గురువారం, అక్టోబర్ 03, 2013

అందరూ మనుషులే!

ఓ భూస్వామ్య కుటుంబంలో పుట్టి, పెద్ద చదువు చదివి, ఓ వ్యాపారస్తుడికి ఇల్లాలై, ఓ బిడ్డకి తల్లైన తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టి నాయికగా నీరాజనాలు అందుకున్న రేఖ కథ 'అందరూ మనుషులే!' కేవలం సినిమా పరిశ్రమని మాత్రమే కాక, తనకి పరిచయం ఉన్న అనేక రంగాలనీ, భిన్న మనస్తత్వాలనీ నేపధ్యంగా తీసుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి వి.యస్. రమాదేవి రాసిన నవల ఇది.

ఆంధ్ర రాష్ట్ర అవతరణ సమయం ఈ నవల కథా కాలం.. మధ్య తరగతి అమ్మాయి రేఖ పెళ్ళితో మొదలయ్యే ఈ నవల, సినిమా పరిశ్రమతో సహా, మద్రాసులో స్థిరపడ్డ తెలుగు పరిశ్రమ ప్రముఖులు వాళ్ళ కార్య స్థానాలని హైదరాబాద్ కి మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్న సమయంలో తెలుగు సినీ రంగంలో ఉన్నత స్థితిలో ఉన్న కథానాయిక రేఖ తీసుకున్న నిర్ణయం, దాని తాలూకు ఫలితాలతో ముగింపుకి చేరుకుంటుంది. విస్తారమైన కేన్వాసు కావడంతో కథనం తాపీగా సాగుతుంది.

ఓ రైతు కుటుంబానికి చెందిన సత్యనారాయణకి తల్లీ తండ్రీ లేరు. వారసత్వంగా వచ్చిన ఆస్తి అమ్మి, విజయవాడలో ఓ కట్టెల అడితి ప్రారంభిస్తాడు. అతనికి ఉన్నదల్లా చిన్నాన్న రామారావు. జర్మనీలో స్థిరపడ్డ ఫిలాసఫీ స్కాలర్. ఆ రామారావు కూతురు ూర్యకాంతం. ప్లీడర్ భూషణ రావు, సత్యనారాయణని చూసి, ముచ్చట పడి, తన భార్య శాంత సవతి చెల్లెలు రేఖతో పెళ్ళికి ఒప్పిస్తాడు. హైదరాబాద్ లో అన్న రాజేశ్వర్ దగ్గర ఉండి డిగ్రీ పూర్తిచేసిన రేఖకి కవిత్వంలో మంచి అభినివేశం ఉంది.

పెళ్ళైన కొంత కాలానికే మిత్రుల ప్రోద్బలంతో సినిమా కంపెనీలో వాటా తీసుకుంటాడు సత్యనారాయణ. లాభాలు బావుండడంతో అడితి అమ్మేసి మొత్తం డబ్బు సినిమాల్లోనే పెడతాడు. పార్ట్నర్స్ సలహా మేరకు రేఖ కథానాయికగా ఓ సినిమా నిర్మాణం ప్రారంభిస్తారు. అదే సమయానికి, తన జర్మన్ భార్యకి పుట్టిన కొడుకు మన్మోహన్ తో కలిసి సత్యనారాయణ దగ్గరికి వచ్చేస్తాడు రామారావు. ఫిలాసఫీ రేఖకి కూడా ఎంతో ఇష్టమైన సబ్జక్ట్ కావడం, మన్మోహన్ కి ఇంగ్లీష్ తప్ప తెలుగు రాకపోవడంతో వాళ్ళిద్దరికీ దగ్గరవుతుంది రేఖ. రేఖ సినిమాల్లో నటించడాన్ని రామారావు ప్రోత్సహిస్తాడు.

మొదటి సినిమా రేఖకి మంచి పేరు తేవడంతో వరసగా అవకాశాలు వస్తాయి. సత్యనారాయణ అడ్డుకోడు. అలాగని, ఆమెకి వస్తున్న పేరుని పూర్తిగా ఆస్వాదించనూ లేడు. నటించడం రేఖకి ఇష్టమూ కాదు, అయిష్టమూ కాదు. సినిమా పరిశ్రమలో ఉండే రకరకాల మనుషుల మధ్య నెగ్గుకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే, రామారావుతో సహా ఆమెకి దగ్గర వాళ్ళందరూ రేఖని అనుమానించే పరిస్థితులు వస్తాయి. తామరాకు మీద నీటిబొట్టు చందంగా తన పని తాను చేసుకుపోయే రేఖ ఎలా స్పందించిందో చెబుతూ కథని ముగిస్తారు రమాదేవి.


ముందుగా చెప్పినట్టుగా విస్తారమైన కేన్వాసుతో 418 పేజీల నవలని రాశారు రమాదేవి. మధ్య తరగతి మనస్తత్వాలు, తాగుడు అనర్ధాలు మొదలు, లోతైన వేదాంత విషయాలు, నవాబుల జీవన విధానం వరకూ ఎన్నో ఎన్నెన్నో విషయాలని కథలో భాగం చేశారు. కోస్తా, తెలంగాణా ప్రాంతాల నైసర్గిక రూపం, ప్రజల జీవన విధానం, న్యాయస్థానాల పనితీరు, మారుతున్న ఫ్యాషన్లు, వస్త్రధారణ ఇలా ఎన్ని సంగతులో చర్చకి వస్తాయి నవలలో. కథనం పరుగులు పెట్టించేది కాదు. తాపీగా చదివించేది.

రేఖ ఉన్నత వ్యక్తిత్వాన్ని చిత్రించే క్రమంలో రచయిత్రి మిగిలిన పాత్రలని ఒకింత చిన్న చూపు చూశారేమో అనిపించక మానదు. ప్రాముఖ్యత ఉన్న కొన్ని పాత్రలు ఉన్నట్టుండి తెరవెనక్కి వెళ్ళిపోవడం, అదాటున రంగం మీదకి వచ్చిన పాత్రలు అంతలోనే కీలకమైనవిగా మారిపోవడం ఆశ్చర్య పరుస్తుంది. ఎడిటింగ్ విషయంలో కొంచం శ్రద్ధ తీసుకుని ఉంటే రీడబిలిటీ పెరిగి ఉండేది అనిపించింది. రమ్య ప్రచురణలు ప్రచురించిన ఈ పుస్తకం నవోదయ బుక్ హౌస్ ద్వారా అందుబాటులో ఉంది. (వెల రూ. 190).

3 కామెంట్‌లు:

  1. గవర్నర్‌గా చేసిన రమాదేవి గారేనా.. నవలా పరిచయం బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. రమాదేవిగారి గురించి చాలా విషయాలు మీరు అందించిన లింక్ ద్వారా తెలుసుకున్నాను.. ఇప్పతివరకు ఆవిడ ఒక గవర్నర్ గా మాత్రమే తెలుసు.. సాహితివేత్తగా ఆవిడగొప్పదనం ఇప్పుడే తెలిసింది... ధన్యవాదములు ..

    రిప్లయితొలగించండి
  3. @పురాణపండ ఫణి: అవునండీ.. ఆవిడే.. ధన్యవాదాలు
    @నాగ శ్రీనివాస: అవునండీ.. బహుముఖ ప్రజ్ఞాశాలి ఆవిడ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి