శుక్రవారం, మే 22, 2015

దేవర కోటేశు

బాబాలకీ, కరువుకీ ఉన్న సంబంధం ఏమిటన్నది నన్ను తరచూ వేధించే ప్రశ్న. కరువు విలయ తాండవం చేస్తున్న కాలంలోనో, నిత్యం దుర్భిక్షంలో ఉండే ప్రాంతాల్లోనో ఎక్కువమంది బాబాలు అవతరించడం నా ప్రశ్నకి బలాన్నిచ్చే విషయాలు. తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి రాసిన 'దేవర కోటేశు' నవల చదివినప్పుడు నా ప్రశ్నకి జవాబు దొరికినట్టుగా అనిపించింది. సమకాలీన అంశాలనీ, సాంఘిక సమస్యలనీ వస్తువులుగా తీసుకుని ఒడుపుగా కథలల్లే పతంజలి శాస్త్రి రాసిన మూడు నవలల్లోనూ (నవలికలు అనాలేమో) 'దేవర కోటేశు' ఒకటి.

తూర్పుగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో రంగంపేట ఒకటి. నీటివసతి సరిగా లేనందువల్ల వ్యవసాయం వర్షాధారం. రంగంపేటకి సమీపంలో ఉన్న తురకపాలెం 'దేవర కోటేశు' నవలలో కథాస్థలం. ఏళ్ళ తరబడి వర్షాలు కురవకపోవడం, ఒకటీ అరా తుపాను తప్ప వర్షపు చుక్క రాలకపోవడంతో తురకపాలెంలో నేల నెర్రెలు తీసింది. ఊరికంతకీ ఆధారమైన పెద్ద నీటి చెరువు ఏనాడో ఎండిపోయింది. వ్యవసాయం లేదు. కూలి పనులూ లేవు. ఇతరత్రా పనులు దొరికే మార్గం లేదు. జనంలో బతుకుభయం నెమ్మది నెమ్మదిగా పెద్దదవుతున్న కాలంలోనే తురకపాలెం లో 'కోటేశు సామి' వెలిశాడు. ఆ ఊరి కుర్రాడు కోటేశ్వర రెడ్డి అనారోగ్యంతో మరణించి అప్పటికింకా ఏడాది పూర్తి కాలేదు.

అనకాపల్లికీ అడివికీ మధ్య ఉన్న ప్రాంతం నుంచి తురకపాలెం వలస వచ్చిన వెంకటమ్మ కోటేశ్వర రెడ్డికి ఇంటిపనుల్లో సాయం చేస్తూ ఉండేది. రెడ్డి చనిపోయిన నాటినుంచీ అతని తల్లితో సమంగా అతన్ని తల్చుకుని బాధ పడింది. కోటేశ్వర రెడ్డి కాలంచేసిన తర్వాత సరిగ్గా పది నెలలకి రామాలయం ముందు నుంచి వెళుతూ స్పృహ తప్పి పడిపోయింది వెంకటమ్మ. కోటేశు ఆమె ఒంటి మీదకి వచ్చాడన్న వార్త ఊరంతా పొక్కిపోయింది. కోటేశు అవతార పురుషుడనీ, తప్పకుండా ఊళ్ళో వానలు కురిపిస్తాడనీ నమ్మడం మొదలుపెట్టారు జనం. రానురానూ ఇలా నమ్మే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో కోటేశుకి ఓ గుడి నిర్మించారు అతని ఇంటిముందే. తండ్రిలేని కోటేశుని చిన్నాన్న పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడాయన కోటేశు భక్తులందరికీ 'చిన్నాన్న రెడ్డి గారు.'


చిన్నాన్న రెడ్డి గారితో పాటు, రాయుడు గారు, చౌదరిగారు, స్కూలు మేష్టారు బళ్ల సూర్య చక్రం, శాస్త్రి గారు, కిరాణా కొట్టు సుబ్బారావు కోటేశు దేవర కమిటీ సభ్యులు. రోజులు గడిచే కొద్దీ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా భక్తుల రాక మొదలవుతుంది. ముడుపులు కట్టే వాళ్ళు, మొక్కులు చెల్లించే వాళ్ళు పెరుగుతారు. ఊరు యాత్రాస్థలి అవుతుంది. సూర్యచక్రం గారు కోటేశు దేవర మహిమలతో పాటలు, జీవిత చరిత్ర పుస్తకం రాస్తే, కోటేశు స్నేహితులు అతని ఫోటోలని ప్రింట్లు వేయించి అమ్మకానికి పెడతారు. ఏటేటా కోటేశు దేవర సంబరాలు కూడా మొదలవుతాయి. కానీ, జనం ఎంతగానో ఎదురుచూస్తున్న వర్షం మాత్రం ఆ ఊరిని పలకరించలేదు.

'ఇదిగోపులి అంటే అదిగో తోక' అనే మానవ మనస్తత్వాన్నీ, చుట్టూ పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు ఏదో ఒక ఆలంబనని వెతుక్కునేందుకు మనుషులు చేసే ప్రయత్నాలనీ నిశితంగా చిత్రించిన నవల ఇది. అల్లరి చిల్లర జీవితం గడిపిన కోటేశ్వర రెడ్డిని ఓ దైవంగా చిత్రించేస్తారు జనం. "మనతో కలిసి మందు కొట్టే వోడు.. ఆడు దేవుడేంట్రా" అని వాళ్ళలో వాళ్ళు గుంజాటన పడే మిత్రబృందం కూడా పైకేమీ మాట్లాడరు సరికదా, కోటేశు దేవర లీలల గురించి వాళ్ళూ ప్రచారం మొదలుపెడతారు. ఇక, కోటేశు దేవర మహాత్యాలని వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే వాళ్ళకీ కొదవలేదు.

ఈ నవలలో కోటేశుతో సమ ప్రాధాన్యం ఉన్న ఓ మిస్టిక్ కేరక్టర్ 'మూగిది.' ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలీదు. ఎండిపోయిన ఊరి చెరువు గట్టు మీద మొదటిసారిగా ఊరి జనం కంట పడుతుందా పిల్ల. ఆ ఊళ్లోనే పెరిగి పెద్దదవుతుంది. ఆమె కళ్ళముందే కోటేశు మహత్యాలు ఒక్కొక్కటిగా బయట పడతాయి. భజనలు, గుడి, మొక్కులు, ఆ వెనుక జరిగే వ్యాపారాలు వీటన్నంటికీ నిశ్శబ్ద సాక్షి మూగిది. ఇంతకీ తురకపాలెంలో వర్షం కురిసిందా? మూగిది ఏమయ్యింది? తదితర ప్రశ్నలకి జవాబులిస్తూ ముగుస్తుందీ నవల. చదువుతున్నంతసేపూ ఒకే కథగా అనిపించి, చదవడం పూర్తిచేశాక అనేకానేక కథలుగా అనిపించడం 'దేవర కోటేశు' ప్రత్యేకత. పతంజలి శాస్త్రి మరో నవల 'హోరు' తో కలిపి 'దేవర కోటేశు'ని ప్రచురించారు. (పేజీలు 192, వెల రూ. 90, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

2 కామెంట్‌లు:

  1. హహహ బాగుందండి మి రివ్యూ... గొల్లపూడి గారిది కూడా ఇటువంటి కథ చదివిన గుర్తు. అందులో ఒక చాకలి స్త్రీ మరణిస్తుంది. ఆమెను దేవతను చెసెస్తారు ఆ ఊరిజనం. అప్పటిదాకా ఆమె బట్టలు ఉతికిన బండను ఆమె విగ్రహంగా చెసి పూజిస్తారు .... కథ పెరు గుర్తులేదు
    .

    రిప్లయితొలగించండి
  2. @Freebookbank: ధన్యవాదాలండీ.. గొల్లపూడి వారి కథ చదివిన గుర్తు లేదు నాకు..

    రిప్లయితొలగించండి