మంగళవారం, జూన్ 30, 2009

మేఘమా...

ఆకాశంలో గుంపులుగా సాగే మేఘాలనీ, మేఘాల మధ్య మెరిసే మెరుపులనీ చూడాలని ఉంది.. చల్లని మలయ మారుతాన్ని ఆస్వాదించాలనీ, తొలకరిని ఆహ్వానిస్తూ నేల తల్లి వెలువరించే సుగంధాన్ని ఆఘ్రాణించాలనీ ఉంది..వర్షపు చినుకుల సవ్వడిని వినాలనీ, ఆగకుండా కురిసే వానలో తనివితీరా తడవాలనీ ఉంది.. కానీ వర్షం ఎక్కడ?

పాటలు వింటుంటే 'ఆషాఢ మాసాన ఆనీలి గగనాన మేఘాల రాగాల ఆలాపన' అని బాలూ గొంతు ఆర్తిగా వినిపించింది.. హరిప్రసాద్ చౌరాసియా వేణువు 'సిరివెన్నెల' కురిపించింది. ఆషాఢ లో పావు భాగం పూర్తయ్యింది కానీ నీలి మేఘపు ఆలాపన ఇంకా మొదలవ్వ లేదు..తొలి తొలి తొలకరి ఇంకా చినుకుని చిలక లేదు.. పుడమికి పులకల మొలకల పిలుపు ఇంకా అందలేదు.

మామూలుగానే వేసవి యెంతో సుదీర్ఘంగా అనిపిస్తుంది.. మామిడి పళ్ళనీ, మల్లెపూలనీ ఇచ్చినందుకు, చిన్నప్పుడైతే బడికి సెలవలు తెచ్చినందుకూ వేసవిని క్షమించొచ్చు.. ఐతే మాత్రం మరీ ఇంతంత ఎండలా? అది కూడా ఇన్ని రోజులు? పాతకాలపు అత్తింటి కొత్తల్లుడిలా వేసవి ఇలా వెళ్ళకుండా ఉండిపోతే భరించేదెలాగా? వచ్చిన పని చూసుకుని మర్యాదగా వెళ్లిపోవాలి కదా?

అయినా మేఘానిది ఇంత రాతి గుండె అనుకోలేదు.. మల్లి మనసు బావకి తెలిపింది కదా.. మమతలెరిగిందే అనుకున్నాం.. ఉత్తరాన ఉరుముతుందని తొలకరి కురుస్తుందనీ ఎదురు చూశాం.. కానీ ఎన్నాళ్ళీ దోబూచులాట? ఎవరిమీదీ అలక? వేళ మించిపోతోందని మర్చిపోయావా మేఘమా? ఆబాలగోపాలమూ నీ రాక కోసం ఆశగా ఎదురుచూస్తోందని తెలియదా నీకు?

ఎండల బాధ అటుంచి, పడమటి దిక్కున వరరగుడెయ్యక పొతే ఏరువాక సాగేదెలా? రైతుల కష్టం తీరేదెలా? వేళకి వానలు కురవకపోతే తాగడానికి గుక్కెడు నీళ్ళైనా దొరకవు కదా? పొగలు కక్కుతున్న నేల చల్లారకపోతే రోగాలు ప్రబలవూ? అన్నీ తెలిసి, ఏమీ తెలియని నంగనాచిలా ప్రవర్తిస్తుందేమిటీ మేఘం? అసలు ఏం చేద్దామనుకుంటోంది? వానలా కరగకుండా ఎందుకు ఆగుతోంది?

తనకి పార్టీ కండువా కప్పినందుకు వరుణ దేవుడు అలిగాడనుకోవాలా? అందుకే వర్షాన్ని కురిపించడం లేదా? కండువా కప్పి చాలా రోజులయ్యింది కదా..ఇప్పుడెందుకు అలిగినట్టు? అయినా పొలిటీషియన్స్ ఒపీనియన్స్ ని చేంజ్ చేసుకుంటారని ఆయనకి మాత్రం తెలియదా? అయినా నాయకులేదో అన్నారని ప్రజల్ని శిక్షించడం న్యాయమా? ఆకాశం ఎప్పుడు ఉరుముతుందో.. మేఘం ఎప్పుడు కరుగుతుందో.. ఎన్నాళ్ళు ఎదురుచూడాలో....

18 వ్యాఖ్యలు:

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మేఘం తాలుకు సున్నిత మనసుని మనమందరం పొల్యుషన్ పేరుతో ఎటేటా చిద్ర వధ చేస్తున్నం కదా!! అందుకే దాని గుండెల్లో ఉన్న నీరు ఇంకిపోయి ఇలా రాతిలా తయారయినట్టు ఉంది. ఈ సారి ఓ ఆట ఆడించడానికే నిర్ణయించుకున్నట్టు ఉంది. ఎక్కడ ముందే కురిసేస్తే "వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా..." అని పాడేసుకుని ఆనందంతో మళ్ళీ పాత తప్పులే రిపీట్ చేస్తామని దానికి అనుమానం కాబోలు.

మేధ చెప్పారు...

వచ్చే వచ్చే వానలు వచ్చే అని వాతావరణ శాఖ చెప్పడమే తప్పించి, వాటి జాడ ఎక్కడా కనబడడం లేదు... ఇంకెంతకాలమో ఈ నిరీక్షణ....!!

Subrahmanya Chaithanya Mamidipudi చెప్పారు...

ఈ మద్య కొన్నేళ్ళుగా ఠంచనుగా వస్తుంటె మరీ పట్టించుకోవట్లేదు అనుకున్నాదొ ఎమోని ఈసారి ఈ అల్లుడు బెట్టు చూపిస్తిన్నాడు మాస్టారు.కొన్నింటికి ఎదురుచూడక తప్పదు...ఎంతైనా దేవుడిపాలనగదా!

చిన్ని చెప్పారు...

xlnt .....tamari raaka maakentho samthosham.:)

తృష్ణ చెప్పారు...

చూసారా ఎందరు అభిమానులం మీ టపాల కోసం చేతకాల్లా ఎదురుచూస్తున్నామూ!!మీ అభిమానులని పరీక్షించడానికి ఇలా మాయమయ్యారేమో అనిపించింది.పునర్దర్శన భాగ్యం కలిగించినందుకు కృతజ్ఞతలు.నిన్ననే పక్కింట్లోంచి "रिम झिम गिरे सावन..." పాట విని వర్షం మీద రాయాలి అనుకున్నాను.మీరు రాసేసారు.ఇవాళ "మొదటి సంపాదన" అనే పోస్టు రాసాను.విశ్వామిత్రగారు కూడా ఇదే పేరుతొ ఇవాళ ఒక టపా రాసారు.
birds of the same feather flock together అంటే ఇదేనేమో...

ఉష చెప్పారు...

మురళీ గారు, "ఉరుము భేరి మ్రోగించి, మెరుపు దీపాలు వెలిగించి సమరం చేసె ఆకాశం! " http://maruvam.blogspot.com/2009/04/blog-post_03.html త్వరలో నిజం కానున్నదని ఆశిద్దాం.ఇది నా కల. నాకలలు చాలవరకు నిజం చేసుకుంటాను. ;)

ఉమాశంకర్ చెప్పారు...

పది రొజుల విరామం తరువాత మీర్రాసిన ఈ పొస్టు లో ఏదో మార్పు కనపడుతొందే. మంచి మార్పే..

చాలా బావుంది..

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

నిజమేనండీ ఎంతకాలం ఎదురు చూడాలో.. ఇంకానయం రాజశేఖరుడికే పగ్గాలు దొరకబట్టి సరిపోయింది కానీ బాబు గారు ముఖ్యమంత్రైతే భలే ఉండేది :-)

...Padmarpita... చెప్పారు...

ఇంక ఎదురుచూపులకి తావెక్కడిదండి!
ఇంక రోజూ విరిజల్లులే కదండి!!!!

srujana చెప్పారు...

ఇంక రేపటినుండి వర్షాలు మొదలనుకుంటాను....

Subrahmanya Chaithanya Mamidipudi చెప్పారు...

మాస్టారూ నాకు ఏమేమి కావాలో మీకు చెప్తుంటా అవికావాలి అని మీరు టపా పెట్టేయ్యండి. హ్హ హ్హ హ్హ.

Mohanavamshi చెప్పారు...

akasa desana, ashada masana, meriseti o meghama

maa master mata vini, chiru jallula pulakarinthalu chilakarinchi povey

పరిమళం చెప్పారు...

మురళిగారు, ఋతుపవనాల రాక ఆలస్యమైనా ...తొలకరి జల్లు కురిసిన అనుభూతి మీ రాకతో ....
మేఘమా అంటూ మీ పలకరింపు మీ అభిమానులకు వర్షపు చినుకుల చిలకరింపు !
ఈసారి సహస్రం పూర్తయ్యే వరకూ విరామం లేదు అంతే !

మురళి చెప్పారు...

@శేఖర్ పెద్దగోపు: నిజమేనండి.. కాలుష్యం.. మన స్వయంకృతాపరాధం... ...ధన్యవాదాలు.
@మేధ: అదే అర్ధం కావడం లేదండి.. ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య మామిడిపూడి: నిజమేనండి.. చూడాల్సిందే.. ధన్యవాదాలు
@చిన్ని: ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@తృష్ణ: అంతేనంటారా? :-) ...ధన్యవాదాలు.
@ఉష: బాగుందండి మీ కవిత.. ధన్యవాదాలు.
@ఉమాశంకర్: హమ్మయ్య.. మంచి మార్పే కదా.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: అలా అంటారా? ...ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@పద్మార్పిత: ప్రశంస..మీదైన శైలిలో... ..ధన్యవాదాలు.
@సృజన: గోడ మీద రాసుకుందాం అంటారా? :-) ధన్యవాదాలు.
@మోహనవంశీ: మరో మంచి పాట గుర్తుచేశారు. ..ధన్యవాదాలు
@పరిమళం: పెద్ద టార్గెట్ పెట్టేశారు :-) ...ధన్యవాదాలు.

Haripriya చెప్పారు...

sangeetha vidvansulu varuna ragam padithe vana padedita... alene mee lanti varu ila meghaniki megha sandesam rasina vana padithe baguntundhi kada... sangeeta kala ki spandinchina vana sahityaniki kuda spandichali ani korukuntunnanu adyaksha:)

మురళి చెప్పారు...

@హరిప్రియ: ధన్యవాదాలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి