నాకు హిందీ నుంచి తెలుగులోకి డబ్ అయిన సినిమాలంటే ప్రత్యేకమైన అభిమానం. ఆంగ్లం, అరవం మరియు ఇతర భారతీయ భాషల నుంచి డబ్ అయిన సినిమాల కన్నా వీటిమీద ఇష్టం కొంచం ఎక్కువ. మరీ ముఖ్యంగా ఈ సినిమాల్లో పాటలు, సాహిత్యం. ఇది ఎంతగా అంటే, ఇప్పటికీ ఏదన్నా హిందీ సినిమా తెలుగు డబ్బింగ్ విడుదలై, ఆ తర్వాత ఎప్పుడైనా ఒరిజినల్ హిందీ సినిమా టీవీలో వస్తుంటే నేనీ డబ్బింగ్ పాటలు పాడుకుంటూ ఉంటాను.
ఈ డబ్బింగ్ సినిమాలని నేను కొంచం ఆలస్యంగా పట్టించుకున్నాననే చెప్పాలి. హిందీ నుంచి డబ్బింగ్ ఎప్పుడు మొదలయ్యిందన్నది నాకు ఇదమిద్దంగా తెలియదు కానీ, నేను చూసిన మొదటి డబ్బింగ్ చిత్రరాజం మాత్రం రాజశ్రీ వారి 'ప్రేమపావురాలు.' సల్మాన్ ఖాన్, రీమాలాగు వీళ్ళంతా తెలుగులో మాట్లాడుతుంటే ఏదో చిత్రమైన అనుభూతి. వాళ్ళ వేషానికీ, భాషకీ అస్సలు సంబంధం లేకపోవడం... అదేమిటో కానీ, భాగ్యశ్రీ మాత్రం పరాయిపిల్లలా అనిపించలేదు నాకు.
ఇంక పాటలైతే చెప్పక్కర్లేదు.. "సాయం సంధ్యవేళయ్యిందీ..." పాటలో బాలూ "తస్సదియ్యా" అనడం భలే నచ్చేసింది. "ఓ పావురమా.. హెహే.. ఒపావురమా," "నీజతలేక..పిచ్చిది కాదా.." ఇలా 'ప్రేమపావురాలు' లో పాటలన్నీ మారుమోగాయి అప్పట్లో. ఇప్పటికీ 'మైనే ప్యార్ కియా' డిస్క్ చూస్తుంటే (అవును డిస్క్ ఉంది నాదగ్గర, "దేశాన్నే ఊపేసిన భాగ్యశ్రీనా?" అని జొన్నవిత్తుల రాశాడంటే, రాయడూ మరి) పాటలు వచ్చేసరికి నేను తెలుగులోకి షిఫ్ట్ అయ్యి పాడేసుకుంటూ ఉంటాను.
"నీ ఆశే నాకు ఆరాధనం.. ప్రేమించే గుండె ఒక నందనం.. అప్పగించా నా ప్రాణం పునఃమ్.. నా ప్రాణం నీ పునరంకితం.." ఈపాట గుర్తుందా ఎవరికైనా? "తుజ్హే దేఖా తో ఏ జానా సనం...." అదీ సంగతి. 'ప్రేమపావురాలు' తెలుగులో కూడా బాగా డబ్బు చేసుకునేసరికి హిందీ డబ్బింగ్ సినిమాల పరంపర మొదలయ్యింది. సినిమా రాకముందే తెలుగు ఆడియో వచ్చేసేది. ఇంక ఏ హోటల్ కి వెళ్ళినా అవే పాటలు. "చెమ్మ చెమ్మ చెక్కలాట.." పాట టబు సినిమా 'మాచీస్' తెలుగు డబ్బింగ్ 'అగ్గిరవ్వలు' లోది.
'ప్రేమపావురాలు' తర్వాత ఆ స్థాయి డబ్బింగ్ మ్యూజిక్ ని మళ్ళీ రాజశ్రీ సంస్థే అందించింది, 'ప్రేమాలయం' ద్వారా. "ఓ అక్కా నీ మరిదెంతో ఎర్రోడే.." "జోళ్ళు ఇచ్చుకో.. డబ్బు పుచ్చుకో.." "అమ్మా అమ్మా మన ముంగిట్లో కూసెను నేడొక కాకి.." లాంటి సాహిత్యం వినగలిగే అవకాశం దొరికింది. పాటలేనా? అప్పట్లో ఈ సినిమా తెలుగు డైలాగులు కూడా కేసెట్లుగా విడుదలయ్యాయి. ఆ చిత్రమైన తెలుగుకి భలే నవ్వొచ్చేది. (అప్పట్లో టీవీ చానళ్ళూ, టాక్ షోలూ లేవు మరి).
అదే టైములో మళ్ళీ వచ్చిన మరో ట్రెండ్, పాపులర్ హిందీ పాటల ట్యూన్ యధాతధంగా వాడుకుని (కాపీ చేసి అంటే మన సంగీతదర్శకుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి) తెలుగు పాటలు చేసేయడం. 'తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్..' ని 'ఓ సుందరి నువ్వే మస్త్ మస్త్..' అనీ, మరో పాపులర్ పాటని 'పున్నాగ పూల తోటలో మాట ఇచ్చి మరవకు..' ట్యూన్ చేసి వదిలేశారు. ఇలాంటివే మరికొన్ని పాటలూ ఉన్నాయి. ఈ పరంపర కొన్నాళ్ళపాటు సాగింది. డబ్బింగ్ సినిమాల్లోనూ కొన్ని చక్కటి పాటలు ఉన్నాయి. అసలు శ్రీశ్రీ సిని రచయితగా మారింది డబ్బింగ్ సినిమాతోనే. డబ్బింగ్ లో రాజశ్రీకి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'వైశాలి' అనే సినిమాలో 'ప్రేమ జీవన రాగం' పాట నాకెంతో ఇష్టం.
హిందీ డబ్బింగ్ సినిమాల ప్రాభవం కొంచం తగ్గాక హాలీవుడ్ డబ్బింగ్ సినిమాల మెరుపు దాడి మొదలయ్యింది. 'జురాసిక్ పార్క్' మొదలుకొని 'టైటానిక్' 'అనకొండ' ల మీదుగా సాగిన ప్రయాణం నిన్న మొన్నటి 'భూలోక వీరుడు' 'లోకం చుట్టిన వీరుడు' వరకూ అప్రతిహతంగా కొనసాగింది. ఈమధ్య ఎందుకో ఈ సినిమాలూ తగ్గాయనిపిస్తోంది. కారణాలు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారిని కనుక్కోవాలి. ఇంగ్లీష్ సినిమాలు డబ్ చేయడంలోనే కాదు, ప్రచారంలోనూ వీరిది ప్రత్యేక శైలి. గుండె జబ్బులున్న వాళ్ళు వీళ్ళ సినిమాల ప్రోమోలకి తగుమాత్రం దూరంలో ఉండడం మంచిది.
మణిరత్నం లాంటి దర్శకులు తమిళ డబ్బింగ్ సినిమాలని తెలుగు నేలమీద పాపులర్ చేశారు. నేను చెప్పకపోయినా, మళయాళ డబ్బింగ్ సినిమాలకి ఇక్కడ ప్రాభవం తెచ్చి, అక్కడి అగ్ర హీరోల ఆగ్రహం కారణంగా తర్వాతి కాలంలో తెలుగులో హాస్య పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసేసిన తార కొందరికైనా ఈసరికి గుర్తొచ్చే ఉంటుంది. "ఇనుములో హృదయం మొలిచెనే.." పాట నిన్నమొన్నటి వరకూ చెవుల్లో తుప్పు వదిలిస్తూనే ఉంది. టీవీ చానళ్ళు బాగా పెరిగిపోవడంతో సినిమాలకీ డిమాండ్ పెరిగి, ఇప్పుడిప్పుడు ఇంగ్లీష్, హిందీ డబ్బింగ్ సినిమాలనీ వరుసగా ప్రసారం చేసేస్తున్నారు. ఇవాళ ఉదయం అలా చానళ్ళు మారుస్తుంటే 'ప్రేమాలయం' కనిపించి నన్నలా జ్ఞాపకాల్లోకి తిప్పి తీసుకొచ్చింది.
లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారిని కనుక్కోవాలి. ఇంగ్లీష్ సినిమాలు డబ్ చేయడంలోనే కాదు, ప్రచారంలోనూ వీరిది ప్రత్యేక శైలి. గుండె జబ్బులున్న వాళ్ళు వీళ్ళ సినిమాల ప్రోమోలకి తగుమాత్రం దూరంలో ఉండడం మంచిది.
రిప్లయితొలగించండి---------------------------
నిజమండి బాబోయ్ ఆవిడ ఎందుకు అలా అరుస్తుందో నాకు ఇప్పటికి అర్ధం అయ్యి చావదు .
హా!! డబ్బింగ్ సినిమాలలోన హిందీ డబ్బింగ్ సినిమాలు వేరయా అని.. ఇవి తలుచుకోగానే నాకు గుర్తొచ్చే పాట: అక్కా నీ మరిదెంతో పిచ్చోడే!! ఆ పాట పూర్తిగా ఎప్పుడూ వినలేదు కానీ ఈ లైను వినేసరికే బాబోయ్ అనిపిస్తుంది..
రిప్లయితొలగించండిమీకు సుమన్ బాబు సినిమాలు చూసి తట్టుకునే శక్తి ఎలా వచ్చిందో ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. :)
రిప్లయితొలగించండిchala baga chepparu..monna ne nenu malli premapavuralu youtube lo chusanu...chinnapati rojulu gurtukuvachayi..dubbings pataleayina manchi sahityam tho rasaru
రిప్లయితొలగించండిమురళీగారు.....తెలుగు చిత్రాలని హిందీలోకి డబ్ చేస్తున్నారుగా, వాటి ముచ్చట్లు ఎప్పుడో మరి:):)
రిప్లయితొలగించండిమీ డబ్బింగ్ సినిమాల జ్ఞాపకాలు బాగున్నాయండీ.
రిప్లయితొలగించండినిజంగా ఈ మధ్య ఏ చానెల్ లో చూసినా ఇంగ్లిష్ డబ్బింగ్ సినిమాలు చాలా వస్తున్నాయి..
"గుండె జబ్బులున్న వాళ్ళు వీళ్ళ సినిమాల ప్రోమోలకి తగుమాత్రం దూరంలో ఉండడం మంచిది."
నిజమే చాలా బాగా చెప్పారు..
హింది డబ్బింగ్ సినిమాలు మా చిన్నప్పుడు కూడా ఉండేవి అంటే 50 ల్లో . రాజ్ కపూర్ సినిమా పేరు గుర్తు లేదు.
రిప్లయితొలగించండి"పందిట్లో పెళ్లవుతున్నది, కనువిందవుచున్నది, నటనమే ఆడేదనోయ్" " పాడు జీవితమూ యవ్వనం మూడు నాళ్ళ ముచ్చట లోయి అయ్యాయో నీదు పరుగులెచటికోయి.. చీకటి రాత్రి చుట్టూ ఎడారి చేయునదేమో చెలి ఇలు చేరి" పాటలు విన్నారా. ఆ కాలంలో పెద్ద హిట్లు.
ఇంకా చాలానే వచ్చాయనుకుంటాను.
@ శ్రవ్య,
రిప్లయితొలగించండిమీరు విజయవాడ వివిధ భారతి రేడియో లో ఎడ్వేర్తిసేమేన్త్స్ విన లేదా. నేను ౧౯౯౯ వరకు విన్నాను ఆ కంచు కన్తని
నేను చూసిన డబ్బింగ్ సినిమాలు మొత్తం మీద అప్పటికీ ఇప్పటికీ కలిపీ రెండేనండి. గాంధీ, మెరుపుకలలు. రెండూ నాకు బాగానే ఉన్నాయి:) మీరు చెప్పిన పాటలు నాకు చాలామటుకు తెలియవు. కాని భలేగున్నాయి. బులుసు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు అప్పట్లో సేం ట్యూన్ తో చేసిన పాటలు చక్కటి సాహిత్యం తో చాలా బాగున్నాయి. ఇప్పటికీ అవి ఒరిజినల్ అనిపిస్తాయి.
రిప్లయితొలగించండి>> "హిందీ నుంచి డబ్బింగ్ ఎప్పుడు మొదలయ్యిందన్నది నాకు ఇదమిద్దంగా తెలియదు కానీ ...."
రిప్లయితొలగించండి1953 ప్రాంతంలో రాజ్ కపూర్ 'Aah' సినిమాని 'ప్రేమలేఖలు' పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. శ్రీశ్రీ దానికి రచయిత. అందులో పాటలు పెద్ద హిట్లని పెద్దోళ్లు చెప్పేవాళ్లు. అంతకు ముందూ హిందీ డబ్బింగ్ సినిమాలుండి ఉండొచ్చు.
లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ వాళ్లని పన్లోపనిగా 'ఆకాశంలో భూకంపం' లాంటి పేర్లు ఎలా తడతాయో కూడా కనుక్కుని పుణ్యం కట్టుకోండి.
@శ్రావ్య: అన్నట్టు ఆవిడే ఇంటర్, ఎంసెట్ ఫలితాలప్పుడు కార్పోరేట్ కాలేజీల ర్యాంకులు చదువుతూ (అరుస్తూ) ఉంటారు ప్రకటనల్లో.. అదేంటోనండీ, సౌండ్ కూడా అమాంతం పెరిగిపోతూ ఉంటుంది ఆ ప్రకటనలకి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@మేధ: పిచ్చోడు కాదండీ, ఎర్రోడు.. నాకైతే 'అమ్మా అమ్మా మన ముంగిట్లో కూసెను నేడొక కాకి..' మొదట గుర్తొస్తుంది :)) ..ధన్యవాదాలు.
@కొత్తపాళీ: :)))))))))))))))))))) ...ధన్యవాదాలండీ..
@C Prapancham: అవునండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పద్మార్పిత: చూడాలండీ.. ధన్యవాదాలు.
@రాజి: ధన్యవాదాలండీ..
@బులుసు సుబ్రహ్మణ్యం: 'పందిట్లో పెళ్లవుతున్నాది' నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఒకటండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@వంశీ: అవునండీ, ఎక్కువగా బట్టల షాపుల ప్రకటనలు వినిపిచేవి.. ధన్యవాదాలు.
@జయ: ఎప్పుడన్నా ఫ్రీ గా ఉన్నప్పుడు నే చెప్పిన డబ్బింగ్ పాటలు వినండి.. మాంచి రిలీఫ్ :)) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@అబ్రకదబ్ర: 'ఆకాశంలో భూకంపం' ...నిజమేనండీ మంచి పాయింట్.. అసలు గమ్మత్తైన పేర్లు పెట్టడంలో కూడా వీళ్ళది ప్రత్యేకమైన స్టైల్.. థాంక్స్ ఫర్ ది ఇన్ఫో.. ధన్యవాదాలు.
అయ్యో ఆ గొంతు గుర్తు చేస్తూ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ మర్చిపోతే ఎలా,
రిప్లయితొలగించండిముద్దుల మావయ్య, ముద్దుల మావయ్య అనే అరుపులు ఇప్పటికీ నా చెవిలో గింగురుమంటున్నాయి.
డబ్బింగ్ సినిమాలు భరించాలంటే చాలా ఓపిక కావాలండీ.
శ్రీరాగ