శుక్రవారం, ఏప్రిల్ 30, 2010

శతాబ్ద కవి

ఒక వ్యక్తి మన మధ్య నుంచి వెళ్ళిపోయినా చాలా ఏళ్ళ తర్వాత కూడా, గుర్తు పెట్టుకుని మరీ అతని శతజయంతిని మనమంతా ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆ వ్యక్తి చాలా చాలా గొప్పవాడన్న మాట. గొప్ప వాడు కాబట్టే ఉదయం నుంచీ ఊరూరా శ్రీశ్రీ పాటలు వినిపిస్తున్నాయి. సాహితీ మందిరాలన్నీ 'అరుణారుణ' శోభని సంతరించుకున్నాయి. వీఐపీ లందరూ శ్రీశ్రీ గురించి తమకి తెలిసిందో తెలియందో మాట్లాడేస్తుంటే సామాన్య ప్రజలు ఎప్పట్లాగే వింటున్నారు.

శ్రీశ్రీగా మారిన శ్రీరంగం శ్రీనివాసరావు కి ఆత్మవిశ్వాసం హెచ్చు. కాబట్టే "ఈ శతాబ్దం నాది" అని రొమ్ము విరుచుకున్నాడు. చాలా మంది ఒప్పేసుకున్నారు. ఒప్పుకొని వాళ్ళెవరన్నా ఉంటే వాళ్ళు శ్రీశ్రీ మన మధ్య నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరిపోగానే, రెండో ఆలోచన లేకుండా శ్రీశ్రీ చెప్పింది నిజమేనని అంగీకరించేశారు. బతికున్న వాళ్ళ గొప్పదనాన్ని ఒప్పుకోడానికి ఏ మాత్రం ఇష్టపడని వాళ్ళు సైతం, అవతలి వాళ్ళు దూరం కాగానే రెండో ఆలోచన లేకుండా అభిప్రాయాన్ని మార్చేసుకుంటారు.

శ్రీశ్రీ విప్లవ కవి. ఆకలి నుంచే విప్లవం పుడుతుంది. ఆగర్భ శ్రీమంతుల ఇంత పుట్టినా, చిన్న వయసులోనే దరిద్రాన్ని రుచి చూశాడు శ్రీశ్రీ, పరిస్థితుల ప్రభావం వల్ల. ఆ రుచే అతన్ని మహాకవిని చేసింది. విప్లవం ఎప్పుడూ పేద వాడి పక్షాన్నే ఉంటుంది. శ్రీశ్రీ విప్లవ కవిత్వం కూడా "తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు?" అని ప్రశ్నించిందే తప్ప, వెన్నెల రాత్రుల్లో బంగారు వన్నెతో మెరిసిపోయే ఆ శ్వేత సౌధపు సౌందర్యాన్ని ప్రస్తుతించలేదు.

శ్రీశ్రీ కమ్యూనిస్టు. సోవియట్ రష్యాని ఎంతగానో అభిమానించాడు. అక్కడి విధానాలని మెచ్చుకున్నాడు. ఆ నోటితోనే ఇందిరా గాంధీ మొదలు పెట్టిన సంక్షేమ పథకాలనీ మెచ్చుకున్నాడు, విప్లవ పార్టీ వారి మనోభావాలు దెబ్బతిన్నా పట్టించుకోకుండా. శ్రీశ్రీ నాస్తికుడు. ఏనాడూ దేవుణ్ణి నమ్మలేదు. కానీ తను రాసిన కొన్ని సినిమా పాటలు విన్నప్పుడు ఈమాట నమ్మడం కష్టం. ఈ వైరుధ్యాలు రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినవి కాదు, మొదటి నుంచీ ఉన్నవే.

ఎంత గొప్పవాళ్ళనీ శ్రీశ్రీ విడిచి పెట్టలేదు. "ఒక్కసారి పబ్లిక్ లోకి వచ్చాక ఏమన్నా అంటాం" అనేశాడు నిర్మొహమాటంగా. అలాగని తన విషయాలనీ ఏమాత్రం దాచుకోలేదు. పడకింటి విషయాలతో సహా అక్షరబద్ధం చేశాడు, తన ఆత్మ చరిత్రాత్మ చరిత్రాత్మక నవల 'అనంతం' లో. ఈ పుస్తకం కొంచం అస్తవ్యస్తంగా ఉంది అని మిత్రులు కొందరు అభిప్రాయ పడ్డారు. శ్రీశ్రీ జీవితం కూడా అంతే కదా. శ్రీశ్రీ కి ఆత్మవిశ్వాసం అనిపించిన విషయాలే చాలామందికి అహంభావంగా వినిపించాయి. లోక సహజమే.

