గురువారం, ఏప్రిల్ 08, 2010

తన మార్గం

గడిచిన శతాబ్ద కాలంలో స్త్రీ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిందో తెలియాలంటే, సమాజపు గతిని ఒక్కసారి పరిశీలిస్తే చాలు. ఒకప్పుడు కేవలం వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు ఇప్పుడు విద్య, ఉద్యోగం, రాజకీయం.. అది ఇది యేమని అన్నిరంగములా విజయ బావుటా ఎగరేస్తున్నారు. ఇదేమీ రాత్రికి రాత్రి వచ్చిన మార్పు కాదు. అంత సులభంగా జరిగిన పరిణామమూ కాదు.

ఈ మార్పు జరుగుతున్న కాలంలో స్త్రీల పరిస్థితిని కథల రూపంలో రికార్డు చేసిన రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి. ఆవిడ కథల సంకలనం 'తన మార్గం.' 2005 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతిని అందుకుందీ సంపుటి. ఈ పుస్తకంలో ఉన్న ఇరవైఎనిమిది కథలూ 1960 నుంచీ తర్వాతి నాలుగు దశాబ్దాల కాలంలో రాసినవి. మెజారిటీ కథల్లో ఇతివృత్తం స్త్రీల సమస్యలే.

తాను ఎంచుకున్న కథాంశాన్ని ఘాటుగా కాక, మెత్తగా చెప్పడం ఛాయాదేవి శైలి. సంకలనంలో మొదటి కథ 'ప్రయాణం' నుంచి చివరి కథ 'పరిధి దాటిన వేళ' వరకూ ప్రతి కథనూ ఆసాంతమూ చదివించేది ఈ శైలే. "ప్రయాణం కథని ఇప్పుడు రాస్తే ముగింపు మరో విధంగా ఇస్తాను" అన్నారు ఛాయాదేవి, పుస్తకం చివర్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో. తన స్నేహితురాలి భర్త చేతిలో అత్యాచారానికి గురైన ఓ అవివాహిత కథ ఇది.

ఉద్యోగాలు చేయడం మొదలు పెట్టిన తొలి తరం మహిళల కథలే చాలా వరకూ. ఇంటా బయట పని ఒత్తిడి, మహిళ అనే కారణంగా ఆఫీసుల్లో ఎదుర్కొనే వివక్షలే చాలా కథల్లో ఇతివృత్తాలు. కొన్ని కుటుంబాల్లో పాటించే ఆచారం మహిళలని, ముఖ్యంగా చదువుకునే అమ్మాయిలు, ఉద్యోగినులని ఎంతగా ఇబ్బంది పెడుతుందో చెప్పే కథ 'మూడునాళ్ళ ముచ్చట,' కాగా డిసిప్లిన్ కారణంగా తండ్రీకూతుళ్ల మధ్య పెరిగిన దూరాన్ని చిత్రించిన కథ 'స్పర్శ.'



'శ్రీమతి-ఉద్యోగిని' కథ సీరియస్ అంశాన్ని సరదాగా చెప్పగా, వివాహ రజతోత్సవ సమయంలో భర్త గురించి ఓ నిజాన్ని తెలుసుకున్న భార్య కథ 'వెండి పండుగ.' స్త్రీ జీవితాన్ని బోన్సాయ్ తో పోల్చే కథ 'బోన్సాయ్ బతుకు' పుస్తకం పక్కన పెట్టాక కూడా వెంటాడే కథల్లో ఒకటి. మెజారిటీ కథల్లాగే ఈ కథ నడక కూడా రచయిత్రి మన ఎదురుగా కూర్చుని చెబుతున్నట్టుగా ఉంటుంది.

అధిక శాతం కథలు సంప్రదాయ మధ్యతరగతి కుటుంబ నేపధ్యంతో సాగేవే. తనకు తెలిసిన ప్రపంచాన్ని మాత్రమే కథల్లో చిత్రించానన్నారు ఛాయాదేవి. సంకలనానికి శీర్షిక గా ఇచ్చిన కథ 'తన మార్గం' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వృద్ధాప్యంలో భర్తని కోల్పోయి, కొడుకుల ఆదరణ లేని కారణంగా ఒంటరి జీవితం గడుపుతున్న వర్ధనమ్మ కథ ఇది. వేర్వేరు కారణాలకి కొడుకులు వచ్చి ఆమెతో ఉంటామన్నప్పుడు ఆమె ప్రకటించిన నిర్ణయమే ఈ కథ.

ఎక్కడా వాస్తవ దూరంగా అనిపించక పోవడం ఈ కథల ప్రత్యేకత. కొన్ని కథల ముగింపులో నాటకీయత తొంగి చూసినా, "ఇలా కూడా జరగవచ్చు" అని అనిపిస్తుంది పాఠకులకి. గడిచిన తరం స్త్రీల గొంతుని బలంగా వినిపించిన ఈ కథలని చదవడం ఒక్కసారి గతంలోకి ప్రయాణం చేయడమే. భవిష్యత్తుని రూపు దిద్దుకోడంలో గతం నుంచి నేర్చుకున్న పాఠాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా.

'తన మార్గం,' అబ్బూరి చాయాదేవి కథల సంకలనం, పేజీలు 248, వెల రూ. 100, లిఖిత ప్రెస్, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్, ప్రచురణ. ప్రతులు అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతాయి.

9 కామెంట్‌లు:

  1. నే చదవాల్సిన పుస్తకాల్లో మరోటి చేరిందన్నమాట! :-)

    రిప్లయితొలగించండి
  2. మంచి పరిచయం ...చదివినట్లు గుర్తు రావడం లేదు ...సో మనం చదవలన్నమాట

    రిప్లయితొలగించండి
  3. పరిచయం బాగుంది. ఇక వేట(పుస్తక వేట) కి వెళ్ళడమే తరువాయన్నమాట మాకు.

    రిప్లయితొలగించండి
  4. ఈ కథల సంపుటి వివిధ అంశాలతో బాగనిపిస్తోంది. తప్పకుండా చదువుతాను.
    ప్రస్తుతం మీరుండేది హైద్రాబాద్ లోనే కదూ:)

    రిప్లయితొలగించండి
  5. ఎందుకో గుర్తు రావడం లేదు కానీ ఈవిడ పేరు బాగా పరిచయమున్నట్లుందండీ (సినీనటి వల్ల కాదులెండి పూర్తిపేరుతో). బహుశా సాహిత్య అకాడమీ అవార్డ్ వల్లో లేక తను రాసిన వేరే పుస్తకమేమన్నా చదివానో గుర్తురావడం లేదు. మొత్తానికి పరిచయం బాగుంది. చదవాల్సిన పుస్తకమనమాట.

    రిప్లయితొలగించండి
  6. @మధురవాణి: చదవండి, అన్నీ కాకపోయినా కొన్ని కథలు బాగా నచ్చుతాయి.. ధన్యవాదాలు.
    @చిన్ని: అయితే చదివేయండి.. ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: సులభంగానే దొరుకుతుందండీ, ప్రింట్ లోనే ఉంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. @జయ: కథలు మీకు నచ్చుతాయనే నా అంచనా.. చదివాక ఎలా ఉన్నాయో ఆమాట చెప్పండి, మీ బ్లాగులో అయినా సరే.. అబ్బే.. నేనుండేది హైదరాబాద్ కాదండీ, ఇప్పట్లో వచ్చే ఉద్దేశం కూడా లేదు :-) :-) ..ధన్యవాదాలు.
    @ప్రేరణ: ధన్యవాదాలండీ..
    @వేణూ శ్రీకాంత్: కథలు చదివి ఉంటారండీ.. చాలా పుస్తకాలకి ఈవిడ ముందు మాటలు కూడా రాశారు, అలా ఎక్కడైనా చదివి ఉండొచ్చు మీరు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. పుస్తకపరిచయం ఎప్పటిలాగే వెంటనే చదవాలనిపించేలా ఉంది ...ప్చ్ ...లిస్టులో చేరిన మరో పుస్తకం !

    రిప్లయితొలగించండి