మంగళవారం, ఫిబ్రవరి 15, 2011

వంశీకి నచ్చిన కథలు

తెలుగువాళ్ళకి వంశీని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రచయిత, సిని దర్శకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, ప్రకృతి ఆరాధకుడు... కాలం గడిచేకొద్దీ వంశీలోని మరిన్ని కొత్తకోణాలు ఆవిష్క్రుతమవుతూనే ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వంశీ సినిమాలు చూసిన, రచనలు చదివిన వాళ్లకి తన టేస్ట్ ని అంచనావేయడం పెద్ద కష్టమేమీ కాదు. పాఠకుడి నుంచి రచయితగా ఎదిగిన వంశీ, తన అభిమాన రచయితలు రాసిన కథల్లో తనకు నచ్చిన యాభై కథలతో వెలువరించిన సంకలనమే 'వంశీకి నచ్చిన కథలు.'

మెజారిటీ కథల్లో ఇతివృత్తం మానవనైజం. నిజానికి ఈ ఇతివృత్తంతో వందలకొద్దీ వైవిద్యభరితమైన కథలు రాయొచ్చు. ఎందుకంటే అంత చిత్రమైనది మానవనైజం. పరిస్థితులకి అనుగుణంగా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడెలా మారుతుందో ఒక అంచనాకి రావడం కూడా కష్టం. మానవనైజం తర్వాత ఎక్కువ కథలు మృత్యువు ఇతివృత్తంగా సాగినవి. సెంటిమెంట్ తో పాటు, హాస్యం, వ్యంగ్యంతో సాగేవి, కరుణ, రౌద్ర రస ప్రధానమైన కథలకీ ఈ సంకలనంలో సముచిత స్థానం ఇచ్చారు వంశీ.

రవీంద్రనాథ్ టాగోర్ రచనకి వంశీ స్వేచ్చానువాదం 'అక్కడి రాళ్ళు ఆకలితో ఉన్నాయి' తో మొదలైన ఈ సంకలనంలో వంశీ తొలికథ 'నల్ల సుశీల,' గొల్లపూడి మారుతీరావు రాసిన 'జుజుమురా,' శ్రీరమణ 'ధనలక్ష్మి,' రాజేంద్రప్రసాద్-యమునల హిట్ సినిమా 'ఎర్ర మందారం' కి ఆధారమైన ఎమ్వీఎస్ హరనాధరావు కథ 'లేడి చంపిన పులి నెత్తురు,' కెఎన్వై పతంజలి రచన 'సీతమ్మ లోగిట్లో' ల మీదుగా సాగుతూ 'అంపశయ్య' నవీన్ రాసిన 'హత్య' కథతో ముగిసింది.

రావి కొండల రావు పేరు వినగానే హాస్యమే గుర్తొస్తుంది. కానీ సస్పెన్స్ ప్రధానంగా ఆయన రాసిన 'రెండు శవాలు' కథ ఆశ్చర్య పరుస్తుంది. కుప్పిలి పద్మ 'ఆడిపాడిన ఇల్లు' స.వెం. రమేశ్ 'ఉత్తరపొద్దు' కథలు వర్ణన ప్రధానంగా సాగినవి. 'జంగుభాయి,' 'మంత్రసాని' చాలామందికి అంతగా పరిచయం లేని జీవితాలని పరిచయం చేస్తాయి. దుత్తా దుర్గాప్రసాద్ 'దానిమ్మపండు,' తల్లావఝుల పతంజలి శాస్త్రి రచన 'వైతరణికీవల' కథలు చాలారోజులపాటు వెంటాడుతాయి.

అల్లం శేషగిరిరావు కథ 'చీకటి' పాఠకులని పూర్తిగా ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకుపోతుంది. కథ కళ్ళముందు జరుగుతున్నట్టు అనిపిస్తుందే తప్ప, చదువుతున్న భావన కలగదు. కాశీభొట్ల కామేశ్వరరావు కథ 'దుప్పటి' మానవనైజాన్ని చాకచక్యంగా చిత్రిస్తే, బివిఎస్ రామారావు కథ 'బైరాగి' ఓ.హెన్రీ తరహా మెరుపు ముగింపుతో అబ్బురపరుస్తుంది. శంకరమంచి పార్థసారధి రాసిన 'ఆరోజు రాత్రి' టి.ఆర్. శేషాద్రి కథ 'ప్రియే చారులతే!' సి.ఎస్. రావు రచన 'మళ్ళీ ఎప్పుడొస్తారు?" కథల్లో ప్రధాన పాత్రలు వేశ్యలు. ఈ మూడు కథల్లోనూ పోలిక ఇదొక్కటే.

నిజానికి ఈ సంకలనంలోని ఏ రెండు కథలనీ పోల్చలేము. హాస్య ప్రధానంగా సాగే మొక్కపాటి నరసింహ శాస్త్రి కథ 'మా బావమరిది పెళ్లి' సెంటిమెంటల్ టచ్ తో ముగిసే పాలగుమ్మి పద్మరాజు కథ 'కోట గోడలు' రొమాంటిగ్గా సాగే కప్పగంతుల సత్యనారాయణ కథ 'తెల్లవారుఝాము పాఠాలు' కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రతి కథ చివరనా ఆ కథ తనకి ఎందుకు నచ్చిందో వివరిస్తూ వంశీ రాసిన ఫుట్ నోట్స్ కొన్ని కథల్లోని కొత్త కోణాలని అర్ధం చేసుకోడానికి పాఠకులకి ఉపయోగపడుతుంది.

నాలుగొందల డెబ్భై పేజీల ఈ సంకలనం ప్రింటింగ్ కంటికింపుగా ఉంది. బాపు రూపుదిద్దిన కవర్ పేజీ ఎప్పటిలాగే ఆకర్షణీయంగా ఉంది. తులసికోట దగ్గర నైవేద్యంగా కథల పుస్తకాలని ఉంచడం అన్నది బాపుకి మాత్రమే వచ్చే ఆలోచన. వంశీ అభిమానులు మాత్రమే కాక, వైవిద్యభరితమైన తెలుగు కథలని ఇష్టపడే వారందరూ తప్పక చదవ వలసిన సంకలనం ఇది. కుట్టిమాస్ ప్రెస్ ప్రచురించిన ఈ పుస్తకం 'విశాలాంధ్ర' అన్ని శాఖల్లోనూ దొరుకుతుంది. (వెల రూ. 200.)

7 కామెంట్‌లు:

  1. వంశీకి నచ్చిన కధలు..చదివాను. కానీ గుర్తులేవు. మళ్ళీ చదవాలి.

    రిప్లయితొలగించండి
  2. @ప్రణీత స్వాతి: యాభై కథలు కదండీ.. ఓసారి చూస్తే అన్నీ గుర్తొచ్చేస్తాయ్.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. ఒరిస్సా అనంగానే నాకు గుర్తొచ్చే ఊరు జుజామురా.
    మానవనైజం అంతసంక్లిష్టమైనది కాబట్టే ఇన్నిబ్లాగులు. ఏమంటారు?

    రిప్లయితొలగించండి
  4. @సుబ్రహ్మణ్య చైతన్య: నిజమేనండీ.. ఒప్పుకోక తప్పదు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. తులసికోట దగ్గర నైవేద్యంగా కథల పుస్తకాలని ఉంచడం అన్నది బాపుకి మాత్రమే వచ్చే ఆలోచన.

    ముఖ చిత్రాన్ని చాలా సార్లు చూసాను, ముగ్గులో టైటిల్ అనుకొన్నాను కానీ.....

    very keen observation.

    wonderful

    review is analytical.

    bollojubaba

    రిప్లయితొలగించండి
  6. నేను కూడా ఒరిస్సాలో శంబల్పూర్ వెళ్లేప్పుడు జుజుమురా లో వర్ణించిన కొన్ని ఊర్లు తగిలాయి. ఆ చీకట్లో ఊరిపేర్లు చదువుతూ పరవశిస్తుంటే- ఈ నోరుతిరగని దిక్కుమాలిన ఊర్లపేర్లకీ వీడి పిచ్చి సంతోషానికీ సంబంధమేంటా అని నా ఫ్రెండ్ అనిల్ రెడ్డి పెట్టిన ఎక్స్ప్రెషన్ నాకింకా గుర్తే.
    బొల్లోజు బాబా గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
    మీ పరిశీలనా శక్తిపట్ల అసూయతో
    సూరంపూడి పవన్ సంతోష్

    రిప్లయితొలగించండి
  7. @బోల్లోజుబాబా: బాపూ బొమ్మల్లో కనీకనిపించని కోణాలు చాలా ఉంటాయన్నది నా అభిప్రాయమూ, అనుభవమూ అండీ.. అందుకే పదేపదే చూస్తూ ఉంటాను.. ధన్యవాదాలండీ..
    @పవన్ సంతోష్: నేను 'జుజుమురా' తొలి సారి చదివినప్పుడు "వంశీ అయితే సినిమా తీసేస్తాడు" అనుకున్నానండీ. అనుకోకుండా అది వంశీకి నచ్చిన కథల్లో ప్రత్యక్షం.. 'శక్తి' ఏమీ లేదండీ, చిన్న పరిశీలన అంతే :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి