శుక్రవారం, ఆగస్టు 12, 2011

శంకరాభరణానికి 'వావ్'

ఈటీవీలో వచ్చే కార్యక్రమాలలో కొంచం వైవిధ్యంగా ఉండి కనీసం అప్పుడప్పుడూ అయినా చూసే కార్యక్రమాలలో ఒకటి 'వావ్.' సీనియర్ నటుడు సాయికుమార్ వ్యాఖ్యానం ఈ కార్యక్రమానికి పెద్ద అసెట్. వినోదాన్నీ, విజ్ఞానాన్నీ మేళవించి, ప్రశ్నలు సంధించి, విజేతలకి నగదు బహుమతి అందించే ఈ కార్యక్రమానికి అతిధుల ఎంపిక కూడా వైవిధ్య భరితంగానే సాగుతోంది. సిని నటుల్ని, ముఖ్యంతా కొత్తగా విడుదలవుతున్న సినిమాల టీములని పిలవడం ద్వారా, ఆయా సినిమాలనీ ప్రమోట్ చేస్తూ, ఉభయతారకంగా మలుస్తున్నారు ఈమధ్యన.

ఈ కొత్త సినిమాల ట్రెండ్ కి భిన్నంగా, ముప్ఫయ్యేళ్ళ క్రితం విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న కె. విశ్వనాథ్ అపూర్వ సృష్టి 'శంకరాభరణం' లో నటించిన నటీనటుల్ని అతిధులుగా ఆహ్వానించి ఇవాళ ప్రసారం చేసిన ఎపిసోడ్ ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది. చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, మంజుభార్గవి, తులసిలని కార్యక్రమంలో పాల్గొనడానికీ, కళాతపస్వి విశ్వనాథ్ ని ప్రత్యేక అతిధిగానూ ఆహ్వానించిన ఈ ఎపిసోడ్ లో 'శంకరాభరణం' సినిమాకి సంబంధించిన ఎన్నో విశేషాలని గుర్తు చేసుకుందీ బృందం. కొన్ని తెలియనివీ, మరికొన్ని తెలిసినా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవీ..

కె. విశ్వనాథ్ తనకి స్వయానా పెదనాన్న కొడుకన్న సంగతిని చంద్రమోహన్ అధికారికంగా చెప్పిన తొలి సందర్భం బహుశా ఇదే. అలాగే, గాయకుడు బాలూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాడేలా చూడమని తను బాలూ తండ్రి సాంబమూర్తిని అడిగాననీ, బాలూ చూపిన ప్రత్యేక శ్రద్ధ కారణంగానే టైటిల్స్ లో ప్రత్యేకమైన కార్డ్ ఇవ్వడం జరిగిందనీ చెప్పారు విశ్వనాథ్. విమర్శకులు మెచ్చిన కొన్ని సన్నివేశాల్నీ, వాటి వెనుక జరిగిన సంఘటనలనీ సరదాగా చెప్పారు. "మజుభార్గవి పాత్రకి ఒకే ఒక్క డైలాగుంది.. ఆ ఒక్కటీ పెట్టకపోతే ఇంకా బాగుండేది కదా అనుకున్నాను చాలాసార్లు" అన్నారు.

మంజుభార్గవినీ, తులసి నీ పక్కపక్కన చూసినప్పుడు "తల్లీ కొడుకులుగా చేసింది వీళ్ళిద్దరేనా!" అని ఆశ్చర్యం కలిగింది. కేరళ జడ్జి, తులసిని చూసి శంకరం వేషం వేసింది ఈమెనంటే నమ్మకపోవడాన్ని విశ్వనాథ్ చెబుతుండగా, తులసి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ గమ్మత్తుగా అనిపించింది. అన్నింటికీ మించి, విశ్వనాథ్ సమక్షంలో జరిగిన మొదటి రౌండ్లో - ఒక్కొక్కరికీ ఒక్కో సినిమా కథ చెప్పి ఆ సినిమా గురించి ప్రశ్నలు అడిగే రౌండ్ - సాయికుమార్ విశ్వనాథ్ సినిమాల గురించే అడుగుతుంటే, నటీనటులు నలుగురూ తెలిసిన విషయాలే చెప్పడానికి తడబడడం, మరీ ముఖ్యంగా మంజుభార్గవి 'సిరిసిరిమువ్వ' సినిమాకి దర్శకుడు ఏడిద నాగేశ్వర రావు అని టక్కున చెప్పినప్పుడు విశ్వనాథ్ ముఖంలో ఎక్స్ ప్రెషన్ ఇవన్నీ సరదాగా ఉన్నాయి.

రెండుగంటల పాటు సాగిన ఎపిసోడ్ ఎక్కడా బోర్ కొట్టలేదు. మరీ ముఖ్యంగా 'శంకరాభరణం' ఫీల్ ని ఆసాంతమూ కొనసాగించడం బాగుంది. చంద్రమోహన్ కొంచం అనారోగ్యంగా ఉన్నట్టు కనిపించాడు. మొత్తం అరవై ఒక్క మంది హీరోయిన్లు తనతో నటించారని కొంచం గర్వంగా చెప్పినప్పుడు -- చెప్పొద్దూ కొంచం అసూయలాంటిది కలిగింది. పెద్ద పెద్ద హీరోలక్కూడా ఇంత పెద్ద అవకాశం వచ్చి ఉండదు. మంజుభార్గవి "ఈ ఒక్క సినిమా చాలు" అని కొంచం ఉద్వేగంగా చెప్పింది. రాజ్యలక్ష్మి తన తొలి సినిమా 'శంకరాభరణం' అనీ, అదే తన ఇంటి పేరుగా మారిపోయిందనీ జ్ఞాపకం చేసుకుంది. ఇక తులసి చేసిన అల్లరి చూస్తే ఆమె ఇంకా 'శంకరం' గానే ఉండిపోయిందేమో అనిపించింది.

సాయికుమార్ తో సహా మొత్తం ఐదుగురూ విశ్వనాథ్ ని సన్మానించారు. 'శంకరాభరణం' ని మళ్ళీ తీసే అవకాశం ఉందా? అని సాయికుమార్ అడిగితే, వీలుపడదని చెప్పేశారు విశ్వనాథ్. "ఓ మాయాబజార్, ఓ మల్లీశ్వరి, ఓ శంకరాభరణం.. వీటిని మళ్ళీ తీయలేం" అంటూనే "మరో సినిమా గురించి ఇప్పుడు కమిట్ చేయించొద్దు" అంటూ తను
తప్పించేసుకున్నారు. మొత్తం ఐదు రౌండ్ల గేం షో లో చంద్రమోహన్ విజేతగా నిలిచాడు. 'శంకరాభరణం' గొప్పదనాన్ని గురించిన ముగింపు వాక్యాలు చెబుతూ, సాయికుమార్ "కొత్తని స్వాగతించాలి. అదే సమయంలో మనదైన సంస్కృతిని భద్ర పరుచుకోవాలి. మన సంస్కృతిలో ఒక భాగం ఈ శంకరాభరణం" అనడం నచ్చింది నాకు.

28 కామెంట్‌లు:

  1. ఇప్పుడే అక్కడ బజ్ లో ఎవరో ఇదే అంటుంటే అవునా!!! అంటూ ఇటు చూస్తే మీ పోస్ట్,మీరు చాలా ఫాస్ట్ సుమా.
    నా సందేహమూ తీరిపోయింది(చంద్రమోహన్-విశ్వనాథ్ ల బంధుత్వం గురించి)మీరూ ధృవపరిచేసాక నమ్మకమూ కలిగిపోయింది.

    శంకరాభరణం(సినిమా అయినా శంకర-ఆభరణం అయినా)తల్చుకుంటేనే వొళ్ళు ఝల్లు మంటుంది కదూ మురళి గారూ...

    రిప్లయితొలగించండి
  2. వావ్..షో కి ఏ మాత్రం తగ్గకుండా. మీ ..స్పందన వావ్..గా ఉంది. మురళి. గారు

    రిప్లయితొలగించండి
  3. :-(((( అయ్యో.. టీవీ లో ఆడ్స్ చూసా ఈ టీం వస్తుందని. కానీ నేను చూద్దామనుకుంటూనే మర్చిపోయా.. పోన్లెండి. కనీసం మీ రివ్యూ చూసా. యూట్యూబ్ లో ఎవరైనా పెడతారేమో చూస్తా.

    రిప్లయితొలగించండి
  4. మీ బ్లాగులో టివి చూస్తుంటాను. ఈ ప్రోగ్రాం బాగుంది. Thanks

    రిప్లయితొలగించండి
  5. అవును మంచి ఎపిసోడ్.చంద్రమోహన్ కి అనారోగ్యమా లేక వినికిడి సమస్య కోడా ఉన్నదా అని చాలా సార్లు అనిపించింది. శంకరాభరణం డి వి డి లో ఒక ఎడిషనల్ ఫీచర్ కింద ఈ కార్యక్రమాన్ని కలిపి విడుదల చేస్తే ఎంతైనా బాగుండును రాబొయ్యే తరాలకు ఈ సినిమా గురించిన విశేషాలు తెలుస్తాయి.

    మన సి డి/డి వి డి వర్తకులకి ఇటివంటి సెన్సిటివిటీ ఉన్నదా అని అనుమానం!

    రిప్లయితొలగించండి
  6. కొంచం వైవిధ్యంగా ఉండి కనీసం అప్పుడప్పుడూ అయినా చూసే కార్యక్రమాలలో ఒకటి 'వావ్.'..అవునండి.

    రాత్రి ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడూ మీరే గుర్తుకొచ్చారు..చూస్తున్నారో లేదో అనుకున్నా.

    @శ్రీనివాస్ పప్పు గారూ.."నా సందేహమూ తీరిపోయింది(చంద్రమోహన్-విశ్వనాథ్ ల బంధుత్వం గురించి)మీరూ ధృవపరిచేసాక నమ్మకమూ కలిగిపోయింది"....అంటే అక్కడ చంద్రమోహన్ స్వయంగా చెప్పారు అని చెప్పినా మీకు నమ్మకం కలగలేదా...ఇక్కడ మురళి గారు చెప్తేనే నమ్మకం కలిగిందా!...మురళి గారూ చూసారా మీ మాట మీద ఎంత గురో మనాళ్లకి.

    రిప్లయితొలగించండి
  7. నేనూ చూసానండి ఈ ప్రోగ్రాం. బాగుంది. కాని అది చూసేప్పుడు మీరు దీని గురించి రాస్తారనుకోలేదు. అవునండి, 'వావ్' లో అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ బాగుంటాయి. వాళ్ళు ఎంత కమర్షియల్ అన్నది 'బొమ్మాళీనిన్నొదలా' రౌండ్ లో బాగా తెలిసిపోతుంది:)

    రిప్లయితొలగించండి
  8. అవును. చాలా బావుందీ ఎపిసోడ్. తులసి నాకు చాలా నచ్చింది. మొన్న పేపర్లో ఫోటో లో కూడా చాలా బావుందే అనుకున్నాను. మహా నది సినిమా తరవాత ఎప్పుడన్నా చేసిందా అని అనుమానం నాకు. ప్రోగ్రాం చాలా బావుంది. శంకరాభరణం + వాణీ జయరాం.. వావ్ ! వాణీ జయరాం కార్యక్రం ఆదివారం. మళ్ళీ నేను మిస్ కావచ్చు. మీరు చూసి చెప్పండేం ?!

    రిప్లయితొలగించండి
  9. ఐతే ఒక మంచి టీవీ షో మిస్ అయ్యానన్నమాట..యుట్యూబ్ లో చూడాలి అయితే

    రిప్లయితొలగించండి
  10. నేను చూశానోచ్.. ఆ ప్రోగ్రాం నేను కూడా చూశానోచ్.. చాలా బాగుంది. అందర్లోనూ మంజుభార్గవికి కొంచెం జనరల్ నాలెడ్జ్ ఎక్కువలా అనిపించింది. విశ్వనాథ్ గెస్ట్ అప్పియరెన్స్ కార్యక్రమానికి హైలైట్.

    రిప్లయితొలగించండి
  11. వచ్చే వారం వావ్ మిస్ కావద్దు. గ్రేట్ కామెడీ షో ఉండబోతోంది. ల.పా. అనగా లక్ష్మి పార్వతి, పోసాని, అంబిక కృష్ణ, తీగెల కృష్ణా రెడ్డి వస్తున్నారు. ల.పా. ఏం చెబుతారో... తన దేవుడు గురించి, అల్లుడు గురించి? అంబిక కృష్ణ, తీగెల కృష్ణా రెడ్డి డాన్సు స్పెషల్.

    రిప్లయితొలగించండి
  12. ఈ మధ్య దదాపు ప్రతివారం మిస్ అవకుండా చూస్తూ నిన్ననే మిస్ అయ్యానండీ... యూట్యూబ్ లోనో రీ టెలికాస్ట్ లోనో చూడాలి. వివరాలు అందించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. ఔనండీ చాలాబావుంది "వావ్"..

    సిరిసిమువ్వ దర్శకుడు ఏడిద నాగేశ్వరరావు అన్నప్పుడు, విశ్వనాధ్ గారి ముఖకవలికలు.. :)

    రిప్లయితొలగించండి
  14. @జయగారు, 'బొమ్మాళీనిన్నొదలా' లో ఇప్పటికి ముగ్గురు విజయం సాధించారండి,

    ప్రారంభ ఎపిసోడ్ లో కత్తి కళ్యాణ్ రాం.
    వెరి వెరి స్పెషల్ ఎపిసోడ్ లో సుమన్ బాబు (అఖండ విజయం అన్ని రవుండ్లలోను)
    చంద్రమోహన్ (ఇంతక ముందు సారి వచ్చినపుడు)

    రిప్లయితొలగించండి
  15. http://andhrawatch.com/tv-shows/27774-wow-with-manju-bhargavichandra-mohanrajyalakshmitulasi.html

    Thanks Murali garu for mentioning about the show here; after I searched for the show and got it in the above link..
    click on the above link for the people who missed it..పండగ చేసుకోండి..

    రిప్లయితొలగించండి
  16. @శ్రీ గారు, మురళి గారి ఫ్రెండ్ విన్ అయిన ఎపిసోడ్ చూసాను, కాని మిగతావాళ్ళవి నాకు తెలీదు. మొన్న తులసి కోసం పెట్టిన స్ట్రక్చర్ లోంచి మాత్రం కందిరీగ నడుము వాళ్ళు కూడా పోలేరు:)

    రిప్లయితొలగించండి
  17. ముతళి గారూ,

    ఇవాళ మీ టపా చూసి youtube లో వెతుక్కుని ఈ program చూసానండీ...బావుంది...నాకు కూడా wow కాస్త చూడదగ్గ TV show అనిపిస్తుంది.

    తరచూ నా టపాలు చదివి, ప్రోత్సహిస్తూ వుంటారు...చాలా ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  18. @శ్రీనివాస్ పప్పు: చంద్రమోహన్ స్వయంగా చెప్పాడని రాశానండీ! మీరది స్కిప్ చేసినట్టున్నారు, చూడండిప్పుడు ఎన్ని అపార్ధాలో :)) ..నిజమండీ. శంకర-ఆభరణాల గురించి కూడా ఓసారి చేయి చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది, మీ వ్యాఖ్య చూశాక!! ..ధన్యవాదాలు.
    @వనజ వనమాలి: వావ్!! ధన్యవాదాలండీ..
    @కృష్ణప్రియ: కవిత గారు లింక్ ఇచ్చారు చూడండి తన వ్యాఖ్యలో.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @చందు.ఎస్: నా బ్లాగులో టీవీ?? ..ధన్యవాదాలు.
    @శివరామ ప్రసాదు కప్పగంతు: నిజమేనండీ.. అలా చేయదగ్గ కార్యక్రమం.. కానైతే మన దగ్గర డీవీడీలు చేసేవాల్లకి ఎలాంటి సెన్సిబిలిటీలూ లేవు
    .. దానికి సేలబిలిటీ ఉన్నప్పటికీ కూడా :(( ఇదో విషాదం.. ధన్యవాదాలు.
    @సిరిసిరిమువ్వ: అబ్బే.. పప్పుగారు ఎక్కడో పొరబడి ఉంటారండీ.. మీరలా నన్ను ఖంగారు పెట్టేయద్దు :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @జయ: ఆ రౌండే లేకపోతే వాళ్ళు లక్షలకి లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది, విజేతలకి.. ఎక్కడో సుమన్ బాబు లాంటి అవతార పురుషులు మాత్రం అవలీలగా గేలిచేస్తూ ఉంటారనుకోండి, అది వేరే విషయం మరియు దేవ రహస్యమూను :)) ..ధన్యవాదాలు.
    @సుజాత: నేను వాణి జయరాం ప్రోగ్రాం కూడా మిస్ కాకుండా చూసి, ఇప్పుడే ఓ టపా పోస్ట్ చేశానండీ!! అన్నట్టు తాజాగా 'వినాయకుడు' అనే సినిమాలో అతిధిపాత్ర చేసింది తులసి. "తల్లి పాత్రలకి సిద్ధం" అంటూ ఒకటే స్టేట్మెంట్లు కూడా..ధన్యవాదాలు.
    @శ్రీ: చూసేయండి.. నచ్చుతుంది మీకు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. @చాణక్య: అవునండీ.. జనరల్ నాలెడ్జి ప్రశ్నలకి టకటకా జవాబులిచ్చేసింది మంజు భార్గవి.. ధన్యవాదాలు.
    @చక్రవర్తి: ప్రోమో చూసి తరించానండీ.. ఆవిడ ఏమేం స్టోరీలు చెబుతుందో ఏమిటో.. అయినా అల్లుడి గురించి పెద్దగా చెప్పనివ్వరు లెండి ఆ చానల్ వాళ్ళు :)) ..ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: లంకె ఉంది చూడండి.. మీకు నచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. @రవికిరణ్: కదండీ.. నాకైతే మేష్టారి ముందు స్టూడెంట్ లాగే అనిపించింది నిజంగా!! ..ధన్యవాదాలు.
    @కవిత: చాలా చాలా ధన్యవాదాలండీ, లంకెని పంచుకున్నందుకు..
    @స్ఫురిత: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  23. అవును ఆ ప్రొగ్రాం యాదృచ్చికంగా నేనూ చుడదం జరిగింది. బావుంది. శంకరాభరణం నాకు నచ్హిన కొద్ది చిత్రాలలొ ఒకటి.

    రిప్లయితొలగించండి
  24. అవునండి. అదేదో కిట్‌కేట్ అసోసియేషన్ అంటండి. లండన్‌లో ఉన్న రైటర్స్ అసోసియేషన్‌ని అలా అంటారంట. మంజుభార్గవి చెప్పేదాకా నాకు తెలీదు.

    రిప్లయితొలగించండి
  25. Thank you Muraligaaru..

    Kavitha gariki kuda Thanks andi..link share chesinanduku..

    రిప్లయితొలగించండి
  26. @బాలకృష్ణ: ధన్యవాదాలండీ..
    @చాణక్య: అవునండీ.. నేనూ ఆశ్చర్యపోయాను..
    @స్వాతి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  27. అమ్మయ్యో మీ పాత పోస్ట్లు చూడకపోతే ఎంత మంచి ప్రోగ్రాం మిస్ అయి పోయే వాళ్ళమో. ఇప్పుడు మీ వల్ల కనీసం you tube లో నాన్నా చూసే భాగ్యం కలిగింది. చాలా థాంక్స్ అంది.

    రిప్లయితొలగించండి