సోమవారం, అక్టోబర్ 07, 2013

దాలప్ప తీర్థం

దాలప్ప ఓ మామూలు మనిషి. సమాజానికి బాగా ఉపయోగ పడే మనిషి. కానీ, సమాజం నుంచి ఎలాంటి గుర్తింపూ నోచుకోక పోగా చివాట్లూ, చీత్కారాలూ భరిస్తున్న మనిషి. అతనొక్కడే కాదు, దాలప్ప చేసే వృత్తిలోనే ఉన్న అతని బంధువులు, సావాసగాళ్ళూ అందరిదీ ఇదే పరిస్థితి. తన వృత్తి అవసరాన్ని అందరూ గుర్తించేలా చేయాలన్న దాలప్ప ప్రయత్నం ఎంతగా ఫలించిందంటే, ఇప్పటికీ అతని పేరు మీద ఏటా 'దాలప్ప తీర్థం' జరుపుకునేటంత!!

'సాక్షి' దినపత్రికను, మరీ ముఖ్యంగా 'ఫ్యామిలీ' పేజీని క్రమం తప్పకుండా చదివే వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు. ఎన్నో ఆసక్తికరమైన వార్తా కథనాలు రాసిన ఈ పాత్రికేయుడు కథకుడు కూడా. తను రాసిన పద్నాలుగు కథలతో విడుదల చేసిన సంకలనానికి శ్రీనివాసరావు ఇష్టంగా పెట్టుకున్న పేరు, సంకలనంలో మూడో కథ పేరూ ఒక్కటే.. అదే 'దాలప్ప తీర్థం.'

ఉత్తరాంధ్ర నుడికారంలో చకచకా సాగిపోయే ఈ కథలన్నీ ఆసాంతమూ విడవకుండా చదివిస్తాయి. బ్రాహ్మలు పెట్టుకునే ఆవకాయ కోసమని మడిగట్టుకుని మరీ తన మిల్లులో కారాలు ఆడించి ఇచ్చే 'పిండిమిల్లు' హుస్సేను కథ చెప్పినా, ఊళ్ళో తల్లిపాలు చాలక అల్లాడుతున్న పసిపిల్లలందరికీ స్తన్యం అందిచి ఊపిరిపోసిన గంపెడు పిల్లల తల్లి 'పాలమ్మ' ని గురించి చెప్పినా పాఠకుల చేత ఏకబిగిన కథని చదివించడం ఎలాగో ఈ రచయితకు బాగా తెలుసు. 'పులికన్నా డేంజర్' అయినది ఏమిటో, ఒకప్పుడు 'చల్దన్నం చోరీ' చేసిన దొంగలు ఇప్పుడు ఎలా రూపు మార్చేసుకున్నారో తెలుసుకోవచ్చు ఈ కథల ద్వారా.


విశాఖ జిల్లా పల్లెల్నీ, మరీ ముఖ్యంగా మూడు నాలుగు దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన అగ్రహారాలనీ, వాటితో పాటుగా కష్టానికీ సుఖానికీ కలిసిమెలిసి ఉండి, వాటిని ఎదురీదిన అష్టాది వర్ణాల వారినీ పాఠకులకి పరిచయం చేసిన రచయిత, మానవీయ విలువలు క్రమక్రమంగా కనుమరుగవుతున్న తీరుని కథలు చదివిన వారు ఆలోచనలో పడే రీతిలో చిత్రించారు. 'వానతీర్పు' 'నిదర్శనం' 'శిఖండి గాడు' 'చిదిమిన మిఠాయి' అగ్రహారం నేపధ్యంగా సాగే కథలు. వీటిలో తొలి మూడు కథలూ వాస్తవ సంఘటనలే!!

"ఒక రావిశాస్త్రి నీ ఒక పతంజలి నీ కలిపి ముద్ద చేస్తే వచ్చే పదార్ధం చింతకింది లా ఉంటుందేమో" అన్నారు 'ప్రియదర్శిని' రామ్. నాకైతే, పేదవాడి పక్షాన నిలబడ్డంలో రావిశాస్త్రినీ, 'కన్యాశుల్కం' నాటకాన్ని ప్రేమించడంలో పతంజలినీ గుర్తు చేసిన ఈ రచయిత నేటివిటీ చిత్రణలో వంశీ ని జ్ఞాపకం చేశారు. 'రాజుగారి రాయల్ ఎన్ ఫీల్డ్' 'గుడ్డముక్కలు' కథలు వంశీని బాగా జ్ఞాపకం చేశాయి. అయితే, శ్రీనివాసరావుకి తనదైన శైలి ఉంది, ఆపకుండా చదివించే గుణం ఈయన కథల్లో పుష్కలంగా ఉంది.

అక్కడక్కడా సంభాషణల్లో వినిపించిన నాటకీయత, ఉన్నట్టుండి కథల్లోకి జొరబడే పత్రికల భాష, కొంచం ఎక్కువగానే ఉన్న అచ్చుతప్పులు పంటికింద రాళ్ళు. వీటిని మినహాయించుకుంటే, ఈ కథల సంకలనం మృష్టాన్న భోజనమే. గురజాడ, చాసో, రావిశాస్త్రి కథల్లో కనిపించే "అమాయకమైన కవితాస్వప్నం" డాక్టర్ చింతకింది కథల్లో కూడా కనిపించడం తనకెంతో సంతోషంగా ఉందన్న వాడ్రేవు చిన వీరభద్రుడి ముందుమాటతో ఏకీభవించకుండా ఉండలేం.. కథా సాహిత్యాన్ని ఇష్టపడే వారు తప్పక చదవాల్సిన సంకలనం ఈ 'దాలప్ప తీర్థం.' (శ్రీనిజ ప్రచురణలు, పేజీలు 106, వెల రూ. 110, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

3 కామెంట్‌లు:

  1. మా ఊరెళ్ళివచ్చినట్టనిపించిందండీ "దాలప్ప తీర్థం" కథలు చదువుతూంటే. చాలా మంచి పరిచయం. ధన్యవాదాలు!

    మీ పరిశీలనని అభినందించాల్సిందే. ఉత్తరాంధ్ర నుడికారం, కన్యాశుల్కపు చెమకులు.. రచయిత నిజంగానే కళింగాంధ్ర వారసుడని ఒప్పుకునేలా చేసాయి. పలుకురాళ్ళున్నా భరించగలమేమో కానీ, పొల్లుని సహించడం చాలా కష్టం. ఆ ఇబ్బంది లేదీ కథల్లో. దాలప్ప తీర్థం, గుడ్డముక్కలు, పులికంటే డేంజర్ ప్రత్యేకంగా నచ్చేసాయి.

    రిప్లయితొలగించండి
  2. @కొత్తావకాయ: నాక్కూడా మీ ఊరు (విజయనగరం) వెళ్లి వచ్చినట్టే అనిపించిందండీ... ధన్యవాదాలు..
    @చావా కిరణ్: ధన్యవాదాలండీ

    రిప్లయితొలగించండి