శనివారం, నవంబర్ 20, 2010

నూడుల్స్

నాకు ఉప్మా చేయడం వచ్చు. రెండు రకాల నూకలు, సేమియా, సగ్గుబియ్యం, అటుకులు.. ఇలా అన్నింటితోనూ రకరకాల ఉప్మాలు చేయగలను. (ఈ సందర్భంగా ఆంధ్రుల ఆహ్లాద రచయితకి కృతజ్ఞతలు చెప్పుకోవడం అవసరం.. తన ప్రతి నవలలోనూ ఉప్మా తప్పనిసరి కదా). అలాగే ఇనిస్టంట్ మిక్స్ తో పులిహోర కూడా చేయగలను. ఆఫ్కోర్స్, తినేవాళ్ళకి 'దంతసిరి' ఉండాలనుకోండి. ఈ వరుసలో నాకు వచ్చిన మరో వంటకం నూడుల్స్. ఇది మా ఇంట్లో నేను మాత్రమే తినే వంటకం. అందువల్ల దీనితో నేను చేసిన ప్రయోగాలకి లెక్కలేదు.

ఎన్ని రెస్టారెంట్లలో తిన్నా నూడుల్స్ రుచి ఒకేలా ఎందుకు ఉంటోందా? అని ఆలోచిస్తున్న సమయంలో చాన్నాళ్ళ క్రితం ఒక ఫ్రెండ్ ఇంట్లో నూడుల్స్ రుచి చూసే సందర్భం వచ్చింది. వీటిని ఇలా కూడా చేయొచ్చా? అనిపించి చేసినావిడ నుంచి తయారీ విధానం వివరంగా తెలుసుకున్నాను. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఆవిడ చాలా సంతోషంగానూ మరియు వివరంగా నాక్కావలసిన సంగతులు చెప్పారు.

వాళ్ళింటి నుంచి వస్తూ వస్తూ షాపుకెళ్ళి మేగి పేకెట్లు తెచ్చుకున్నాని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అప్పటికే నేను ఒకటి రెండు సార్లు స్వతంత్రించి చేసిన ప్రయోగాలు వికటించాయి. నీళ్ళు చాలక బాండీ మాడడం, నీళ్ళు ఎక్కువై నూడుల్స్ సూప్ గా అవతారం మార్చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ నేను అదరక, బెదరక, పట్టుదల విడవక వివరాలు తెలుసుకుని మరీ వచ్చాను కదా. ఆ ఉత్సాహంలో వంటకం మొదలు పెట్టేశా.

సదరు మిత్రురాలు చెప్పిన ప్రకారం, ముందుగా బాండీ వేడి చేసి ఓ రెండు చెంచాల నూనె పోయాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కేప్సికం తురుము, కేరట్ తురుము, కేబేజీ (ఇష్టమైతేనే), బీన్స్ (దొరికితేనే) వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కల్ని చివరికి ఉంచి, మిగిలినవన్నీ కొంచం వేగాక బాండీ లో వేయడం ఉత్తమం. నూడుల్స్ లో ఆనియన్ డీప్ ఫ్రై కాకపోతేనే టేస్ట్ బాగుంటుందన్న మాట. (టీవీ వంటల ప్రోగ్రాం భాష).


మన ఇష్టాన్ని బట్టి ఒకటో, రెండో పచ్చి మిర్చి కూడా సన్నగా తరిగి వేయాలి. పచ్చి బఠానీ వేసినట్టయితే వాటిని బాగా వేగనివ్వాలి. ఏమేం వెయ్యాలన్నది ముందుగానే నిర్ణయించుకుంటే, ఒక వరుసలో బాగా వేగాల్సిన వాటిని ముందుగానూ, తక్కువగా వేగాల్సిన ఉల్లి, టమాటా లాంటి వాటిని చివరిగానూ వేసుకోవచ్చు. ఇప్పుడింక కూరగాయ ముక్కలు ఫ్రై అయిపోయాక బాండీలో తగినన్ని నీళ్ళు పోయాలి. ఈ తగినన్ని దగ్గర చాలా సమస్య వస్తుంది. కూరగాయ ముక్కలు ప్లస్ నూడుల్స్ కలిసి ఉడకడానికి సరిపోయే నీళ్ళు పోయ్యాలన్న మాట.

వేసిన కూరగాయ ముక్కల పరిమాణాన్ని బట్టి (పరిమాణమా? పరిణామమా?? ...పరిమాణమే) తగినంత ఉప్పుని మరుగుతున్న నీటిలో వేయాలి. ఓ చిటికెడు సరిపోతుంది. నూడుల్స్ పేకట్ లో ఉండే చిన్న మసాల టేస్టర్ పేకట్ ని కత్తిరించి ఆ మసాలాని కూడా బాండీలోకి వొంపి గరిటతో కలపాలి. నూడుల్స్ అచ్చులని తగుమాత్రం చిన్న ముక్కలుగా విరిచి బాండీలో వేయాలి. సన్నని సెగమీద సరిగ్గా రెండు నిమిషాలు ఉడకనిస్తే చాలు ఘుమఘుమలాడే నూడుల్స్ రెడీ. ఇష్టమైతే గార్నిష్ చేసుకోవచ్చు(మళ్ళీ టీవీ భాష). టమాటా సాస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది.

నేను మేగి, టాప్ రోమన్ పేకట్లు మార్చి మార్చి వాడుతూ ఉంటాను. మేగి కన్నా టాప్ రోమన్ కి తక్కువ నీళ్ళు పడతాయన్నది నా అనుభవం. కొత్త కంపెనీ ఏది కనిపించినా ఓసారి ప్రయత్నిస్తా కానీ, నాకెందుకో ఈ రెండే బాగా నచ్చాయి. వండడానికీ, తినడానికీ కూడా. మసాలా టేస్టర్ ని అస్సలు వాడకుండా, నూడుల్స్ తో సేమియా ఉప్మా పద్ధతిలో చేసిన నూడుల్స్ వంటకాన్ని తినడం ఒకసారి సంభవించింది. అదో అనుభవం. ఎంత జాగ్రత్తగా చేసినా నూడుల్స్ ప్రతిసారీ రుచిగా రావు. అలాంటప్పుడు బాండీ సింకులో పడేసి, ఇంట్లో వాళ్ళతో పాటు ఇడ్లీ తినేయడమే..

27 కామెంట్‌లు:

  1. వావ్ ..కార్తీకమాసం వనబోజనాల "స్పెషలా"....నేను ఊర్లో లేకపోతె మా ఇంట్లో వాళ్ళు చటుక్కున చేసుకుని తినే వంటకం ....నాకిప్పుడు వాటిని చుస్తే విసుగు ,విరక్తి ,అంతకంటే మల్లాది గారి టిఫినిలె బెస్ట్ అంటాను :-)

    రిప్లయితొలగించండి
  2. నా కనీసం ఆ నూడుల్స్ చేయడం కూడా రాదు,కప్పా నూడుల్స్ తెచ్చుకుని, హీటర్లో నీటిని(కనీసం నీళ్ళు కాయడం కూడా రాదు మరి), వాటికి కలుపుకుని తింటాను.

    రిప్లయితొలగించండి
  3. ఆకలివేస్తే రెండు నిమిషాల్లో చేసుకునే వంట నాకు తెలిసి ఇదేనండి:)

    రిప్లయితొలగించండి
  4. హ హ కంక్లూజన్ బాగుంది మురళిగారు :-) నాకు ఈ వెజిటబుల్స్ ఆయిల్ అవీ వేసి ఇంత ప్రోసెస్ చేయడానికి మహా బద్దకం. వాడు చెప్పినన్ని నీళ్ళుపోసేసి మరిగాక మసాలా+నూడుల్స్ కలిపేసి రెణ్ణిముషాలు ఉంచి దించేయడమే. ఎందుకంటే టైం లేనప్పుడు తప్పనిసరి ఐతేమాత్రమే నేను నూడుల్స్ చేస్తా :-)

    రిప్లయితొలగించండి
  5. హహ్హహ్హా.. బాగున్నాయండీ నూడుల్స్ తో మీ ప్రయోగాలు! మీకు చెప్పినావిడ లాగానే మీరు కూడా మాకు చాలా వివరంగా చెప్పారు నూడుల్స్ ఎలా చేసుకోవాలని. :)

    రిప్లయితొలగించండి
  6. >>నీళ్ళు ఎక్కువై నూడుల్స్ సూప్ గా అవతారం మార్చేసుకోవడం జరిగింది.
    అదేదో సూప్ అని పేరెట్టేసి పేటెంట్ తీసీస్కోడమే.(శీకాకుళం యాస కుదిరిందా?)

    >>అలాంటప్పుడు బాండీ సింకులో పడేసి, ఇంట్లో వాళ్ళతో పాటు ఇడ్లీ తినేయడమే..

    :))

    రిప్లయితొలగించండి
  7. బాగున్నాయండి మీ నూడుల్స్. మొత్తానికి చాలా పెద్ద వంటకమే నేర్పించారు మాకు. :)

    రిప్లయితొలగించండి
  8. అన్నీ వేయించాక చివర్లో ఒక నిమిషం పాటు కొంచెం సోయాసాస్ కూడ వేసి వేయిస్తే మంచి రుచి వస్తుంది.

    రిప్లయితొలగించండి
  9. మురళీగారు, నూడుల్స్ వండుటకు రుచికరమైన పద్ధతి చెప్పారు. మేమూ ఇలాగే కూరలన్నీ వేసి చేసుకుంటాం. ఇంకా గరం మసాలా, ధనియాలపొడి వగైరాలు కూడా వేస్తాం.


    నూడిల్స్ ఇష్టపడే అందరికీ ఒక ముఖ్యమైన విషయం. నూడిల్స్ అతుక్కోకుండా ఉండటానికి, పైన రసాయనాలు పూస్తారు. అందుకని ముందర నూడిల్స్ విడిగా ఉడకబెట్టి ఆ నీటిని పారబోసి, ఆ ఉడికినవాటిని వేరే గిన్నెలో మిగతా పదార్ధాలతో వండుకోవాలి.

    మరిన్ని వివరములకు "Instant noodles chemicals drain water" అని గూగులించచ్చు.

    రిప్లయితొలగించండి
  10. nenu kuda baga thintanu noodles. baga ishtam plus ivi thinte konchem ayina laavu avutharu kada ani:)

    రిప్లయితొలగించండి
  11. మురళి గారు నేనూ ఇలాగే చేస్తా ..jbగారు హమ్మయ్య నేనూ ముందు ఉడకబెట్టి నీళ్ళు వంపి వండుతా.. కాని పోషకాలన్నీ పోతాయి అని అందరూ నన్ను తిట్టేవారన్నమాట :)

    రిప్లయితొలగించండి
  12. మరే నీటి పరిమాణం మారితే పరిణామాలు వక్రిస్తాయి కదా.అలాంటప్పుడు బాండీ సింకులో పడేసి, ఇంట్లో వాళ్ళతో పాటు ఇడ్లీ తినేయడమే..భలే చేసేదేముంది కనక.

    రిప్లయితొలగించండి
  13. బాగుందండి.నేను కొంచమించుమించు ఇలానే చేస్తానండి.

    రిప్లయితొలగించండి
  14. నూడుల్స్ ఓ పెద్ద వంట, దాన్లో రకాలు, రుచులూ...సరిగా రావడం, రాకపోవడం.....అమ్మమ్మామ్మా ఎంత ఎదిగిపోయారు జనాలు!

    రిప్లయితొలగించండి
  15. meeru vrase prati post lagaane NOODLES kuda malli,malli chadivinchela vundi.intha vivaram ga vrayalante nijam ga meeku entha vopika vundo anipistundi.

    రిప్లయితొలగించండి
  16. అయితే, మీలోకూడా చిన్నసైజ్ నలభీముడు దాగున్నాడన్నమాట! హాస్టల్లో ఉన్నప్పుడు అదేపనిగా తిని, ఆ తర్వాత సంవత్సరాల తరబడి ముట్టుకోకుండా, ఈ మధ్యనే మళ్ళీ స్టార్ట్ చేశా :) మీరు చెప్పినట్టే చేస్తే ఇక బాండీ సింక్ లో పెట్టాల్సిన అవసరం లేనేలేదే?! చివర్లో 2 గుడ్లు కొట్టేసి 'ఎగ్ ఫ్రైడ్ నూడుల్స్ ' అనేసుకోవచ్చు :-)

    నేస్తం, నూడుల్స్ వడకడితే ఆ నీళ్ళలో పోయే పోషకాలు పెద్దేమీ ఉండవండీ.. అంతా కార్బోహైడ్రేట్స్ మయం.. అంతే! :-)

    రిప్లయితొలగించండి
  17. నాకు నూడిల్స్ చాల ఇష్టమండీ...నా నూడిల్స్ ప్రహసనం గురించి నా బ్లాగ్ లొ ఒక టపా కూడా కొట్టలేండి...కాని మీరు చేసిన నూడిల్స్ భలె యమ్మి యమ్మీ గా ఉన్నయి.తినెయాలనిపించేస్తొంది ఆ ఫొటో చూస్తుంటే...

    రిప్లయితొలగించండి
  18. @చిన్ని: 'ఇన్ స్టంట్' గా ఏమన్నా రాద్దాం అనుకోగానే మొదట గుర్తొచ్చిందండీ.. ధన్యవాదాలు.
    @విశ్వనాధ్: కొంచం కొంచంగా అయినా నేర్చుకోండి.. చేతిలో విద్య ఉంటే కొట్టదు కదా :-) ..ధన్యవాదాలు.
    @పద్మార్పిత: కొంచం వెరైటీగా కూడా ఉంటుంది కదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @వేణూ శ్రీకాంత్: మొదట్లో నేనూ మీ పద్ధతిలోనే చేసేవాడినండీ.. కొత్తదనం కోసం ప్రయత్నాలు చేసీ చేసీ.. :-) :-) ..ధన్యవాదాలు.
    @మధురవాణి: ఇంతకీ మీ ఇంటి అబ్బాయి చేత చదివించారా లేదా? :-) :-) ..ధన్యవాదాలు.
    @రిషి: "పేరిట్టీసి" అని ఉండాలనుకుంటానండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @జయ: నా ప్రాణానికి పెద్ద వంటకమేనండీ మరి:-) ..ధన్యవాదాలు.
    @నాగేస్రావ్: ఈసారి తప్పక ప్రయత్నిస్తానండీ.. ధన్యవాదాలు.
    @జేబీ: ఇదివరకూ అలాగే చేసేవాడిని కానీండీ, "ఒక్కళ్ళు తినేదానికోసం ఇన్ని గిన్నెలా" లాంటి నేపధ్య సంగీతం విన్నాక ఇలా మారిపోయా.. మళ్ళీ పాత పద్ధతికి వెళ్లి పోతానైతే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. @స్వప్న: తప్పకుండా అవుతారండీ :-) ..ధన్యవాదాలు.
    @నేస్తం; నేనూ మీలా ఉలవచారు ప్రయత్నిద్దామని అనుకుంటున్నానండీ :-) ..ధన్యవాదాలు.
    @సునీత: కొత్తగా అడుగుతున్నారా? పులిహోర, పులసచేప పులుసు.. అన్నీ మర్చిపోయారా?? :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. @శ్రీనివాస్ పప్పు: ఏదో ఒకటి తినాల్సిందే కదండీ మరి .. ధన్యవాదాలు.
    @మాలాకుమార్: ఏదో తిప్పలు పడ్డానండీ.. కంది పచ్చడీ అవీ అంటే చేయడానికి కొంచం కష్టం కదండీ మరి..:-) ..ధన్యవాదాలు.
    @రాధిక (నాని); ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  23. @ఆ.సౌమ్య: ఏమంటిరేమంటిరి? ధిక్కారము సైతునా?? :-) ..ధన్యవాదాలండీ..
    @భారతి మాచెర్ల: రాయడం ఇష్టమండీ నాకు.. ధన్యవాదాలు.
    @నిషిగంధ: భలే ఐడియా అండీ.. నా జీవితాన్ని ఏమన్నా మారుస్తుందేమో చూడాలి.. ధన్యవాదాలు.
    @ఇందు: చదువుతానండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. టివిలో వంటల ప్రోగ్రామ్స్ ప్రభావమేదో కాస్త పడినట్టుంది మీమీద :) అంతా బావుంది ఇంకో చిన్న చిట్కా మీకు ఈసారి ఉల్లి ,వెజిటబుల్ ముక్కలతోపాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా జత చేసి చూడండి ...నచ్చకపోతే ఎలాగూ ....ఇడ్లీలు రెడీగానే ఉంటాయిగా ...:) అన్నట్టు మురళిగారు అన్ని రకాల ఉప్మాలు నేర్చుకున్నందుకు అభినందనలు !రెండు రకాల ఉప్మాకే ఓ నీకిష్టం కాబట్టి అంటూ తెగ బిల్డప్ ఇస్తారు మీ పోస్ట్ మా ఇంట్లో చూపిస్తానుండండి:)

    రిప్లయితొలగించండి
  25. Your noodles are as delicious as your Book reviews/ memoirs. You have penchant for writing.

    All the best

    రిప్లయితొలగించండి