కొందరు దర్శకులు సినిమాని కొంచమైనా "డిఫరెంట్ గా తీస్తారు" అని ఓ నమ్మకం నాకు. ఆ కొందరి జాబితాలో గీతాకృష్ణకీ స్థానం ఉంది. 'సంకీర్తన,' 'కోకిల,' 'కీచురాళ్ళు' ఇంకా నిన్న మొన్నటి అంతగా కలిసిరాని 'టైం' వరకూ తను తీసిన సినిమాలు జయాపజయాలకి అతీతంగా యెంతో కొంత నవ్యతతో ఉండడం నేను గమనించిన విషయం. కొన్ని కొన్ని సార్లు గీతాకృష్ణ ఆలోచనలు చాలా అడ్వాన్సుడు గా ఉంటాయనిపిస్తుంది నాకు. కేవలం గీతాకృష్ణ మీద నాకున్న నమ్మకం కారణంగా చూసిన సినిమా నిన్న విడుదలైన 'గీతాకృష్ణ కాఫీబార్.'
రెండేళ్ళకి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకి గీతాకృష్ణ కథ, స్క్రీన్ప్లే, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలతో పాటు సంగీతాన్నీ సమకూర్చారు. ప్రధమార్ధంలో ఎక్కడ గీతాకృష్ణ మార్కు కనిపించని విధంగా సాగిన సినిమా, ఇంటర్వల్ కి వచ్చేసరికి కథకి కీలకమైన ముడిపడి, ద్వితీయార్ధం అంతా చకచకా సాగుతూ కొంత సాగతీత ముగింపు దృశ్యాలతో ముగిసింది. మొదటిసగం కలిగించిన నిరాశను, రెండో సగం కొంతమేరకి తొలగించడంతో సినిమా ముగిసే సమయానికి "అనవసరంగా బలయ్యాం" అన్న భావన కలగలేదు.
సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మానవుడు తన మెదడుని ఉపయోగించగలిగిన దానిలో కనీసం ఒక్క శాతం కూడా పూర్తిగా ఉపయోగించడం లేదనీ, కనీసం పది శాతం ఉపయోగించినా ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయంటూ జాతికి చేసిన సూచననీ, ఉగ్రవాదం తీవ్రవాదం పెచ్చరిల్లిన ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపమన్న మహాత్ముడి సిద్ధాంతాన్ని ఆచరించడం ఎంతవరకూ సమంజసం అన్న ప్రశ్ననీ కలిపి అల్లుకున్న కథ ఇది. కొంచం గందరగోళంగా అనిపిస్తోంది కదూ? సినిమా ప్రధమార్ధం కూడా ఇలాగే గందరగోళంగా సాగింది.
చిన్నప్పుడే తండ్రినీ, పెద్దయ్యాక తల్లినీ కోల్పోయిన యువకుడు రామకృష్ణ (శశాంక్) కి తను చాలా మేధావిననీ, మేధస్సుతో ఏమైనా సాధించవచ్చుననీ గట్టి నమ్మకం. ఆ నమ్మకంతోనే చేతిలో సర్టిఫికెట్లు లేకపోయినా, కేవలం తన మేధస్సుతో ఉద్యోగం సంపాదించడం కోసం హైదరాబాద్ బయలుదేరతాడు. ప్రయాణంలో తనలాగే అనాధ అయిన చిన్నపాప శివాని (బేబి శివాని) పరిచయమవుతుంది. భాగ్యనగరం చేరుకున్నాక రేడియో జాకీ సృజన (బియాంక దేశాయ్) తో ఓచిన్న తగువుతో మొదలైన పరిచయం ఇంటర్వల్ నాటికి ప్రేమగా మారుతుంది.
ప్రారంభ సన్నివేశాలతో సినిమాపై ఆసక్తిని పెంచిన దర్శకుడు దానిని నిలబెట్ట లేకపోయాడు. పాత్రల పరిచయం అయ్యాక, కథలాంటిది ఏదీ మొదలు కాకపోగా, అనవసర సన్నివేశాలు వస్తూ పోతూ స్క్రీన్ టైం వృధా అవుతున్న భావన కలిగించాయి. మాటకి ముందు హీరో 'నేను జీనియస్ ని కదా' అనడం విసుగు రప్పించింది. ఓ అపరిచితుడితో జరిగిన చిన్న వాగ్వాదం తర్వాత, తనకో లక్ష రూపాయలిస్తే తన మేధస్సుని ఉపయోగించి ఏడాది తిరిగేసరికల్లా దానిని కోటి రూపాయలు చేస్తానని చాలెంజ్ చేస్తాడు రామకృష్ణ. అయితే, ఆ అపరిచితుడు లక్ష కి బదులు కోటి రూపాయలు ఇస్తాననీ, ఏడాదికల్లా దానిని వంద కోట్లు చేయాలనీ షరతు విధించడంతో కథ విశ్రాంతికి చేరింది.
నిజానికి సినిమాని ఈ పాయింట్ నుంచి మొదలు పెట్టి చాలా బాగుండేది కదా అనిపించింది, రెండోభాగం నడిచిన తీరు గమనించాక. దర్శకుడిగా తన పనితనాన్ని రెండో సగంలో చూపించాడు గీతాకృష్ణ. చాలా సీరియస్గా సాగిన రెండో సగంలో కథకీ, అప్పటికే హీరో పాత్రని నాన్-సీరియస్ గా ఎస్టాబ్లిష్ చేసిన తీరుకీ పొసగలేదు. అప్పటికే స్క్రీన్ టైం సగం అయిపోవడంతో హీరోకి తన మేధస్సుని చూపించే అవకాశం పూర్తిగా దొరకలేదు. తాజ్ హోటల్ మీద టెర్రరిస్ట్ దాడి జరిగిన కాలంలో రాసుకున్న కథ కావడం వల్ల కాస్త పాతబడినట్టుగా అనిపించినా, ఆ తరహా దాడులు వాటిపట్ల ప్రభుత్వ స్పందనల్లో పెద్దగా మార్పు లేనందున మరీ అవుట్ డేటెడ్ గా అనిపించలేదు.
కూసింత నాటకీయంగా చిత్రీకరించిన క్లైమాక్స్ సన్నివేశంలో సుదీర్ఘమైన సీరియస్ డైలాగుల్ని శశాంక్ పలికిన తీరు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. చాలా సన్నివేశాల్లో విలన్ గా చేసిన అతుల్ కులకర్ణి శశాంక్ ని డామినేట్ చేసేశాడు. బియాంక కి నటించడానికి కొంచం అవకాశం ఉన్న పాత్ర. బానే చేసింది. సాధారణంగా గీతాకృష్ణ సినిమాల్లో సంగీతం కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ ఈ సినిమాలో పాటలు నిరుత్సాహ పరిచాయి. ప్రధమార్ధంలో వచ్చే 'హలో హలో..' పాట ఒక్కటే గుర్తుంది. రెండో సగంలో నేపధ్య సంగీతం బాగా కుదిరింది. ఎమ్వీ రఘు చాయాగ్రహణం బాగుంది.
రెండేళ్ళకి పైగా షూటింగ్ జరిపిన గీతాకృష్ణ స్క్రిప్ట్ మీద మరికొంత సమయం వెచ్చించి ఉంటే బాగుండేది అనిపించింది, సినిమా పూర్తవ్వగానే. ముఖ్యంగా మొదటి సగం సాగతీతగానూ, రెండో సగం 'అప్పుడే అయిపోయిందా' అనిపించేట్టుగానూ ఉందంటే అది స్క్రీన్ ప్లే లోపమే. అలాగే చాలా సన్నివేశాలలో ప్రధాన పాత్రల నుంచి సరైన నటన రాబట్టుకోలేదు అనిపించింది. కొన్ని చోట్ల డబ్బింగ్ లిప్ సింక్ కుదరలేదు. (తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేశారు). ముఖ్యంగా శశాంక్ కి ఎవరిచేతైనా డబ్బింగ్ చెప్పించి ఉంటే బాగుండేది. రెండో సగంలో మాస్ మసాలా పాట లేకపోయినా పర్లేదు. మొత్తం మీద రెండోసగం కోసం మొదటి సగాన్ని భరించగలిగే వాళ్ళు ఈ కాఫీని ప్రయత్నించవచ్చు.
ఎప్పుడొచ్చిందండి ఈ సినిమా? ఎక్కడా టీవీ లో కమర్షియల్స్ కూడా కనపడ్డట్టు లేవు? కొత్తదేనా? మీ రివ్యూ బాగుంది, ఐతే మేము డీవీడీ లలో చూడొచ్చన్నమాట మొదటి హాఫ్ ను ఫార్వర్డ్ చేసుకుంటూ.
రిప్లయితొలగించండిఈ సినిమా ఎట్టకేలకు విడుదలైపోయిందా!! ఎక్కడాడుతుందో చూడాలి. నాకు గీతాకృష్ణపై ఇంచుమించు మీ అభిప్రాయంలాంటిదే. మీ సమీక్ష బాగుంది. సినిమా చూడాలి.
రిప్లయితొలగించండిప్రస్తుతం మలయాళ సినిమా చూద్దామనుకుంటున్నానండి. సో, ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది:)
రిప్లయితొలగించండి@భావన: ఎట్టకేలకి ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన విడుదల అయిందండీ.. కొత్తదేనా ఆంటే, కొత్తదనే చెప్పాలి మరి :)) మొత్తానికి చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జేబీ: అవునండీ, వచ్చి వెళ్ళిపోయింది కూడా.. థియేటర్ లో కుదరకపోతే డిస్క్ చూడడమే.. రెండో సగం బాగుందండీ.. ధన్యవాదాలు.
@జయ: పర్లేదండీ.. తీరికగా చూడొచ్చు.. ధన్యవాదాలు.