అనువాద సాహిత్యం చదివే పాఠకులని ఇబ్బంది పెట్టే మూడు విషయాలు..పాత్రల పేర్లు, ప్రాంతాల పేర్లు, వారు ఉపయోగించే భాష. అనువాదం ఎంత సరళంగా ఉన్నా, చదువుతున్న నవల పరాయిది అన్న భావన కలుగుతూనే ఉంటుంది ఈ మూడు విషయాల్లోనూ. మొదటి రెంటినీ మార్చడం ఎటూ సాధ్యపడదు. మూడోదైన భాషని ఆసాంతమూ తెనిగించి, 'విదేశీ పాత్రలు స్వచ్చమైన తెలుగుని ఇంచక్కా మాట్లాడుతున్నాయే..' అన్న ఆశ్చర్యాన్ని పాఠకులకి కలిగించిన అనువాద రచయిత తెన్నేటి సూరి. పాత్రల మధ్య సంభాషణల్లోనే కాదు, కథ చెప్పడానికీ, సన్నివేశాల వర్ణనకీ జాను తెనుగుని ఇంత బాగా ఉపయోగించిన అనువాద రచయిత మరొకరు లేరేమో అన్న సందేహం కలగక మానదు, 'రెండు మహానగరాలు' చదువుతూ ఉంటే.
ఫ్రెంచి విప్లవాన్ని నేపధ్యంగా తీసుకుని చార్లెస్ డికెన్స్ 1859 లో రాసిన 'ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్' ని 'రెండు మహానగరాలు' పేరిట తెనిగించారు అభ్యుదయ కవి తెన్నేటి సూరి. మాతృకలో ఏ కొద్ది భాగాన్ని చదివిన వారికైనా, సూరి తన అనువాదాన్ని మక్కీకి మక్కీగా కాక, మొత్తం నవలని మళ్ళీ మళ్ళీ చదివి, జీర్ణించుకుని, తనదైన శైలిలో తిరగరాశారని ఇట్టే బోధ పడుతుంది. ఇప్పుడిప్పుడు వాడుక భాషనుంచి కూడా నెమ్మదిగా తప్పుకుంటున్న 'ఇక్ష్వాకుల కాలం నాటి' 'అహోబల బిలం' 'డచ్చీలు చరవడం' లాంటి ఎన్నో ప్రయోగాలు ఈ నవల్లో అడుగడుగునా కనిపిస్తాయి. పాత్రల పేర్లు, సంఘటనా స్థలాలని బట్టి విదేశీ నవల అనుకోవాలే తప్ప, ఇంకెక్కడా అనువాదం అన్న భావన కలగనివ్వలేదు రచయిత.
ఫ్రెంచి విప్లవం ప్రారంభానికి ముందు ఉన్న పరిస్థితులు, విప్లవం తీరుతెన్నులతో పాటు, నాటి ఇంగ్లండు నగరం స్థితిగతులనీ వర్ణిస్తుందీ నవల. "అది ఒక వైభవోజ్వల మహాయుగం - వల్లకాటి అధ్వాన్న శకం; వెల్లివిరిసిన విజ్ఞానం - బ్రహ్మజెముడులా అజ్ఞానం; భక్తీ విశ్వాసాల పరమపరిధనం - పరమ పాశందాల ప్రల్లద కల్లోలం..." అంటూ కవితాత్మకమైన వచనంతో నవలని మొదలు పెట్టి "గవిడిగవదల ఓ రాజూ, గాజుకళ్ళ ఓ రాణీ ఇంగ్లండు లోనూ, గవిడిగవదల ఓ రాజూ, కలువ కన్నుల ఓ రాణి ఫ్రాన్సులోనూ రాజ్యం చేస్తున్నారు" అంటూ నేరుగా కథలోకి తీసుకుపోతారు రచయిత. ఇది దేశ భక్తుడైన డాక్టర్ మానెట్ కథ. ఫ్రాన్సు జమీందార్ల దురాగతాలకు ప్రత్యక్ష సాక్షి అయిన మానెట్ సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితం గడపాల్సి వస్తుంది.
మానెట్ నూ, అతని కూతురు లూసీనీ కలిపే బాధ్యత తీసుకుంటాడు టెల్ సన్స్ బ్యాంక్ ఉద్యోగి లారీ. ఖాతాదారుల క్షేమం కోసం తపించే టెల్ సన్స్ బ్యాంకు, వారికి అవసరమైన అన్ని సేవలనూ నమ్మకంగా అందిస్తుంది. మానెట్ జైలుకి వెళ్ళాక, అతని కూతురు పెంపకం బాధ్యత గమనించడంతో పాటు, ఆయన జైలు నుంచి విడుదల అయ్యాడని తెలిశాక ఆ తండ్రీ కూతుళ్ళని కలిపే పనినీ బ్యాంకు తన భుజాన వేసుకుంటుంది. ఏకాకి జైలు జీవితంలో వెలుతుర్ని పూర్తిగా మర్చిపోయిన మానెట్ దాదాపు పిచ్చివాడిగా జైలు నుంచి బయటికి వస్తాడు. అతన్ని ఇంగ్లండు తీసుకువెళ్ళి తన ప్రేమతో అతన్ని మనిషిని చేస్తుంది లూసీ. అదే సమయంలో ఆమె డార్నే తో ప్రేమలో పడుతుంది.
ఫ్రాన్స్ లో ఓ జమీందారీ కి వారసుడైన డార్నే తన ఆస్తిని బీదలకి పంచాల్సిందిగా మిత్రుడిని కోరి, ఒక సామాన్యుడిగా ఇంగ్లండు చేరుకొని లూసీని వివాహం చేసుకుంటాడు. ఆ దంపతులకి ఒక పాప పుట్టాక, ఫ్రాన్స్ లో విప్లవం మొదలవుతుంది. డార్నే స్నేహితుడు తానో చిక్కులో ఉన్నానని, ఒక్కసారి చూసి వెళ్ళమని రాసిన జాబు చూసుకుని హడావిడిగా బయలుదేరతాడు. అయితే, జమీందార్ల మీద పీకల వరకూ కోపంగా ఉన్న విప్లవ కారులు డార్నే ని నిర్బందిస్తారు. అతనికి మరణ శిక్ష ఖాయం అవుతుంది. తన యావత్ జీవితాన్నీ ఫ్రెంచి జైలుకి ధారబోసిన డాక్టర్ మానెట్ తన అల్లుడిని రక్షించుకోగలిగాడా? విప్లవం ప్రారంభం అయ్యేనాటికి ఫ్రాన్స్ లో ఉన్న పరిస్థితులు ఏమిటి? ఫ్రెంచి విప్లవం పరిణామాలు ఇంగ్లండుని ఏవిధంగా ప్రభావితం చేశాయి? తదితర ప్రశ్నలకి జవాబులిస్తూ ముగుస్తుంది ఈనవల.
తెన్నేటి సూరి అనువాదంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి భాష, క్లుప్తత. చక్కని తెలుగు నుడికారంతో నవలని నింపిన సూరి, ఎక్కడా ఏ సన్నివేశమూ కూడా 'సుదీర్ఘం' అనిపించనివ్వలేదు. నడిరోడ్డు మీద ద్రాక్ష సారా జాడీ భళ్ళున బద్దలైన వైనాన్ని వర్ణించినా, ఫ్రెంచి వీధుల్లో 'గిలెటిన్' పేరిట నిత్యం జరిగిన నరమేధాన్ని కళ్ళకి కట్టినా అనువాదంలో రచయిత చూపిన ప్రత్యేక శ్రద్ధ పాఠకుడికి అడుగడుగునా అర్ధమవుతూనే ఉంటుంది. ఏకబిగిన చదివి పక్కన పెట్టాల్సిన నవల ఇది. ఎక్కడ ఆగినా, మళ్ళీ మొదటినుంచీ చదవాల్సిందే. మళ్ళీ మళ్ళీ చదివించే కథనం. 'విశాలాంధ్ర' ప్రచురించింది. (పేజీలు 244, వెల రూ. 125, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
mee parichayam baagundi.
రిప్లయితొలగించండి@నక్కా వెంకట రావు: ధన్యవాదాలండీ...
రిప్లయితొలగించండిమొన్ననే మిసిమి నాగేశ్వరరావు గారితో సృజనాత్మక రచన ప్రారంభం ఎలా ఉంటే బావుంటుందనే విషయం మాట్లాడుతోంటే ఈ నవల ప్రస్తావనకొచ్చింది. టేల్ ఆఫ్ టూ సిటీస్ నవల ప్రారంభించేప్పుడు "అది ఫలానా కాలం" అనో, ఫ్రెంచి విప్లవానికి ముందు అనో అనొచ్చు. కానీ ""అంటూ ఉండే ఆ ఎత్తుగడ ఆగనివ్వకుండా చదివిస్తుంది.
రిప్లయితొలగించండిఅనువాదం కూడా కవితాత్మకంగా చేశారు సూరి గారు. "అది ఒక వైభవోజ్వల మహాయుగం - వల్లకాటి అధ్వాన్న శకం" అంటూండే ఆ వాక్యం రచయితగా సూరి గారు ఎన్నుకున్న అనువాద శైలిని(మక్కికి మక్కి అనువాదం ఉండకుండా) వివరిస్తుంది. చదివి తీరాల్సిన నవల ఇది.
ఈ పుస్తకం మీదగ్గర ఉందనుకుంటాను. ఈ నవల ఏ పత్రికలో ధారావాహికగా ఎప్పుడు ప్రచురణ అయిందో చెప్పగలరా, థన్యవాదాలు.
రిప్లయితొలగించండిఈ నవల ఎప్పుడు ఏ పత్రికలో ధారావాహికగా వచ్చిందో తెలియజేయగలరా. థాంక్స్
రిప్లయితొలగించండి@పవన్ సంతోష్: అవునండీ.. నిజం!! (మీకు కుదిరినప్పుడు నాకు మెయిల్ చేయగలరా.. మీ మెయిల్ చిరునామా మారినట్టుగా ఉంది) ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@మాలతి: ఆంద్ర సచిత్ర వారపత్రికలో ధారావాహికగా వచ్చిందండీ, 1956 లో.. ప్రస్తుతం 'విశాలాంధ్ర' వారి దగ్గర దొరుకుతోంది.. ధన్యవాదాలు..
@మురళి గారూ, థాంక్స్. ఫేస్బుక్కులో రెండు హానగరాలు - ఇది 26.03.1952 సంచికలో ప్రారంభమై, 07.01.1953 సంచికలో సమాప్తమైంది. జూన్ 1953లో నవల పుస్తకరూపంలో వెలువడింది, అని సర్వశ్రీ జె.కె. మోహనరావు, సురేశ్ కొలిచాల, రమణమూర్తి గారలు ఇచ్చిన సమాచారం.
రిప్లయితొలగించండి@మాలతి: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి