బుధవారం, ఆగస్టు 08, 2012

ఇంజినీరింగ్ 'మిధ్య'

నూతన ఆర్ధిక సంస్కరణల అనంతరం దేశంలో వేగవంతంగా చోటుచేసుకున్న మార్పుల్లో ఒకటి, ఇంజినీరింగ్ విద్యావకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం. అప్పటివరకూ ప్రభుత్వ కాలేజీల్లో, కొద్దిమంది విద్యార్ధులకి మాత్రమే అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ విద్య, ప్రైవేటు కాలేజీల రాకతో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ఉద్యోగావకాశాల ఫలితంగా, విద్యార్దులకన్నా ఎక్కువగా వారి తల్లిదండ్రులు తమ పిల్లలని ఇంజనీరింగ్ చదివించడానికి ఉత్సాహ పడుతున్నారు.

ప్రవేశం సులభతరం కావడం, మెడిసిన్ తో పోల్చి చూసినప్పుడు ఖర్చు బాగా తక్కువ కావడం, చదువు పూర్తవ్వక మునుపే ఊరించే ఉద్యోగావకాశాల పుణ్యమా అని ఏటా ఈ కోర్సుకి డిమాండ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఫలితంగా, కూతవేటు దూరంలోనే ఇంజినీరింగ్ కాలేజీలు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్యే ఏడు వందల పైచిలుకు. పొరుగు రాష్ట్రాల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీలేదు.

అయితే రాన్రానూ ఇంజనీరింగ్ వాళ్లకి వెంటనే 'కేంపస్' (కేంపస్ సెలక్షన్స్) రావడం లేదన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకులతో పాటుగా, ఇంజనీరింగ్ విద్యలో క్షీణిస్తున్న నాణ్యతని కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు నిపుణులు. 'మళయాళ మనోరమ' గ్రూప్ నుంచి వచ్చే 'ది వీక్' పత్రిక తాజా సంచికలో (జూలై 29) ఇంజనీరింగ్ విద్యపై వచ్చిన ఓ కథనం ఆసక్తికరంగా అనిపించింది. ఆ పత్రిక, ఒక సర్వే సంస్థతో కలిసి పదమూడు రాష్ట్రాల్లో 198 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న ముప్ఫై నాలుగువేల మందిని సర్వే చేసి రిపోర్టు ప్రచురించింది.

సదరు సర్వే ప్రకారం, మన ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో కేవలం పన్నెండు శాతం మంది మాత్రమే వెంటనే ఉద్యోగంలో చేరేందుకు అర్హులు. మరో యాభై రెండు శాతం మంది శిక్షణ తర్వాత ఉద్యోగం చేయగలుగుతారు. ఇక, మిగిలిన ముప్ఫై ఆరు శాతం మందీ కనీసం శిక్షణకి కూడా అర్హులు కారు! కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు, అనలిటికల్ అబిలిటీ, రీజనింగ్ తదితరాల్లోనూ బాగా వెనుకబడి ఉన్నారు మన విద్యార్ధులు. కేవలం పెట్టుబడి, రాజకీయ పలుకుబడీ ఉంటే చాలు, ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించేయ గలగడం, ఈ కాలేజీలపై నియంత్రణ లేకపోవడం, బోధనా సిబ్బంది కొరత.. ఇలా ఎన్నో కారణాలు.

సరిగ్గా ఇదే సమయంలో, విద్యార్ధుల ఫీ-రీ ఎంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించే విషయంలో రాష్ట్రంలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రజలకి అనేక "మేళ్ళు" చేయడంలో భాగంగా మొదలైన ఈపథకం, ప్రభుత్వానికి ఓ తెల్ల ఏనుగుగా మారిందిప్పుడు. ఉచిత విద్య ఉచితమా, అనుచితమా అన్న ప్రశ్న అప్పుడు రాలేదు. ఇప్పుడు వస్తోంది. ఒక్కసారిగా ఈ పథకాన్ని తొలగించకుండా, విడతలు విడతలుగా నీరుగార్చే అవకాశం ఉంది. నిజానికి, 'అర్హత' 'ప్రతిభ' తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య అందించడం ఎంతవరకూ సబబు? ఉచితంగా వచ్చే చదువు విలువ ఎంతమంది విద్యార్ధులకి తెలుస్తుంది??

కేవలం మన రాష్ట్రం అనే కాదు, ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంచేందుకు దేశ వ్యాప్తంగా కృషి జరగాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో, ఇండియా బలం మానవ వనరులే. ఈ వనరులని సాధ్యమైనంత బాగా ఉపయోగించుకోవాలంటే తగిన విధంగా శిక్షణ అందించాలి. ఈ శిక్షణ కళాశాలల ద్వారానే జరగాలి. అలా జరగాలంటే, కళాశాల మీద నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఇప్పటికే సాచ్యురేటెడ్ దశకి చేరుకున్న ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్యని మరింత పెంచకుండా, ఉన్నవాటిలో వనరులు, సౌకర్యాలని మెరుగు పరచడం తక్షణావసరం. కాని పక్షంలో, మన బలంగా చెప్పుకుంటున్న మానవ వనరులే బలహీనతగా మారిపోయే ప్రమాదం కనిపిస్తోంది..

8 వ్యాఖ్యలు:

జీడిపప్పు చెప్పారు...

కోళ్ళఫారాలలా తయారవుతున్న ఈ కాలేజీలు "ఎంసెట్లో ర్యాంకు రాకపోయినా ఫరవాలేదు మా కాలేజీలో సీటు ఇస్తాం రండి" అని చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే భవిష్యత్తులో 'ప్రొఫెషనల్ బెగ్గర్స్ ' ఎవరో కళ్ళముందు కదలాడుతోంది!
Sad but true.

http://100telugublogs.blogspot.com

SNKR చెప్పారు...

Good post, informative.

Sravya Vattikuti చెప్పారు...

హ్మ్ ! మెడిసిన్ కష్టం అనే కాదనుకుంటానండి . మెడిసిన్ చదివినా సరే వేరే దేశం లో ప్రాక్టీస్ చేయాలంటే అక్కడి ట్రోపికల్ డిసీజెస్ గురించి ప్రత్యేకం గా ఏదో కోర్స్ చేయాల్సి ఉంటుంది అనుకుంటా . నాకు సరిగా తెలియదు కానీ ఎక్కడో చదివిన గుర్తు ఉంది . ఇక ఇంజీనీరింగ్ విషయం లో అది లేదు .
ఈ పరిస్తితులు రావటానికి ప్రధాన కారణం మన ఆలోచన తీరు , ఎంతసేపటికి వేరే వాళ్ళకి సర్వ్ చేయయానికి మనల్ని మనం మౌల్డ్ చేసుకోవటానికి చేసే ప్రయత్నం తప్ప , మన కోసం మనం ఏమి చేయాలి అన్న ఆలోచన అనేది ప్రభుత్వానికి , ప్రజలకి ఎవరికీ లేకపోవటం . ఈ విషయం లో కేవలం ప్రభుత్వాన్నే తప్పు పట్టం సరి కాదు అని నా అనుకోలు . ఒక వేళ మన దగ్గర కాకపొతే వేరే రాష్ట్రాలకి పోయి డబ్బు పోసి చదివించి మరీ ఇలాంటి ప్రోడక్ట్ తయారు చేయటానికి రెడీ .
ఇక ఈ ఉచితం ఫీజ్ అనేది ఈ రంగం లో నైనా ఫలితం శూన్యం . ఒకప్పుడు మంచి segmenented వ్యవస్థ గా ఉన్న ఆరోగ్యం , విద్య ఇలాంటి పరిస్తితి కి రావటానికి ఈ ఉచిత పదకాలే కారణం . ఈ ఉచితం లేకపోతె మరి రాజకీయ పార్టీలు కు ఓట్లు రాలవు . ఈ viscious cycle లో బయటకి ఎప్పటికి వస్తామో నాకు అనుమానమే !
Nice post !

Sridhar d చెప్పారు...

ఒకప్పుడు గొప్ప పేరు ఉన్న డిగ్రీ కాలేజీలు ఈ ఇంజినీరింగ్ కాలేజీల పుణ్యమా అని ఇప్పుడు వెలవెలబోతున్నాయి.

ఈనాడు జిల్లా ఎడిషన్ చదువుతున్నప్పుడు..ఫలానా కాలేజి వాళ్ళు తయారు చేసిన "రోబోట్," "లీటరుకు రెండొందలు మైళ్ళు నడిచే బైక్" ప్రాజక్ట్ వర్కులు నిజంగా చేసినవేనా అనిపిస్తుంది. ఇంత మేధ వాళ్ళల్లో ఉందా అని కూడా అనిపిస్తుంది. [నిజానికి ఆ రోబోట్లు అవి వేరే చోటనుండి కొనుక్కొని వచ్చి పైపైన మెరుగులు దిద్దడమే వాళ్ళు చేసే పని].

వీళ్ళలో చాలా మంది డిగ్రీలు గోడకు తగిలించుకోవడానికి తప్పితే ఎందుకూ కొరగావు.

అజ్ఞాత చెప్పారు...

ఈ మధ్య మా ఊరి దగ్గర కొత్తగా పెట్టిన ఇంజనీరింగ్ కళాశాలలో పిల్లాణ్ణి చేర్పిస్తే "ల్యాప్ టాప్ ఫ్రీ"

అజ్ఞాత చెప్పారు...

ఇప్పుడు విద్య కోసం, డిగ్రీల కోసం ఎవరు చదువుతున్నారు?
కేంపస్ సెలక్షన్ల కోసమే చదువుతున్నారు.

అసలు ఈ IT కంపెనీలకి ఇంజనీర్లే ఎందుకు కావాలో నాకు అర్థం కాదు.

మురళి చెప్పారు...

@జీడిపప్పు: 'కోళ్ళ ఫారాలు' ...సరిగ్గా సరిపోయే పోలిక తెచ్చారండీ.. కొన్ని కాలేజీలు నిజంగా అలాగే ఉంటున్నాయ్.. ధన్యవాదాలు.
@SNKR : ధన్యవాదాలండీ..
@శ్రావ్య వట్టికూటి: ఇప్పుడు చదువు కేవలం జ్ఞానం కోసం కాదండీ, ఉద్యోగం కోసం. ఇంజనీరింగ్ ఎంప్లాయబిలిటీ ఉన్న కోర్సు కాబట్టి దాని వెంట పడుతున్నారు, అంతే! ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@శ్రీధర్: మీరు చెప్పింది మరో పార్శ్వం.. నియంత్రణ ఉండాలండీ ఈ కాలేజీల మీద.. అది అవసరం.. ధన్యవాదాలు.
@పక్కింటబ్బాయి: పేపర్తో పాటు వచ్చే పాంప్లెట్లలో ఇలాంటి ప్రకటనలే కనిపిస్తున్నాయండీ :( ధన్యవాదాలు.
@బోనగిరి: నిజమండీ.. ఉద్యోగం కోసమే.. ఐటీ, నాకూ అర్ధం కాని విషయమే...:( ...ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి