శుక్రవారం, జూన్ 05, 2009

అప్పిచ్చువాడు...

కొన్ని కొన్ని అపార్ధాలు ఎప్పుడు తలచుకున్నా నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. చిన్నప్పుడు పద్యాలు నేర్చుకునేటప్పుడు 'అప్పిచ్చు వాడు' పద్యం చదువుతూ అప్పిచ్చువాడే వైద్యుడు అనుకున్నా.. తర్వాత తెలిసింది..అప్పిచ్చువాడు, వైద్యుడు, ఏరూ అవీ ఉన్న ఊళ్ళో ఉండమని కవి భావమని. మా ఊరి దుంపల బడిలో చదివినంత కాలం నాకు అప్పు అవసరం రాలేదు. అసలు చిన్నప్పటినుంచీ నా దగ్గర చిల్లర గలగలమంటూనే ఉండేది. ఓ డబ్బాలో నాణేలు దాచుకోడం, అప్పుడప్పుడు లెక్కపెట్టుకోడం అదో కాలక్షేపం. దీనికి మళ్ళీ ఆడిట్ ఉండేది దాదాపు ప్రతి నెలా..

హైస్కూలికి పొరుగూరికి వెళ్ళినప్పుడు అమ్మ రోజూ గుర్తు చేసేది.. "దగ్గర కొన్ని డబ్బులుంచుకో, ఎప్పుడే అవసరం వస్తుందో.." అంటూ. అప్పట్లో పాకెట్ మనీ అంటూ ప్రత్యేకంగా ఉండేది కాదు కానీ, అప్పుడప్పుడూ కొద్దిగా డబ్బిచ్చి ప్రతిరోజూ జమాఖర్చుల వివరాలు అడిగే వాళ్ళు నాన్న. అదో పెద్ద హింస. దగ్గర డబ్బులుంటాయి..కాని ఇష్టానికి ఖర్చుపెట్టే వీలు లేదు. ఇక రాను రాను డబ్బులడగాలంటే విసుగొచ్చేది, మరీ అత్యవసరమైతే తప్ప.

ఏడో తరగతి చివర్లో మొదటిసారిగా అప్పు చేశాను..మా క్లాస్మేట్ రత్న కుమారి దగ్గర. ఆవేళ నాదగ్గర డబ్బులు లేవు. మాస్టారేమో "వచ్చే వారం స్కూల్లో ఎగ్జిబిషన్ పెడుతున్నాం.. మద్యాహ్నం కూర్చుని చార్టులు గీసి సాయంత్రం ఇచ్చేసి వెళ్ళండి" అని చెప్పారు. ఆయన కొంచం మంచాడు, మరికొంచెం చండశాసనుడు. అప్పటికింకా మాస్టారిని అప్పడిగేంత సాహసం లేదు. నడిచి మా ఊరెళ్ళి డబ్బులు తెచ్చుకునే అంత ఓపికా, టైమూ లేవు.

లంచి బ్రేక్ లో మా ఊరి మిత్రులని అడిగాను.. ఎవరికి వాళ్ళు చార్టులు, పెన్సిళ్ళూ కొనుక్కోవాలి..మాకే డబ్బులు చాలవు అనేవాళ్ళే. క్లాసురూములో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే రత్న వచ్చి అడిగింది చార్టులు తెచ్చుకోలేదేమని. నేను విషయం చెప్పగానే వెంటనే అడిగింది 'యెంత కావాల'ని. చెప్పాను 'అర్ధ రూపాయి' అని. వెంటనే తన బాక్సు లోనుంచి తీసిచ్చేసింది. అస్సలు ఊహించలేదు.. ఇప్పుడెవరైనా ఓ లక్ష రూపాయలు అప్పిచ్చినా అంత ఆనందం కలగదు. నేను చేసిన దుర్మార్గం ఏమిటంటే ఆ అప్పు తీర్చడం మర్చిపోవడం.

తర్వాత డిగ్రీ ఐపోయాక, అప్పులు చేయడం బాగా అలవాటయ్యాక, ఈ బాకీ విషయం గుర్తొచ్చింది. మా ఊరెళ్లినప్పుడు నా హైస్కూలు ఫ్రెండుని అడిగా.. రత్న వాళ్ళింటికి వెళ్దామని. "తనకి పెళ్ళయ్యింది. నువ్వా బాకీ తీర్చడానికి మాత్రమే వచ్చావంటే వాళ్ళాయన అస్సలు నమ్మడు .." అని వాడు కొంచం బెదిరించాడు.. బాకీ తీర్చి తనని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనిపించింది. పువ్వుల్లో పెట్టి తీర్చేయాలనుకున్న ఆ బాకీ అలా ఇప్పటికీ తీర్చలేదు. ఎక్కడున్నావు రత్నా?

చదువు, ఉద్యోగం అనే రెండు పడవలమీద ప్రయాణం చేస్తున్న రోజుల్లో అప్పులిచ్చి నన్నాదుకున్న చల్లని తల్లి మా పిన్ని. ఫీజుల కోసమో, పుస్తకాలకో ఎందుకో అందుకు డబ్బులు అవసరమయ్యేవి. ఉద్యోగం చేస్తూ ఊరికే డబ్బులడగడానికి మొహమాటం. తనే చాలాసార్లు అప్పులిచ్చింది. అన్నీ తీర్చేశాను. అంతేనా..ఓ విలువైన మాట కూడా చెప్పింది. "మనకి ఎప్పుడూ యెంతో కొంత అప్పు ఉండాలి. ఒక్కోసారి మనం బతకడానికి ఏ కారణం కనిపించదు.. మనం ఎవరికైనా బాకీ ఉన్నామనుకో.. అది తీర్చేదాకా బతికి ఉండాలి అనుకుంటాం.." ఈ ఫిలాసఫీ నాకు బాగా నచ్చింది.

ఓసారి నాకు అత్యవసరంగా డబ్బు కావాల్సొచ్చింది. కొంచం పెద్ద మొత్తమే. ఓ బ్యాంక్ మేనేజర్ ఇస్తానని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో సారీ చెప్పడంతో వచ్చింది సమస్య అంతా.. సమస్యని నా దగ్గరే దాచుకునే కన్నా, మిత్రులకి చెబితే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెయ్యకపోరు అనిపించింది. అనుకున్నట్టుగానే ఓ మిత్రుడు తనకి తెలిసిన బ్యాంకు మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన అప్పటికప్పుడు అప్పిచ్చేశాడు. "మామూలుగా అయితే ఇంత సాయం చేసినందుకు మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను అని చెప్పాలండి.. కానీ నేను ఈ జన్మలోనే తప్పక తీర్చేస్తాను.." అన్నాను మేనేజర్ తో.

ఆయనకో నిమిషం పట్టింది, అర్ధం చేసుకోడానికి. చాలాసేపు నవ్వారు. ఇప్పటికీ కలిసినప్పుడల్లా గుర్తు చేస్తారు. అప్పులు సక్రమంగా తీర్చడం వచ్చినంత బాగా, నేనిచ్చిన అప్పులు వసూలు చేసుకోడం రాలేదు నాకు. అన్నీ చిన్న చిన్న చేబదుళ్ళే కానీ, అన్నీ కలిపితే కొంచం పెద్ద మొత్తమే అవుతుంది. ఈ మధ్య మా ఆఫీసు వాళ్ళు ఉద్యోగులకి అప్పులిచ్చే పధకం ఒకటి మొదలు పెట్టారు. ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ.. అలా నా అప్పుల కథంతా గుర్తొచ్చింది..

31 కామెంట్‌లు:

  1. ఏడో తరగతిలో అప్పు దట్ టు ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గర....ఓహో... ఆహా!!

    నేను చాలా రోజులవరకు అప్పిచ్చువాడు వైద్యుడు అని అనుకునేదానండి, తరువాత తెలిసింది అవిరెండు వేరని మద్యలో కామ పెట్టాలని.

    బాగుంది మీ టపా...

    రిప్లయితొలగించండి
  2. నేను చిన్నప్పుడు అప్పిచ్చు వాడు - వైద్యుడు ఒకరే అనుకునేదాన్ని.. తరువతరువాత తెలిసినా, ఆ పాత అర్ధమే బావుందనిపిస్తుంది!!!

    రిప్లయితొలగించండి
  3. ఈ పద్యం నన్నే కాదు ఇంకొందర్నీ ఇబ్బంది పెట్టిందన్న మాట. మా ఇంట్లో అప్పు కథ ఇది - మా నాన్నగారికి ఆరోగ్య సూత్రాలు ఎక్కువ. ఒకసారి ఈ రోజు నుండి మనిషికి ఉడికిన అన్నం 2 కప్పుల కొలత అని తీర్మానించారు. అన్నం తినటానికి రోజుకొక సాకు పెట్టే నాకు మాత్రం మహా ఆనందం. సరే మొదలైంది కొలత బోజనాల వడ్డింపు ప్రహసనం. అమ్మ మొదటి కప్పు అన్నం తింటుండగా ఈయనది ఇంకా చారులోకి రాకుండానే రెండో కప్పు అయిపోయేది. "సీతాయ్ రేపు ఇస్తా" అని సగం కప్పు అన్నం అప్పు తీసుకునేవారు. ఆ అప్పులు తీర్చగా నేనెప్పుడూ చూడలేదు. "నాన్న గారు! నాది తీసుకోండి" అని నేను ఉదారత చూపినా "వద్దురా" అని అమ్మనే సగం ఆకలి పాలు చేసారు. ఒక నెల సాగాక ఆ పద్దతి రద్దైంది, నాకు మళ్ళీ సాకులు అప్పు ఇచ్చేవాడి కోసం తిరగటం ప్రహసనం మొదలైంది. నిజం డబ్బు విషయంలో ఇప్పుడూ డాలర్లు, చిల్లర [వెండింగ్ మిషన్ లో స్నాక్స్ కొనటానికి] ఆఫీసులో అప్పుగా/చేబదులుగా ఇస్తుంటాను, నాకు అదే పేరు - క్రెడిట్ కార్డ్స్ తో అంతా కొనుగోలు చేస్తుంటే ఇంకా డబ్బులతోనే నడిపించే "సత్తెకాలపు" దాన్నని. కనుక నేనూ కొందరికి "రత్న" నే!

    రిప్లయితొలగించండి
  4. నేను అలానే అనుకునేదాన్ని అప్పిచ్చువాడు వైద్యుడు అని ,రత్న గారి ఇంటికి వెళ్ళక పోడానికి కారణం మాత్రం సమంజసం గానే ఉంది ..అనవసర అనుమానాలుకు తావివ్వకుండా చాలా బాగా రాసారు

    రిప్లయితొలగించండి
  5. అప్పిచ్చువాడు వైద్యుడు కాదా?? నాకిప్పుడే తెలిసింది :)

    రత్న కి రుణపడిపోయారన్నమాట, బాగుంది.

    రిప్లయితొలగించండి
  6. బాంక్ లో అప్పుకోసం ప్రయత్నించడం కొంచెం ఫార్మల్ వ్యవహారం కాబట్టి నాకేమీ అనిపించదు కానీ తెలిసినవాళ్ళ దగ్గర అడగాలంటే ప్రాణం పోయినంత పనౌవుతుంది నాకు.. మీలానే నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే మా దగ్గర బంధువొకరిని అప్పు అడగాల్సి వచ్చింది.. అదీ నా కోసం కాదు, నాకత్యంత ఆత్మీయమైన వ్యక్తి కోసం.. నేనెంత మొహమాటపడుతూ అడగలేక అడిగానో అంతే నిష్కర్షగా 'ఉద్యోగం చేస్తూ అప్పేమిటీ?' అంటూ లేవనేశారు! పైగా ఇప్పటినించే ఇలా అప్పులు చేయడం నేర్చుకోవడం మంచిది కాదు అంటూ హితబోధలు కూడా! అప్పటికి నేను ఉద్యోగంలో చేరి 2,3 నెలలే అయింది కాబట్టి నాదగ్గరంత మొత్తం లేదనీ, అది నాకోసం కూడా కాదనీ అసలు కారణం చెప్పినా సరే ఇంకొన్ని బోధలు చేసి పంపారు.. అదే మొదటిసారి, చివరిసారీ నేనెవరినైనా అప్పడగటం! అలాంటి పరిస్థితి నాకు మళ్ళీ కలుగజేయనందుకు భగవంతుడికి మాత్రం నేను ఋణపడిఉన్నాను :-)

    రిప్లయితొలగించండి
  7. చాల తప్పు పని చేసారు , ఎంచక్కగా అర్ధ రూపాయి తీసుకుని బుద్దిగా రత్న వాళ్ళ హస్బెండ్ ని కలిసి రత్న మిమ్మల్ని ఎలా ఆదుకుంది ఆవేళ చెప్పి ఇచ్చి రావలసింది .-:)

    రిప్లయితొలగించండి
  8. అప్పు తీసుకోవడం అంటే.....ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇంట్లో డబ్బులు అడగటం ఇష్టం లేక నా కంటే ముందు ఉద్యోగాల్లో స్థిరపడ్డ మిత్రులు మాత్రం ప్రతీ నెలకి ఒక్కొక్కరు అన్న ప్రాతిపదికన నాకు డబ్బులు ఇచ్చేవారు. అయితే వాళ్ళు నాకు అప్పుగా ఇవ్వలేదు. వారందరూ స్నేహితుడికి సాయం చేద్దామనే ఆలోచనతో ఇచ్చారు. కానీ నేను మాత్రం దాన్ని అప్పుగానే భావించాను. కాలేజీ చదివే రోజుల్లో లాబ్ రేపు అనగా ఇవాళ రాత్రి రికార్డ్ రాసే నా రూమ్మేట్స్ , క్లాస్మేట్స్ రికార్డ్ షీట్లు మాత్రం అప్పుగా తీసుకునే వారు. నేనేమో కట్టలు కట్టలు రికార్డ్ షీట్లు కొనడం...రెండు వారాలు తిరిగేసరికి మొత్తం అయిపోవటం...ఒక్కడు కూడా ఇదిగోరా నీ షీట్లు..అని ఇచ్చేవారు కాదు. విసుగొచ్చి నేను రికార్డ్ షీట్స్ 'దాత' అన్న గుర్తింపు నుండి 'గ్రహీత' గా మారిపోయాను. ఆ రకంగా బోల్డన్ని షీట్స్ అప్పు తీర్చకుండానే ఇంజనీరింగ్ అయిపొయింది.
    మీ జ్ఞాపకాల టపాల పుణ్యమాని మర్చిపోయిన విలువైన జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. "మనకి ఎప్పుడూ యెంతో కొంత అప్పు ఉండాలి. ఒక్కోసారి మనం బతకడానికి ఏ కారణం కనిపించదు.. మనం ఎవరికైనా బాకీ ఉన్నామనుకో.. అది తీర్చేదాకా బతికి ఉండాలి అనుకుంటాం.."
    ఈ ఫిలాసఫీ నాకూ బాగా నచ్చింది.
    సరే, అంత జ్ఞాపక శక్తి ఎలా సోదరా? నేను, నిన్న అప్పుతీస్కుంటే ఈరోజుకి గుర్తుండదు :):)

    రిప్లయితొలగించండి
  10. ఇప్పుడు అన్నీ హైటెక్ అప్పులే. అవే ప్రతివాళ్ళ పర్సులలో దర్శనమిచ్చే క్రెడిట్ కార్డులు.

    రిప్లయితొలగించండి
  11. నెమలికన్ను స్పర్శకు
    అభినందన మందారమాల!!

    రిప్లయితొలగించండి
  12. అప్పుచేసే అవసరం ఎప్పుడూ రాలేదు గానీ ...మీలాగే చేబదుళ్లు అదీ దగ్గరి వాళ్ళే ...తిరిగి అడగటం మొహమాటం !అన్నట్టు మీ పిన్నిగారి ఫిలాసఫీ బావుందండీ ...నేనింకోటి చెప్పనా ? మనం ఎవరికైనా బాకీ ఉండి తీర్చక పొతే మళ్ళీ జన్మలో వాళ్ళింట్లో పుట్టి తీర్చుకోవాలాట ! ఎవరైనా మనకి బాకీ ఉంటే వాళ్లు మనింట్లో పుడతారట అప్పు తీర్చడానికి ..మరీ అర్ధరూపాయికి ఇంకో జన్మ అవసరమంటారా ?రత్నగారెక్కడ ఉన్నా వడ్డీతోకలిపి తీర్చేయండెం ?

    రిప్లయితొలగించండి
  13. మీ టపా చలా బావుందండి. ప్రతివొక్కరికీ వారు బాకి ఉన్న అప్పులు గుర్తొచ్చెట్టు రాసారు. నేస్తం గారు చెప్పినట్టు రత్న గారింటికి వెళ్ళకపొవటమే మంచిది. కాని వాళ్ళింటికి మీరు వెళదామన్న అలోచన మీకు రావటం, నాకు 'నా ఆటోగ్రాఫ్' సినిమా గుర్తు చెసింది. నేను కుడా నా స్నేహితుడు మొహిసీన్ ఖానుకు అప్పు ఉన్నాను. బహుశ ఒక పాతిక రూపాయలదాక అప్పు ఉన్నానేమో. నేను పదవతరగతిలో అవసరాలకు తీస్కున్న అప్పది. ఇప్పటికీ నాకు అప్పు అన్న పదం వినగానే ముందు వాడే ఙ్ఞప్తికి వస్తాడు. రోజు ఇంట్లో సంధ్యావందనం చేసి వెళ్ళే నేను, రోజు తు.చ. తప్పకుండా మసీదులో ప్రార్ధనలు చేసే వాడు క్రిందటి జన్మలో అన్నదమ్ములమేమో అనిపిస్తుంది. నేను ఎవర్నైనా రూపాయి అడగటం చూసాడంటే...వెంటనే వచ్చి "నా దెగ్గరుంది తీస్కోరా" అనేవాడు. స్కూల్ అయ్యాక నన్ను తీస్కెళ్ళి పాని పూరి పెట్టీంచెవాడు. నేనంటే వాడికెందుకో వల్లమాలిన ప్రేమ.
    వాడి స్నేహానికీ, వాడు చేసిన సహాయానికీ నేను ఈ జీవితానికి ఋనపడిపోయా. మా భ్రాతృ ప్రేమ చూసి విధికి కన్ను కుట్టిందేమో, బస్సు రూపలో వాణ్ణి రెండేళ్ళ క్రితం మృత్యువు కబళించింది. ఏదేమైనా నా జీవితంలోని కొన్ని మధురమైన ఘట్టాలను నేను మళ్ళీ స్మరణ చేస్కొటానికి కారణమైన మీకు ధన్యవాదలు.

    రిప్లయితొలగించండి
  14. మురళి గారూ, ఈ రోజు ఈనాడులో మీ బ్లాగు గురించిన పరిచయం వచ్చింది, అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. మురళి గారు,

    అందుకోండి నా అభినందనలు.

    I know how you enjoy blogging and the efforts you put in.Keep up the good work and keep writing.

    రిప్లయితొలగించండి
  16. అయ్యో అప్పుల వైద్యునికి ఎంత పెద్ద అప్పో.. బాగుందండి.

    రిప్లయితొలగించండి
  17. Very nice one ... and I have read it in eenadu today... Congratulations to you..!

    రిప్లయితొలగించండి
  18. చాలా బాగుందండి మీ అప్పు కథ. మా నాన్నగారు నాకు ఎప్పుడు సరిపడే డబ్బులు ఇచ్చేవారు. అందువల్ల నాకు ఎప్పుడు అప్పు అవసరం రాలేదు, నేను మాత్రం ఎందరో మిత్రులకు అప్పులు ఇచ్చాను, దేవుడి దయ వల్ల అందరూ తిరిగి ఇచ్చెశారు.

    రిప్లయితొలగించండి
  19. chala bangundi...mi appu sangathi...
    chalarojula tarvatha manchi kada chadivina feel ayyanu...

    రిప్లయితొలగించండి
  20. @కత్తిమహేష్ కుమార్: ధన్యవాదాలు
    @వినయ్ చక్రవర్తి: తీర్చాల్సిన బాకీ కదండీ.. బాగా గుర్తుండి పోయింది.. ధన్యవాదాలు.
    @పద్మార్పిత: మీరు గర్ల్ ఫ్రెండ్ అంటే నేనేక్కడికో వెళ్ళిపోయాను :):) ధన్యవాదాలు.
    @మేధ: హమ్మయ్య.. నేనొక్కడినే కాదన్న మాట! ధన్యవాదాలు.
    @ఉష: వ్యాఖ్యలు రాయడంలో మీది ప్రత్యేకమైన శైలి.. మీ వ్యాఖ్య చదివిన ప్రతిసారి నాకే మరో రెండు మూడు టపాలకు సరిపోయే విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. @నేస్తం: ఆ ఆలోచన నా మిత్రుడిదండి.. తర్వాత ఆలోచిస్తే నాకూ సబబే అనిపించింది..ధన్యవాదాలు.
    @లక్ష్మి: పోనీలెండి.. నా టపా ద్వారా ఓ కొత్తవిషయం చెప్పగలిగాను :) ..ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: పశు పత్నీ సుతాలయా... చెట్టుని మర్చిపోయాడు శాస్త్రకారుడని బాధ పడతాడండి శ్రీరమణ 'మిధునం' లో అప్పదాసు గారు... ధన్యవాదాలు.
    @నిషిగంధ: అలాంటి చేదు అనుభవం నాకూ ఎదురయ్యిందండి.. పిన్ని సాయం చేయకపోతే ఆ దశలో చాలా ఇబ్బంది పడి ఉండేవాడిని.. ధన్యవాదాలు.
    @చిన్ని: ఏం చెయ్యను చెప్పండి.. నా ఫ్రెండు పడనివ్వలేదు :) ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. @శేఖర్ పెద్దగోపు: మిత్రులదగ్గర చాలా చనువుగానూ, కొండొకచో అధికారంగానూ తీసుకోవచ్చండి.. బట్, మిగిలిన వాళ్ళ చాలా మొహమాట పడాలి. బాగుందండి మీ రికార్డు షీట్ల కథ.. ధన్యవాదాలు.
    @భాస్కర్ రామరాజు: 'నేను ఎవ్వరికీ బాకీ లేను' అని గుండెల మీద చెయ్యేసుకుని అనుకోడానికి లేకుండా, గుండెలమీద కుంపటిలాంటి బాకీ.. చిన్నదే కావొచ్చు కానీ బాకీ బాకీనే కదా..అందుకే మర్చిపోలేక పోతున్నా.. మరుపు కూడా ఒక వరం అని ఇప్పుడు తెలుస్తోంది :):) ...ధన్యవాదాలు.
    @పద్మనాభం దూర్వాసుల: తీస్కునేటప్పుడు చాలా బాగుంటుంది.. తీయగా మాట్లాడి అప్పిస్తారు.. కానీ తీర్చేటప్పుడే... ...ధన్యవాదాలు.
    @పరిమళం: నేను వాళ్ళింట్లో పుడతాననే విషయం రత్నకి తెలిస్తే తనే నన్ను వెతుక్కుంటూ వచ్చి వడ్డీతో సహా వసూలు చేసుకుంటుందండి :):) మందారమాలకి కూడా ధన్యవాదాలు..
    @సాయిచంద్: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. @"శం కరోతి" - ఇతి శంకరః : మీ పేరు చాలా బాగుందండి.. మీ మొహసీన్ గురించి చదివి బాధ కలిగింది.. మంచివాళ్ళే త్వరగా ఎందుకు చనిపోతారన్న దానిగురించి నా స్కూలు రోజుల్లో ఒకమ్మాయి ఇలా చెప్పింది.. "మన ముందు పది పళ్ళు ఉన్నాయనుకో..ముందు మంచి పండే తీసుకుంటాం.. మచ్చలున్నది వదిలేస్తాం.. దేవుడు కూడా అంతే.." అమాయకంగా చెప్పినా యెంత నిజం చెప్పింది అనిపిస్తుంది, ఇలాంటివి విన్నపుడు.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
    @సిరిసిరి మువ్వ: ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: చాలారోజుల తర్వాత... ...ధన్యవాదాలు.
    @భాస్కర్ రామిరెడ్డి; ధన్యవాదాలు.
    @నెలబాలుడు: ధన్యవాదాలు
    @Happy World: అదృష్టవంతులు! ధన్యవాదాలు.
    @అనిల్: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. murali garu... mee tapaa chala bagundandii....

    naku kuda nenu chesina appudu gurtochhelaa rasaru....

    asalu nenu mee blog ki endukochhanante... eeroju Eenadu lo chusaka.....

    రిప్లయితొలగించండి
  25. very nice....ennadu lo me blog chusi visit chesa....chala baundi.....congrats

    రిప్లయితొలగించండి
  26. @Raj:ధన్యవాదాలు
    @Sirisha Mummidi: ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి