బుధవారం, ఏప్రిల్ 14, 2021

'ఎమి' నేర్చుకున్న పాఠం

ఉద్యోగం చేస్తున్న సంస్థని 'కుటుంబం' గా భావించుకుని అనుబంధం పెంచుకోవచ్చా? నేనొక ఉద్యోగిని అని కాకుండా, ఫలానా సంస్థలో నేనో విడదీయరాని భాగం అని భావించుకోడం ఎంతవరకూ సబబు? 'గూగుల్' సంస్థ మాజీ ఉద్యోగిని ఎమి నైట్ ఫీల్డ్ తను ఉద్యోగం విడిచిపెట్టేందుకు దారితీసిన పరిస్థితులని వివరిస్తూ గతవారం 'ది న్యూయార్క్ టైమ్స్' కి రాసిన వ్యాసం చదివాకా తలెత్తే అనేకానేక ప్రశ్నల్లో ఇవికూడా ముఖ్యమైనవే. యూనివర్సిటీ క్యాంపస్ నుంచి నేరుగా గూగుల్ సంస్థలో ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరి, నాలుగేళ్లు మాత్రమే అక్కడ పనిచేయగలిగి 2019 లో ఉద్యోగాన్ని విడిచిపెట్టేశారు ఎమి. ఆమె ప్రధాన ఆరోపణ పని ప్రదేశంలో తాను లైంగిక వేధింపులకు గురయ్యానని, సంస్థ నుంచి ఎలాంటి భరోసానీ పొందలేక పోయననీను. ఆమె రాసిన విషయాలని గురించి అటు 'న్యూయార్క్ టైమ్స్' కామెంట్స్ సెక్షన్ లోనూ, ఇతరత్రా మాధ్యమాలలోనూ విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆమె వేలెత్తి చూపిన సంస్థ అతిపెద్ద కార్పొరేట్ కావడం కూడా ఈ విస్తృత చర్చకి ఒక కారణం. 

అనాధాశ్రమంలో పెరిగిన ఎమీకి గూగుల్ లో ఉద్యోగం చేయడం అన్నది చదువుకునే రోజుల్లో ఒక కల.ఎంతో శ్రమించి ఆ కలని నెరవేర్చుకుంది. ఆఫీసు వాతావరణం, పని ప్రదేశంలో లభించిన సౌకర్యాలు, ఉద్యోగభద్రత ఇవన్నీ ఆమెకి చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా సంస్థ ఆమెకి కల్పించిన సౌకర్యాలకు (ఉచిత భోజనం, జిమ్, తరచూ ప్రయాణాలు, పార్టీలు ఇత్యాదులు) అతిత్వరలోనే అలవాటు పడిపోయింది. "నా మేనేజర్లో నేను తండ్రిని చూసుకున్నాను" అంటూ ఆమె రాసిన వాక్యం దగ్గర ఒక్క క్షణం ఆగుతారు పాఠకులందరూ. అయితే, ఆమెకి వేధింపులు ఎదురయ్యింది మేనేజర్ నుంచి కాదు. మరో సీనియర్ సహోద్యోగి నుంచి. మేనేజర్ మాత్రమే కాదు, మానవ వనరుల విభాగం కూడా ఆమె కోరుకున్నట్టుగా స్పందించలేదు. పైపెచ్చు ఆమె వేధించినతని కనుచూపు మేరలోనే పనిచేయాల్సి వచ్చింది. "ఇంటి నుంచి పనిచెయ్యి, లేదా సెలవుపెట్టు" అని ఆమెకి సలహా ఇచ్చింది మానవవనరుల సంస్థ. 

చాలా ఓపిక పట్టి, మూడు నెలలు సెలవు పెట్టినా కూడా ఆమె ఫిర్యాదు మీద విచారణ ఓ కొలిక్కి రాలేదు. ఆమె అతనితోనే పనిచేయాల్సి వచ్చింది. కాలేజీ రోజుల నాటి కలలు, ఉద్యోగంలో చేరిన కొత్తలో పెంచుకున్న భరోసా.. ఇవన్నీ బద్దలైపోవడం ఆమెని కుంగదీసింది. వేరే ఉద్యోగం వెతుక్కుంది. "ఇది కేవలం ఉద్యోగం.. చేస్తాను, కానీ ఎప్పటికీ నేను నా ఉద్యోగాన్ని ప్రేమించలేను" అంటుంది ఎమి. వేధింపుల విషయంలో మహిళా ఉద్యోగుల నుంచి వచ్చే ఫిర్యాదుల పట్ల సంస్థల ఉదాసీన వైఖరి కొత్తేమీ కాదు. నిజం చెప్పాలంటే ఇలాంటి ఫిర్యాదుల విషయంలో సంస్థలు వేగంగా స్పందించిన  సందర్భాలు అరుదు. సాక్ష్యాల సేకరణ, నేర నిరూపణ జాప్యానికి ముఖ్య కారణాలని చెప్పొచ్చు. ఒక జూనియర్ ఉద్యోగికి, సీనియర్ కి మధ్య అభిప్రాయ భేదాలు వస్తే, యాజమాన్యాలు సీనియర్ పక్షానే ఉంటాయన్నది తరచూ వినిపించే మాట. గూగుల్ కూడా ఇందుకు భిన్నంగా వ్యవహరించలేదు. బాధితురాలిగా ఎమి రాసింది చదువుతున్నప్పుడు, చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, విచారణని ఆమె సంస్థ మరికొంత సహానుభూతితో నిర్వహించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. 

ఎమి రాసింది చదువుతూ ఉంటే బాగా ఆకర్షించేది, ఆలోచింపజేసేదీ సంస్థని, ఉద్యోగాన్ని ఆమె ప్రేమించిన తీరు. ఓ ఇరవై, పాతికేళ్ల క్రితం వరకూ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందని క్రితం ఉన్న బంధాన్ని గుర్తు చేసింది. గూగుల్ సంస్థలో ఉన్నన్ని ఆకర్షణలు లేకపోయినా, ఒకప్పుడు ఉద్యోగం సంపాదించడం అంటే జీవితంలో స్థిరపడడమే. రిటైర్మెంట్ వరకూ ఉద్యోగమూ, సంస్థా కూడా ఉంటాయన్న భరోసా బాగానే ఉండేది. కాస్త భద్రమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టడం అనేది బహు అరుదు. ఉద్యోగం పోతుందేమో అన్న భయం ఉద్యోగుల్లో ఉన్నప్పటికీ, సంస్థలు కూడా "వీళ్ళకి మనం తప్ప మరో దిక్కు లేదు" అన్నట్టు కాకుండా ఉన్నంతలో బాగానే చూసేవి. ఆ భయం వల్లనే కావొచ్చు, సంస్థలో విడదీయలేని భాగం అనేంత అనుబంధం అయితే ఉండేది కాదు. అంత అనుబంధం పెంచుకోవాల్సిన అవసరం లేదనిపించే సందర్భాలూ తటస్తిస్తూనే ఉండేవి. సంస్థకి, ఉద్యోగానికి అలవాటు పడడం అనే ప్రసక్తి ఉండేది కాదు. ఉద్యోగుల వయసు, పూర్వానుభవాలు కూడా ఇందుకు దోహదం చేస్తూ ఉండేవి బహుశా. 

గడిచిన ఇరవై ఏళ్లలో సంస్థ-ఉద్యోగి సంబంధాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఎమి ఉదంతాన్ని పరిశీలించడం అవసరం. మిలీనియల్స్ లో (1990 తర్వాత పుట్టిన వాళ్ళు) ఎక్కువగా కనిపించే 'ప్రాక్టికాలిటీ' ఉద్యోగంలో చేరిననాటి ఎమిలో కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది.  ఇందుకు ఆమె ఆలోచనా ధోరణితో పాటు, ఆ సంస్థలో పనిచేస్తున్న కారణంగా ఆమెకి దొరికిన హోదా, లభించిన సౌకర్యాలూ కూడా తగుమాత్రం పాత్ర పోషించి ఉండాలి. నిజానికిప్పుడు జాబ్ మార్కెట్లో 'లాయల్టీ' కి విలువ లేదు. 'ఒక సీనియర్ కి ఇచ్చే డబ్బుతో ఇద్దరు/ముగ్గురు  జూనియర్లు' అనే సూత్రాన్ని వంటబట్టించుకున్న సంస్థలే అధికం. ఈ కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు, అభద్రతతో రోజులు వెళ్లదీస్తున్న వాళ్ళు (ముఖ్యంగా ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తూ, సీనియర్లు అయిన వాళ్ళు) చాలామందే ఉన్నారు. గూగుల్ లాంటి బాగా పేరున్న కార్పొరేట్లు కొంత మినహాయింపు కావచ్చేమో కానీ, మెజారిటీ సాఫ్త్వేర్ కంపెనీల్లో ఉద్యోగుల సగటు సర్వీసు ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు మించడం లేదు. 

సంస్థ-ఉద్యోగి సంబంధాల్లో వచ్చిన మార్పుని ఉద్యోగులు - మరీ ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న యువత - బాగా గుర్తు పెట్టుకోవాలని ఎమి ఉదంతం హెచ్చరిస్తోంది. సంస్థని ఓ కుటుంబంగానో, భరోసాగానో భావించడం తెలివైన పని కాదని చెబుతోంది. కుటుంబాన్నీ, సోషల్ సర్కిల్నీ త్యాగం చేసి ఉద్యోగంలో నిరూపించుకోవాల్సిన అవసరం లేదని గుర్తుచేస్తోంది. 'వర్క్-లైఫ్ బాలన్స్' అనేది ఎవరికి వారు నిర్వచించుకుని అమలు చేసుకోవాలి తప్ప సంస్థే సర్వస్వం అనుకోకూడదు అంటోంది ఎమి. సగటు మిలీనియల్స్ కన్నా ఆమె తన సంస్థని, ఉద్యోగాన్ని కొంచం ఎక్కువగానే ప్రేమించి ఉండొచ్చు. అందుకుగాను మూల్యాన్ని చెల్లించింది కూడా. పని ప్రదేశంలో ఇచ్చిపుచ్చుకునే లెక్క తప్పకూడదనీ, తప్పితే అందుకు మూల్యం చెల్లించాల్సింది ఉద్యోగేననీ 'గూగుల్' సాక్షిగా చెప్పింది ఎమి. కొన్ని చేదు అనుభవాల తర్వాత ఆమె నేర్చుకున్న పాఠాన్ని గమనంలో ఉంచుకోడం ద్వారా ఎవరికివారు వృత్తిగత-వ్యక్తిగత జీవితాల మధ్య ఒక రేఖ గీసుకోగలిగే వీలుంది. ఆమె అనుభవాలు చదివిన కొందరైనా ఈ ప్రయత్నం మొదలు పెడతారు, తప్పకుండా. 

2 వ్యాఖ్యలు:

 1. నెమలికన్ను "మురళి" గారు నన్ను నన్ను వేధించారు అని బ్లాగులో వ్రాసాను అనుకోండి. ఎంతమంది నమ్ముతారు ? నన్ను ఆగ్రిగ్రేటర్ నుండి గెంటివేయడం తప్ప నాకు మిగిలేదేమిటి ? బ్లాగులతోనూ, బ్లాగర్లతోనూ జీవితాన్ని ముడిపెట్టడం నా అవివేకమే తప్ప అగ్రిగ్రేటర్లు మాత్రం ఏమి చేస్తారు చెప్పండి?

  గూగుల్ సంస్థ ఉద్యోగి సహోద్యోగి వల్ల సంస్థని విడిచిపెడుతూ సంస్థ న్యాయం చేయలేదనటం కరెక్ట్ కాదు. ఆమె న్యాయం కోసం పోరాడవలసింది. పోరాడేతత్వమే లేకుండా చేతిలో ఫేస్బుక్ ఉంది కదా అని వ్రాసుకున్నందువల్ల మిగిలేది కమెంట్లూ, లైకులే ! ఆమెను వేధించారు అన్న ఆధారాలు ఉంటే గూగుల్ సంస్థ కూడా తప్పించుకోలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఏ పేస్ బుక్ లోనో రాసుకుంటే ఎవరూ పెద్దగా పట్టించుకోక పోయేవాళ్లేనండీ.. ఆమె రాసింది బాగా పేరున్న 'ది న్యూయార్క్ టైమ్స్' పత్రికలో వచ్చింది, అందువల్ల చర్చ. పైగా, ఈ వ్యాసం పబ్లిష్ అయ్యాక గూగుల్ ఉద్యోగినులు వేధింపులు నిజమేనంటూ సుందర్ పిచాయ్ కి ఓ బహిరంగ లేఖ రాశారు కూడా.. కాబట్టి పసలేని ఆరోపణలు అని కొట్టి పారేయలేం. మీరన్నట్టు, ఆమె పోరాడి ఉంటే బాగుండేది.. కాకపోతే, ఆమెవైపు పరిస్థితులు ఏమిటో మనకి తెలియదు కదా.. ..ధన్యవాదాలు.. 

   తొలగించు