శుక్రవారం, ఏప్రిల్ 30, 2021

చందమామలో 'అమృతం'

నిండు చంద్రుణ్ణి చూసినప్పుడల్లా మనసుకి దగ్గరైన వాళ్లంతా వరసగా గుర్తొస్తారు - దూరంగా ఉన్నవాళ్లూ, బహుదూరంగా ఉన్నవాళ్లూను. ఆ జ్ఞాపకాలన్నీ ఆనందాన్నీ, బాధనీ ఏకకాలంలో అనుభవానికి తెస్తాయి. నిన్నటి వరకూ సంతోషపెట్టిన మీ జ్ఞాపకం ఇవాల్టినుంచీ బాధ పెడుతుందని  ఏమాత్రం అనుకోలేదు 'అమృతం' గారూ.. ఎందుకిలా జరిగింది? వేణూశ్రీకాంత్ అనే మీ అసలు పేరు కన్నా మీరెంతో ఇష్టంగా పెట్టుకున్న 'అమృతం అమృతరావు' అనే కొసరుపేరే నాకెంతో నచ్చింది. ఎంత అంటే, మీకు రాసిన పర్సనల్ మెయిల్స్ లో కూడా మిమ్మల్ని 'అమృతం గారూ' అని సంబోధించడం, అదిచూసి మీరు నవ్వుత్తూ జవాబివ్వడం వరకూ. కోవిడ్ జ్వరంతో ఆస్పత్రిలో చేరుతున్నట్టుగా మీరు పోస్టు పెట్టినప్పుడు కూడా, ఒకట్రెండు రోజులు చికిత్స చేయించుకుని, ఆరోగ్యంగా తిరిగొచ్చి ఆ కబుర్లన్నీ పంచుకుంటారనుకున్నాను.. కానీ మీరు ఇక లేరన్న వార్త వినాల్సొస్తుందని ఏమాత్రం ఊహించలేదు. 

పుష్కర కాలానికి పైగా కలిసి ప్రయాణం చేశాం. దాదాపు రోజూ అన్నట్టుగా కబుర్లు చెప్పుకున్నాం. మీ పోస్టులు చదివి నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు అనిపించిన సందర్భాలు ఎన్నో. "అసలు కరుకుదనం అంటే తెలుసా?" అనిపించేటంతటి మెత్తదనం - మీ పోస్టుల్లోనూ, కామెంట్లలోనూ కూడా. ఈ మార్దవాన్ని గురించి మన మిత్రులు సరదాగా జోకులేసినా స్పోర్టివ్ గానే తీసుకున్నారు తప్ప అప్పుడు కూడా కోపం చూపించలేదు. ఇప్పుడు మాత్రం మాకందరికీ కోపంగా ఉంది. మీ మీద మాత్రమే కాదు. మిమ్మల్ని మాకు దక్కకుండా చేసిన పరిస్థితులన్నింటి మీదా కూడా. కోప్పడడాన్ని మించి ఏమీ చేయలేనివాళ్ళం అయిపోయాం అందరమూ. 

గత ఏడాదిగా మీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నారో, మాకందరికీ ఎన్ని జాగ్రత్తలు చెప్పారో తెలుసు. ఎవరిదో నిర్లక్ష్యానికి మీరు బలవ్వడం అత్యంత విషాదం. మీ చుట్టుపక్కలి నిర్లక్ష్యపు మనుషుల మొదలు, ప్రభుత్వమనే బ్రహ్మపదార్ధం వరకూ అందరికీ ఈ పాపంలో భాగం ఉంది. అందుకేనేమో దుఃఖం కన్నా ఎక్కువగా కోపమొస్తోంది. మీ చివరి పోస్టు, చివరి మెసేజీ అన్నీ ఆశావహమైనవే. మీకిలా జరుగుతుందని మేమే కాదు, మీరూ ఊహించలేదు, భయపడలేదు. ఆస్పత్రికి వెళ్తూ కూడా మీ గురించి కన్నా, మీ నాన్నగారి గురించే ఎక్కువ ఆలోచించారు. 'విష్ అజ్ ఆల్డి బెస్ట్' అన్నారు. మా విషెస్ చాలలేదు. మీరు మాకు మిగల్లేదు. ఉహు, మీరు లేరంటే ఇంకా నమ్మకం కలగడం లేదు. 

ఎవరిమీదన్నా కోపం వస్తే వాళ్లతో ఉన్న విభేదాలో, అభిప్రాయం భేదాలో గుర్తొస్తాయి కదా. మీ విషయంలో అది కూడా జరగడం లేదు.  "వినదగునెవ్వరు చెప్పిన.." అనే మాటని అక్షరాలా అమలు చేశారు.. అలాగని ఎప్పుడూ వినినంతనే వేగపడలేదు, నచ్చని సంగతుల్ని ఒప్పుకోలేదు. 'ఇలా ఉండగలగడం ఎలా సాధ్యం?' అనే ప్రశ్నని మిత్రులందరిలోనూ కలిగి, 'ఒక్క వేణూశ్రీకాంత్ కి మాత్రమే సాధ్యం' అనే సర్వామోదమైన జవాబు ఏళ్ళ కిందటే వచ్చేసింది. కాలం గడిచినా ఆ జవాబులో మార్పు రాలేదు. మీలా ఉండగలడగం మీకు మాత్రమే సాధ్యం. కనీసం కొన్నిసార్లన్నా కటువుగా ఉండుంటే ఇప్పుడు మాకింత బాధ ఉండేది కాదేమో అనిపిస్తోంది. మీ కబుర్లలో సగం నాన్న, తమ్ముడు, చెల్లి గురించే.. ఇప్పుడు వాళ్లెలా ఉన్నారో కదా.. 

మీకందరూ ఆప్తులే అయినా ప్రత్యేకించి మనిద్దరినీ దగ్గర చేసినవి సినిమాలు, పాటలు. కొత్త సినిమాలు ఒకేసారి ఇద్దరం విడివిడిగా చూసి, పోస్టులు రాసుకుని, ఒకరిది మరొకరం చదువుకుని 'అరె, ఒకేలా రాశామే!' అని నవ్వుకుని ఆపై మెయిల్స్ రాసుకున్న సందర్భాలు ఎన్నో. కొన్నాళ్ళకి ఈ 'ఒకేలా ఉండడం' కూడా మనకి అలవాటైపోయింది. అన్నట్టు, నా మొదటి పుస్తకానికి రూపుదిద్దింది మీరే.. ఎంత ఓపికగా, శ్రద్దగా తీర్చిదిద్దారో కదా. కేవలం సినిమా పాటల కోసమే ఓ బ్లాగు మొదలు పెట్టి, ప్రతి రోజూ ఓ పాటతో మమ్మల్నందరినీ పలకరించారు. ప్రతిరోజూ సూర్యుడు ఉదయించినంత సహజంగా, ఓ కొత్త పాట పలకరించేది. రేపటినుంచి కూడా సూర్యుడు ఉదయిస్తాడు. కానీ మమ్మల్ని పలకరించే మీ పాట? 

మీ బ్లాగు పోస్టులు, పాటల చర్చలు, మెగాభిమానం కబుర్లు.. ఒకటేమిటి చాలా గుర్తొస్తున్నాయి. మీ బ్లాగుని తల్చుకోగానే గుర్తొచ్చే మొదటి పది పోస్టుల్లో ఒకటి మీ అమ్మగారిని గురించి రాసిన పోస్టు. ఇప్పుడు గుర్తు చేసుకుంటే 'ఆ తల్లి ఒడిని వెతుక్కుంటూ సేదదీరడానికి వెళ్లిపోయారా?' అనిపిస్తోంది. ఎస్కెపిజం కదూ? ఎన్నో సినిమాలు చూస్తానన్నారు, కొత్త వంటలు ప్రయత్నిస్తానన్నారు.. మీరు లేరన్న వార్త నమ్మడానికి చాలా సమయం పట్టింది.. ఇప్పుడు కూడా ఇది అబద్ధం అయితే బాగుండునని, అలా తెలిసిన మరుక్షణం ఈ పోస్టు డిలీట్ చేసేయాలని బలంగా కోరుకుతుంటున్నాను. మీరెక్కడున్నా ప్రశాంతంగానే ఉంటారు.. కానీ, మీరు లేకపోవడం అలవాటయ్యేంత వరకూ మాకందరికీ అశాంతి తప్పదు. చంద్రుడు మబ్బుల్లోకి వెళ్ళిపోతే బాగుండు. నాకు మా అమృతాన్ని చంద్రుళ్ళో కాదు, ఆన్లైన్లో చూడాలని ఉంది.. 

