మంగళవారం, ఏప్రిల్ 13, 2021

చైత్రము కుసుమాంజలి ...

సాహిత్యంలో ఋతు సౌందర్య వర్ణనకి కాళిదాసు పెట్టింది పేరు. తెలుగులో ఆ ఘనత కవిసామ్రాట్వి శ్వనాథ సత్యనారాయణదే. ఋతుసంహార కావ్యం సాక్షిగా. మరి, ఆ విశ్వనాథకి ప్రత్యక్ష శిష్యుడైన వేటూరి ఋతుశోభని వర్ణిస్తూ పాట రాస్తే? నిజానికి వేటూరి పాటల్లో ఋతువుల ప్రస్తావన కనిపిస్తూనే ఉంటుంది కానీ, కేవలం ఋతువులే ఇతివృత్తంగా రాసిన పాటలు తక్కువ. అలాంటి పాటలు రాసే అవకాశాలు అరుదుగానే వచ్చాయని అర్ధం. వచ్చిన ప్రతిసారీ వేటూరి కలం పరవళ్లు తొక్కింది. ఇందుకు 'ఆనంద భైరవి' (1984) సినిమా కోసం దర్శకుడు జంధ్యాల రాయించుకున్న 'చైత్రము కుసుమాంజలి' పాట చక్కని ఉదాహరణ. 


"చైత్రము కుసుమాంజలి
పంచమ స్వరమున ప్రౌఢ కోకిలలు
పలికే మరందాల అమృత వర్షిణి"

శాస్త్రీయ సంగీత స్వరాలు ఒక్కొక్కటీ ఒక్కొక్క పక్షి/జంతువు చేసే ధ్వనుల నుంచి పుట్టాయంటారు. వీటిలో పంచమానికి ఆధారం కోకిల స్వరం. ఆ కోకిల వసంత ఋతువు (చైత్ర వైశాఖ మాసములు) లో మాత్రమే పాడుతుంది. చైత్రము అంటేనే కొత్త చివుళ్లు, పువ్వులు. ఆ పూలతో సాక్షాత్తూ చైత్రమే అంజలి ఘటిస్తోంది, కోకిల పాటల నేపథ్యంలో.. ఆ కోయిలలు అమృతం (మరందము) తాగి పడుతున్నాయా, లేక 'అమృత వర్షిణి' రాగం పాడుతున్నాయా? వేటూరికే తెలియాలి. ఇంతకీ ఈ అంజలి ఎవరికో తెలియాలంటే చరణాల్లోకి వెళ్ళాలి.

"వేసవిలో అగ్నిపత్రాలు రాసే
విరహిణి నిట్టూర్పులా కొంత సాగి
జలద నినాదాల పలుకు మృదంగాల
వార్షుక జలగంగలా తేలిఆడే
నర్తనకీ, కీర్తనకీ, నాట్య కళాభారతికీ
చైత్రము కుసుమాంజలి"

విరహం కారణంగా వచ్చే నిట్టూర్పు లాంటి రాగం.. ఆ విరహం కూడా వేసవిలో ఆకులు కాలినప్పుడు పుట్టే వేడి లాంటిది (అసలే వేసవి, ఆపై అగ్ని). మృదంగ ధ్వనుల్లాంటి మేఘ గర్జనల నేపథ్యంలో (జలద నినాదాల) తెలివచ్చే వర్షం లాంటి నృత్యం. ఈ సంగీత నృత్యాలతో పాటు నాట్యకళా భారతికి కూడా చైత్రము కుసుమాంజలి పలుకుతోంది అంటున్నారు కవి. వసంతం తర్వాత వరసగా వచ్చే గ్రీష్మ, వర్ష ఋతువుల్ని వర్ణించారీ చరణంలో. 

"శయ్యలలో కొత్త వయ్యారమొలికే
శరదృతు కావేరిలా తీగ సాగి
హిమ జలపాతాల, సుమశర బాణాల
మరునికి మర్యాదలే చేసి చేసి
చలి ఋతువే సరిగమలౌ నాద సుధా మధువనికీ
చైత్రము కుసుమాంజలి"

శయ్యలు కొత్త వయ్యారాలు ఒలికించే శరదృతువులో (ఆశ్వయుజ, కార్తీక మాసములు శరదృతువు కదా - సహజం), తీగసాగి ప్రవహించే కావేరీ నది, హిమ జలపాటలతోటి, మన్మధుడి  బాణాలతోటీ  మన్మధుడికి మర్యాదలు చేసే చలి ఋతువునే  (హేమంతం - మార్గశిర, పుష్య మాసములు) సరిగమలుగా మార్చగలిగిన సంగీత వనానికి చైత్రము కుసుమాంజలి అర్పిస్తోంది. శరత్తు, హేమంతం ఈ చరణంలో భాగాలయ్యాయి. సందర్భశుద్ధి కాదని కాబోలు, శిశిరం జోలికి వెళ్ళలేదు కవి. 

దొమ్మరికులానికి చెందిన ఒక బాలికని నాట్యగత్తెగా తీర్చిసిద్ధేందుకు శిష్యురాలిగా స్వీకరించిన ఓ అగ్రహారపు నాట్యాచార్యుడు ఆమెకి పాఠం చెప్పడం ఈ పాట సందర్భం. పల్లవిలో బాలిక, చరణాలకి వచ్చేసరికి అందమైన యువతిగా ఎదుగుతుంది. రుతువులు గడిచాయన్నమాట! సంగీత నాట్యాల ప్రత్యేకతని చెప్పే సందర్భోచిత గీతమే అయినా, ఋతువులని నేపథ్యంగా తీసుకోడం వల్ల పాట మధ్యలో ఫార్వార్డ్ చక్రం తిప్పాల్సిన పని లేకపోయింది దర్శకుడికి. రమేష్ నాయుడు స్వరపరిచిన ఈ పాటని ఆర్తితో పాడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. గిరీష్ కర్నాడ్, మాళవిక, బేబీ కవిత నర్తించగా,  పుచ్చా పూర్ణానందం కూడా కనిపిస్తారీ పాటలో. 

మిత్రులందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!

8 కామెంట్‌లు:

  1. చాలా బాగా రాశారండీ.. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  2. సుమశరుడు అంటే మన్మథుడు. సుమశర బాణాలు అంటే మన్మథుని బాణాలు. కాబట్టి, మీ వ్యాఖ్యని ఉపసంహరించుకోవచ్చు... :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ వ్యాఖ్య చూసి నాలిక్కరుచుకున్నా!! తట్టలేదేంటో.. వేటూరికి మనసులోనే క్షమాపణ చెప్పుకుని నా వ్యాఖ్యని ఉపసంహరించాను.. ధన్యవాదాలండీ.. 

      తొలగించండి
    2. సుమము = పుష్పము
      శరము = బాణము

      సుమశరములు = పూల బాణాలు

      మళ్ళీ దీనికి "బాణాలు" తగిలించడమెందుకండీ?

      తొలగించండి
    3. మొదట నేనూ ఇలాగె అనుకున్నానండీ. మన్మధుడికి 'సుమశరుడు' అనే పేరు కూడా ఉందని రమణమూర్తి గారు గుర్తు చేశారు. ..ధన్యవాదాలు.. 

      తొలగించండి

  3. అయ్యయ్యో ! యేమి వ్యాఖ్య రాసిరో
    తెలియకుండా పోయెనే! అది కూడా పెట్టి
    ఆ పై సవరణ అని పెడ్దురూ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'సుమశరము' అంటేనే పూలబాణం కదా, మళ్ళీ సుమశర బాణాలు అనడం ఏమిటనిపించి అదే రాశానండీ.. 'సుమశరుడు = మన్మధుడు' అని రమణమూర్తి గారు జ్ఞాపకం చేశారు.. ధన్యవాదాలు.. 

      తొలగించండి