శనివారం, ఆగస్టు 18, 2012

సామి కుంబుడు

పొరుగు రాష్ట్రాల్లో ఉన్న టీ ఎస్టేట్లకీ, తెలుగు పాఠకులకీ మధ్య అందమైన సాహితీ వారధులు, సి. రామచంద్ర రావు కథలు. గడిచిన అరవై ఏళ్ళ కాలంలో కేవలం తొమ్మిది కథలు మాత్రమే రాసి, 'వేలు పిళ్ళై' కథా సంకలనాన్ని మూడు దఫాలుగా వెలువరించిన రామచంద్ర రావు తన ఎనభై ఒకటో ఏట రాసిన తాజా కథ 'సామి కుంబుడు.' సుదీర్ఘ కాలంపాటు టీ ఎస్టేట్ లో ఉన్నతోద్యాగాలు చేసిన ఈ రచయిత రాసిన మెజారిటీ కథల్లో లాగానే, ఈ కథకీ నేపధ్యం టీ ఎస్టేటే.. ఇంకా చెప్పాలంటే, టీ ఎస్టేట్ యాజమాన్యానికీ-పనివాళ్ళకి మధ్యన తగువే ఈ కథ ఇతివృత్తం.

కథాస్థలం సీఫోర్త్ టీ ఎస్టేట్. ప్రతి ఐదేళ్లకీ ఓసారి టీ తోటల్లో తప్పక జరిపించాల్సిన ప్రూనింగ్, ఆ సంవత్సరం గూడలూరు మలై డివిజన్లో జరుగుతోంది. టీ చెట్లని నిర్ణీత ఎత్తుకి మించి పెరగనివ్వకూడదు. అలా పెరగనిస్తే లేత టీ ఆకులు దొరకవు, పైగా ఎత్తైన చెట్ల నుంచి ఆకు తెంపడం కూలీలకి కష్టమవుతుంది. వేసవి ముగిసి, వర్షాలు మొదలు కాగానే ప్రూనింగ్ పని మొదలు పెడతారు నిపుణులైన పనివాళ్ళు. ఎంతో బాధ్యతగా పని చేసే ప్రూనింగ్  పని వాళ్ళమీద పెద్దగా నిఘా కూడా ఉండదు.

కానైతే, ఆ సంవత్సరం ప్రూనింగ్ పనివాళ్ళు 'గోస్లో' మొదలు పెట్టారు. ప్రతిరోజూ, చేయాల్సిన పనిలో నాలుగో వంతు మాత్రమే చేస్తున్నారు. ఈ పరిణామం ఎస్టేట్ మేనేజర్ సంపత్ దొర ముందుగా ఊహించిందే. కానైతే, పరిణామం తాలూకు తీవ్రత మాత్రం అతను ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంది. నిజానికి, యాజమాన్యానికీ ప్రూనింగ్ పని వాళ్ళకీ మధ్య వచ్చిన తగువు చాలా చిన్నది. పరిష్కారం కూడా సంపత్ చేతిలోనే ఉంది. కానీ, ఆ పరిష్కారం సంపత్ కి ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదు. ఓ మెట్టు దిగి రాడానికి అతను ఎంతమాత్రమూ సిద్ధంగా లేడు.

టీ తోటల్లో కులమతాలకీ, భాషా భేదాలకీ అతీతంగా పనివాళ్ళంతా కలిసి జరుపుకునే సంబరం ఒకటి ఉంది. దానిపేరు 'సామి కుంబుడు.' ప్రూనింగ్ పని మొదలు పెట్టే ముందు ప్రతి ఎస్టేట్ లోనూ జరుపుతారీ పండుగని. ఈ నిమిత్తం అయ్యే ఖర్చుని యాజమాన్యం ఆనందంగా భరిస్తుంది, 'సామి కుంబుడు బక్షిస్' రూపంలో. మొత్తంగా అయ్యే ఖర్చు ఓ రెండొందల రూపాయలు. ఆ సంవత్సరం ప్రూనింగుకి రెండు నెలల ముందే పని వాళ్ళంతా ఆందోళనలు చేసి, యాజమాన్యాలు వేతనాలు పెంచేలా చేసుకున్నారు.

ఇలా పెంచడం ఏమాత్రం ఇష్టం లేదు సంపత్ కి. అయినప్పటికీ ఇది అన్ని టీ ఎస్టేట్లకీ సంబంధించిన విషయం కాబట్టి కొత్త వేతన ఒప్పందాన్ని ఒప్పుకోక తప్పదు అతనికి. ఇందుకు ప్రతిగా, అగ్రిమెంట్ లో లేదనే కారణంతో 'సామి కుంబుడు బక్షిస్' నిలిపివేస్తాడు. యాజమాన్యం 'సామి కుంబుడు' జరపలేదు కాబట్టి, గోస్లో బాట పడతారు పనివాళ్ళు. ప్రూనింగ్ పని జరుగుతున్నట్టే ఉంటుంది, కానీ జరగదు. యజమానికీ పనివారికీ మధ్య నలిగిపోతాడు కండక్టర్ ఆరుళ్ దాస్. ఇంతకీ, పనివాళ్ళు తమ బక్షిస్ ని ఎలా సాధించుకోగలిగారు అన్నదే కథ ముగింపు.

టీ, కాఫీ ఎస్టేట్లు, తాజా గాలి పరిమళాలు, మలుపులు తిరిగే ఘాట్ రోడ్లు, 'దొరల' పట్ల విధేయంగా ఉంటూనే తమకి కావాల్సింది సాధించుకునే ఎస్టేట్ కూలీలు..ఇవన్నీ కాఫీ/టీ తోటలు నేపధ్యంగా రామచంద్రరావు గతంలో రాసిన కథలని గుర్తు చేస్తాయి. పాత్ర చిత్రణ, కథని నడిపే తీరు...ఈ రెండూ రచయిత బలాలు. ఒక్కో పాత్రనీ ఎంత నిశితంగా చిత్రిస్తారంటే, కథ చదువుతుంటే ఆ పాత్రలు కళ్ళముందు నిలబడాల్సిందే. పనివాడు బెల్లా మొదలు (నాకు 'గాళిదేవరు' కథలో మాంకూ గుర్తొచ్చాడు) సంపత్ స్నేహితుడు రాజారాం వరకూ ప్రతిఒక్కరూ పాఠకులకి తెలిసినవాళ్ళు అయిపోతారు.

కథని తాపీగా చెప్పడం రామచంద్రరావు గారి పధ్ధతి. ఎక్కడా ఉరుకులూ, పరుగులూ ఉండవు. అలాగని చదవలేకపోవడమూ ఉండదు. కథ మొదలు పెట్టామంటే ఏకబిగిన ముగించాల్సిందే. 'సామి కుంబుడు' క్లైమాక్స్ కి సంబంధించి ఒకటి రెండు చిన్నపాటి క్లూలని ఇచ్చినప్పటికీ, ఓ.హెన్రీ తరహా మెరుపు ముగింపునే ఇచ్చారు. కనీసం మూడు తరాల తెలుగు పాఠకులని తన కథల కోసం ఎదురుచూసేలా చేసిన రామచంద్ర రావు గారు కొంచం తరచుగా కథలు రాస్తే బాగుండును. (ఆదివారం ఆంధ్రజ్యోతి సెప్టెంబరు 4, 2011 సంచికలో 'సామి కుంబుడు' కథని చదవొచ్చు).

8 కామెంట్‌లు:

  1. తప్పక చదవడానికి ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  2. చాలా మంచి కథ చదివించారండీ. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. మంచికథ చదివించినందుకు ధన్యవాదాలు మురళి గారు.

    రిప్లయితొలగించండి
  4. తాపీగా కథ చెప్పే తీరు, టెక్నికల్ విషయాలని కూడా అర్ధమయ్యేలా వివరించడం, ప్రతీ పాత్రతోనూ పాఠకుడికి దగ్గరతనాన్ని కలిగేలా చెయ్యగలగడం.. ఈ మూడూ నేటివిటీ లేదనే ఒకే ఒక్క విషయాన్ని తొలిపేరాల్లోనే మర్చిపోయి కథాగమనంతో సాగిపోయేలా చేసాయి.
    "సామికుంబుడు" కథలో బెల్లా పాత్ర చిత్రీకరణ, చివరలో అరుళ్ దాస్ తన అసహనాన్ని, కోపాన్ని బయటపెట్టిన పధ్ధతీ, ఎన్ని జరిగినా తమ అహాన్ని పూర్తిగా వీడలేని యాజమానిగా సంపత్ మనస్తత్వం .. కథని గుర్తుండిపోయేలా ముద్రవేసాయి.

    రామచంద్రరావు గారి కథలు చదవడం ఇదే మొదటిసారి. మిగిలినవి దొరకబుచ్చుకుని చదివేయాలనే ఆసక్తిని - ఆయన కథ, మిగిలిన కొన్ని కథల గురించిన మీ సమీక్షలూ కలిగించాయి. ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  5. ముందుగా కథని బ్లాగులో పరిచయం చేసి, ఈ మెయిల్లో పంపి చదివించిన మురళీగార్కి ధన్యవాదాలు. ఆయనే గానీ పరిచయం చేయకుంటే ఈ కథ చదవలేకపోయేవాణ్ణేమో. సి.రామంచంద్రారావుగారి "వేలుపిళ్లై" కథల సంపుటి గతంలో చదివాను. నాలాంటి సాధారణప్రేక్షకుడికి అంతగా పరిచయం ఉండే అవకాశంలేని ప్రాంతాన్ని, వాతావరణాన్ని, పాత్రల్ని, విశేషాల్ని ఎన్నుకోవడంలోనే ఈ కథల ప్రత్యేకత ఉంది.
    ఈ కథ కూడా అలానే టీ ఎస్టేట్ వాతావరణంలో సాగుతుంది. పాత్రలు, టీ ఎస్టేట్ సాంకేతికాంశాలు కథని నా వరకూ నాకు ఆసక్తిదాయకంగా మలిచాయి.
    నాకైతే కథ(అన్ని సి.రామచంద్రరావు గారి కథల్లానే) బాగా నచ్చింది.

    రిప్లయితొలగించండి
  6. మరో విషయం, చివర్లో అరుళ్ దాస్ తన కోపాన్ని సంపత్ ముందు బయటపడ్డ తీరుకు చదువుతూ నేను (సంపత్ లాగే) చాలా షాక్ అయ్యాను. దాన్ని బట్టే అర్థమైంది కథాగమనంలో అరుళ్ దాస్ పాత్రని, సంపత్ పాత్రని ఎంత బలంగా తీర్చిదిద్దారో.

    రిప్లయితొలగించండి
  7. @పద్మార్పిత: తప్పక చదవండి.. ధన్యవాదాలు.
    @చందు.ఎస్: ధన్యవాదాలండీ..
    @వేణూ శ్రీకాంత్: థాంక్స్ వేణూ గారూ..

    రిప్లయితొలగించండి
  8. @కొత్తావకాయ: తెలుగు కథని ఇష్టపడే వాళ్ళందరూ చదవాల్సిన సంకలనం అండీ 'వేలు పిళ్ళై' తప్పక చదవండి.. ధన్యవాదాలు.
    @పక్కింటబ్బాయి: ప్రతిపాత్రకీ (యెంత చిన్నదైనా) ఓ ఐడెంటిటీ ఇవ్వడం రామచంద్ర రావుగారి ప్రత్యేకత కదండీ మరి.. ధన్యవాదాలు. .

    రిప్లయితొలగించండి