"కవిరాజు కంఠంబు కౌగిలించెనుగదా పురవీధి నెదురెండ బొగడదండ..." శ్రీనాథ కవిసార్వభౌముడి ఈ చాటువుతో పాటు చటుక్కున గుర్తొచ్చే పేరు, రూపం కీర్తిశేషులు నందమూరి తారక రామారావుది. ఇవాళ ఎన్టీఆర్ శతజయంతి. శ్రీనాథుడి మిగిలిన రచనలు ఏవి తలుచుకున్నా మొదట గుర్తొచ్చేది సినీ గేయ రచయిత వేటూరి. కానీ, ఈ ఒక్క చాటువు మాత్రం నందమూరినే గుర్తుచేస్తుంది. వ్యక్తిత్వం మొదలు, ఆహార విహారాదుల వరకూ ఆ కవిసార్వభౌముడికీ, ఈ నట సార్వభౌముడికీ చాలా పోలికలుండడం ఇందుకు ఒక కారణం అయి ఉంటుంది. వందేళ్ల క్రితం ఓ మారుమూల పల్లెటూళ్ళో, సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఓ మనిషి స్వయంకృషితో ఎదిగి తానే ఒక చరిత్ర కావడం వెనుక ఉన్న శ్రమని, ఒడిదుడుకుల్ని ఎవరికి వారు ఊహించుకోవలసిందే.
కాలేజీ రోజుల్లో నాటకాలాడడంతో నటన మీద మొదలైన ఆసక్తి, ఎన్టీఆర్ ని మదరాసు మహానగరం వైపు నడిపించింది. తన ప్రాంతానికి, తన కులానికే చెందిన అక్కినేని నాగేశ్వర రావు అప్పటికే సినిమాల్లో నిలదొక్కుకున్నారు. మొదట్లో పడ్డ ఇబ్బందులు మినహా, ఒకసారి కథానాయక పాత్రలు రావడం మొదలయ్యాక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. ఆ నాగేశ్వరరావుకే గట్టి పోటీ ఇవ్వడం, ఒక్క నటనతోనే ఆగిపోకుండా సినిమా రంగానికి సంబంధించిన చాలా రంగాల్లో ప్రవేశించి ఔననిపించుకోవడం ఎన్టీఆర్ ప్రత్యేకత. అప్పటివరకూ బ్రాహ్మణ కులస్తుల ఆధిపత్యంలో ఉన్న సినిమా పరిశ్రమని కమ్మ కులస్తులు తమ చేతుల్లోకి తీసుకుంటున్న దశలో సినిమా రంగంలోకి అడుగు పెట్టడం ఎన్టీఆర్ కి కలిసొచ్చిన విషయాల్లో ఒకటి.
నలభైనాలుగేళ్ల సినిమా కెరీర్ లో మూడొందల సినిమాల్లో నటించడం అన్నది ఇప్పటి రోజులతో పోలిస్తే పెద్ద రికార్డే. రేయింబవళ్లు శ్రమించడం, నిర్మాత శ్రేయస్సు కోరడం అనే లక్షణాలు ఈ రికార్డుకి దోహదం చేశాయి. సినిమా నటులు తమని తాము దైవాంశ సంభూతులుగా భావించుకోవడం అనేది ఎన్టీఆర్ తోనే మొదలయ్యింది బహుశా. ఈ భావన బాగా వంటబట్టాక అడపాదడపా నిర్మాతల్ని ఇబ్బంది పెట్టిన సంఘటనలున్నప్పటికీ (ముళ్ళపూడి, ఎమ్మెస్ రెడ్డిలు తమ ఆత్మకథల్లో ప్రస్తావించిన విషయాలు) మొదటి నుంచీ ఇదే ధోరణిలో ఉండి ఉంటే పెద్ద ఎత్తున సినిమాలు చేసే అవకాశం ఉండేది కాదు. ఎన్టీఆర్ సెంటిమెంట్ సీన్లలో చేసే అభినయం మీద తమిళ నటుడు శివాజీ గణేశన్ ప్రభావం కనిపిస్తుంది. అదే రాజకీయాలకి వచ్చేసరికి, ఎంజీ రామచంద్రన్ మార్గాన్ని తనది చేసుకున్నారనిపిస్తుంది.
Google Image |
ప్రాయంలో ఉండగానే 'భీష్మ' లాంటి వృద్ధ వేషాలు, 'బృహన్నల' వంటి సాహసోపేతమైన వేషాలూ వేసిన ఎన్టీఆర్, తన వయసు అరవైకి సమీపిస్తున్నప్పుడు మాత్రం కేవలం హీరోగా మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నారు. 'స్టార్డం' పతాక స్థాయికి చేరిన సమయమది. 'కూతురు వయసు పిల్లలతో తైతక్కలాడడం' లాంటి విమర్శల్ని ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇక, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం ఒక సంచలనం. రాష్ట్ర రాజకీయాలన్నీ రెడ్డి కులస్తుల చుట్టూనే తిరుగుతున్నాయన్న అసంతృప్తి ఆర్ధికంగా బలపడిన కమ్మ కులస్తుల్లో మొదలైన సమయం కావడంతో నేరుగా ముఖ్యమంత్రి పదవి పొందడానికి మార్గం సుగమమైంది. కాంగ్రెస్ వ్యతిరేకత, తెలుగు ఆత్మగౌరవం పేరిట నాటి ప్రముఖ పత్రికలు ఒక నేపధ్యాన్ని సిద్ధం చేసి ఉండడంతో పాటు, అన్నివిధాలా సహకరించడంతో సొంతంగా పార్టీ పెట్టి, అతితక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టి రికార్డు సాధించగలిగారు. ఇందుకోసం ఎన్టీఆర్ పడిన శ్రమని తక్కువ చేయలేం.
ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలన్నింటికీ తాతలాంటిది అప్పట్లో ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన రెండురూపాయలకే కేజీ బియ్యం పథకం. తర్వాతి కాలంలో ఇదే పథకం రాష్ట్ర ఖజానా పాలిట తెల్ల ఏనుగుగా మారడం, లోటు బడ్జెట్టు, తత్ఫలితంగా రాష్ట్రానికి-కేంద్రానికి మధ్య సంబంధాలు దెబ్బతినడం వరకూ వెళ్లి, అటు నుంచి కేంద్రంలో తృతీయ కూటమి ఏర్పాటు వరకూ సాగింది. పేదలకి బియ్యం పథకం ఎన్నో ఇళ్లలో పొయ్యిలు వెలిగిస్తే, ఒక్క సంతకంతో ఉద్యోగాల రద్దు నిర్ణయం వేలాది కుటుంబాలని రాత్రికి రాత్రే రోడ్డున పడేసింది. ముఖ్యమంత్రి అయినట్టే, ఎన్టీఆర్ చులాగ్గా ప్రధాని కూడా అయిపోతారని అప్పట్లో చాలామంది బలంగా నమ్మారు. కానీ, కాలం కలిసి రాలేదు. ప్రధాని పదవి రాకపోగా, తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న ముఖ్యమంత్రి కుర్చీ నుంచి అత్యంత అవమానకర పరిస్థితుల్లో దిగిపోవాల్సి వచ్చింది.
సినిమాల్లో స్టార్డం వచ్చాక దైవత్వం ఆవహించినట్టే, రాజకీయాల్లో అవుననిపించుకోగానే అధికారం ఆవహించింది ఎన్టీఆర్ ని. ఫలితమే, "ఎన్నికల్లో నా కాలి చెప్పుని నిలబెట్టినా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు" లాంటి ప్రకటనలు. తాను నిలబెట్టిన ఎమ్మెల్యేలని అలా కాలి చెప్పులతో పోల్చారు ఎన్టీఆర్. అదే ఎమ్మెల్యేలు, అదే ఎన్టీఆర్ మీద చెప్పులు విసిరే పరిస్థితి రావడమే విధి విచిత్రం. చివరి రోజులు బాగుండాలి అనేది ప్రతి ఒక్కరూ కోరుకునే కోరిక. వయసులో ఉన్నప్పుడు ఎన్ని కష్ఠాలు ఎదురైనా, వృద్ధాప్యంలో ప్రశాంత జీవితాన్నీ, అనాయాస మరణాన్నీ కోరుకోని వారు ఉండరు. అప్పటివరకూ వైభవాన్ని చూసిన ఎన్టీఆర్ కి చివరి రోజుల్లో మిగిలినవి వెన్నుపోటు, అవమానాలు, ఆక్రోశాలు. రాజులా బతికిన శ్రీనాథుడు చివరి రోజుల్లో కష్టాలు అనుభవించడానికి స్వీయ తప్పిదాల కన్నా, మారిన పరిస్థితులే ఎక్కువ కారణం అంటుంది చరిత్ర. మరి, ఎన్టీఆర్ విషయంలో?? చరిత్ర ఎలాంటి జవాబు చెబుతుందో వేచి చూడాలి.