ప్రపంచపు బాధనంతటినీ తన బాధగా చేసుకుని శ్రీశ్రీ రాసిన గేయాల సంకలనం 'మహా ప్రస్థానం.' ఇది తెలుగు సాహిత్యం లో ఒక మైలురాయి. ఆ తర్వాత యెంతో మంది ఔత్సాహిక కవులు ఈ గేయాలని అనుకరిస్తూ సాహిత్య కృషి జరిపారు. కానీ అవేవీ 'మహా ప్రస్థానం' కాలేక పోయాయి. వాళ్ళెవరూ శ్రీశ్రీ లు కాదు కదా మరి. నాటికీ నేటికీ సాహిత్యంలో 'మహా ప్రస్థానం' ఒక్కటే..శ్రీశ్రీ ఒక్కడే. అతను చిరంజీవి.

17 కామెంట్‌లు:

  1. శ్రీ శ్రీ వ్యక్తిత్వం లో లోపాలుండచ్చు...కాని తన కవిత్వం లో కాదు. " శతాబ్దపు కవి " ముమ్మాటికి నిజమే.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ శ్రీ ని మించిన కవులు తెలుగు నాట ఇంకా పుట్టలేదు.

    రిప్లయితొలగించండి
  3. raadhika gaaru, kaastha aalochinchi choodandi unnaaaremo. ante sri sri gaarini takkuva chesi maatlaaddam naa uddessyam kaadu.

    రిప్లయితొలగించండి
  4. ఏమైనప్పటికీ మనిషి బ్రతికి ఉన్నప్పటికంటే మరణించాకే వారి విలువ హెచ్చుతుందని కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది .శ్రీ శ్రీ లోని నిర్భీతి నాకు చాలా నచ్చుతుంది .

    రిప్లయితొలగించండి
  5. మురళి గారు, నేను శ్రీ శ్రీ గారి భార్య సరోజ శ్రీ శ్రీ గారి ఇంటర్వ్యూ చదివాను. ఆవిడ అనుభవాలు చదువుతుంటే ...ఎంత గొప్పవారైనా భార్య పట్ల మామూలు మొగవారే...అనిపించింది.

    రిప్లయితొలగించండి
  6. నిజమే శ్రీ శ్రీ ఒక వ్యక్తి కాదు,సామూహిక శక్తి అని(ఎంత గొప్ప పదం ఇది).కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ,ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ.(భలే భలే).

    ఒక సన్మాన సభలో శ్రీ శ్రీ కి ఒక చందనపు కృష్ణుడి బొమ్మ బహూకరించారట.అది ఆయన మొహం దగ్గరగా పెట్టుకోడం చూసిన ఒక విలేఖరి మీరు నాస్తికులు కదా మరి ఆ దేవుడి బొమ్మని ఎందుకు కళ్ళకద్దుకుంటున్నారు అని అడిగితే అయ్యా నేను కళ్ళకద్దుకోడంలేదు ఇది చందనపు బొమ్మ కదా చందనపువాసన ఆఘ్రాణిస్తున్నా అని చురక వేసారట.

    ఆయన విరసం సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు,మిగత జనాలు శ్రీ శ్రీ విరసం అడ్డాల్లోంచి జారిపడ్డాడు అని విమర్శించారట దానికాయన కాదు కాదు విరసం ఉక్కుకౌగిళ్ళ నించి విడివడ్డాను అని సమాధనమిచ్చారట.

    శ్రీ శ్రీ పేరు చెప్తేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఇప్పటికీ "తెలుగువీరలేవరా" అన్నపాట ఘంటసాల గొంతులోంచి వింటుంటే.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శ్రీ గారి గురించి సంక్షిప్తంగా చక్కగా చెప్పారు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    రిప్లయితొలగించండి
  8. ఆయన కవితల్లోని రెండు,మూడు వాక్యాలూ, ఫొటో ఏదైనా పెడితే బాగుండేదండీ..

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శ్రీ భావాలు నాకు నచ్చవు కాని అతని పద ప్రయోగాలు అమోఘం. అవి చాలా ఇష్టం నాకు.
    మంచి పోస్ట్.. అతన్ని తలచుకోవడం చాలా మంచి పని.

    రిప్లయితొలగించండి
  10. నాకు వారి గురించి అంత పెద్దగా తెలియదు. గొప్పవాడని అందరూ అంటారు. నేనూ కొన్ని కవితలు చదివాను. చాలా గొప్పగా ఉన్నాయి. నాకు తెలిసింది అంతే. అందువలన నేను వారి గురించి ఏమీ చెప్పలేను కానీ మొన్న శ్రీ శ్రీ పుట్టిన రోజు నాడు బస్సులో మాఊరు వెళ్తూ ఎఫ్ ఎమ్ లో అతని పాటలు వింటూ మైమరచి పోయాను. ఆ సాహిత్యానికి ముగ్ఢుడినైపోయాను. ఇంతకీ "అనంతం" పుస్తకం దొరుకుతోందా బయట. వారి గురించి తెలియదని చెప్పడానికి సిగ్గుగాఉంది.

    రిప్లయితొలగించండి
  11. @కౌండిన్య: ధన్యవాదాలండీ..
    @రాధిక: ధన్యవాదాలండీ..
    @రజని: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  12. @చిన్ని: నిజం చెప్పారు.. ధన్యవాదాలు.
    @జయ: భార్యతో తను ఎలా వ్యవహరించారో తన ఆత్మకథ లోనే రాసుకున్నారండీ శ్రీశ్రీ.. ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: అవునండీ మీ వ్యాఖ్య చదివాక గుర్తొస్తోంది.. చందనపు కృష్ణుడితో ఉన్న శ్రీశ్రీ ఫోటో ఎక్కడో చూసిన జ్ఞాపకం.. కేవలం విప్లవ గీతాలే కాక లలితమైన ప్రేమ గీతాలూ రాశారండీ శ్రీశ్రీ.. ఆవేశం, సున్నితత్వం ఒకే నాణేనికి బొమ్మా బొరుసూ కావడం కొంచం చిత్రమే కదా?? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @రావ్ ఎస్ లక్కరాజు: ధన్యవాదాలండీ..
    @తృష్ణ: ఈమధ్య అస్సలు టైం దొరకడం లేదండీ.. ఉన్న కొంచం టైం లో టపా రాసి పోస్ట్ చేసేస్తున్నా.. భవిష్యత్తులో మీ సూచన తప్పక దృష్టిలో ఉంచుకుంటాను.. ధన్యవాదాలు.
    @సవ్వడి: ధన్యవాదాలండీ..
    @విశ్వప్రేమికుడు; విశాలాంధ్ర అన్ని శాఖల్లోనూ దొరుకుతోందండీ.. ఇదే కాకా మహా ప్రస్థానం, కథలు, సినిమా పాటలు, ఇతర రచనలు కూడా దొరుకుతున్నాయి.. చదవడం మొదలు పెడితే చాలా తెలుసుకోగలుగుతారు శ్రీశ్రీ గురించి.. ఎందుకంటే తను ఎలాంటి దాపరికం లేకుండా రాసుకున్నారు తన గురించి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. కమ్యునిజం..లాంటివేమీ నాకంతగా తెలియదండీ. సినిమా పాటలతోనే శ్రీ శ్రీ గారి పరిచయం నాకు. మీరన్నట్టు శ్రీ శ్రీ చక్కటి భావ గీతాలు కూడా రాశారు..నాకు మటుక్కి రుద్రవీణ లో "నేను సైతం", ఆకలి రాజ్యం లో కమల్ హసన్ చెప్పే శ్రీ శ్రీ గారి కవిత్వం అంటే చాలా ఇష్టం.

    రిప్లయితొలగించండి
  15. @ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  16. మురళిగారూ !శ్రీ శ్రీ గారి వ్యక్తిత్వాన్ని ఈచిన్నటపాలో ఇమిడ్చి మాకందించారు నిజంగా ఈ శతాబ్దం ఆయనది ...ఆయన ఎంత నిర్మొహమాటంగా మాట్లాడేవారో శ్రీనివాస్ పప్పు గారు చెప్పారు ...ఆయన కవితలూ అంతే అనిపిస్తుంది ...శ్రీ శ్రీ గారి ' సిప్రాలి ' నుండి ........

    నాకేమో లోకంలో
    కాకవులే కానరారు , కవి దూషణ న
    న్నాకర్షించదు , రచనో
    త్సేకాన్నే మెచ్చుకొందు సిరిసిరిమువ్వా !

    ఇమిటేషన్ తప్ప స్వతం
    త్రముగా నూహించగల మెదడులేక సమ
    ర్ధముగా కృతులను విరచించి,
    మమ్ములను పొగడమంద్రు సిరిసిరిమువ్వా !

    రిప్లయితొలగించండి
  17. @పరిమళం: మీదైన శైలిలో వ్యాఖ్య.. దన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి