నటీనటుల కోసం కన్నా సాంకేతిక నిపుణుల కోసం సినిమా చూడడం నాకు అలవాటు. ముఖ్యంగా కొత్త దర్శకుడి సినిమా ఏమాత్రం 'పర్లేదు' అని తెలిసినా తప్పకుండా చూస్తాను. అలా 'ఐతే' చూసినప్పుడు చంద్రశేఖర్ యేలేటి 'బాగా తీశాడు' అనిపించింది. 'అనుకోకుండా ఒకరోజు' చూసినప్పుడూ అదే ఫీలింగ్, టేకింగ్ లో అక్కడక్కడా ఇంగ్లీష్ సినిమాలని గుర్తు చేసినప్పటికీ..
స్టార్ల వారసుల సినిమాలంటే నాక్కొంచం భయం. వీళ్ళ నటన కన్నా వంశాన్ని గురించీ, వీళ్ళ తాతయ్య, నాన్న, బాబాయి, మావయ్యల గొప్పదాన్ని వివరిస్తూ చెప్పే డైలాగులూ, డి.టి.ఎస్. లో వినిపించే తొడల చప్పుళ్ళూ భరించడం కష్టం. అందువల్ల ఇలాంటి సినిమాలకి కొంచం దూరంగా ఉంటాను. నాకొచ్చిన సమస్య ఏమిటంటే చంద్రశేఖర్ యేలేటి ఓ స్టార్ తనయుడితో తీసిన సినిమా చూడాలా? వద్దా?
రిలీజ్ రోజు సినిమా చూసే అలవాటున్న మిత్రులని ఒకటే మాట అడిగా.. ఇది చంద్రశేఖర్ సినిమానా లేక మంచు మనోజ్ బాబుదా అని. 'చంద్రశేఖర్ దే' అని చెప్పగానే ఇంకేమీ చెప్పొద్దన్నా, సినిమా చూడ్డానికి నిర్ణయించుకుని. కొంచం ఆలస్యం అయ్యింది కాని మొత్తానికి సినిమా చూసేశా.. మనోజ్ చాలా కష్టపడి చంద్రశేఖర్ స్టైల్లో నటించాడు..కానీ చంద్రశేఖరే పడాల్సినంత కష్టపడలేదనిపించింది.
సినిమా నిడివి రెండు గంటలు. మొదటి గంట అవ్వగానే విశ్రాంతి. కథాస్థలం విమానాశ్రయం. ప్రధాన పాత్రలైన నాయికా నాయకులతో పాటు హీరో స్నేహితులో ముగ్గురు, హీరోయిన్ ఫ్రెండ్ ఒకమ్మాయి మరియు బ్రహ్మానందం. ఒకేస్థలం లో తక్కువ పాత్రలతో నడిచే కథ అనే సెటప్ చూడగానే నీలకంఠ 'షో' గుర్తొచ్చింది. ఐతే స్క్రిప్టు విషయంలో నీలకంఠ తీసుకున్నంత శ్రద్ధ చంద్రశేఖర్ తీసుకోలేదు, ముఖ్యంగా సినిమా రెండో సగంలో.
చదువు పూర్తి చేసిన ధృవ్ (మంచు మనోజ్) కి ప్రయాణాలంటే సరదా. మలేషియా ఏర్పోర్ట్ లో హారిక (కొత్తమ్మాయి హారిక) ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఇద్దరూ వేర్వేరు విమానాల్లో ప్రయాణించాలి. ఆమె విమానం రెండు గంటల్లో బయలుదేరుతుంది. కేవలం రెండు గంటల్లో ఆమెని పరిచయం చేసుకుని, తన ప్రేమని ప్రకటించి, ఆమెని ప్రేమని పొందగలిగాడా అన్నదే కథ.
హీరోకి తోడుగా అతని మిత్రులిద్దరూ. ఒకతను సైకాలజీ స్టూడెంట్. అమ్మాయిల సైకాలజీ మీద హీరోకి సలహాలు ఇస్తూ ఉంటాడు. రెండో అతను కథా రచయిత.. ఏర్పోర్టులో పరిచయమైన బ్రహ్మానందానికి ఇతను చెప్పిన 'ఉగ్రనరం' సినిమా కథ ప్రస్తుతం తెలుగులో వస్తున్నా ఫ్యాక్షన్ సినిమాల మీద మంచిసెటైర్. హీరోయిన్ ఫ్రెండుగా చేసిన అమ్మాయిని చూడగానే ఎందుకో గానీ 'ఆనంద్' ఫేం సత్య కృష్ణన్ గుర్తొచ్చింది.
హీరో, హీరోయిన్లు కలవక తప్పదని తెలుగు సినిమాలు చూసేవాళ్ళందరికీ తెలుసు. కానీ ఎలా కలిశారన్నదే కథ.. అది చెప్పడంలోనే తడబాట్లు కనిపించాయి. హీరోయిన్ పాత్ర బలమైనది.. సునీత తన డబ్బింగ్ తో మెప్పించిందే తప్ప, హారిక తన హావభావాలతో మెప్పించలేక పోయింది. మొదటి సగం బాగానే అనిపించినప్పటికీ, రెండో సగం లో కథ బాగా నీరసంగా అనిపించింది.
హీరోతో పాటు ప్రేక్షకులు కూడా చాలాసార్లు వాచీ చూసుకుంటారు. నాకైతే ఒక్క గంటలో ఐపోయే సినిమాని బలవంతంగా రెండో గంట సాగదీశారనిపించింది. ప్రారంభం లో వచ్చే నేపధ్య గీతం బాగుంది. చిన్నపిల్ల చేత (అమృత వర్షిణి అనుకుంటా) పాడించారు. కెమెరా పనితనం బాగుంది. నేనైతే రెండో సారి చూడడానికి టిక్ చేసుకోలేదీ సినిమాని.
నేను కుడా ఈ సినిమా చూద్దాం అనుకుంటున్నాను. అదేంటో, నేను అమెరికాలో ఉండటం చేతనో, మీరు ఇండియాలో ఉండటం చేతనో....నాకంటే మీరె అన్ని సినిమాలు ముందు చూసేస్తున్నారు.
రిప్లయితొలగించండిఅయినా ఇదీ ఒకందుకు మంచిదేలెండి. ఎందుకంటే. మీరు సినిమా బవుంది అంటే...ఎందుకు బాగుందో చుస్తాను. బాగోలేదు అంటే ఎందుకు బాగోలేదు చూస్తాను.
నా మటుకు నాకైతే, మంచు విష్ణువర్ధన్ బాబు కంటే, అతను తమ్ముడు...మనోజ్ నటనలో పరవాలేదనిపిస్తాడు. అయినా చంద్రశేఖర్ సినిమా ఆయె....మరి చూడాలి కద.
మీరు కొత్త దర్శకుల సినిమా బావుందంటే చూస్తా అన్నారు కదా...గమ్యం చూసారా మురళి గారు?
నాకు మీ 'నెమలికన్ను ' ఈనాడు ద్వారా తెలియవచ్చింది...కనుక నాకు మీరు గమ్యం మీద టపా రాసారో లేదో తెలియదు.
పాపం, మీకీ నెల మంచి సినిమా యోగం బాగున్నట్లులేదు. ఏ సినిమా అయినా శుభం కార్డ్ వరకు చూసే అలవాటు + కథ ముందుగా తెలుసుకునే అలవాటు లేదు - అంచేత మొదటి పేరా, చివరి పేరాలు చదివి, గుర్తు పెట్టుకుని, ఈ సినిమాని బాగా స్నో పడ్డ రోజు [-30F + 6 inch snow piled up] ఇంకేమీ చేయలేను అనుకున్నపుడు చూడ్డానికి లిస్టు చేసుకున్నాను.
రిప్లయితొలగించండిచూసిన సినిమాని చూసినట్టు చక్కగా పరిచయం చేస్తున్నందుకు బహుదా ధన్యవాదాలు. నేను కూడా చంద్రశేఖర్ సినిమా కాబట్టి బాగుంటుందన్న భావనతో ఉన్నా కాని మా అమ్మాయి విడుదలయిన రోజే చూసి అంత సీన్ లేదమ్మా అంది, పిల్లలు కదా అలాగే అంటారులే అనుకున్నా:). మా అమ్మాయి విశ్లేషణ కరక్టే అన్నమాట!
రిప్లయితొలగించండిటేర్మినుస్ సినిమా రెండో సారి చూసినట్టు వుంది ఇంచుమించుగా..
రిప్లయితొలగించండిమురళి గారు బాగా చేసారు సమీక్ష
కొంచము బొర్ కొట్టినా మొతం మీద సినిమా వెరైటీ గా బాగానే వుంది.
రిప్లయితొలగించండిపిల్లలని తీసుకెళితె ఎంజాయ్ చెసారు.
మీ సమీక్ష బావుంది.ఏమి వెరైటీయో ఏమిటో?ఆ మనోజ్ బాబు అన్ని ఫీలింగ్స్ కి ఒకే ఎక్స్ప్రెషన్.బ్రహ్మానందం కామెడీ ఏదో కొన్ని చోట్ల బాగుంది.హీరోయిన్ ఫ్రెండు బాగా చేసింది.పాప తండ్రి హీరో ఫ్రెండు వెంట పడే సీన్ విసుగొచ్చేసింది.పాయింటు చాలా చిన్నది దానిని లాగి లాగి లాగి చావగొట్టాడు.ఏ పనీ లేదు,చూడడానికి ఇంకే సినిమా లేదు అనుకుంటే చూడొచ్చన్న మాట.చంద్ర శేఖర్ ఏలేటి ఇలా తీస్తాడనుకోలేదు :(
రిప్లయితొలగించండిMuralhee gaaru,
రిప్లయితొలగించండిcongrrtulations.mee blaagu telugu daileeloe parichayam chaesaaru. good work. keep it up.
సమీక్ష చాలా బాగా రాసారండి.. ప్రయాణం సినిమా కొంచెం బోర్ కొట్టించిన మాట నిజమే గాని.. కాన్సెప్ట్ కొంచెం వెరైటీ గానే వుంది
రిప్లయితొలగించండి@"శం కరోతి" - ఇతి శంకరః : 'గమ్యం' నాటికి నా బ్లాగు ప్రారంభం కాలేదండి.. థియేటర్లో మూడుసార్లు చూశాను ఆ సినిమాని. డిస్క్ మార్కెట్లోకి రాగానే ఒక ఫ్రెండ్ నాకు ప్రెజెంట్ చేశారు. అలా విడియో చాలాసార్లు చూశాను. అందులో 'సమయమా..' నేను తరచూ వినే పాట.. నాకైతే విష్ణు, మనోజ్ ఒకేలా అనిపించారు.. విష్ణు సినిమాలేవీ థియేటర్లో చూడలేదు లెండి, టీవీలో కాసేపు చూడడమే.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ఉష: ఒకసారి చూడొచ్చండి.. అంచనాలు ఏమీ లేకుండా చూడండి.. ధన్యవాదాలు.
@సిరిసిరి మువ్వ: 'పిల్లలూ దేవుడూ చల్లనివారే..' నాకు 'ఉషాపరిణయం' తో రుజువైన సత్యం :-) ధన్యవాదాలు.
@హరే కృష్ణ: 'టెర్మినస్' చూడలేదండి.. ఆ రకంగా అదృష్టవంతుడిని.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@మాలా కుమార్: రెండో సగం విసుగొచ్చిందండి.. బలవంతంగా సాగదీసినట్టు అనిపించింది. ధన్యవాదాలు.
@రాధిక: ఆ బ్లాక్ అతని సీన్ మొదటి సారి బానే ఉంది కాని, సినిమా అంతా అదే చూడడం అంటే విసుగొచ్చిందండి నాక్కూడా.. ధన్యవాదాలు.
@సునీత: ధన్యవాదాలు.. మీ టపాకి ప్రత్యేక ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@కథాసాగర్: మీ పేరు చాలా బాగుందండి.. సినిమా రెండోసగం బాగా విసిగించిందండి.. ధన్యవాదాలు.