మంగళవారం, ఏప్రిల్ 26, 2011

డబ్బుఖర్చు...

మార్పు అన్నది ఓ నిశ్శబ్ద పరిణామం..మన పని మనం చేసుకుంటూ పోతే, మనకు తెలియకుండానే మన జీవితాల్లో ఈ మార్పు ప్రవేశించేస్తూ ఉంటుంది. ఏ విషయంలోనూ మనం నిన్నలా మొన్నలా ఉండం.. ఉండడం సాధ్యపడదు కూడా. ఉదాహరణకి డబ్బు ఖర్చు పెట్టడం అనే విషయాన్నే తీసుకోండి. ఒకప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు వచ్చేసిందో.. 'ఆచి తూచి ఖర్చు పెట్టడం' అన్నది ఒకప్పుడు అలిఖిత నియమంగా ఉండేది. పిల్లలూ, పెద్దలూ అందరూ పాటించేవాళ్ళు. నిజానికి అప్పట్లో పిల్లలకి తమ చేత్తో ఖర్చు పెట్టే అవకాశమే ఉండేది కాదు. డబ్బు దాచుకున్న వాడు గొప్పవాడు అప్పట్లో.

మరి ఇప్పుడో? ఎవరెంత ఎక్కువగా ఖర్చు చేస్తే వాళ్ళంత గొప్పవాళ్ళు. దాచుకోవడం కన్నా ఖర్చు పెట్టడమే మిన్న అన్నది మనకి తెలియకుండానే ప్రవేశించిన సాంస్కృతిక విప్లవం. కాన్వెంట్ పిల్లల కనీస పాకెట్ మనీ యాభై నుంచి వంద రూపాయలిప్పుడు.. ఇంక కాలేజీ పిల్లలకైతే డబ్బివ్వడం, లెక్ఖలు చూడడం లాంటి తతంగం ఏమీ లేదు. ఓ క్రెడిట్ కార్డో, డెబిట్ కార్డో తీసివ్వడం, అకౌంట్లో క్రమం తప్పకుండా బాలన్స్ ఉండేలా చూసుకుంటూ ఉండడం. కేవలం పిల్లలేనా? పెద్దవాళ్ళకి మాత్రం, ఏమీ తోచకపోతే గుర్తొచ్చే మొదటి పని షాపింగ్. ఏ ప్రత్యేక సందర్భం వచ్చినా చేసే మొదటి పని కూడా షాపింగే..
ఈ షాపింగ్ కి ప్రస్తుతం ఉన్న, రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణకి నిదర్శనం కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు.. మన చుట్టూ పెరుగుతున్న షాపింగ్ మాల్స్ ని గమనిస్తే చాలు.. ఆ మాల్స్ ప్రకటనల మీద వచ్చిస్తున్న మొత్తాన్ని లెక్కకట్టినా చాలు. అవసరానికి తగ్గట్టుగా కొనుక్కోవడం స్థానంలో, ముందుగా కొని తర్వాత ఉపయోగించడాన్ని గురించి ఆలోచించడం అన్న కాన్సెప్ట్ చాలా వేగంగా మన జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చేసింది. ఫలితం, "మా ఇంట్లో కేవలం పనికొచ్చే వస్తువులు మాత్రమే ఉన్నాయి" అని ఎవరూ కూడా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పలేని పరిస్థితి.

డబ్బు ఖర్చు అన్నది కేవలం షాపింగ్ కి మాత్రమే పరిమితం కాదు, కాలేదు. ప్రతిచోటా 'ఇది మనకి అవసరమా?' అన్న ప్రశ్నకి ఏమాత్రం తావులేని విధంగా ఖర్చు జరిగిపోతోంది. ఉదాహరణకి రైలు ప్రయాణాన్నే తీసుకుందాం.. ఈమధ్య కాలంలో పెరిగిన ధోరణి "టిక్కెట్ తత్కాల్ లో కొందాంలే.." తత్కాల్ టిక్కెట్ కొనడం తప్పుకాదు. కానీ ముందుగా రిజర్వేషన్ చేయించుకునే అవకాశం ఉన్నప్పటికీ, తత్కాల్ అనే సౌకర్యం ఉందన్న ఒకే ఒక్క కారణంతో ఎక్కువ మొత్తం ఖర్చు చేసి ఆ టిక్కెట్ కొననేల? ఎందుకంటే ఖర్చుకి మనం వెనుకాడం కాబట్టి. ఇంకా చెప్పాలంటే 'తత్కాల్' అన్నది ఓ ప్రెస్టేజ్ ఇష్యూ అయి కూర్చుంది కాబట్టి.

రాను రాను, సేవింగ్స్ గురించి మాట్లాడడం కూడా అవుట్ డేటెడ్ అయిపోతోంది. ఒక్క మార్చి నెలలో ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మినహా, మిగిలిన సందర్భాలలో ఎక్కడా ఎప్పుడూ సేవింగ్స్ ప్రస్తావన రావడం లేదు. షేర్ మార్కెట్, మూచ్యువల్ ఫండ్ కబుర్లు మాత్రం అక్కడక్కడా వినిపిస్తున్నాయి.. షేర్స్ ని స్థిరమైన సేవింగ్స్ అనగలమా? ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ సంస్కృతికి ఎక్కడి నుంచి వచ్చింది? కొద్దిగా ఆలోచిస్తే దొరికిన సమాధానం, వారం ఐదు రోజులూ కష్టపడి సంపాదించిన మొత్తాన్ని వారాంతం రెండు రోజులూ పూర్తిగా ఖర్చు చేసేసి కొత్త వారాన్ని తాజాగా మొదలు పెట్టడం అన్నది అమెరికన్ సంస్కృతి. దీనిని మనం అరువు తెచ్చుకోలేదు.. తనే వచ్చి మనతో కలిసిపోయింది. అమెరికనైజేషన్ అన్నది ఇవాళ కొత్తగా మొదలైంది కాదు కదా.

జరుగుతున్న ఈ పరిణామం మంచికా, చెడుకా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది కాలం మాత్రమే జవాబు చెప్పగలిగే ప్రశ్న. 'చీమ-మిడత' కథ వింటూ పెరిగిన తరాలకి ఈ పోకడ ఓ పట్టాన అర్ధం కాకపోవచ్చు. అర్ధమయ్యి ఆందోళన కలిగించనూవచ్చు.. కానైతే, రోజురోజుకీ విశ్వరూపం దాలుస్తున్న ఈ ఖర్చు సంస్కృతిని నిలువరించడం ఏ ఒక్కరి వల్లనో జరిగే పని కాదు. బహుశా ఇదో శాఖా చంక్రమణం. 'మనోనేత్రం' సందీప్ గారు రాసిన ఈ టపా చదివాక అలా అలా ఆలోచనల్లోకి వెళ్లి వచ్చి రాసిన టపా ఇది.

7 కామెంట్‌లు:

  1. ఇదివరకటి రోజులతో పోలిస్తే సంపాదనా పరులు ,సంపాదించే అవకాసాలు పెరగటం ఒక కారణం కావచ్చు . ఫలానావారు ఫలానా ఫని మాత్రమే చెయ్యాలి అన్న నియం లేదు ఏదో ఓ పని చేసి సంపాదించచ్చు అన్న ధీమా అందరికీ వుంది దాంతో ఖర్చు చెయ్యడానికి వెనకాడ్డం లేదు .
    ఏమైనా ఇది మంచిది కాదు . రాబడికి ఖర్చుకు పొంతన వుండాలి .అప్పులపాలయి కుటుంబం మొత్తం ఆత్మహత్యలు చేసుకోవటం పెరిగిపోయింది ఈ విపరీత ధోతణి వల్లే అని నా అభిప్రాయం

    రిప్లయితొలగించండి
  2. నాకు 'విండో షాపింగ్' అంటే చాలా ఇష్టం. అలా వెళ్ళాక ఇలా ఊరికే రాలేం గా:) మీరన్నట్లు ఒక్క ఇన్ కంటాక్స్ ఫైల్ చేసేప్పుడే ఆలొచిస్తామేమో. కళ్ళు చూసి చేతులకి పనిచెప్తే అంతే మరి. ఈ విషయంలో నాకెప్పుడూ పడుతునే ఉంటాయి. మీరన్నట్లు మాల్స్ కూడా పెరిగిపోతున్నాయి. చుట్టూ అవే మరి. ఎలా కంట్రోల్ చేసుకోగలం చెప్పండి మరి.

    రిప్లయితొలగించండి
  3. నాకైతే అందరూ ఇంత ఖర్చు పెడుతున్నారు , అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని ఆశ్చర్యం వేస్తుంది . ఎవరిదాకా నో ఎందుకు , మా సర్వెంట్ క్వాటర్ లో వున్న , మాసర్వెంట్ లీటర్ 44 రూపాయల పాలు రోజూ కొంటుంది . నేనేమో అమ్మో 44 రూపాయలే అనుకొని , విజయ పాలు ఎక్కువ ధరా , హెరిటేజ్ పాలు ఎక్కువ ధరా అని అలోచించి కొంటాను :)

    రిప్లయితొలగించండి
  4. good one...మన పిల్లలు పెద్దయ్యేటప్పటికి ఎలా ఉంటుందో పరిస్తితి. మనం ఎక్కువ ఖర్చు చేస్తున్న ఏములొ కాస్త సేవ్ చెయ్యాలన్న ఆలోచన అన్న ఉంది.
    Once my friend said, save money only for your old age, you don’t have to save to give to kids. నిజమే కదా అనిపిస్తుంది ఇప్పుడు. బాగుందండి మీ పోస్ట్..

    రిప్లయితొలగించండి
  5. మురళి గారూ

    మీ బ్లాగ్స్ చాలా బావుంటున్న్నాయండీ.
    మీరన్నది నిజమే మార్పు అనేది మన జీవితాల్లోకి నిశ్శబ్దంగా చేరిపోతోంది. ఏ విషయం గురించి ఆలోచించినా మార్పుని అంగీకరించటం మినహా మరేమీ చెయలేమనిపిస్తోంది. కాస్త conservative thinking ఉన్న వాళ్ళం కొత్త దనాన్ని accept చేయలేక, పూర్తిగా పాత పద్ధతులు పాటించలేక సతమతమవ్వాల్సి వస్తుంది. చివరికి నలుగురితో పాటు నారాయణా అనుకోవటం ఇలా బతికేయటం.

    శ్రీరాగ

    రిప్లయితొలగించండి
  6. @లలిత: మీరు చెప్పిన ఆత్మహత్యల కోణం ఆలోచించాల్సిందేనండీ.. ధన్యవాదాలు.

    @జయ: అసలు రహస్యమంతా విండో షాపింగ్ లోనే ఉందండీ.. మనకి అవసరం లేని వస్తువులు కొనేది అప్పుడే.. (నా స్వానుభవం లెండి) .. ఇంక మాల్స్ అంటారా.. డిమాండ్ ని బట్టి సప్లై మరి..ధన్యవాదాలు.

    @మాలాకుమార్: నిజమేనండీ.. మనం ఆలోచించేలోగా మన పక్కవాళ్ళు ఖర్చు పెట్టేయడం జరిగిపోతోంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. @ప్రవీణ: లేదండీ, నా అంచనా ప్రకారం అప్పటికి మళ్ళీ సేవింగ్స్ కల్చర్ వచ్చేస్తుంది.. ధన్యవాదాలు.

    @సిరి: అవునండీ.. జరుగుతున్నది అదే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి