సోమవారం, ఆగస్టు 27, 2012

సర్వసంభవామ్

'నాహం కర్తా, హరిః కర్తా' ఇది పీవీఆర్కే ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణాధికారిగా పనిచేసిన కాలంలో తనకెదురైన వింత అనుభవాల సమాహారానికి ఇవ్వాలనుకున్న శీర్షిక. ఈ శీర్షికకి అర్ధం 'నేను కర్తని కాదు..చేసేది, చేయించేది శ్రీహరి మాత్రమే.' అయితే, 'స్వాతి' సపరివార పత్రికలో ఈ కథనాలని వారం వారం ప్రచురించిన ఆ పత్రిక ఎడిటర్, శీర్షికని 'సర్వసంభవామ్' గా మార్చారు. ప్రసాద్ మరోమారు చిరునవ్వు నవ్వుకుని ఉంటారు, బహుశా. తర్వాతి కాలంలో ఆ అనుభవాలకి పుస్తక రూపం ఇచ్చినప్పుడు, తను మనసుపడ్డ శీర్షికని ఉపశీర్షికగా ఉంచారయన.

పత్రి వెంకట రామకృష్ణ (పీవీఆర్కే) ప్రసాద్ పేరు వినగానే, నాకు మొదట గుర్తొచ్చే రచన 'అసలేం జరిగిందంటే.' ఆయన రచనల్లో నేను చదివిన తొలి రచన అది. చెప్పే విషయంతో పాటు, చెప్పిన విధానం కూడా నచ్చడంతో కేవలం రచయిత పేరు చూసి తీసుకున్న పుస్తకం ఈ 'సర్వసంభవామ్.' ఊహించినట్టుగానే నన్ను ఏమాత్రమూ నిరాశ పరచలేదు. కలియుగ దైవం కొలువై ఉన్న ప్రదేశం అని మాత్రమే కాక, మరికొన్ని వ్యక్తిగత కారణాలకి కూడా తిరుమల-తిరుపతి అంటే ఇష్టం నాకు. ప్రసాద్ రచనా శైలితో పాటు, నాకున్న ఈ ఇష్టం కూడా పేజీలు చకచకా సాగడానికి కారణమయ్యింది.

జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని తార్కిక కోణం నుంచి చూడడం వీలుకాదు. హేతువుకీ, తర్కానికీ అందనివెన్నో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అనుభవాలే, ప్రపంచంలో అత్యంత సంపన్నమైన ఆలయాల్లో ఒకదానికి కార్య నిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి జీవితంలో జరిగితే వాటి తాలూకు ఫలితాలు ఎలా ఉంటాయన్నదే 'సర్వసంభవామ్' పుస్తకం. అంతే కాదు, దేవస్థానానికి సంబంధించిన ముఖ్యమైన పదవిలో ఓ దైవ భక్తుడు ఉంటే, దానివల్ల భక్తులకీ, దేవస్థానానికీ ఎటువంటి ప్రయోజనం ఉంటుందన్నది కూడా చెబుతుందీ రచన.


తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ఇవాళ మనం చూస్తున్న రూపంలో, అనుభవిస్తున్న సౌకర్యాలతో ఉండడం వెనుక ఉన్న అనేకమందిలో ప్రసాద్ ఒకరు. 'మాస్టర్ ప్లాన్' అమలు చేయడం మొదలుపెట్టిన తొలి అధికారి ఆయన. ఆ సందర్భంలో ఎన్నో ఒత్తిడులు ఎదురైనా, తనని ముందుకు నడిపిన శక్తి శ్రీనివాసుడే అంటారాయన. మొత్తం ముప్ఫై అధ్యాయాలున్న ఈ పుస్తకంలో ప్రతి అధ్యాయమూ పాఠకులని ఆశ్చర్యంలో ముంచెత్తేదే.అసలు ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని విచిత్రాలు జరిగే అవకాశం ఉందా అన్న ఆశ్చర్యం ఒక్కసారన్నా కలగక మానదు.

తాళ్ళపాక అన్నమాచార్య కీర్తనలని పరిష్కరించిన రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ ను, ఆయన జీవితపు చివరి క్షణాల్లో 'దేవస్థానం ఆస్థాన విద్వాంసుడి' గౌరవంతో సత్కరించడం, ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఎమ్మెస్ సుబ్బులక్ష్మి చేత (నమ్మలేని నిజం ఇది) అన్నమయ్య కీర్తనలు పాడించి, అటు ఆ గాయనికి సాయం చేయడంతో పాటు కీర్తనలని ప్రాచుర్యంలోకి తీసుకురావడం లాంటి సంఘటనలు ఎక్కువమందికి తెలిసే అవకాశం ఉండకపోయేది, ఈ పుస్తకం రానట్టైతే. కుటుంబమంతా ఏళ్ళ తరబడి ఒంటిపూట ఉపవాసాలు చేసి, దాచిన సొమ్ముతో స్వామికి బంగారు హారం చేయించి బహూకరించిన భక్తుల గురించి మాత్రమే కాదు, ఎవరో చెప్పినట్టుగా సరైన సమయానికి నవరత్నాలని కానుకగా తెచ్చి ఓ ముఖ్యమైన 'సేవ' ఆగిపోకుండా సాయపడ్డ భక్తుడి గురించీ ఇంత వివరంగా మరొకరు చెప్పలేరు.

ఒత్తిళ్ళు అనేవి ఏ ఉద్యోగికైనా తప్పవు. ప్రభుత్వోగికి మరీ ఎక్కువ. పైగా, తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రతిష్టాత్మకమైన చోట ఉన్నతోద్యోగం చేసే వారికి ఉండే ఒత్తిళ్ళు ఊహకి కూడా అందవు. ముఖ్యమంత్రి, మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ప్రతిపక్షాలు..ఇలా అనేక దిక్కులనుంచి ఎదురయ్యే ఒత్తిడులని సమర్ధవంతంగా ఎదుర్కొని అవుననిపించుకోడం కత్తిమీద సామే. ఆ సాముని సక్రమగా చేయడం వెనుక 'స్వామి' కృప ఉందంటారు ప్రసాద్. ప్రత్యేక కళ్యాణోత్సవం మొదలు పెట్టడం మొదలు, పద్మావతి అతిధి గృహం నిర్మించడం వరకూ ప్రతి పనిలోనూ, ప్రతి దశలోనూ ఎదురైన ఒత్తిడులని వివరంగా అక్షరబద్ధం చేశారాయన.

శ్రీవెంకటేశ్వర స్వామికి వజ్రాల కిరీటం చేయించే మిష మీద, స్వామికి చెందిన వజ్రాలని ప్రసాద్ దొంగిలించారన్నది ఆయనపై వచ్చిన అతిపెద్ద ఆరోపణ. ఈ ఆరోపణని నేరు గా విచారించారు, అప్పుడే ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న ఎన్టీ రామారావు. వజ్రాలతో పాటు, తనపై మరో రెండు ఆరోపణలకి సంబంధించి వివరంగా రాసిన కథనం 'ఎన్టీఆర్ దృష్టిలో మూడు నేరాలు.' కేవలం వృత్తిగత విషయాలే కాకుండా, వ్యక్తిగత అంశాలకీ ఈ పుస్తకంలో చోటిచ్చారు ప్రసాద్. తన బాల్యం, నేపధ్యం, భార్యాపిల్లలకి సంబంధిచిన విషయాలని సందర్భానుసారంగా ప్రస్తావించారు. తిరుమల పై భక్తీ, నమ్మకం ఉన్నవాళ్ళందరినీ ఆకట్టుకునే రచన ఇది. (ఎమెస్కో ప్రచురణ, పేజీలు 271, వెల రూ.100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

8 కామెంట్‌లు:

  1. ఈ పుస్తకం చదివాను. కొత్త ధ్వజస్థంభం ప్రతిస్టించడం, నడకదారిలొ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యడం వెనుక కథ... మొదలైన విశేషాలు ప్రసాద్ గారు చక్కగా రాసారు. మీ రివ్యూ బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. మంచి పరిచయం మురళి గారు , నేను చదివిన మరో పుస్తకం పరిచయం మీ బ్లాగులో బావుంది :-)) ప్రసాద్ గారు రాసిన అసలేం జరిగింది కూడా నాకు చాలా నచ్చింది !

    రిప్లయితొలగించండి
  3. మనసు బాగోనపుడు ఈ పుస్తకం తీసుకుని కూచుని చదువుతూ అందులో లీనమయిపోవడం నా అలవాటు.

    రిప్లయితొలగించండి

  4. చాలా చదవాలనిపిస్తోందండి. మీరు ఇంకొన్ని వివరాలు....అంటే, చా...లా...వివరంగా రాసేయొచ్చుగా:)

    రిప్లయితొలగించండి
  5. @కృష్ణవర్మ దంతులూరి: ఆ ధ్వజ స్థంభం ఎపిసోడ్ అయితే పదేపదే గుర్తొస్తూ ఉంటుందండీ.. ధన్యవాదాలు.
    @శ్రావ్య వట్టికూటి: :-) ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  6. @కష్టేఫలే: మంచి అలవాటండీ.. మన మూడ్ ని మార్చేయగల పుస్తకం.. ధన్యవాదాలు..
    @జయ: పబ్లిషర్ నామీద కేసు వేస్తారేమోనండీ :-) ;-) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. Nice review! ప్రతి వారం స్వాతి రాగానే మొట్టమొదట చదివే ఫీచర్ ఇదే అప్పట్లో. ధ్వజస్థంభ ప్రతిష్టాపన కళ్ళకు కట్టించారు ప్రసాద్ గారు. బాపు బొమ్మలు ఇంకా కళ్ళముందు కదులుతున్నాయ్. ఈ పుస్తకంలో కూడా ఉన్నాయాండీ? బొమ్మల ప్రస్తావన లేదు కదా టపాలో.

    రిప్లయితొలగించండి
  8. @కొత్తావకాయ: కవర్ పేజీ మినహా, లోపలెక్కడా బొమ్మలు లేవండీ.. కొన్ని ఫోటోలు పెట్టారు అంతే.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి