నేను మైఖేల్ జాక్సన్ అభిమాని ని కాదు.. అప్పుడప్పుడూ అతని పాటలు వినడం, టీవీలో ఎక్కడైనా కనిపిస్తే కాసేపు చూడడం, పత్రికల్లో అతని గురించి వచ్చే కథనాలు చదవడం.. జాక్సన్ తో నా పరిచయం ఇంతవరకే. నాలుగు నెలల క్రితం ఈ పాప్ ప్రపంచపు రారాజు శాశ్వతంగా సెలవు తీసుకున్నప్పుడు "అయ్యో" అనిపించింది ఒక్క క్షణం.. అతని గురించి వచ్చిన చాలా కథనాలు చదివాను.
ఇప్పుడు జాక్సన్ ని వెండి తెరమీద చూశాను. సోనీ పిక్చర్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన 'This Is It' డాక్యుమెంటరీ ని అనుకోకుండా చూశాను. జాక్సన్ చివరి రోజులకి సంబంధించిన డాక్యుమెంటరీ అని ప్రచారం జరిగింది కానీ, తెర మీద నేను చూసింది వేరు. ఈ డాక్యుమెంటరీ మనకి తెర వెనుక జాక్సన్ ని చూపిస్తుంది. అతను, అతని బృందం ఎంత కృషి చేస్తే ఒక ప్రదర్శన జరుగుతుందో వివరిస్తుంది.
తొంభై నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీ, వివిధ షో ల కోసం జాక్సన్, అతని బృందం తో కలిసి చేసిన రిహార్సళ్ళ సమాహారం. అన్నీ డ్రెస్ రిహార్సళ్ళే కావడం వల్ల జాక్సన్ ఆహార్యం అతని షోలలో ఉన్నట్టుగానే ఉంది. విచిత్రమైన రంగుల కాంబినేషన్ల దుస్తులు, అతని శరీర బరువు కన్నా బరువుగా అనిపించే బూట్లు మొదలైన యాక్సెసరీలు, ప్రతి పాటకీ మారిపోయే కనుముక్కు తీరు, హెయిర్ స్టయిలూ.. వెరసి పాప్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మైకేల్ జాక్సన్.
వేదిక మీద ఎంత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాడో, తెర వెనుక కూడా అలాగే కనిపించాడు జాక్సన్. ఒక కళాకారుడిని మించిన టీం లీడర్ అతనిలో కనబడ్డాడు. తన బృంద సభ్యులతో మృదువుగా వ్యవహరిస్తూనే తనకి కావలసినది రాబట్టు కోవడం, తను వారి నుంచి ఏమి ఆశిస్టున్నాడో వివరంగా చెప్పడం, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించమని ప్రోత్సహించడం, ఎక్కడా రాజీ పడక పోవడం.. ఎలాంటి కష్టమూ పడకుండా అంత పేరు వస్తుందా మరి?
లక్షలాది మంది జనం ముందు నాట్యం చేసే జాక్సన్, అవే సెట్టింగులతో, దుస్తులతో కేవలం తన బృంద సభ్యుల ముందు మాత్రమే ఇచ్చిన ప్రదర్శనలు చూడడం ఒక చిత్రమైన అనుభూతి. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో, దానికి తను, తన బృందం ఎలా ప్రతిస్పందించాలో కూడా రిహార్సల్ చేశాడు జాక్సన్. ఇవన్నీ రికార్డు చేసినప్పుడు బహుశా అతనికి తెలిసి ఉండక పోవచ్చు, ఆ క్లిప్పింగులతో ఒక డాక్యుమెంటరీ చేస్తారని, తన తదనంతరం అది ప్రదర్శింప బడుతుందనీ.
జాక్సన్ బృంద సభ్యుల అభిప్రాయాలని కూడా రికార్డు చేసి చూపారు మధ్య మధ్యలో. అతను తన బృందాన్ని ఎంపిక చేసుకునే తీరు, వారి నుంచి తనకి కావాల్సింది రాబట్టుకోడానికి ఇచ్చే శిక్షణ తరగతులనూ చేర్చారు డాక్యుమెంటరీలో. జాక్సన్ సహాయకులు, హెయిర్ స్టయిలిస్ట్, ఫ్యాషన్ డిజైనర్ ల అభిప్రాయాలనూ చూడొచ్చు. జాక్సన్ అభిమానులు ఎలాగూ చూస్తారు. అభిమానులు కాని వాళ్ళు కూడా చూడదగ్గ డాక్యుమెంటరీ ఇది. కేవలం రెండు వారాలు మాత్రమే థియేటర్లలో ప్రదర్శింప బడుతుంది.