఎక్కడా ఆపకుండా చదివించే పుస్తకం ఇది. ప్రపంచీకరణ, ఫెమినిజాలని చర్చిస్తూనే, బాబ్రీ విధ్వంసం, గుజరాత్ అల్లర్లని సందర్భోచితంగా కథలో భాగం చేశారు పద్మ. (ముక్తా పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 297, వెల రూ. 120, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

బుధవారం, జూన్ 05, 2013

విదేశీ కథలు

చదివించే గుణం పుష్కలంగా ఉండే రచనలు చేసే రచయితల జాబితాలో ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి పేరు సుస్థిరం. అమలిన శృంగారం మొదలు మలిన శృంగారం వరకూ మల్లాది ఏం రాసినా ఒకసారి చదవడం మొదలుపెట్టాకా పూర్తిచేసి కానీ పక్కన పెట్టలేం. అమెరికన్, జర్మన్, ఫ్రెంచ్, బ్రిటిష్, ఇజ్రాయిల్, జపనీస్ తదితర ప్రపంచ భాషల్లో వచ్చిన చిన్న కథలని తెలుగులోకి అనువదించిన మల్లాది, వాటన్నింటినీ 'విదేశీ కథలు' పేరిట సంకలనంగా విడుదల చేశారు. 'విపుల' మాసపత్రికలో ప్రచురితమైన ఈ కథల్లో ఏ ఒక్కటీ కూడా నాలుగైదు పేజీలు మించదు. చదివాక ఓ పట్టాన జ్ఞాపకం నుంచి తొలగిపోదు.

అనువాదం అనగానే 'మక్కీకి మక్కీ' అనువదించేసే రచయితలు ఉన్నారు. కానీ, మల్లాది అనువాదాలు మాత్రం అందుకు భిన్నం.. కథలని సరళమైన భాషలో చెప్పడంతో పాటు, వీలున్న చోటల్లా తెలుగు జాతీయాలు వాడడం ద్వారా 'పరాయీకరణ' ని వీలైనంత తగ్గించే ప్రయత్నం చేశారు. మల్లాది గతంలో రాసిన చిన్న కథలు చదివిన వారికి ఆయన అభిరుచి ఏమిటన్నది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్లకి ఈ పుస్తకంలో మొదటి నాలుగైదు కథలు చదివితే చాలు, మిగిలిన కథలు ఎలా ఉండబోతున్నాయో సులభంగానే బోధ పడుతుంది. విలియం కింగ్ రాసిన 'నంబర్ వన్' అనే అమెరికన్ కథతో మొదలయ్యే ఈ సంకలనం, ఎడ్మండ్ ఫిలిప్స్ రాసిన 'మై డియర్ రీటా' అనే అమెరికన్ కథతో ముగుస్తుంది.

అమెరికన్ కాటన్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు మిస్టర్ పీబాడి. అతని సెక్రటరీ మిస్ స్మిత్. మనుషులకి బదులు యంత్రాలు, కంప్యూటర్లతో పని చేయించాలి అని నిర్ణయించిన కంపెనీ, పీబాడి స్థానంలో ఓ రోబో ని నియమిస్తుంది. ఆ రోబోకి విధులు నేర్పవలసిన బాధ్యత పీబాడిదే. అతనికి ఏమీ విచారం లేదు. ఎందుకంటే, తన స్థానం లోకి రోబో వచ్చేసినా తనకి వేరే ఉద్యోగం దొరికే వరకూ లేదా పదవీ విరమణ వయసు వచ్చే వరకు జీతాన్ని యధావిధిగా చెల్లించడానికి కంపెనీ అంగీకరించింది. రోబో పేరు నెంబర్ వన్. చాలా చురుకైన రోబో. "నన్ను జాగ్రత్తగా గమనించు. నేనేం చేస్తున్నానో అర్ధం చేసుకో. నేను లేకపోయినా ఆ పరిస్థితుల్లో అలా చెయ్యి" అని పీబాడి ఒకటికి పదిసార్లు చెప్పిన మాటల ప్రభావం నెంబర్ వన్ మీద ఎలా పనిచేసింది అన్నది ఈ కథ ముగింపు.


అనువాద కథలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి... ఎప్పుడూ చూడని, చూసే అవకాశం లేని ప్రాంతాల గురించీ, కలిసేందుకు పెద్దగా అవకాశం లేని మనుషుల మనస్తత్వాలు, సంస్కృతిక నేపధ్యాల గురించీ తెలుసుకునే అవకాశం దొరకడం. ఈ కథల ద్వారా ఎందరో విదేశీ వ్యక్తుల గురించి తెలుసుకోగలుగుతాం. వాళ్ళ ఆలోచనలు, క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ జీవిత గమనం... ఇవన్నీ కొన్ని కొన్ని కథల్లో చాలా సరదాగా ఉంటే, మరికొన్ని కథల్లో జీవిత సత్యాలని తెలిపేవిగా ఉన్నాయి. హిట్లర్ పాలన, నాజీల దురాగతాల మొదలు, యూదుల జీవితం, అమెరికన్ వివాహ వ్యవస్థ, నల్ల జాతీయుల కృతజ్ఞత... ఇలా ఎన్నో ఇతివృత్తాలు.

ఈ సంకలనం లో ఉన్న మొత్తం ముప్ఫై ఒక్క కథల్లో, బ్రిటిష్ కథ 'కానుక' ఒక్కటే గతంలో చదివింది. 'విపుల' చదవడం ఆపేసి చాలా రోజులే అయిపోయిందన్న విషయం గుర్తు చేసిన కథ ఇది. విభిన్నమైన ఇతివృత్తాలు ఎంచుకున్నప్పటికీ, చాలా కథలు మెరుపు ముగింపుతో ఆకర్షించేవే. ఈ కారణానికే కొన్ని కథలు చదవడం అయ్యాక, మనకి తెలియకుండానే ముగింపు ఊహించే ప్రయత్నం చేసేస్తాం. ఏ కథా నాలుగైదు పేజీలు మించక పోవడం వల్ల చదువుతుంటే విసుగు కలిగే ప్రమాదం లేదు. ఆసాంతం చదివించే శైలి (అనువాద శైలి అందామా?!) ఉండనే ఉంది. మెజారిటీ కథలు మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించేవే.

సంకలనం చదవడం పూర్తిచేశాక, భారతీయ భాషల్లో వచ్చిన కథలని కూడా మల్లాది తెలుగులోకి అనువదిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది. ఆధ్యాత్మిక రచనలు, ట్రావెలాగ్ లతో బిజీగా ఉన్న మల్లాది ఈ విషయం మీద దృష్టి పెడతారో లేదో మరి. ఏకబిగిన చదివించేసే ఈ కథలన్నింటినీ లిపి పబ్లికేషన్స్ పుస్తక రూపంలో తీసుకువచ్చింది. ఆకట్టుకునే కవర్ పేజి.. అచ్చుతప్పులు లేని ముద్రణ. కథా సాహిత్యం అంటే ఆసక్తి ఉన్నవాళ్ళకి బాగా నచ్చే పుస్తకం ఇది. (పేజీలు 144, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

మంగళవారం, జూన్ 04, 2013

కాశీయాత్ర

"కాశీకి వెళ్ళిన వాడూ, కాటికి వెళ్ళిన వాడూ ఒక్కటే..." ..రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో బాగా ప్రచారంలో ఉన్న వాడుక ఇది. బస్సులు పెద్దగా లేకపోవడం, ఎక్కువ దూరం కాలి నడకన, బళ్ళ మీద ప్రయాణం చేయాల్సి రావడం, కాశీ పట్టణంలో తరచూ అంటువ్యాధులు ప్రబలుతూ ఉండడం... ఈ కారణాల వల్ల, కాశీకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారన్న నమ్మకం పెద్దగా ఉండేది కాదు. ఇలాంటి వాతావరణంలో కాశీకి ప్రయాణం అయ్యారు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి. తర్వాతి కాలంలో శతావధానిగా పేరు తెచ్చుకున్న పండితుడూ, తిరుపతి వేంకట కవుల్లో అర్ధభాగమూ అయిన వేంకట శాస్త్రి, తన యవ్వనారంభంలో చేసిన కాశీయాత్రని ఓ సుదీర్ఘ వ్యాసంగా అక్షరబద్ధం చేశారు.

ఈ కాశీయాత్ర విశేషాలతో పాటు, వేంకటశాస్త్రి విరచితమైన వ్యాసాలు మరికొన్నింటిని కలిపి ఓ సంకలనంగా తీసుకు వచ్చారు గుంటూరు కి చెందిన అన్నమయ్య గ్రంధాలయం వారు. సంపాదకుడు మోదుగుల రవికృష్ణ సుదీర్ఘంగా రాసిన 'మనవి మాటలు' తో ప్రారంభమయ్యే ఈ పుస్తకం ఆసాంతమూ చదివిస్తుంది. తిరుపతి వేంకట కవుల ప్రసిద్ధ నాటకం 'పాండవోద్యోగ విజయాలు' లో పండిత పామరులని సమంగా ఆకర్షించిన ఒకానొక పద్యం ప్రారంభ వాక్యం శీర్షికగా 'చెల్లియో చెల్లకో..!' అంటూ శ్రీరమణ చెప్పిన కబుర్లు దాటుకుని ముందుకు వెడితే, 'మా గురువుగారు' అంటూ పలకరిస్తారు 'కవి సామ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ. వేంకట శాస్త్రి ప్రత్యక్ష శిష్యుడైన విశ్వనాథ, తన ఆత్మకథలో గురువు గారి గురించి రాసుకున్న భాగాన్ని ఈ పుస్తకంలో చేర్చడంతో, చెళ్ళపిళ్ళ వారి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే వీలు కలిగింది.

తన పందొమ్మిదో ఏట (1889) కాశీ వెళ్ళడానికి ప్రయాణ ముహూర్తం నిర్ణయించుకున్న వేంకట శాస్త్రి గారికి, అనుకోకుండా అదే ముహూర్తంలో వివాహం జరిగింది. పెళ్ళికి ముందు జరిపే 'స్నాతకం' లో 'కాశీ యాత్ర' జరిపే సంప్రదాయం ఉంటుంది కాబట్టి, తను పెట్టుకున్న ముహూర్తానికి కాశీ ప్రయాణం జరిగినట్టే అని చమత్కారంగా చెబుతూనే, చదువరులని తనతో పాటు కాశీ క్షేత్రానికి ప్రయాణం చేసేస్తారు చెళ్ళపిళ్ళ వారు. కాశీ వెళ్ళాలనే సంకల్పం కలగడానికి మొదటి కారణం తాంబూల చర్వణం మీద ఆయనకి ఉన్న ఇష్టం. పుట్టిన ఊరు యానాం లో కానీ, గురువుగారు చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి స్వస్థలం కడియెద్ద లో కానీ తాంబూలం దొరికే పరిస్థితి లేదు. కాశీలో తాంబూల సేవనం హెచ్చు అనీ, దొరకడం సులభమనీ తెలిశాక కాశీ మీద మోజు కలిగింది అంటారాయన. స్థానికంగా ఎందరు పండితులు ఉన్నా, కాశీ పండితుల దగ్గర విద్య నేర్చుకోవాలి అన్న కుతూహలం మరొక కారణం.


వివాహం జరిగిన తర్వాత, కందుకూరి కృష్ణశాస్త్రి అనే సహాధ్యాయితో కలిసి అష్టావధానాలు చేసి సంపాదించిన సొమ్ముతో కాశీయాత్ర ప్రారంభించిన చెళ్ళపిళ్ళ వారికి ఎదురైన అనుభవాలు ఎన్నో... ఎన్నెన్నో... మొత్తం యాభై తొమ్మిది పేజీల వ్యాసంలో కాశీ యాత్రతో పాటు, ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ఎందరో కవిపండితులు, వారిని ఆదరించిన జమీందారులు, ఆయా జమీందారుల చుట్టూ ఉండే బలమైన కోటరీలు.. ఇలా ఎన్ని కబుర్లో... పండితుల మధ్య ఉండే స్పర్ధలు, ఫలితంగా ఎదురయ్యే సమస్యలు... ఇవన్నీ సందర్భానుసారంగా చెబుతూనే, అసలు విషయాన్ని పక్కదోవ పట్టనివ్వకుండా యాత్రాస్మృతిని ఆసాంతం ఆకర్షణీయంగా మలిచారు. కాశీ ప్రయాణం క్లుప్తంగానే చెప్పినా, తిరుగు ప్రయాణాన్ని గురించి విశదంగా రాసి, యాత్రలో ఉండే ఇబ్బందుల గురించి చదువరులకి ఓ అవగాహన కలిగేందుకు దోహదం చేశారు. కష్టార్జితం దొంగల పాలవ్వడం మొదలు, అనారోగ్యంతో చేసిన పడవప్రయాణం వరకూ అన్నీ ఆసక్తిగా చదివించేవే.

ఆకట్టుకునే మరో విషయం 'గంగా సంతర్పణ' వృత్తాంతం. కాశీ వెళ్లి, తిరిగి వచ్చిన వారు సంతర్పణ చేయడం రివాజు. అందరిలాగా కాకుండా, 'కనీసం ఒక మిఠాయితో' ఘనంగా సంతర్పణ చేసుకోవాలి అన్నది చెళ్ళపిళ్ళ వారి కోరిక. ఇంటి ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రం. ఆర్జనకి ఉన్న ఏకైక మార్గం అవధానమే. అప్పటికింకా తిరుపతి శాస్త్రి జతచేరలేదు కూడా.. యానాం నుంచి ముమ్మిడివరం వెళ్లి అవధానం చేసిన చెళ్ళపిళ్ళ వారికి అక్కడ కలిగిన ఖేదం, అటుపై అయినాపురం లో దొరికిన ఆదరణ, ఘనంగా జరిగిన సంతర్పణలతో పాటు, తన జాతకంలో సంభవించిన 'కుసుమ యోగా'న్ని వివరిస్తూ వ్యాసం ముగించారు. ప్రయాణ సౌకర్యాలు పెద్దగా లేని ఆ రోజుల్లో, ఆచారం సాగించుకునే విషయంలో ఏమాత్రమూ రాజీపడలేని ఓ బ్రాహ్మణుడు చేసిన యాత్ర ఎన్నో ఆసక్తికరమైన విషయాలని చెబుతుంది, తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి. 'కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర' చాలాసార్లే గుర్తొచ్చింది.

కాశీయాత్రతో పాటు, 'శృంగార వర్ణనము,' 'శతావధానము,' 'సిగ్గూ-బిడియము,' 'మా విద్యార్ధి దశ-నాటి కవిత్వం'అనే శీర్షికలతో వేంకట శాస్త్రి రాసిన వ్యాసాలని జతచేశారు ప్రకాశకులు. వీటిలో, 'శృంగార వర్ణనము' 'సిగ్గూ-బిడియము' వ్యాసాలు మళ్ళీ మళ్ళీ చదివించేవిగా ఉన్నాయి. శతావధాన ప్రక్రియపై వచ్చిన విమర్శలని ఖండిస్తూ రాసిన పదునైన వ్యాసం 'శతావధానము.' విద్యార్ధి దశలో తెలుగు కవిత్వం అంటే ఏమాత్రం ఆసక్తి లేకపోయినా, చివరికి తెలుగు కవులుగానే స్థిరపడిన వైనాన్ని వర్ణించారు 'మా విద్యార్ధి దశ-నాటి కవిత్వం' వ్యాసంలో. తిరుపతి వేంకట కవుల నుంచి వచ్చిన రచనల జాబితాతో పాటు, వారి అవధానాన్ని గురించి నాటి పత్రికల్లో వచ్చిన కథనాన్ని జతచేశారు. వీటితోపాటు విజయనగరం రాజులకి కాశీతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ సంపాదకుడు రాసిన 'కాశీ-విజయనగరం వారు' వ్యాసం ఏకబిగిన చదివిస్తుంది. (పేజీలు 176, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).