గత కొద్దిరోజులుగా వాట్సాప్ గ్రూపుల్లో ఓ మెసేజీ చక్కర్లు కొడుతోంది. ఆర్య వైశ్య సంఘాల అభ్యర్ధన మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 'చింతామణి' నాటక ప్రదర్శనని నిషేధిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సాంస్కృతిక శాఖకి ఆదేశాలు వెళ్లాయన్నది ఆ మెసేజీ సారాంశం. దీంతో, వివాదాస్పద నాటకం 'చింతామణి' మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. గతంలోనూ ఈ నాటకం నిషేధాలకి గురైనా అది కొన్ని ప్రాంతాల్లో, స్థానిక పోలీసు అధికారుల నిర్ణయం మేరకు తాత్కాలికంగా జరిగింది తప్ప, ప్రభుత్వం ద్వారా శాశ్వత నిషేధం కాదు. శత వసంతాల ఉత్సవం జరుపుకోవాల్సిన సమయంలో నిషేధానికి గురవ్వడం అన్నది ఒక రచనగా చూసినప్పుడు 'చింతామణి' విషయంలో బాధ కలిగించే విషయమే. కానీ, నాటక ప్రదర్శనగా చూసినప్పుడు నిషేధాన్ని సమర్ధించకుండా ఉండలేం. అదే సమయంలో, ఇన్నేళ్ల తర్వాత నిషేధించడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నా తలెత్తుతుంది.
తెలుగులో తొలితరం ప్రచురణ కర్త కూడా అయిన కాళ్ళకూరి నారాయణ రావు (1871-1927) సంఘ సంస్కరణని ఆశిస్తూ నాటక రచన చేశారు. హాస్యం ద్వారా ప్రజలకి చేరువ కావచ్చన్నది వీరు నమ్మిన సిద్ధాంతం. వరకట్నాలని వ్యతిరేకిస్తూ రాసిన 'వర విక్రయం' నాటకం ప్రజాదరణ పొందింది. ఈ నాటకంలో సింగరాజు లింగరాజు పాత్ర, 'అహనా పెళ్ళంట' తో సహా అనేక తెలుగు సినిమాల్లో పిసినారి పాత్రలకి ఒరవడి పెట్టింది. 'వర విక్రయం' తర్వాత నారాయణరావు రాసిన నాటకం 'చింతామణి', ఇతివృత్తం వేశ్యా వ్యసన నిర్మూలన. లీలాశుకుని కథని ఆధారం చేసుకుని రాసిన ఈ నాటకం ఆద్యంతం హాస్యభరితంగానూ, ముగింపు కరుణరస భరితంగానూ ఉంటుంది. అటు వేశ్య చింతామణిలోనూ, ఇటు విటులలోనూ పరివర్తన రావడంతో నాటకం ముగుస్తుంది.
మూల నాటకంలో హాస్యమే తప్ప బూతు లేదు. చింతామణి ముగ్గురు విటుల్లో ఒకరైన సుబ్బిశెట్టిని హాస్య పాత్రగా మలిచారు రచయిత. ఈ పాత్ర లోభిగా కనిపించి ప్రేక్షకుల్ని నవ్విస్తుంది ('కన్యాశుల్కం' నాటకంలో పోలిశెట్టి లాగా) తప్ప ఆ కులంవారు అభ్యంతరం చెప్పేలా ఉండదు. ఒకసారి ప్రదర్శనల కోసం నాటక సమాజాల చేతుల్లో పడ్డాక మూల నాటకం తన రూపాన్ని కోల్పోయింది. హాస్యం స్థానంలో బూతు ప్రవేశించింది. స్త్రీలు తమంతట తామే ఆ నాటకాన్ని దూరం పెడితే, పెద్దవాళ్ళు పిల్లలని ఆ నాటకం చూడనిచ్చే వాళ్ళు కాదు. రానురానూ, మిగిలిన పాత్రలని నామమాత్రం చేసి కేవలం చింతామణి-సుబ్బిశెట్టిల సరస సంభాషణల్ని పెంపు చేసి నాటకాన్ని నిర్వహించడం, ఆ ప్రదర్శనలకు ప్రజాదరణ పెరగడం సంభవించింది. మూల నాటక రచయిత కాలధర్మం చెందడంతో అభ్యంతర పెట్టేవాళ్ళు లేకపోయారు.
ఆశ్చర్యం ఏమిటంటే, నాటకంలోని బూతు సినిమా లోకీ చొరబడింది. కాళ్ళకూరి 'వరవిక్రయం' నాటకం ఆధారంగా అదే పేరుతో తీసిన సినిమా ద్వారా వెండి తెరకి పరిచయమైన భానుమతి, భరణీ పిక్చర్స్ సంస్థని స్థాపించి వరుసగా సినిమాలు తీస్తూ 1956లో తానే కథానాయికగా, తన భర్త రామకృష్ణ దర్శకత్వంలో 'చింతామణి' సినిమా తీసినప్పుడు, ఆ సినిమాకి సెన్సార్ ఇబ్బందులు తప్పలేదు. సుబ్బిశెట్టి పాత్ర పోషించిన రేలంగి చేత చెప్పించిన డైలాగులన్నీ సెన్సారు చేయబడ్డాయి. ప్రజలు కోరిందే (?) తీద్దాం అనుకున్న భరణీ వారికి, సెన్సార్ రూపంలో చుక్కెదురైంది. ఎన్ఠీఆర్ బిల్వమంగళుడుగా నటించినా ఆ సినిమా సరిగా ఆడలేదు. విమర్శకుల మెప్పూ దొరకలేదు. నాటక సమాజాల చేతుల్లో రూపాంతరం చెందిన సుబ్బిశెట్టి పాత్ర తాలూకు ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగ పడే దృష్టాంతం ఇది.
నిజానికి 'చింతామణి' నాటకం పట్ల ఆర్య వైశ్యుల అభ్యంతరం ఇవాళ కొత్తగా మొదలైంది కాదు. సుమారు ముప్ఫయ్ ఏళ్ళ క్రితం, వాణీ విశ్వనాథ్ చింతామణి గానూ, తాను సుబ్బిశెట్టి గానూ స్వీయ దర్శకత్వంలో 'చింతామణి' సినిమాని నిర్మిస్తానని దాసరి నారాయణ రావు ప్రకటించినప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య సంఘాలన్నీ ఆ ప్రతిపాదన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశాయి. మర్నాటికే తన నిర్ణయంపై వెనక్కి తగ్గారు దాసరి (అప్పటికే ఈ సినిమా విషయంలో కొన్ని విఫల యత్నాలు చేసి ఉన్నారు). ఒకప్పటితో పోల్చినప్పుడు గత పదేళ్లుగా తెలుగు ప్రజల్లో కుల స్పృహ బాగా పెరిగిందనన్నది కంటికి కనిపిస్తున్న విషయం. అప్పటివరకూ ఎన్నో సినిమాల్లో బ్రాహ్మణ వేషాల పాత్రల్ని అవమానకరంగా చిత్రించినా పెద్దగా పట్టించుకోని ఆ వర్గం, 2012 లో విడుదలైన 'దేనికైనా రెడీ' సినిమా విషయంలో తీవ్రంగా స్పందించడం రాష్ట్రమంతా చర్చనీయమయ్యింది. వైశ్య వర్గం నుంచి ఒత్తిడి పెరగడంతో, ప్రస్తుత ప్రభుత్వం 'చింతామణి ప్రదర్శనల నిషేధం' నిర్ణయం తీసుకుని ఉండొచ్చు.
నాటక ప్రదర్శనలు దాదాపుగా అంతరించిపోయిన తరుణంలో ఈ నిషేధం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమిటన్నది ఒక ప్రశ్న. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ తో పోల్చినప్పుడు ఉన్నంతలో తెలంగాణలో నాటక ప్రదర్శనలు కాస్త జరుగుతున్నాయి. మరి ఆ రాష్ట్రంలో ఈ నాటకాన్ని నిషేధించేందుకు ఏవన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్నది రెండో ప్రశ్న. రెండో ప్రశ్నని ఆర్య వైశ్య సంఘాల వారికి విడిచిపెట్టి, మొదటి ప్రశ్న గురించి మాట్లాడుకుంటే ఈ నాటకాన్ని నిషేధించడం వల్ల ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. కేవలం నాటకాలు, సినిమాలే కాదు టీవీ, ఓటీటీ మీడియం లోనూ విపరీతంగా 'కంటెంట్' ఉత్పత్తి అవుతూ, అందులో హాస్యం కోసం సదరు ఉత్పత్తి దారులు నానా పాట్లూ పడుతున్న నేపథ్యంలో, కంటెంట్ క్రియేటర్ల మీద ఈ నిషేధం తాలూకు ప్రభావం ఉండొచ్చు. మనోభావాల జోలికి వెళ్లకూడదన్న మెసేజీ వారికి అందవచ్చు. ఒకవేళ వాళ్ళు పెడ చెవిన పెట్టినా, తమని టార్గెట్ చేస్తే ఎలా స్పందించాలో అన్ని వర్గాలకీ ఓ స్పష్టత తప్పక వస్తుంది. మూల రచనలో వేలు పెట్టకుండా ఉన్నదున్నట్టు ప్రదర్శించి ఉంటే 'చింతామణి' నాటకానికి ఈ ముగింపు ఉండేది కాదు కదా..
మనోభావాల విషయమై నెగటివ్ గా కాకుండా ఇది కంటెంట్ క్రియేటర్స్ కి ఒక హెచ్చరికలా కూడా ఉపయోగపడుతుందనేది మంచి ఆలోచనండీ. నిజమే దీని వలన ఆరోగ్యకరమైన హాస్యం ఎక్కువగా వస్తే సంతోషమే కదా.
రిప్లయితొలగించండిఇక చింతామణి ని పూర్తిగా నిషేధించకుండా ఒరిజినల్ వర్షన్ ప్రదర్శించేలా చర్యలు తీస్కోగలిగితే బావుంటుందేమోననేది నా ఆలోచనండీ. నాకు గుర్తున్నంత వరకూ సుబ్బిశెట్టి స్వరం మాటతీరుతోనే హాస్యం పుట్టేదనుకుంటా ఎక్కువగా.
ఒరిజినల్ వెర్షన్ మాత్రమే ప్రదర్శించడం ..మంచి ఆలోచనే కానీ, హామీ పడేది ఎవరండీ? సినిమా కాదు కదా, పూర్తిగా తయారయ్యాక సెన్సార్ చేయడానికి.. నాటకం లైవ్ లో సెన్సార్ సాధ్యమయ్యే విషయం కాదేమోనండీ.. ధన్యవాదాలు..
తొలగించండిగురజాడ వారి కన్యాశుల్కం నాటకంలో బ్రాహ్మణ్యం మీద వెటకారం పుష్కలంగా ఉంది. నాటకకర్త బ్రాహ్మణులే ఐనా. చాలామంది బ్రాహ్మణులు ఆ బ్రహ్మనిందని నిరసించినా నాటకం ప్రజామోదం పొందింది. కమ్యూనిస్టులు దాన్ని బాగా ప్రచారం చేసారనీ కొందరి అభిప్రాయం. కాని ఇప్పుడు ఆ బ్రహ్మనిందని చూపి కన్యాశుల్కం నాటకాన్ని నిషేధించమని అడుగవచ్చును కదా.
తొలగించండిపాయింటేనండీ.. అయితే ఇక్కడ రెండుమూడు విషయాలు. 'కన్యాశుల్కం' ప్రదర్శనలో మూల రచనకు మార్పులు చేయడం లేదు, కుదిస్తున్నారు తప్ప అశ్లీల సంభాషణలు చొప్పించడం లేదు. 'చింతామణి' ప్రదర్శింప బడుతున్నంత విస్తృతంగా 'కన్యాశుల్కం' ప్రదర్శింపబడడం లేదు. ఇప్పటి వరకూ 'కన్యాశుల్కం' నాటక ప్రదర్శనకి వ్యతిరేకంగా ఎవరూ ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు.. ఇప్పుడు చేసే అవకాశాలనీ కొట్టి పారేయలేం.. ..ధన్యవాదాలు..
తొలగించండిDenikaina Ready movie writer is also a Brahmin. I don't think that he makes fun on his own caste.
రిప్లయితొలగించండి