18 వ్యాఖ్యలు:

 1. చాలా ఆర్ద్రతతో కూడిన అద్భుతమైన నివాళి, మురళి గారు.
  ప్చ్, మనం ఎంత denial లో ఉన్నా కూడా వేణుశ్రీకాంత్ ఇక లేరనేదే చేదు నిజం.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పొద్దున్నే మురారి శ్రీనివాస్ ఈ సాడ్ న్యూస్ చెప్పాడు. అసలు జీర్నించుకోలేని విషయం. ఈ మహమ్మారి ఎంతో జీవితం చూడాల్సిఉన్న ఎందరో ప్రాణాలని తీసేస్తుంది. మీరన్నట్టు సాటి మనుషుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల అసమర్దతను మహమ్మారి అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఇంకా ఎన్ని విని మనగుండె తట్టుకోవాలో !!
  నా వరకు వేణు గారితో మెయిల్స్ రాసుకునేంత పరిచయం లేకపోయినా, బ్లాగులు బాగా ప్రాచుర్యంలో ఉన్న కాలంలో మనమంత ఎలా వుండేవాళ్ళమో ఆవన్ని అందమైన మెమొరీస్ నాకు. రెండేళ్ళ క్రితం వరకు ఫేస్బుక్ లో ఆక్టివ్ గా ఉన్న రోజుల్లో నేను ఫాలో అయ్యే కొద్ది పోస్టుల్లో వేణుగారిది కూడా ఉండేది. తన రాతల్లోనే తను ఎంత మ్రుదు స్వభావో అర్దమవుతుండేది.

  ఇప్పటికే తెలిసినవారి గురించి ఇలాంటి వార్తలు విన్నప్పుడల్లా చాలా నిరాశగా వుంటొంది.

  సర్వే జన సుఖినోభవంతు !!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఇకపైన మన జీవితాల్లో ఆ బుడుగు బొమ్మ, అమృతం అమృతరావు, పాటతో నేను ఎదురుపడవంటే ఉదయాన్నే పలకరించవంటే చాలా కష్టంగా ఉంది. నిన్న కాక మొన్న మాట్లాడిన మనిషి ఈ రోజు లేకపోవటం ఏంటో? ఎవరిని నిందించాలో తెలియటం లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అవునండీ, ఇప్పటికీ నమ్మలేనట్టు ఉంది. నాకు తెలుగు బ్లాగుల్లో మొదటిగా పరిచయమైన వ్యక్తి.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. బ్లాగులో వేణు గారి అమ్మ జ్ఞాపకాలు నన్ను అత్యంతగా కుదిపి వేసేవి చాలా రోజులు వెంటాడేవి....నా స్వంత మనిషిని పోగొట్టుకున్న రీతిగా వుంది.. కలవక పోయినా చూడకపోయినా కొందరితో ఆత్మీయత పెంచుకుంటాము .. అటువంటి వారిలో వేణు గారు ఒక్కరూ.... నేను ఇంకొంచెం ముందుగా విషయం తెలుసుకున్నట్లు అయితే బాగుండేది అనిపిస్తుంది... చివరి సంభాషణ నన్ను వెంటాడుతూనే వుంది

  ప్రత్యుత్తరంతొలగించు
 6. వెర్రి దుక్ఖం కమ్ముకుంది వార్త చూడగానే..:( ఇట్లా జరిగుండాల్సింది కాదని వెయ్యినొక్క సార్లు చెప్పుకున్నా మన ఆశ తీరదు కదా అనుకుంటే ఎంత నిస్సహాయంగా ఉందోనండీ. మీ మాటలు మరీ మరీ పొడిచాయ్ :((((((
  This is so painful!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. వేణు శ్రీకాంత్ గారి మరణం నాకు చాలా కలతగా వుంది. ఒక ఆత్మీయుడిని పోగొట్టుకున్నామనే బాధ.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. Very shocking.

  After long gap came to maalika, checking blogs N going down the timelines.

  And you hit with this sad news.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. చాలా విచారకరమైన వార్త... ప్రత్యక్ష పరిచయం లేకపోయినా, బ్లాగ్ ద్వారా ఆత్మీయులైనారు. ఇంప్పుడు శ్రీకాంత్ గారు లేరన్న వార్త కలచివేస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు