ఆదివారం, ఏప్రిల్ 25, 2010

ఎల్లోరాలో ఏకాంతసేవ

ముప్ఫయ్యేళ్ళ వయసున్న వితంతువు జ్ఞాన సుందరి. అన్నయ్య ముఖప్రాణ్, చెల్లెలు నాగరాజ్యలక్ష్మిల ఇళ్ళలో చెరో కొంత కాలం గడుపుతూ రోజులు వెళ్ళదీస్తూ ఉంటుంది. తను నాగులూ అని పిలుచుకునే చెల్లెలన్నా, ఆమె కూతురు మధురభక్తి అన్నా యెంతో ఇష్టం జ్ఞానసుందరికి. చెల్లెలి ఇంట్లో ఆమెకి నచ్చని వాడు ఒక్కడే, చెల్లెలి భర్త మధుసూదనం. అతని రూపం, చూపులు,మాట తీరు ఏవీ నచ్చవు ఆమెకి.

అత్యంత చిత్రమైన పరిస్థితుల్లో అతనితో మూడు రోజులు ఏకాంతంగా గడపాల్సి వస్తుంది, అది కూడా ఇంటికి దూరంగా ఎక్కడో ఎల్లోరాలో. ఆ మూడు రోజుల్లో వాళ్ళిద్దరి మధ్యా ఏం జరిగింది? అనంతర పరిణామాలు ఏమిటి? అన్న ఇతివృత్తంతో బుచ్చిబాబు రాసిన పెద్ద కథ 'ఎల్లోరాలో ఏకాంతసేవ.' ఈ మధ్యనే చదవడం పూర్తి చేసిన బుచ్చిబాబు కథలు మొదటి సంపుటంలో నన్ను వెంటాడుతున్న కథల్లో ఇదొకటి.

ముఖప్రాణ్ సలహా మేరకు కొందరు కాలేజీ విద్యార్ధినులతో అజంతా, ఎల్లోరా విహార యాత్రకి బయలుదేరుతుంది జ్ఞానసుందరి. నవ్వుతూ తుళ్ళుతూ ఉండే ఆ పిల్లల మధ్య ఆమె ఇమడలేక పోతుంది. ఎలిఫెంటా గుహలలో త్రిమూర్తి విగ్రహాన్ని చూడగానే ఆమెకి మధుసూదనం గుర్తొస్తాడు. సరిగ్గా అప్పుడే నాగులు నుంచి ఉత్తరం వస్తుంది. నాలుగు రోజులు క్యాంపు కి వెళ్ళిన మధుసూదనం వారం రోజులైనా తిరిగి రాలేదనీ, ఆఫీసుకి నెల్లాళ్ళు సెలవు చీటీ పంపాడనీ, తనకి భయంగా ఉందనీ జ్ఞానసుందరికి ఉత్తరం రాస్తుంది నాగులు.

"తను వెళ్లి చేసేదేమిటి? పోతే పొయ్యాడులే, పీడ విరగడయ్యింది అనబుద్దేస్తుంది. అట్లాగంటే క్షమిస్తుందా? భర్త లోటుపాట్లన్నీ తను పదిమందిలోనూ యాకరువు పెట్టొచ్చు గాని మరెవరైనా కాస్త ఆక్షేపించారంటే మండిపడుతుంది నాగులు. ...స్త్రీని ఆట వొస్తువుగా, ఆస్తిలో ఒక భాగంగా, బానిసగా వాడుకుంటున్నారు ఈ మొగాళ్ళంతా అంటుంటారు గాని, వీళ్ళెవరికీ అసలు విషయం తెలీదు. స్త్రీయే పురుషుణ్ణి పెద్ద హాల్లో మధ్య బల్ల మీద పూల తొట్టిలాగా చూసుకుంటుందని ఎవరూ పైకనరేం?" ..ఈ రకంగా సాగుతాయి జ్ఞానసుందరి ఆలోచనలు.

జ్ఞానసుందరికి మధుసూదనం అంటే భయం. మనిషేమంత బాగుండడు. చామచాయ, పెద్ద గుండ్రటి మెడ, దట్టమైన కనుబొమ్మలు. క్రాఫింగ్ కి నూని పట్టించడు, తల దువ్వుకోడు. అతని చేతులు, ముఖ్యంగా వేళ్ళ స్వరూపం తలచుకుంటే భయమేస్తుంది ఆమెకి. వేళ్ళతో 'కబళింపు' అంటే అవే గుర్తొస్తాయి. చేసేది జియాలజిస్టు ఉద్యోగం. "నిజంగా రాతి మనిషి" అనుకుంటుంది. తనతో మాట్లాడడం కోసం, ఏదో వంకని తనని తాకడం కోసం అతను చేసే ప్రయత్నాలన్నీ గుర్తొస్తాయ్ ఆమెకి ఆ రాత్రి.



తెల్లవారి అజంతాకి వెళ్తారు మిత్ర బృందం. అమ్మాయిలు తనని అజంతా సుందరి అని వ్యాఖ్యానించినప్పుడు బాధ పడుతుంది జ్ఞానసుందరి. తనకి భర్త లేకపోవడం వల్లనే అందరికీ లోకువయ్యానని అనుకుంటుంది ఆమె. ఆరోగ్యం బాగా లేకపోవడంతో మధ్యాహ్నం పూట వాళ్ళతో గుహలు చూడడానికి వెళ్ళకుండా బస్సు దగ్గరే ఆగిపోతుంది జ్ఞానసుందరి. అదిగో అప్పుడు కనిపిస్తాడు మధుసూదనం ఆమెకి. తను స్వేచ్చ కోసం ఇల్లు విడిచి వచ్చేశాననీ, తనని చూసిన విషయం నాగులుకి చెప్పొద్దనీ కోరతాడు మధుసూదనం.

అతను ఎవరో అమ్మాయితో అక్కడికి వచ్చి ఉంటాడని ఊహించిన జ్ఞానసుందరి ఆ రహస్యం చేదించాలని అనుకుంటుంది. తన బృందానికి ఉత్తరం రాసి పంపి, అతని వెంట బయలుదేరుతుంది. చిత్రంగా అతని గురించి ఆమె ఊహించుకున్నవన్నీ తారుమారు అవుతూ ఉంటాయి. అతనో ప్రకృతి ఆరాధకుడనీ, ఓ శిల్పం చెక్కేందుకు ప్రయత్నిస్తున్నాడనీ అర్ధమవుతుంది ఆమెకి. ఠీవిగా నిలబడ్డ ఓ స్త్రీ ముందు మోకరిల్లిన పురుషుడి ప్రతిమ చెక్కాలన్నది అతని ప్రయత్నం.

నిజానికి మధుసూదనం శిల్పి కాదు. కానీ రాయి తప్ప మరొకటి అతనికి అర్ధం కాదు. 'స్వేచ్చ' అనే విషయంపై కలకత్తా లో జరగబోయే శిల్పాల పోటీకి తన శిల్పాన్ని పంపాలన్నది అతని ఆలోచన. అందుకోసం శ్రమిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరితో పాటు, వంటవాడు షూజా, మధుసూదనం శిల్పానికి మోడల్ గా ఎంచుకున్న తుక్కమ్మ. జ్ఞానసుందరికి తుక్కమ్మ నచ్చని కారణంగా ఆమెని పంపించేస్తాడతను.

ఎల్లోరాలో గడిపిన మూడు రోజుల్లోనూ ఒక కొత్త మధుసూదనాన్ని చూస్తుంది జ్ఞానసుందరి. మునుపటిలా ఆమెని తాకాలని అనుకోడం లేదు అతను. ఆమె ఆ అవకాశం ఇచ్చినా అతను దూరం జరుగుతున్నాడు. ఇద్దరూ కలిసి కొండల్లో తిరిగారు, వర్షంలో తడిశారు, అయినా ఆ దూరం అలాగే ఉంది. ఇంటికి తిరిగి వచ్చాక అక్కాచెల్లెళ్ల మధ్య అపార్ధం. అక్క మీద చెల్లెలికి అనుమానం, అది తొలగిన వైనం కథకి ముగింపు. నిజానికి కథావస్తువు చిన్నదే అయినా, ఆద్యంతమూ ఆసక్తికరమైన మానసిక విశ్లేషణలతో సాగింది.

జ్ఞానసుందరి ఒంటరి జీవితం, ఒకరి మీద ఆధార పడాల్సిందేనన్న దైన్యం, మధుసూదనం మీద ఆమెకి స్థిర పడిపోయిన అభిప్రాయాలు మారే క్రమం, తానుగా అతన్ని కోరే సందర్భం, అతడు చూపే సంయమనం.. ఇలా ప్రతి సన్నివేశంలోనూ పాత్రల మానసిక స్థితిని విశదంగా పాఠకుల ముందుంచారు రచయిత. అనుభూతి ప్రధానంగా సాగే కథనం. ఈ కథతో పాటు మరో ఇరవయ్యేడు కథలున్న 399 పేజీల సంకలనం విశాలాంధ్ర అన్ని బ్రాంచీల లోనూ అందుబాటులో ఉంది. వెల. రూ. 250.

19 కామెంట్‌లు:

  1. మీరు విశదీకరించిన విధానం బాగుందండి...
    వీలుచూసుకుని చదవాలి!

    రిప్లయితొలగించండి
  2. http://parnashaala.blogspot.com/2009/05/blog-post_08.html
    ఎల్లోరాలో ఏకాంత సేవ

    రిప్లయితొలగించండి
  3. బాగుందండి మీ పరిచయం. ఈ పుస్తకం వుంది కాని ఇంకా చదవటం మొదలెట్టలేదు, శంకరమఛి గారి అమరావతి కధలలోనే వున్నా. చాలా బాగా పరిచయం చేస్తున్నారు అధ్బుతమైన కధలను... ఇవే మిగిలి పోతాయేమో భావితరాలకు... ముందు తరాల గురించిన విషయ సూచిక లా..

    రిప్లయితొలగించండి
  4. రాతి శిలాజాలలోనూ, జ్ఞాన సుందరిలోనూ అంతులేని వేదన ఉందని మధుసూదనం అనుకుంటాడు. ఆమె(స్త్రీ) మనసుని తెలుసుకోవాలన్న కోరిక తోనే, ఆమెకు సన్నిహితం అయ్యేందుకు ప్రయత్నిస్తాడు. ఆమె స్వగతంలో, అతను చూపే చొరవ నుండి దూరంగా జరగటానికి బలవంతంగా తన ఆలోచనలను బంధించినట్లుగా నాకు అనిపించింది. క్రమేపీ కట్టుబాట్ల శృంఖలాలను తెంచుకొనే ప్రయత్నం చేసి తానే ముందు చొరవ చూపుతుంది. జ్ఞాన సుందరి పట్ల ఉన్న జాలి తర్వాత ఆమే ధైర్యం చేసినా ఎందుకు తిరస్కరించాడనేది అంటూ చిక్కనిది. యుగయుగాలుగా స్త్రీ కి మగవాడు బానిస అనేది అతని ఆలోచన కూడా. అతను చెక్కిన శిల్పం కూడా ఈ భావానికి ప్రతీకే. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వేచ్ఛ గురించి. అతడు ఉద్యోగం చేసి జీతమంతా తీసుకువచ్చి భార్యకు ఇచ్చి సంసార బంధనాల్లో చిక్కుకొని, స్వేచ్ఛలేని జీవితం గడుపుతున్నాడనుకొనే ప్రకృతి ఒడిలో సేదతీరతాడు. ఈ రెండు విషయాలే ఈ కధానిక లో ప్రముఖంగా స్ఫురణకు వచ్చే అంశాలు.
    చక్కటి పరిచయం.

    రిప్లయితొలగించండి
  5. Sounds interesting!
    నే చదవాల్సిన పుస్తకాల లిస్టులో 'తిలక్ కథల్ని' ఆల్రెడీ చేర్చేసాను. మీ పోస్టు చూసాక తొందరగా కోనేయ్యాలనిపిస్తోంది ;-)

    రిప్లయితొలగించండి
  6. మురళి గారు !మీ టపా లు చాల బాగుంటాయండి.నేను మీ అభిమానిని .

    రిప్లయితొలగించండి
  7. చాలాచక్కటి ఇతివృత్తం తో కథాగమనం ఆకట్టుకునే లా ఉంది. చివరికి ఏమౌతుందో తెలుసుకో వాలని ఉంది. మీరెలాగు ముగింపు చెప్పరుగా...కాబట్టి చదవాల్సిందే. ఈ కథమాత్రం తప్పకుండా చదువుతాను మురళిగారు. ఆ పుస్తకాన్ని దుమ్ముదులిపి బయటకు తీయాలి మరి:)

    రిప్లయితొలగించండి
  8. మురళీ గారూ,
    క్షమించాలి. నేను చదవాల్సిన పుస్తకాల్లో ముఖ్యంగా పెట్టుకున్నవి.. బుచ్చిబాబు గారి కథలూ, తిలక్ గారి కథలూ.. రెండూనూ.. ఇది చదువుతూ ఉండగా మీరు 'ఊరు చివర ఇల్లు' గురించి చెప్పింది కూడా గుర్తొచ్చింది. మొత్తానికి ఏదో తికమక పడి చివరికి పొరపాటుగా రాసాను పై వ్యాఖ్యని :-p

    రిప్లయితొలగించండి
  9. మురళి గారు! మీ ఓపికకి అభినందనలు. ఎన్ని రాసేస్తున్నారండి. నిజంగా చాలా గ్రేట్. నేను ఎన్నో చదువుదామనుకుంటాను. కుదరట్లేదు. చదువుతాను. మీ బ్లాగు చూస్తే చాలు ఎన్ని పుస్తకాలో, ఎన్ని కథలో... మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  10. @పద్మార్పిత: తప్పక చదవండి. ధన్యవాదాలు.
    @కత్తి మహేష్ కుమార్: ధన్యవాదాలండీ..
    @చిన్ని: చదవండి, తప్పకుండా. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @భావన: బుచ్చిబాబు గారి శైలి ప్రత్యేకమైనదండీ.. మానసిక విశ్లేషణలు బాగుంటాయి.. కృష్ణమ్మ ఒడ్డున విహరిస్తున్నారన్నమాట అయితే.. ధన్యవాదాలు.
    @రమణ: ముగింపు ఎలా ఉన్నప్పటికీ జ్ఞానసుందరి లో కలిగే పరస్పర విరుద్ధమైన ఆలోచనలని చిత్రించిన తీరు బాగా నచ్చిందండీ.. ధన్యవాదాలు.
    @మధురవాణి: తిలక్, బుచ్చిబాబు... మంచి క్లాసిక్స్ కలెక్ట్ చేస్తున్నారు.. అభినందనలండీ.. రెండో వ్యాఖ్యలో 'సారీ' ఎందుకు చెప్పండి? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @తువ్వాయి: నా టపాలు నచ్చినందుకు ధన్యవాదాలండీ..
    @జయ: ముగింపు చెప్పేశాను కదండీ.. అయినా ముగింపు కన్నా కథనం కోసం చదవాల్సిన కథండీ ఇది.. త్వరగా దుమ్ము దులపండి మరి.. ధన్యవాదాలు.
    @సవ్వడి: నేను చదవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయండి.. ఇప్పుడు చదివిన వాటితో పాటు చిన్నప్పటినుంచీ చదివిన వాటి గురించి అప్పుడప్పుడూ ఇలా రాసుకుంటున్నా.. తప్పక చదవండి.. గట్టిగా అనుకుంటే కుదరక పోవడం అంటూ ఉండదు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. ఎప్పుడో చదివాను ఈ కథ . మీరు రాస్తుంటే అన్నీ వెతుక్కొని మళ్ళీ చదవాలనిపిస్తోంది .

    రిప్లయితొలగించండి
  14. @కొత్తపాళీ: ధన్యవాదాలండీ..
    @మాలాకుమార్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  15. పనులతో బొత్తిగా తీరిక దొరకడం లేదు మురళీ గారూ..నా పుస్తకాల లిస్టునేమో కొండవీటి చేంతాడంత పెంచేశారు.ఎప్పుడు వెళ్తానో..? ఎప్పుడు కొంటానో..? ఎప్పుడు చదువుతానో..?

    రిప్లయితొలగించండి
  16. @ప్రణీత స్వాతి: పర్లేదండీ.. మనసుంటే మార్గం ఉంటుంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. మరో ఆణిముత్యం గురించి తెలియచేసినందుకు ధన్యవాదాలండీ .....

    రిప్లయితొలగించండి